13, డిసెంబర్ 2020, ఆదివారం

ఇక్ష్వాకుకులతిలక ఇకనైన పలుకవే - రామదాసు కృతి


తానీషా సైనికులు రామదాసును ఎంతటి శారీరిక హింసకు గురి చేయకపోతే ఆ వాగ్గేయకారుడు శ్రీరామచంద్రుని నిందించే భావనలను వ్యక్తపరస్తాడు? భక్తిమార్గంలో ఎంతటి అచంచల విశ్వాసమున్నా, భగవంతుడు పెట్టే పరీక్షలు తట్టుకోవటం చాలా కష్టం. అందులోనూ కారాగార వాసంలో శిక్ష తట్టుకోవటం మరింత కష్టం. పరమ భక్తాగ్రేసరుడైన రామదాసు కూడా ఆ సైనికుల దెబ్బలను తట్టుకోలేకపోయాడు, అందుకే ఇక్ష్వాకుకుల తిలక ఇకనైన పలుకవే అని విలపిస్తూ, నిందిస్తూ, రాముని వేడుకున్నాడు. సీతారామ భరతలక్ష్మణ శత్రుఘ్నులకు ఆభరణాలు, భద్రాద్రి దేవాలయ ప్రాకారానికి, గోపురానికి, మంటపాలకు ఖర్చులు ప్రస్తావిస్తూ అవన్నీ స్వామికే కదా? అవేమైనా దశరథుడు, జనకుడు చేయించారా అని నిష్ఠూరంగా పలుకుతాడు రామదాసు.  ఎవరబ్బ సొమ్మనికి కులుకుతూ తిరుగుతున్నావు అని నిందిస్తాడు. అంతలో తన తప్పు గ్రహించి నిందించినందుకు ఆగ్రహించవద్దు, దెబ్బలకు ఓర్వలేక తిట్టానని చెప్పుకుంటాడు. భక్తులనందరినీ కాపాడే శ్రీరాముని తనను కూడా కాపాడమని చివరకు వేడుకుంటాడు. ఇప్పటికీ గోల్కోండ కోటకు వెళితే రామదాసును బందీ చేసిన జైలును చూస్తే ఆయన ఎంతటి దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాడో చూడవచ్చు. తరువాత రామలక్ష్మణుల అనుగ్రహము, రామదాసు ముక్తి మనకు తెలిసిందే. ప్రతి వాగ్గేయకారుని జీవితంలో కూడా పరమాత్మ అనుగ్రహాన్ని చాటే ఇటువంటి ఘటనలు, అద్భుతాలు ఎన్నో. 

ఇక్కడ కొన్ని సాంకేతిక వివరాలు: మొహరీ అంటే ఒక తులము ఎత్తు బంగారము (30 చిన్నములు అనగా నాలుగు గురిగింజల ఎత్తు). వరహా అనగా 3.4 గ్రాముల బంగారము. 

ఆధ్యాత్మిక సందేశంగా ఈ కృతిని తీసుకుంటే జనన మరణాల మధ్య జీవాత్మ పడే నరకయాతనలన్నీ కూడా పరమాత్మ సృష్టి స్థితి లయములలో భాగమే. ఆ పరమాత్మను చేరుకోవటం కోసమే ఇవన్నీ కూడా. కర్మలు, వాటి ఫలాల నుండి రక్షించి తనకు ముక్తిని ప్రసాదించమని జీవాత్మ చేసే అనేక భావనలతో కూడిన ప్రార్థనగా దీన్ని భావించవచ్చు. సమస్తమూ పరమాత్మకు సమర్పించినపుడు ఆ పరంజ్యోతిలో ఏకమయ్యే దారి కనిపించక జీవాత్మ పడే యాతనకు ఈ కృతి ప్రతిబింబం. 

సాహిత్యం
========

ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన పలుకవే రామచంద్ర
నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్ర

చుట్టు ప్రాకారములు సొంపుతో కట్టిస్తి రామచంద్ర
ఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్ర

గోపుర మంటపాలు కుదురుగ గట్టిస్తి రామచంద్ర
నను క్రొత్తగ చూడక ఇద్దరి బ్రోవుము రామచంద్ర

భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర

శత్రుఘ్నునకు చేయిస్తి బంగారు మొలతాడు రామచంద్ర
ఆ మొల త్రాటికి పట్టె మొహరీలు పదివేలు రామచంద్ర

లక్ష్మణునకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర

సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర

కలికి తురాయి నీకు మెలుకువగ చేయిస్తి రామచంద్ర
నీవు కులుకుచు తిరిగేవు ఎవరబ్బ సొమ్మని రామచంద్ర

నీ తండ్రి దశరథ మహారాజు పెట్టెనా రామచంద్ర
లేక నీ మామ జనక మహారాజు పంపెనా రామచంద్ర

అబ్బ తిట్టితినని ఆయాస పడవద్దు రామచంద్ర
ఈ దెబ్బల కోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్ర

భక్తులందరిని పరిపాలించెడి శ్రీ రామచంద్ర
నీవు క్షేమముగ శ్రీ రామదాసుని యేలుము రామచంద్ర

భావం
=====

ఇక్ష్వాకువంశ తిలకుడవైన శ్రీరామచంద్రా! ఇకనైన పలుకుము. నన్ను నువు రక్షించకుంటే వేరెవరు రక్షించెదరు? ఈ దేవాలయము చుట్టూ ప్రాకారము ఎంతో అందంగా కట్టించాను, ఆ ప్రాకారానికి పదివేల వరహాలు పట్టాయి. ఇకనైన పలికి నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! దేవాలయానికి గోపురము, మంటపాలు స్థిరముగా కట్టించాను, ఇవన్నీ నీకు తెలియవా? నన్ను క్రొత్తగా చూడకుండా ఈ చెరసాలలో ఉన్న నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! నీ ప్రియసోదరుడైన భరతునికి పచ్చల పతకము చేయించాను, దానికి పదివేల వరహాలు పట్టాయి. మరి ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! నీ కనిష్ఠ సోదరుడైన శత్రుఘ్నునికి బంగారు మొలత్రాడు చేయించాను, దానికి పదివేల మొహరీలు పట్టాయి. మరి ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! లక్ష్మణునికి ముత్యాల పతకము చేయించాను. దానికి పదివేల వరహాలు పట్టాయి. మరి ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! సీతమ్మకు చింతాకు పతకము చేయించాను. దానికి పదివేల వరహాలు పట్టాయి. మరి ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! నీకోసం అందమైన శిరోభూషణము చేయించాను. ఎవడబ్బ సొమ్మని వాటిని పెట్టుకుని కులుకుతూ తిరుగుతున్నావు! ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. ఈ ఆభరణాలు మీ నాన్న గారు దశరథ మహారాజు చేయించారా లేక మామగారు జనకమహారాజు కానుకగా పంపించారా! ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! నేను ఈ విధంగా దూషిస్తున్నానని కోపగించుకోవద్దు. ఈ తానీష సైనికులు కొట్టే దెబ్బలను భరించలేక అలా చేస్తున్నాను. ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. భక్తులను పరిపాలించే ఓ శ్రీరామచంద్రా! నువ్వు శుభముగా నన్ను రక్షించుము. 

శ్రవణం
======

యదుకుల కాంభోజి రాగంలో కూర్చబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

12, డిసెంబర్ 2020, శనివారం

శర శర సమరైక శూర - త్యాగరాజస్వామి కృతి


రాముని శౌర్యాన్ని, ధీరత్వాన్ని వర్ణించే త్యాగరాజస్వామి కృతులు ఎన్నో. రామాయణంలో విశ్వామిత్ర యాగరక్షణ మొదలు రావణ సంహారం వరకు ఎన్నో ఘట్టలను త్యాగరాజస్వామి తన కృతులలో సవివరంగా రాగయుక్తంగా పలికారు. సీతమ్మ కోసం రాముడు కడలిని దాటే సమయంలో సముద్రుని నిలువరించిన ఘట్టం ప్రస్తావన కూడా అనేక కృతులలో చేశారు. నీరజాక్షికై నీరధి దాటిన నీ కీర్తిని విన్నానురా రామా అని క్షీర సాగర శయన అనే కృతిలో అద్భుతంగా వర్ణించారు. నిజంగా రాముని శౌర్యం తెలుసుకోవాలంటే అరణ్యకాండలోని ఖరదూషణ వధ ఘట్టం, యుద్ధకాండలో రావణాదులపై చేసిన ప్రహార వివరాలు శ్రీమద్వాల్మీకి రామాయణం పఠించాలి. వాటి సారాంశాన్ని త్యాగరాజస్వామి అనేక కృతుల ద్వారా ఆవిష్కరించారు. రాముని శౌర్యం వెనుక ఉన్న మర్మం కూడా తెలిపారు. అటువంటి ప్రస్తావనే ఈ శర శర సమరైక శూర అన్న కృతిలో కూడా చేశారు. వివరాలు:

సాహిత్యం
=======

శర శర సమరైక శూర శరధి మద విదార!

సురరిపు మూల బలమనుతూల గిరులకనల సమమౌ శ్రీరామ

తొలిజేసిన పాపవనకుఠారమా కలనైనను సేయగలేని బలు
విలును విరచి వెలసిన శ్రీరఘుకులవర బ్రోవుము త్యాగరాజనుత!

భావం
====

ఒక్కొక్క బాణముచేత సాటిలేని యుద్ధ శౌర్యమును చూపిన, సముద్రుని గర్వమణచిన శ్రీరామా! దూది పర్వతముల వంటి రావణుని మూలబలమునకు అగ్నితుల్యమైన శ్రీరామా! అనేక జన్మముల పాపములనే అరణ్యములకు గొడ్డలిపెట్టువంటి శ్రీరామా! రాజాధిరాజులు కలలో కూడా ఊహించని రీతి శివధనుస్సును విరిచిన రఘుకులతిలకుడైన శ్రీరామా! పరమశివునిచే నుతించబడిన శ్రీరామా! నన్ను బ్రోవుము. 

శ్రవణం
=====

కుంతలవరాళి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

11, డిసెంబర్ 2020, శుక్రవారం

ప్యారే దర్శన్ దీజో ఆయ్ - ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఆలపించిన మీరా భజన


మీరా భజనలు అనగానే ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు గుర్తుకు వస్తారు. కారణం, ఆవిడ భక్తిలోని ఔన్నత్యం,  ఆవిడ ఆలపించిన ప్రతి భజనలోనూ అది ప్రస్ఫుటంగా తెలుస్తుంది. మీరాలో ఉన్న మధురభక్తిని తన గాత్రంలో రంగరించి సుబ్బులక్ష్మి గారు ఈ భజనలు పాడారు. అటువంటి భజన ఒకటి ప్యారే దర్శన్ దీజో ఆయ్. మధురభక్తిలో మీరాకు సర్వసం శ్రీకృష్ణుడే. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి కూడా ముమ్మాటికీ మీరా వంటి భక్తురాలే. ఆ భావన ఆమె నడవడికలో, గాత్రధర్మంలో మనకు స్పష్టంగా గోచరిస్తుంది. అందుకే ఎమ్మెస్ నటించిన మీరా (1945) చిత్రం కూడా అద్భుతమైన విజయం సాధించింది. 

సాహిత్యం
=======

ప్యారే దర్శన్ దీజో ఆయ్
తుమ్ బిన్ రహ్యయో న జాయ్
జల బిన కమల చంద్ర బిన రజనీ ఐసే తుం దేఖ్యా బిన సజనీ
ఆకుల వ్యాకుల ఫిరూ రైన దిన బిరహ కలేజా ఖాయ్
దివస న భూక్ నీంద్ నహి రైనా ముఖ కే కథన్ న ఆవే బైనా
కహా కరూ కుచ్ కహత్ న ఆవై మిల్ కర్ తపత్ బుఝాయ్
క్యో తరసావో అంతర్యామీ ఆన్ మిలో కృపా కరో స్వామీ
మీరా దాసీ జనమ్ జనమ్ కీ పడీ తుమ్హారీ పాయ్

భావం
=====

ప్రియ కృష్ణా! నీవు లేకుండా నేను జీవించలేను, దర్శనమీయ వేగంగా రా స్వామీ! నీటిని వీడి కమలము, చంద్రుని విడచి రాత్రి ఉండలేనట్లు నిన్ను చూడకుండా ఈ సఖి ఉండలేదు. నీ దర్శనము కోసం విరహముతో పగలు రాత్రి మనసు చెదరి, కలతతో తిరుగుతున్నాను, ఆ విరహము నా హృదయాన్ని తొలచివేస్తున్నది. పగలు ఆకలి లేదు, రాత్రి నిద్ర రావటం లేదు, మాటలు మాట్లాడదామన్నా నోరు పెగలటం లేదు. నువ్వు అంతర్యామివి కదా! నన్ను ఎందుకు తపింపజేస్తున్నావు. వేగంగా వచ్చి నాపై కరుణించు. జన్మజన్మల నుండి ఈ మీరా నీ దాసి, నీ చరణాలపై వ్రాలి ప్రార్థిస్తోంది, దర్శనమీయ వేగంగా రా స్వామీ!

దృశ్య శ్రవణం
===========

ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఆలపించిన ఈ భజనను వీడియోలో వీక్షించండి

10, డిసెంబర్ 2020, గురువారం

రామ రామ నీ వారము గావ రారా - త్యాగరాజస్వామి దివ్యనామ సంకీర్తన


రామునితో మనోజ్ఞమైన సంభాషణలలో శరణాగతిని వ్యక్తపరచిన కృతులను కూడా త్యాగరాజస్వామి రచించారు. రమ్మని, ప్రేమతో కాపడమని వేడుకుంటూ రాముని గుణాలను, వైభవాన్ని అద్భుతంగా ఈ కృతులలో వర్ణించారు. అటువంటి కృతులను ఆయన దివ్యనామ సంకీర్తనలు అనే సంపుటిలో కూడా ఎన్నో రచించారు. దాదాపుగా 118 సంఖ్యలో ఉన్న ఈ సంకీర్తనల ఉద్దేశం రామ నామ స్మరణతో భజన సాంప్రదాయంలో బృందగానం చేసుకుని తరించటం. వీటిలో ప్రతి చరణం తరువాత పల్లవిని పూర్తిగా పాడుకునే చక్కని పద్ధతిని ఉపయోగించి త్యాగరాజస్వామి తన కృతులను పామరులకు కూడా అర్థమయ్యేలా రచించారు. మానవుని ఆనందానికి నడవడిక ఎలా ఉండాలో, రామాయణ ఘట్టాలతో సమన్వయం చేస్తూ ఈ దివ్యనామ సంకీర్తనలను స్వామి రచించారు. నామానికి గుణాన్ని, వైభవాన్ని జతపరచి దాన్ని రాగయుక్తంగా ఆలపిస్తే ఆ నామం మన మనసులో స్థిరమవుతుంది అన్న అద్భుతమైన సూత్రాన్ని ఈ దివ్యనామ సంకీర్తనల ద్వారా త్యాగరాజస్వామి మనకు తెలియజేశారు. నామస్మరణతో త్రికరణ శుద్ధి కలిగి రామచంద్ర పరబ్రహ్మ అనుగ్రహం పొందటమే ఈ కృతుల ఉద్దేశం. చిన్న వయసులోనే రామకోటి జపాన్ని మొదలు పెట్టి 21 ఏళ్ల సుదీర్ఘమైన తపస్సు తరువాతా దానిని పూర్తి చేసి రాముని అనుగ్రహం పొంది, ఆ తరువాతే కృతుల రచన మొదలు పెట్టారు త్యాగరాజస్వామి. అందుకే ఆయన కృతులలో సార్థకత, సాఫల్యము సుస్పష్టం. 

త్యాగరాజస్వామి వారు రచించిన దివ్యనామ సంకీర్తనలలో ఒకటి రామ రామ నీ వారము గావ రారా అన్నది. వివరాలు:

సాహిత్యం
=======

రామ రామ నీ వారము గావ రారా సీతా

రామ రామ సాధుజన ప్రేమ రారా 

మెరుగు చేలము గట్టుకో మెల్ల రారా రామ
కరకు బంగరు సొమ్ములు కదల రారా   

వరమైనట్టి భక్తాభీష్ట వరద రామ రారా రామ
మరుగు జేసు కొన్నట్టి మహిమ రారా          

చిరునవ్వు గల మోము జూప రారా రామ
కరుణతో నన్నెల్లప్పుడు కావ రారా   

కందర్ప సుందర ఆనందకంద రారా నీకు
వందనము జేసెద గోవింద రారా   

ఆద్యంత రహిత వేదవేద్యా రారా భవ
వైద్య నేనీవాడనైతి వేగ రారా    

సుప్రసన్న సత్య రూప సుగుణ రారా రామ
అప్రమేయ త్యాగరాజునేల  రారా

భావం
=====

సాధుజనుల పట్ల ప్రేమ కలిగిన ఓ సీతా రామా! మేము నీ వారము, మమ్ములను రక్షించుటకు రావయ్యా! మెరిసే వస్త్రములు, బంగారు ఆభరణములు ధరించి మెల్లగా మమ్ములను రక్షించుటకు రావయ్యా! భక్తుల కామ్యములను దీర్చే వరదునిగా పేరొంది, ఆశ్రయించదగినట్టి అద్భుతమైన మహిమ గల రామా! మమ్ములను రక్షించుటకు రావయ్య! ఉద్దండువైన శ్రీరామా! అతిశయించే కాంతిగల కోదండముతో మెరుస్తూ కనులపండువగా ఉండేలా మమ్ములను రక్షించుటకు రావయ్యా! చిరునవ్వుగల ముఖమును చూపుటకు, కరుణతో నన్నెపుడు ఏలుకొనుటకు రావయ్యా! మన్మథుని వంటి సౌందర్యము కలిగి, ఆనందానికి మూలమైన ఓ శ్రీరామా! నీకు వందనములు జేసెదము, మమ్ములను రక్షించుటకు రావయ్యా! ఆది, అంతములు లేనివాడవు, వేదములచే తెలియబడినవాడవు, ఈ సంసారమునకు వైద్యుడవు, నేను నీ వాడనైతిని, మమ్ములను రక్షించుటకు వేగముగా రావయ్యా! సుప్రసన్నుడవు, సత్య రూపుడవు, సుగుణములు కలవాడవు, ప్రమాణములకు అందని వాడవు, త్యాగరాజును ఏలుకొనుటకు రావయ్యా! 

శ్రవణం
======

ఆనందభైరవి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఎవరు ఆలపించారో తెలియదు, చాలా చక్కగా పాడారు

7, డిసెంబర్ 2020, సోమవారం

కమలాంబాం భజరే రే మానస - దీక్షితుల వారి నవావరణ కృతి


ముత్తుస్వామి దీక్షితుల వారు శ్రీవిద్యోపాసకులు. వారు తిరువారూరులో జన్మించారు. అక్కడ త్యాగరాజస్వామి దేవస్థానంలో వెలసిన కమలాంబికను ఉపాసన చేసి తరించారు.  ఆ అమ్మ పేరుతోనే తిరువారూరు కమలాలయక్షేత్రంగా కూడ పిలువబడింది. ఈ దేవస్థానం సమీపంలో కమలాలయ తటాకం ఉండటం  విశేషం. ఈ కమలాంబ ప్రత్యేకతలు ఎన్నో. అమ్మవారు సుఖాసీనురాలుగా కాకుండా యోగ ముద్రలో ఒక కాలి మీద మరొక కాలు మెలిక వేసి కూర్చొని ఉంటుంది. తన చేత కమలము, పాశాంకుశము, రుద్రాక్ష ధరించి యోగినిగా దర్శనమిస్తుంది. శ్రీవిద్యా ఉపాసనా పద్ధతిలో ఇక్కడ అమ్మవారిని కొలుస్తారు. దీక్షితుల వారు  ఈ కమలాంబ శ్రీ విద్యా ఉపాసనతో జ్ఞాన దృష్టి కలిగి ఈ అమ్మపై 9 కీర్తనలను రచించారు. వీటిని నవావరణ కృతులు అంటారు. శ్రీచక్రంలో ఉన్న తొమ్మిది ఆవరణలకు ఈ తొమ్మిది కృతులను దీక్షితుల వారు రచించారు. ధ్యానము, మంగళము కలుపుకొని మొత్తం 11 కమలాంబ కృతులు ఆయన జ్ఞాన ధారగా వెలువడ్డాయి. తోడి రాగంలో ధ్యాన కృతి కమలాంబికే, తరువాత ఆనందభైరవిలో కమలాంబ సంరక్షతు, కళ్యాణి రాగంలో కమలాంబాం భజరే, శంకరాభరణ రాగంలో శ్రీ కమలాంబికాయ రక్షితోహం, కాంభోజి రాగంలో కమలాంబికాయై, భైరవిలో శ్రీ కమలాంబాయాః పరం, పున్నాగవరాళి రాగమలో కమలాంబికాయాస్తవ, శహానా రాగంలో శ్రీ కమలాంబికాయాం, ఘంట రాగంలో శ్రీ కమలాంబికే, ఆహిరి రాగంలో శ్రీ కమలాంబా జయతి, శ్రీ రాగంలో శ్రీ కమలాంబికే అనే 11 కృతులను రచించారు.

ఈ కీర్తనలలో విభక్తి అవరోహణ ప్రత్యేకత. కృతుల సాహిత్యాన్ని పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. ఈ నవావరణ కీర్తనలు గానానికి క్లిష్టతరమైనవిగా చెప్పబడతాయి. లోకానికి ఈ ఉపాసనలోని గొప్పతనాన్ని చెప్పటానికి ఆయన దేవతల, యోగినుల వివరాలతో ఈ కృతులను రచించారు. చక్రాలను, ఆయా దేవతల వలన కలిగే సిద్ధులను ఆయన వర్ణించారు. శ్రీవిద్యా ఉపాసన అందరికీ కాదు. చాలా నిష్ఠగా, అర్హులైన గురువుల అనుగ్రహంతో చేయవలసినది. ఈ ఉపాసన సరిగ్గా తెలిసిన గురువులు కూడా చాలా తక్కువ. ఈ నాటి కాలంలో ఇటువంటి ఉపాసన తాంత్రికంగా భావించబడుతుంది. కానీ, దీక్షితుల వారు సిద్ధులైన వారు. తిరువారూరులో అమ్మను ఉపాసన చేస్తూ ఈ కృతులను రచించారు.

కమలాంబ నవావరణ కృతులలో రెండవ కృతి కమలాంబాం భజరే రే మానస. వివరాలు:

సాహిత్యం
=======

కమలాంబాం భజరే రే మానస కల్పితమాయాకార్యం త్యజ రే

కమలావాణీసేవితపార్శ్వాం కంబుజయగ్రీవాం నతదేవాం
కమలాపురసదనాం మృదుగదనాం కమనీయరదనాం కమలవదనాం

సర్వాశాపరిపూరకచక్రస్వామినీం పరమశివకామినీం
దుర్వాసార్చిత గుప్తయోగినీం దుఃఖధ్వంసినీం హంసినీం
నిర్వాణనిజసుఖదాయినీం నిత్యకల్యాణీం కాత్యాయనీం
శర్వాణీం మధుపవిజయవేణీం సద్గురుగుహజననీం నిరంజనీం
గర్వితభండాసురభంజనీం కామాకర్షిణ్యాదిరంజనీం
నిర్విశేషచైతన్యరూపిణీం ఉర్వీతత్వాదిస్వరూపిణీం

భావం
=====

ఓ మనసా! కమలాంబను భజింపుము. మాయా కార్యములను త్యజించుము. వింజామరలను ధరించిన లక్ష్మీ సరస్వతులచే ప్రక్కభాగములందు సేవింపబడే ఆది పరాశక్తి, శంఖాన్ని మించిన కంఠము కలిగినది, దేవతలచే నుతించబడేది, కమలాపురంలో (తిరువారూరులో) వెలసినది, మృదువైన మాటలు,అందమైన పలువరస, కమలము వంటి ముఖము కలిగిన కమలాంబను భజింపుము. అన్ని దిక్కులలోను వ్యాపించి శ్రీచక్రానికి అధిష్ఠాన దేవత అయినది, పరమశివుని అర్థాంగి అయిన కమలాంబను భజింపుము. దుర్వాసునిచే అర్చించబడిన గుప్తయోగిని స్వరూపిణి, దుఃఖములను తొలగించే దేవి, ఆత్మ మంత్ర స్వరూపిణి, తనదైన మోక్షానందమును ప్రసాదించే తల్లి, నిత్య మంగళ స్వరూపిణి, కాత్యాయని, పరమశివుని పత్ని, తుమ్మెదల నలుపును మించిన కురులు కలిగినది, జ్ఞాననిధియైన సుబ్రహ్మణ్యుని జనని, అజ్ఞానమును తొలగించే జ్ఞానస్వరూపిణి, గర్వముతో అంధుడైన భండాసురుని సంహరించినది, శ్రీచక్రములోని రెండవ ఆవరణలో ఉన్న కామాకర్షిణి దేవతలను రంజింపజేసేది, గుణము, ఉపాధి లేని శుద్ధచైతన్య స్వరూపిణి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచభూతములు మొదలైన వాటి రూపము కలది అయిన కమలాంబను భజింపుము, మాయా కార్యములను త్యజించుము. 

శ్రవణం
======

కల్యాణి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

చిత్రం
====

తిరువారూరులోని కమలాంబ మూల రూపం. 

6, డిసెంబర్ 2020, ఆదివారం

గణపతే మహామతే - అంబి దీక్షితార్ కృతి


ముత్తుస్వామి దీక్షితుల వారి వారసులలో మూడవ తరం వారు అంబి దీక్షితులు. వీరు తూత్తుకుడి జిల్లాలోని ఎట్టయపురం సంస్థానంలో ఆస్థాన విద్వాంసులుగా పని చేసే వారు. వీరు ముత్తుస్వామి దీక్షితుల వారి సాహిత్యాన్ని ప్రచారం చేయటానికి చాలా కృషి చేశారు. డీకే పట్టమ్మాళ్ వంటి ఎందరో కళాకారులకు దీక్షితుల వారి సాహిత్యాన్ని పరిచయం చేసింది అంబి గారే. ఈయన అసలు పేరు కూడా ముత్తాతగారి పేరే. ఆయన తన కృతులలో కూడా ముత్తుస్వామి వారి ముద్రగా గురుగుహ పదాన్నే ఉపయోగించారు. అందుకే చాలామంది ఈ కృతి ముత్తుస్వామి దీక్షితుల వారే రచించారని భావిస్తారు. ఆయన కృతులలో ఒకటి గణపతే మహామతే. వివరాలు:

సాహిత్యం
========

గణపతే మహామతే గౌరీ కుమార మాం పాహి

అణిమాద్యష్టైశ్వర్యప్రద గురుగుహపూజిత వర

సోమసూర్యాగ్నినేత్ర సదాశివానందపుత్ర
వామదేవాదివక్త్ర వారిజ గంభీరగాత్ర
హిమాద్రీశసుతామోద హిరణ్యమయపీఠస్థిత
పామరపండితనుతపద పంకజాసనారాధిత

భావం
=====

మహాబుద్ధిశాలివి, గౌరీ పుత్రుడవైన ఓ గణపతీ! నన్ను రక్షించుము. అణిమాది (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము) అష్టైశ్వర్యములను ప్రసాదించేవాడవు, సుబ్రహ్మణ్యునిచే పూజించబడే శ్రేష్ఠుడవైన ఓ గణపతీ! నన్ను రక్షించుము. సూర్యుడు, చంద్రుడు, అగ్ని నేత్రములుగా కలవాడవు, పరమశివునికి ఆనందము కలిగించే పుత్రుడవు, వామదేవాది ఐదు ముఖములు కలవాడవు, శంఖము వలె అందమైన కంఠము కలవాడవు, హిమవత్పుత్రికయైన పార్వతికి మోదాన్ని కలిగించేవాడవు, బంగారు పీఠముపై స్థితుడవై పామరులు, పండితులచే పూజించబడే పదములు కలిగినవాడవు, బ్రహ్మదేవునిచే పూజించబడేవాడవైన ఓ గణపతీ! నన్ను రక్షించుము. 

శ్రవణం
=======

కల్యాణి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు

5, డిసెంబర్ 2020, శనివారం

కొలువై యున్నాడే దేవదేవుడు - శరభోజి కృతి



తంజావూరు మహారాజాలు తెలుగు భాషాభివృద్ధికి ఎంత తోడ్పడ్డారో వారు రచించిన ప్రబంధాల సాహిత్యం పరిశీలిస్తే అర్థమవుతుంది. భోసల సాహ మహారాజు (శరభోజి) 1684-1710 మధ్య ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. వీరు శివ మరియు విష్ణు పల్లకీ సేవా ప్రబంధాలను రచించారు. వీరు సాహిత్య నిర్వహణా దక్షులు, వేదాంత వైశేషిక వ్యాకరణాది శాస్త్ర విజ్ఞాతలు. అభినవభోజుడని బిరుదు కలవారు. వీరు తమ నామధేయాన్నే ముద్రగా కీర్తనలలో ఉపయోగించారు. వీరు శివ పల్లకీసేవా ప్రబంధాన్ని తిరువాయూరులోని కమలాంబికా సమేత త్యాగరాజస్వామి వారికి అంకితం చేశారు. ఈ ప్రబంధం పరమేశ్వర స్తుతితో మొదలై గౌరీశంకర సంస్తుతితో పరిసమాప్తమవుతుంది. ఈ ప్రబంధమొక సంగీత రూపకం. దీనిని దాదాపుగా రెండువందల సంవత్సరాలు త్యాగరాజస్వామి దేవస్థానంలో ప్రదర్శించారు. 

కే విశ్వనాథ్ గారి గొప్పతనమేమిటంటే తన చలనచిత్రాలలో ప్రాచీన వాఙ్మయానికి, కళలకు ప్రముఖమైన స్థానం కలిపించటం. స్వర్ణకమలం (1988) చిత్రంలో నాయిక నాట్యకళాభ్యాస సన్నివేశానికై శివ వైభావాన్ని ఆవిష్కరించే తంజావూరు మహారాజా వారి పల్లకీ ప్రబంధం నుండి ఈ కృతిని పొందుపరచారు. దీనికి కూచిపూడి నాట్యాన్ని కూర్చిన వారు ప్రఖ్యాత నాట్య గురువు శ్రీమతి ఉమారామారావు గారు. ఈ గీతం ద్వారా అరుదైన సాహిత్యానికి, కూచిపూడి నాట్య కళకు ఓ అద్భుతమైన వేదికను ప్రతిపాదించారు. వివరాలు:

సాహిత్యం
========

కొలువైయున్నాడే దేవదేవుడు

కొలువైయున్నాడే కోటి సూర్యప్రకాశుడే
వలరాజు పగవాడే వనిత మోహనాంగుడే

బలుపొంకమగు చిలువల కంకణములమర
నలువంకల మణిరుచులవంక తనర
తలవంక నలవేలుపులవంక నెలవంక
వలచేతనొక జింక వైఖరి మీరంగ

మేలుగ రతనంపు రాలు చెక్కినయుంగ
రాలు భుజగ కేయూరాలు మెరయంగ
పాలుగారు మోమున శ్రీలు పొడమ పులి
తోలు గట్టి ముమ్మొన వాలుబట్టి చెలగ

ఆసల గ్రొన్నన వాసన నిండార
భాసమాన మణిసింహాసనాంతర ని
వాసుడగుచు నిజదాసుల పెన్నిధి
భోసల సాహ భూవాసవు దైవము

భావం
=====

దేవదేవుడైన పరమశివుడు కొలువైయున్నాడు చూడండి. కోటి సూర్యుల ప్రకాశము కలవాడు, మన్మథుని శత్రువు, పార్వతీ దేవి మోహించే సుందరమైన రూపము కలిగిన పరమశివుడు కొలువైయున్నాడు. ఎంతో పొందికగా సర్పములు కంకణములుగా అమరగా, నాలుగుదిక్కులా మణులకాంతుల వల్ల అతిశయించగా, ముందుభాగమున దేవతా సమూహము యుండగా, తలపైన చంద్రుడు, ఒక పక్క పార్వతీదేవి, కుడిచేతిలో జింక కలిగి అద్భుతమైన రూపము అతిశయించగా పరమశివుడు కొలువై యున్నాడు చూడండి. మేలైన రత్నాలు, రాళ్లతో పొదిగిన ఉంగరాలు, భుజకీర్తులు మెరయగా, నుంపారు ముఖములో శుభలక్షణములు ఉదయించుచుండగా పులిచర్మముతో, త్రిశూలమును వాలుగా ధరించి ప్రకాశించే పరమశివుడు కొలువైయున్నాడు చూడండి. అనుభూతి పరిపూర్ణత్వము పొందగా, కామ్యములను వేగముగా నెరవేర్చుతూ మణులతో పొదగబడిన సింహాసన స్థితుడై, నిజభక్తుల పాలిటి పెన్నిధిగా, భోసల సాహజీ మహారాజుకు దైవమై పరమశివుడు కొలువై యున్నాడు చూడండి. 

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు
===========================

వలరాజు = మన్మథుడు, పొంకము=పొందిక/సొగసు, చిలువలు=సర్పములు, రుచి=కాంతి, తలవంక=ముందు భాగమున, కులవంక=ధర్మపత్ని, వలచేత=కుడిచేత, వైఖరి=అందము, ముమ్మొన=మూడు అగ్రభాగములు కలిగినది (త్రిశూలము), చెలగు=ప్రకాశించు, క్రొన్నన=వేగముగా, వాసన=అనుభూతి, నిండార=పరిపూర్ణత్వము పొందగా.


దృశ్యశ్రవణం
==========

కృతిలోని మొదటి రెండు చరణాలను మాత్రమే చలనచిత్రంలో పొందుపరచారు. శరభోజీ ఈ కృతిని శంకరాభరణం రాగంలో స్వరపరచగా, ఇళయరాజాగారు రాగమాలికగా కూర్చారు. ఈ కృతిని బాలసుబ్రహ్మణ్యం, సుశీలమ్మ శ్రావ్యంగా ఆలపించారు, ఉమా రామారావు గారి నృత్య దర్శకత్వంలో భానుప్రియగారు అద్భుతమైన నాట్యం చేశారు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవిత విశేషాలు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆధునిక భారతదేశంలో ఆధ్యాత్మిక సందేశాన్ని విద్య, వైద్యం, తాగునీరు, సేవా కార్యక్రమాలతో ముడిపెట్టిన మహనీయులు. ఆయన 1926...