10, డిసెంబర్ 2020, గురువారం

రామ రామ నీ వారము గావ రారా - త్యాగరాజస్వామి దివ్యనామ సంకీర్తన


రామునితో మనోజ్ఞమైన సంభాషణలలో శరణాగతిని వ్యక్తపరచిన కృతులను కూడా త్యాగరాజస్వామి రచించారు. రమ్మని, ప్రేమతో కాపడమని వేడుకుంటూ రాముని గుణాలను, వైభవాన్ని అద్భుతంగా ఈ కృతులలో వర్ణించారు. అటువంటి కృతులను ఆయన దివ్యనామ సంకీర్తనలు అనే సంపుటిలో కూడా ఎన్నో రచించారు. దాదాపుగా 118 సంఖ్యలో ఉన్న ఈ సంకీర్తనల ఉద్దేశం రామ నామ స్మరణతో భజన సాంప్రదాయంలో బృందగానం చేసుకుని తరించటం. వీటిలో ప్రతి చరణం తరువాత పల్లవిని పూర్తిగా పాడుకునే చక్కని పద్ధతిని ఉపయోగించి త్యాగరాజస్వామి తన కృతులను పామరులకు కూడా అర్థమయ్యేలా రచించారు. మానవుని ఆనందానికి నడవడిక ఎలా ఉండాలో, రామాయణ ఘట్టాలతో సమన్వయం చేస్తూ ఈ దివ్యనామ సంకీర్తనలను స్వామి రచించారు. నామానికి గుణాన్ని, వైభవాన్ని జతపరచి దాన్ని రాగయుక్తంగా ఆలపిస్తే ఆ నామం మన మనసులో స్థిరమవుతుంది అన్న అద్భుతమైన సూత్రాన్ని ఈ దివ్యనామ సంకీర్తనల ద్వారా త్యాగరాజస్వామి మనకు తెలియజేశారు. నామస్మరణతో త్రికరణ శుద్ధి కలిగి రామచంద్ర పరబ్రహ్మ అనుగ్రహం పొందటమే ఈ కృతుల ఉద్దేశం. చిన్న వయసులోనే రామకోటి జపాన్ని మొదలు పెట్టి 21 ఏళ్ల సుదీర్ఘమైన తపస్సు తరువాతా దానిని పూర్తి చేసి రాముని అనుగ్రహం పొంది, ఆ తరువాతే కృతుల రచన మొదలు పెట్టారు త్యాగరాజస్వామి. అందుకే ఆయన కృతులలో సార్థకత, సాఫల్యము సుస్పష్టం. 

త్యాగరాజస్వామి వారు రచించిన దివ్యనామ సంకీర్తనలలో ఒకటి రామ రామ నీ వారము గావ రారా అన్నది. వివరాలు:

సాహిత్యం
=======

రామ రామ నీ వారము గావ రారా సీతా

రామ రామ సాధుజన ప్రేమ రారా 

మెరుగు చేలము గట్టుకో మెల్ల రారా రామ
కరకు బంగరు సొమ్ములు కదల రారా   

వరమైనట్టి భక్తాభీష్ట వరద రామ రారా రామ
మరుగు జేసు కొన్నట్టి మహిమ రారా          

చిరునవ్వు గల మోము జూప రారా రామ
కరుణతో నన్నెల్లప్పుడు కావ రారా   

కందర్ప సుందర ఆనందకంద రారా నీకు
వందనము జేసెద గోవింద రారా   

ఆద్యంత రహిత వేదవేద్యా రారా భవ
వైద్య నేనీవాడనైతి వేగ రారా    

సుప్రసన్న సత్య రూప సుగుణ రారా రామ
అప్రమేయ త్యాగరాజునేల  రారా

భావం
=====

సాధుజనుల పట్ల ప్రేమ కలిగిన ఓ సీతా రామా! మేము నీ వారము, మమ్ములను రక్షించుటకు రావయ్యా! మెరిసే వస్త్రములు, బంగారు ఆభరణములు ధరించి మెల్లగా మమ్ములను రక్షించుటకు రావయ్యా! భక్తుల కామ్యములను దీర్చే వరదునిగా పేరొంది, ఆశ్రయించదగినట్టి అద్భుతమైన మహిమ గల రామా! మమ్ములను రక్షించుటకు రావయ్య! ఉద్దండువైన శ్రీరామా! అతిశయించే కాంతిగల కోదండముతో మెరుస్తూ కనులపండువగా ఉండేలా మమ్ములను రక్షించుటకు రావయ్యా! చిరునవ్వుగల ముఖమును చూపుటకు, కరుణతో నన్నెపుడు ఏలుకొనుటకు రావయ్యా! మన్మథుని వంటి సౌందర్యము కలిగి, ఆనందానికి మూలమైన ఓ శ్రీరామా! నీకు వందనములు జేసెదము, మమ్ములను రక్షించుటకు రావయ్యా! ఆది, అంతములు లేనివాడవు, వేదములచే తెలియబడినవాడవు, ఈ సంసారమునకు వైద్యుడవు, నేను నీ వాడనైతిని, మమ్ములను రక్షించుటకు వేగముగా రావయ్యా! సుప్రసన్నుడవు, సత్య రూపుడవు, సుగుణములు కలవాడవు, ప్రమాణములకు అందని వాడవు, త్యాగరాజును ఏలుకొనుటకు రావయ్యా! 

శ్రవణం
======

ఆనందభైరవి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఎవరు ఆలపించారో తెలియదు, చాలా చక్కగా పాడారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి