మీరా భజనలు అనగానే ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు గుర్తుకు వస్తారు. కారణం, ఆవిడ భక్తిలోని ఔన్నత్యం, ఆవిడ ఆలపించిన ప్రతి భజనలోనూ అది ప్రస్ఫుటంగా తెలుస్తుంది. మీరాలో ఉన్న మధురభక్తిని తన గాత్రంలో రంగరించి సుబ్బులక్ష్మి గారు ఈ భజనలు పాడారు. అటువంటి భజన ఒకటి ప్యారే దర్శన్ దీజో ఆయ్. మధురభక్తిలో మీరాకు సర్వసం శ్రీకృష్ణుడే. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి కూడా ముమ్మాటికీ మీరా వంటి భక్తురాలే. ఆ భావన ఆమె నడవడికలో, గాత్రధర్మంలో మనకు స్పష్టంగా గోచరిస్తుంది. అందుకే ఎమ్మెస్ నటించిన మీరా (1945) చిత్రం కూడా అద్భుతమైన విజయం సాధించింది.
సాహిత్యం
=======
ప్యారే దర్శన్ దీజో ఆయ్
తుమ్ బిన్ రహ్యయో న జాయ్
జల బిన కమల చంద్ర బిన రజనీ ఐసే తుం దేఖ్యా బిన సజనీ
ఆకుల వ్యాకుల ఫిరూ రైన దిన బిరహ కలేజా ఖాయ్
దివస న భూక్ నీంద్ నహి రైనా ముఖ కే కథన్ న ఆవే బైనా
కహా కరూ కుచ్ కహత్ న ఆవై మిల్ కర్ తపత్ బుఝాయ్
క్యో తరసావో అంతర్యామీ ఆన్ మిలో కృపా కరో స్వామీ
మీరా దాసీ జనమ్ జనమ్ కీ పడీ తుమ్హారీ పాయ్
భావం
=====
ప్రియ కృష్ణా! నీవు లేకుండా నేను జీవించలేను, దర్శనమీయ వేగంగా రా స్వామీ! నీటిని వీడి కమలము, చంద్రుని విడచి రాత్రి ఉండలేనట్లు నిన్ను చూడకుండా ఈ సఖి ఉండలేదు. నీ దర్శనము కోసం విరహముతో పగలు రాత్రి మనసు చెదరి, కలతతో తిరుగుతున్నాను, ఆ విరహము నా హృదయాన్ని తొలచివేస్తున్నది. పగలు ఆకలి లేదు, రాత్రి నిద్ర రావటం లేదు, మాటలు మాట్లాడదామన్నా నోరు పెగలటం లేదు. నువ్వు అంతర్యామివి కదా! నన్ను ఎందుకు తపింపజేస్తున్నావు. వేగంగా వచ్చి నాపై కరుణించు. జన్మజన్మల నుండి ఈ మీరా నీ దాసి, నీ చరణాలపై వ్రాలి ప్రార్థిస్తోంది, దర్శనమీయ వేగంగా రా స్వామీ!
దృశ్య శ్రవణం
===========
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఆలపించిన ఈ భజనను వీడియోలో వీక్షించండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి