13, డిసెంబర్ 2020, ఆదివారం

ఇక్ష్వాకుకులతిలక ఇకనైన పలుకవే - రామదాసు కృతి


తానీషా సైనికులు రామదాసును ఎంతటి శారీరిక హింసకు గురి చేయకపోతే ఆ వాగ్గేయకారుడు శ్రీరామచంద్రుని నిందించే భావనలను వ్యక్తపరస్తాడు? భక్తిమార్గంలో ఎంతటి అచంచల విశ్వాసమున్నా, భగవంతుడు పెట్టే పరీక్షలు తట్టుకోవటం చాలా కష్టం. అందులోనూ కారాగార వాసంలో శిక్ష తట్టుకోవటం మరింత కష్టం. పరమ భక్తాగ్రేసరుడైన రామదాసు కూడా ఆ సైనికుల దెబ్బలను తట్టుకోలేకపోయాడు, అందుకే ఇక్ష్వాకుకుల తిలక ఇకనైన పలుకవే అని విలపిస్తూ, నిందిస్తూ, రాముని వేడుకున్నాడు. సీతారామ భరతలక్ష్మణ శత్రుఘ్నులకు ఆభరణాలు, భద్రాద్రి దేవాలయ ప్రాకారానికి, గోపురానికి, మంటపాలకు ఖర్చులు ప్రస్తావిస్తూ అవన్నీ స్వామికే కదా? అవేమైనా దశరథుడు, జనకుడు చేయించారా అని నిష్ఠూరంగా పలుకుతాడు రామదాసు.  ఎవరబ్బ సొమ్మనికి కులుకుతూ తిరుగుతున్నావు అని నిందిస్తాడు. అంతలో తన తప్పు గ్రహించి నిందించినందుకు ఆగ్రహించవద్దు, దెబ్బలకు ఓర్వలేక తిట్టానని చెప్పుకుంటాడు. భక్తులనందరినీ కాపాడే శ్రీరాముని తనను కూడా కాపాడమని చివరకు వేడుకుంటాడు. ఇప్పటికీ గోల్కోండ కోటకు వెళితే రామదాసును బందీ చేసిన జైలును చూస్తే ఆయన ఎంతటి దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాడో చూడవచ్చు. తరువాత రామలక్ష్మణుల అనుగ్రహము, రామదాసు ముక్తి మనకు తెలిసిందే. ప్రతి వాగ్గేయకారుని జీవితంలో కూడా పరమాత్మ అనుగ్రహాన్ని చాటే ఇటువంటి ఘటనలు, అద్భుతాలు ఎన్నో. 

ఇక్కడ కొన్ని సాంకేతిక వివరాలు: మొహరీ అంటే ఒక తులము ఎత్తు బంగారము (30 చిన్నములు అనగా నాలుగు గురిగింజల ఎత్తు). వరహా అనగా 3.4 గ్రాముల బంగారము. 

ఆధ్యాత్మిక సందేశంగా ఈ కృతిని తీసుకుంటే జనన మరణాల మధ్య జీవాత్మ పడే నరకయాతనలన్నీ కూడా పరమాత్మ సృష్టి స్థితి లయములలో భాగమే. ఆ పరమాత్మను చేరుకోవటం కోసమే ఇవన్నీ కూడా. కర్మలు, వాటి ఫలాల నుండి రక్షించి తనకు ముక్తిని ప్రసాదించమని జీవాత్మ చేసే అనేక భావనలతో కూడిన ప్రార్థనగా దీన్ని భావించవచ్చు. సమస్తమూ పరమాత్మకు సమర్పించినపుడు ఆ పరంజ్యోతిలో ఏకమయ్యే దారి కనిపించక జీవాత్మ పడే యాతనకు ఈ కృతి ప్రతిబింబం. 

సాహిత్యం
========

ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన పలుకవే రామచంద్ర
నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్ర

చుట్టు ప్రాకారములు సొంపుతో కట్టిస్తి రామచంద్ర
ఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్ర

గోపుర మంటపాలు కుదురుగ గట్టిస్తి రామచంద్ర
నను క్రొత్తగ చూడక ఇద్దరి బ్రోవుము రామచంద్ర

భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర

శత్రుఘ్నునకు చేయిస్తి బంగారు మొలతాడు రామచంద్ర
ఆ మొల త్రాటికి పట్టె మొహరీలు పదివేలు రామచంద్ర

లక్ష్మణునకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర

సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర

కలికి తురాయి నీకు మెలుకువగ చేయిస్తి రామచంద్ర
నీవు కులుకుచు తిరిగేవు ఎవరబ్బ సొమ్మని రామచంద్ర

నీ తండ్రి దశరథ మహారాజు పెట్టెనా రామచంద్ర
లేక నీ మామ జనక మహారాజు పంపెనా రామచంద్ర

అబ్బ తిట్టితినని ఆయాస పడవద్దు రామచంద్ర
ఈ దెబ్బల కోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్ర

భక్తులందరిని పరిపాలించెడి శ్రీ రామచంద్ర
నీవు క్షేమముగ శ్రీ రామదాసుని యేలుము రామచంద్ర

భావం
=====

ఇక్ష్వాకువంశ తిలకుడవైన శ్రీరామచంద్రా! ఇకనైన పలుకుము. నన్ను నువు రక్షించకుంటే వేరెవరు రక్షించెదరు? ఈ దేవాలయము చుట్టూ ప్రాకారము ఎంతో అందంగా కట్టించాను, ఆ ప్రాకారానికి పదివేల వరహాలు పట్టాయి. ఇకనైన పలికి నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! దేవాలయానికి గోపురము, మంటపాలు స్థిరముగా కట్టించాను, ఇవన్నీ నీకు తెలియవా? నన్ను క్రొత్తగా చూడకుండా ఈ చెరసాలలో ఉన్న నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! నీ ప్రియసోదరుడైన భరతునికి పచ్చల పతకము చేయించాను, దానికి పదివేల వరహాలు పట్టాయి. మరి ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! నీ కనిష్ఠ సోదరుడైన శత్రుఘ్నునికి బంగారు మొలత్రాడు చేయించాను, దానికి పదివేల మొహరీలు పట్టాయి. మరి ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! లక్ష్మణునికి ముత్యాల పతకము చేయించాను. దానికి పదివేల వరహాలు పట్టాయి. మరి ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! సీతమ్మకు చింతాకు పతకము చేయించాను. దానికి పదివేల వరహాలు పట్టాయి. మరి ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! నీకోసం అందమైన శిరోభూషణము చేయించాను. ఎవడబ్బ సొమ్మని వాటిని పెట్టుకుని కులుకుతూ తిరుగుతున్నావు! ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. ఈ ఆభరణాలు మీ నాన్న గారు దశరథ మహారాజు చేయించారా లేక మామగారు జనకమహారాజు కానుకగా పంపించారా! ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! నేను ఈ విధంగా దూషిస్తున్నానని కోపగించుకోవద్దు. ఈ తానీష సైనికులు కొట్టే దెబ్బలను భరించలేక అలా చేస్తున్నాను. ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. భక్తులను పరిపాలించే ఓ శ్రీరామచంద్రా! నువ్వు శుభముగా నన్ను రక్షించుము. 

శ్రవణం
======

యదుకుల కాంభోజి రాగంలో కూర్చబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి