వాగ్గేయకారులకు ద్వైత భావనతో పరమాత్మతో సంభాషించటం, వేడుకోవటం, అప్పుడప్పుడు నిందించటం, అంతలో శరణనటం చాలా పరిపాటి. అది వారిద్దరి మధ్య ఉన్న ఆ బంధానికి ప్రతీక. భక్తిమార్గంలో సద్భక్తునికి స్వామిపై అనేక రకాలా భావనలు కలుగుతాయి. అటువంటి భావనలే మనకు ఈ త్యాగరాజస్వామి వారి ప్రహ్లాద విజయము అనే రచనలో రూపొందించబడిన వందనము రఘునందనా అనే సంకీర్తనలో స్పష్టముగా అవగతమవుతాయి. రాముని శరణనన్న త్యాగయ్య స్వామితో చేసిన విన్నపాలను, వ్యక్తపరచిన భావనలను పరిశీలించండి. అంతర్లీనంగా సందేశం మాత్రం ఒక్కటే - రామనామమే ఆయనకు భృతి, ద్యుతి, శరణాగతి. త్యాగయ్య కృతులు వ్రాయాలని వ్రాసినవి కాదు. ఆయన మనోభావనలు శబ్దరూపము పొంది రాగ యుక్తమై భక్తి పుష్పంగా ఆవిష్కరించబడ్డాయి. శహానా రాగం భక్తికి శరణాగతికి ఆర్తికి ప్రతీక. ఈ భావసుమం ఆ రాగంలోనే త్యాగయ్య ఆలపించటం ఆయనపై గల రామానుగ్రహానికి నిదర్శనం.
వందనము రఘునందనా! సేతుబంధనా! భక్తచందనా! రామ!
శ్రీదమా! నాతో వాదమా! నే భేదమా! ఇది మోదమా! రామ!
శ్రీరమా హృచ్చారమా! బ్రోవ భారమా! రాయబారమా! రామ!
వింటిని! నమ్ముకొంటిని! శరణంటిని! రమ్మంటిని! రామ!
ఓడను! భక్తి వీడను! ఒరుల వేడను! నీ వాడను! రామ!
కమ్మని విడెమిమ్మని! వరము కొమ్మని! పలుక రమ్మని! రామ!
న్యాయమా! నీకాదాయమా! ఇంక హేయమా! ముని గేయమా! రామ!
చూడుమీ! కాపాడుమీ! మమ్ము పోడిమిగా గూడుమీ! రామ!
క్షేమము! దివ్య ధామము! నిత్య నేమము! రామ నామము! రామ!
వేగరా! కరుణా సాగరా! శ్రీ త్యాగరాజ హృదయాకారా! రామ!
రఘువంశమున జన్మించిన శ్రీరామా! లంకకు సేతువును నిర్మించిన వాడా! భక్తులకు చందనము వలె సౌఖ్యాన్ని ఇచ్చే వాడా! నీకు నమస్కరిస్తున్నాను! సిరులను ఇచ్చే వాడా! నీకు నాతో వాదమా! నేను పరాయివాడనా! ఇది నీకు సంతోషమా రామా! నీకు నమస్కరిస్తున్నాను! లక్ష్మీదేవి హృదయ-ములో సంచరించే వాడా! నన్ను బ్రోచుటకు భారమా! నీకు నాకు మధ్య రాయబారములెందుకు రామా! నీకు నమస్కరిస్తున్నాను! భక్తులను బ్రోచే నీ కీర్తి విన్నాను, నిన్ను నమ్ముకున్నాను, శరణని నిన్ను రమ్మనుచున్నాను రామా! నీకు నమస్కరిస్తున్నాను! నిన్ను చూచే మార్గములో నేను ఓడను, నీ భక్తిని వీడను, ఇతరులను వేడను, నేను నీ వాడను రామా! నీకు నమస్కరిస్తున్నాను! కమ్మని తాంబూలమిమ్మని వరమును ఇచ్చుచున్నానను తీసుకొమ్మని నీవు నాతో పలుకవలెనని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను రామా! నీకు నమస్కరిస్తున్నాను! నీకు ఇది న్యాయమా! నన్ను కరుణించకుండా ఉండుట నీకు ఆదాయమా, నాతో పలుకుట నీకు చులకనా మునులచేత నుతించబడిన రామా! నీకు నమస్కరిస్తున్నాను! నన్ను కరుణతో చూడుము, కాపాడుము, ఒప్పుగా నన్ను చేకొనుము రామా! నీకు నమస్కరిస్తున్నాను! నిరంతర నియమమైన నీ నామము క్షేమమైనది దివ్య ధామమైనది రామా! ఓ కరుణా సముద్రుడవైన రమా! వేగముగా రమ్ము, త్యాగరాజుని హృదయమునందు వెలసిన రామా! నీకు నమస్కరిస్తున్నాను!
-సద్గురువులు కాకర్ల త్యాగబ్రహ్మం






