5, డిసెంబర్ 2020, శనివారం

కొలువై యున్నాడే దేవదేవుడు - శరభోజి కృతి



తంజావూరు మహారాజాలు తెలుగు భాషాభివృద్ధికి ఎంత తోడ్పడ్డారో వారు రచించిన ప్రబంధాల సాహిత్యం పరిశీలిస్తే అర్థమవుతుంది. భోసల సాహ మహారాజు (శరభోజి) 1684-1710 మధ్య ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. వీరు శివ మరియు విష్ణు పల్లకీ సేవా ప్రబంధాలను రచించారు. వీరు సాహిత్య నిర్వహణా దక్షులు, వేదాంత వైశేషిక వ్యాకరణాది శాస్త్ర విజ్ఞాతలు. అభినవభోజుడని బిరుదు కలవారు. వీరు తమ నామధేయాన్నే ముద్రగా కీర్తనలలో ఉపయోగించారు. వీరు శివ పల్లకీసేవా ప్రబంధాన్ని తిరువాయూరులోని కమలాంబికా సమేత త్యాగరాజస్వామి వారికి అంకితం చేశారు. ఈ ప్రబంధం పరమేశ్వర స్తుతితో మొదలై గౌరీశంకర సంస్తుతితో పరిసమాప్తమవుతుంది. ఈ ప్రబంధమొక సంగీత రూపకం. దీనిని దాదాపుగా రెండువందల సంవత్సరాలు త్యాగరాజస్వామి దేవస్థానంలో ప్రదర్శించారు. 

కే విశ్వనాథ్ గారి గొప్పతనమేమిటంటే తన చలనచిత్రాలలో ప్రాచీన వాఙ్మయానికి, కళలకు ప్రముఖమైన స్థానం కలిపించటం. స్వర్ణకమలం (1988) చిత్రంలో నాయిక నాట్యకళాభ్యాస సన్నివేశానికై శివ వైభావాన్ని ఆవిష్కరించే తంజావూరు మహారాజా వారి పల్లకీ ప్రబంధం నుండి ఈ కృతిని పొందుపరచారు. దీనికి కూచిపూడి నాట్యాన్ని కూర్చిన వారు ప్రఖ్యాత నాట్య గురువు శ్రీమతి ఉమారామారావు గారు. ఈ గీతం ద్వారా అరుదైన సాహిత్యానికి, కూచిపూడి నాట్య కళకు ఓ అద్భుతమైన వేదికను ప్రతిపాదించారు. వివరాలు:

సాహిత్యం
========

కొలువైయున్నాడే దేవదేవుడు

కొలువైయున్నాడే కోటి సూర్యప్రకాశుడే
వలరాజు పగవాడే వనిత మోహనాంగుడే

బలుపొంకమగు చిలువల కంకణములమర
నలువంకల మణిరుచులవంక తనర
తలవంక నలవేలుపులవంక నెలవంక
వలచేతనొక జింక వైఖరి మీరంగ

మేలుగ రతనంపు రాలు చెక్కినయుంగ
రాలు భుజగ కేయూరాలు మెరయంగ
పాలుగారు మోమున శ్రీలు పొడమ పులి
తోలు గట్టి ముమ్మొన వాలుబట్టి చెలగ

ఆసల గ్రొన్నన వాసన నిండార
భాసమాన మణిసింహాసనాంతర ని
వాసుడగుచు నిజదాసుల పెన్నిధి
భోసల సాహ భూవాసవు దైవము

భావం
=====

దేవదేవుడైన పరమశివుడు కొలువైయున్నాడు చూడండి. కోటి సూర్యుల ప్రకాశము కలవాడు, మన్మథుని శత్రువు, పార్వతీ దేవి మోహించే సుందరమైన రూపము కలిగిన పరమశివుడు కొలువైయున్నాడు. ఎంతో పొందికగా సర్పములు కంకణములుగా అమరగా, నాలుగుదిక్కులా మణులకాంతుల వల్ల అతిశయించగా, ముందుభాగమున దేవతా సమూహము యుండగా, తలపైన చంద్రుడు, ఒక పక్క పార్వతీదేవి, కుడిచేతిలో జింక కలిగి అద్భుతమైన రూపము అతిశయించగా పరమశివుడు కొలువై యున్నాడు చూడండి. మేలైన రత్నాలు, రాళ్లతో పొదిగిన ఉంగరాలు, భుజకీర్తులు మెరయగా, నుంపారు ముఖములో శుభలక్షణములు ఉదయించుచుండగా పులిచర్మముతో, త్రిశూలమును వాలుగా ధరించి ప్రకాశించే పరమశివుడు కొలువైయున్నాడు చూడండి. అనుభూతి పరిపూర్ణత్వము పొందగా, కామ్యములను వేగముగా నెరవేర్చుతూ మణులతో పొదగబడిన సింహాసన స్థితుడై, నిజభక్తుల పాలిటి పెన్నిధిగా, భోసల సాహజీ మహారాజుకు దైవమై పరమశివుడు కొలువై యున్నాడు చూడండి. 

కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు
===========================

వలరాజు = మన్మథుడు, పొంకము=పొందిక/సొగసు, చిలువలు=సర్పములు, రుచి=కాంతి, తలవంక=ముందు భాగమున, కులవంక=ధర్మపత్ని, వలచేత=కుడిచేత, వైఖరి=అందము, ముమ్మొన=మూడు అగ్రభాగములు కలిగినది (త్రిశూలము), చెలగు=ప్రకాశించు, క్రొన్నన=వేగముగా, వాసన=అనుభూతి, నిండార=పరిపూర్ణత్వము పొందగా.


దృశ్యశ్రవణం
==========

కృతిలోని మొదటి రెండు చరణాలను మాత్రమే చలనచిత్రంలో పొందుపరచారు. శరభోజీ ఈ కృతిని శంకరాభరణం రాగంలో స్వరపరచగా, ఇళయరాజాగారు రాగమాలికగా కూర్చారు. ఈ కృతిని బాలసుబ్రహ్మణ్యం, సుశీలమ్మ శ్రావ్యంగా ఆలపించారు, ఉమా రామారావు గారి నృత్య దర్శకత్వంలో భానుప్రియగారు అద్భుతమైన నాట్యం చేశారు

2 కామెంట్‌లు: