3, సెప్టెంబర్ 2020, గురువారం

మరకతవల్లీం మనసా స్మరామి - దీక్షితుల వారి కృతి



మరకతవల్లీం మనసా స్మరామి
మదన జనకాది దేవ పాలినీం

హరహృదయవాసినీం మోహినీం
హరిహర పుత్ర జననీం నళినీం
క్రూర దైత్యాది బృంద మర్దినీం
గురుగుహాది నుత వహ్నివాసినీం

శ్రీహరి మొదలైన దేవతలను పాలించే, మరకతవల్లిగా వెలసిన అమ్మను మనసులో ధ్యానిస్తున్నాను. శివును హృదయములో సంచరించే మోహిని, హరిహర పుత్రుని జనని, నల్లని కలువ వలె ఉన్న అమ్మను, క్రూరులైన రాక్షస సమూహాన్ని సంహరించిన, గురుగుహుడు మొదలైన వారిచే నుతించబడిన, అగ్ని నుండి జన్మించిన అమ్మను నేను ధ్యానిస్తున్నాను.

ముత్తుస్వామి దీక్షితుల వారి కృతులలో సింహభాగం క్షేత్రాలలోని దేవతా స్వరూపాల వర్ణించే కోవకు చెందినవి. అటువంటి కృతే వెల్లూరు సమీపంలోని మార్గబంధీశ్వర క్షేత్రంలోని స్వామి నాయిక అయిన మరకతాంబికను వర్ణించే మరకతవల్లీం. ఈ క్షేత్రంలో ప్రధాన దేవత శివుడు మార్గబంధు లేదా మార్గసహాయేశ్వరుడు కాగా అమ్మ వారు మోహినీ రూపమైన శ్రీహరి. ఆ అమ్మను మరకతాంబికగా పిలుస్తారు. మరకతంతో చేయబడిన విగ్రహం కాబట్టి అమ్మకు ఈ పేరు వచ్చింది. ఈ క్షేత్రం కూడా ఎంతో సనాతనమైనది. దీక్షితుల వారి పూర్వీకుల ఈ విరించిపురానికి చెందిన వారు. తరువాతి కాలంలో తంజావూరు తరలి వెళ్లినా ఆ కుటుంబం ఈ క్షేత్ర దైవాలను కొలిచి అనుగ్రహం పొందారు. ఈ క్షేత్రంలో శివుడు, మోహినితో పాటు గణపతి, కాలభైరవుడు మొదలైన ఎందరో దేవతా స్వరూపాలు వెలసి ఉన్నాయి. బ్రహ్మ కొలిచిన శివుడు కలిగిన ఊరు కాబట్టి దీనికి విరించిపురమని పేరు వచ్చింది. ప్రముఖ యోగి, అద్వైత సిద్ధాంత ప్రచారకులు, పండితులు, శైవాన్ని పరిరక్షించేందుకు కృషి చేసిన మహనీయులు, సిద్ధయోగులు అయిన అప్పయ్య దీక్షితులు ఈ విరించిపురానికి చెందిన వారే. వీరు 16వ శతాబ్దంలో ఇక్కడ నివసించారు.

కాంభోజి రాగం శృంగార మరియు కరుణ రసాలను ఆవిష్కరించటానికి పేరొందిన రాగం. శుభకరమైనదిగా చెప్పబడిన ఈ రాగంలో ఎన్నో అద్భుతమైన కీర్తనలు వచ్చాయి. వాటిలో త్యాగరజస్వామి రచించిన ఓ రంగశాయి, మా జానకి, దీక్షితులవారి ఈ మరకతవల్లీం ప్రసిద్ధి చెందాయి. సొంపైన స్వరములతో సాగే ఈ రాగం ఈ కృతికి ఎంతో శోభనిచ్చింది. దీనిని రంజని గాయత్రి సోదరీమణులు గానం చేశారు.

గమనిక: చాల మంది గాయకులు ఈ కృతిలోని చరణం మొదటి భాగాన్ని హరిహృదయవాసిని, హరిహృదయావేష్టినిగా పాడారు. ఇవి తప్పని నా ఉద్దేశం. హరహృదయవాసిని సరైనది అని కొంత పరిశోధనలో తెలుసుకున్నాను.

కాంభోజి రాగంలో కూర్చబడిన ఈ కృతిని రంజని గాయత్రి సోదరీమణులు ఆలపించారు

అదివో అల్లదివో శ్రీహరివాసము - తాళ్లపాక అన్నమాచార్యుల వారు



అదివో అల్లదివో శ్రీహరివాసము
పది వేల శేషుల పడగల మయము

అదె వేంకటాచలమఖిలోన్నతము
అదివో బ్రహ్మాదులకపురూపము
అదివో నిత్య నివాసమఖిల మునులకు
అదె చూడుడదె మ్రొక్కుడానందమయము

చెంగట నల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము
ముంగిటనల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము

కైవల్య పదము వేంకట నగమదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపద రూపమదివో
పావనములకెల్ల పావనమయము

ఆ వేంకటాచలము అన్నిటికన్నా ఉన్నతమైనది. ఇక్కడ వేంకటాద్రి శిఖరపు యెత్తు అన్న భావన కన్నా స్వామి సన్నిధి అన్నిటినీ మించి ఉన్నతమైనది అన్నది అన్నమాచార్యుల వారి అంతరార్థం. ఆ హరి నివాసము బ్రహ్మాది దేవతలకు ఎంతో అపురూపమైనది. మా గురువు గారు చెప్పినట్లు వేంకటాద్రి మునులకు ఆలవాలము. ఎక్కడ పరమాత్మ ప్రజ్జ్వలమైన తేజస్సుతో సగుణరూపుడై మూర్తిగా వెలసాడో అక్కడ మునులు తప్పక ఉంటారు. వారి అర్థం, పరమార్థం ఆయనే కదా! ఆ వేంకటనాథుని సన్నిధిని చూసి, మొక్కితే కలిగే ఆనందం శాశ్వతమైనది. అందుకే దానికి ఆనందనిలయంగా పేరు వచ్చింది. ఆ వేంకటాద్రి సమీపంలోనే శేషాచలము, ఆకాశంలో నున్న దేవతలకు నివాసమది. దేవతలు ఎక్కడ పవిత్రత ఉంటుందో ఎక్కడ ప్రశాంతత ఉంటుందో, ఎక్కడ ప్రకృతి పులకరించి ఉంటుందో అక్కడ నివసిస్తారు. అందుకే శేషాచలము అడవులు దేవతలకు నివాసంగా అన్నమయ్య చెప్పారు. వీటి మధ్య ఉన్న మూలధనం స్వామి సన్నిధి, బంగారు శిఖరాలతో వెలిగేది. పరబ్రహ్మతత్వంతో ప్రకాశించేది. ఆ వేంకటాద్రి శిఖరము కైవల్యాన్ని ప్రసాదించేది, శ్రీనివాసునికి సంపదలనిచ్చేది. మనం భావిస్తే చాలు సమస్త సంపదలకు రూపము ఆ క్షేత్రము. పరమ పవిత్రమైనది.

మనం శుద్ధ అంతఃకరణముతో భావిస్తే సమస్త సంపదలకు రూపము ఆ తిరుమల శ్రీనివాసుని సన్నిధి అన్నారు అన్నమాచార్యుల వారు. అది అత్యంత పవిత్రమైనది. నిజంగా ఈ భావన రావాలంటే అన్నమాచార్యుల వారికి ఎన్ని అనుభూతులు కలిగి ఉండాలి? ఇప్పటికీ తిరుమలలో ఉన్న పాపవినాశనం, ఆకాశగంగ మొదలైన తీర్థాలలో యోగులు, సిద్ధ పురుషులు అదృశ్య రూపంలో వచ్చి స్నానమాచరిస్తారని మా గురువుగారు చెబుతారు. అన్నమాచార్యుల వారికి 16వ ఏట స్వామి స్వప్న సాక్షాత్కారమిచ్చిన సంగతి నిన్న ప్రస్తావించాను. అటు తరువాత తిరుమల పయనమైన ఆయన ఆ సప్తగిరులను చూడగానే భక్తి భావం హృదయాంతరాళమునుండి సురగంగలా పొంగి మనసు ఉప్పొంగి కనులునుండి ఆనందబాష్పాలు రాలగా, తనను తాను మరచి అదివో అని ఎలుగెత్తి పాడి ఆ శ్రీహరి వాసాన్ని వర్ణించారు.

తనను కరుణించి కలలో కనిపించిన స్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన అన్నమయ్య హృదయ కమలం ఆ ఏడు కొండలను చూచినంత సూర్యుని చూసిన కమలంలా వికసించింది. పదివేల శేషుల పడగలమయంగా గోచరించింది. భగవంతుడు భావగోచరుడు. మనం ఎలా భావిస్తే అలా కనబడతాడు. అన్నమయ్య తన కళ్ల ఎదుట ఉన్న తిరుమల వైభవాన్ని ఆ విధంగా అదివో అల్లదివో శ్రీహరివాసము అనే కృతి ద్వారా మనకు తెలియజేశారు. ఎప్పుడైనా పసిపిల్లవాడు అమ్మను కోసం ఎదురు చూసిన పిమ్మట, అమ్మ కనబడగానే ఎలా ఉత్సాహంగా అమ్మా అని పలుకుతూ వెళతాడో అదే విధంగా అన్నమయ్య ఆ సప్తగిరులపై ఉన్న శ్రీనివాసుని నివాసాన్ని చూసి పులకరించి పాడాడు. మరి అందరికీ ఎందుకు అనిపించదు అలా? భావించాలి. మనసులో నిరంతరం కోరుకోవాలి. సంకల్పము, ఆలోచన, మాట ఆయనపైనే ధ్యాసగా ఉండాలి. దానికి కావలసిన సాధన చేయాలి. అప్పుడు తప్పకుండా మనం కూడా ఆ సప్తగిరుల పవిత్రతను, స్వామి మహిమను, క్షేత్ర వైభవాన్ని అనుభూతి చెంది తీరుతాము.

తిరుమల అంటే విహారయాత్ర కాదు, వెళ్లి అక్కడ మనకు నచ్చిన హోటల్లో భోజనం చేయటమూ కాదు. అణువణువున నిండి ఉన్న స్వామి తత్వాన్ని కొంతైనా అనుభూతి చెందే పవిత్రత మనలో ఉండాలి. త్రికరణములు - మనసు, వాక్కు, కర్మలు - ఆయనపైనే దృష్టి పెట్టేలా ఉండాలి. పవిత్రతకు ఆహారము, వ్యవహారము రెండూ తోడ్పడతాయి. అందుకే తిరుమల కొండలపికి ఎక్కేటప్పుడు, తిరుమలలో ఉన్నప్పుడు ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని విస్మరిస్తే మన మనసు చంచలమై స్వామిని కాంచలేక ఎటువంటి చిన్న సమస్య వచ్చినా ఆందోళన చెంది స్వామి నన్ను కరుణించలేదు అన్న అశాంతికి గురవుతుంది. కట్టు, బొట్టు, ఆహారము, మాటలు అన్నీ స్వామిని కాంచటానికై వినియోగిస్తే స్వామి తప్పక కనబడతాడు. సప్తగిరులలోని దివ్యకాంతుల ప్రకాశాన్ని కాంచగలము, అక్కడ నిండి ఉన్న ఆధ్యాత్మిక సౌరభాలను ఆస్వాదించగలము. మధ్యమావతి రాగంలోని ఈ కృతిని డాక్టర్ శోభారాజు గారు ఆలపించారు

ఇప్పుడిటు కల గంటి - అన్నమాచార్యుల వారి కృతి

ఇప్పుడిటు కల గంటినెల్ల లోకములకు
అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి

అతిశయంబైన శేషాద్రి శిఖరంబు గంటి
ప్రతి లేని గోపుర ప్రభలు గంటి
శత కోటి సూర్య తేజములు వెలుగగ గంటి
చతురాశ్యు పొడగంటి చెయ్యన మేలుకొంటి

కనక రత్న కవాట కాంతులిరుగడ గంటి
ఘనమైన దీప సంఘములు గంటి
అనుపమ మణిమయమగు కిరీటము గంటి
కనకాంబరము గంటి గ్రక్కున మేలుకొంటి

అరుదైన శంఖ చక్రాదులిరుగడ గంటి
సరిలేని అభయ హస్తము కంటి
తిరువేంకటచలావిభుని చూడగ గంటి
హరి గంటి గురు గంటి నంతట మేలుకొంటి

సమస్తలోకములకు తండ్రియైన శ్రీవేంకటాద్రీశుని ఇప్పుడే ఇక్కడే కలలో దర్శించినాను. ఎంతో ఉన్నతమైన శేషాద్రి శిఖరమును, అనుపమానమైన గోపురపు కాంతులను, వందకోట్ల సూర్య తేజములు వెలిగిన దృశ్యమును, నాలుగు చేతులు కలిగిన స్వామి రూపమును కాంచి ఇంతలో మేల్కొన్నాను. రెండు పక్కల రత్నములతో పొదగబడిన బంగారు ద్వారముల కాంతులను, గొప్ప దీపసమూహములను, సాటిలేని మణులతో పొదగబడిన కిరీటమును, బంగారు చేలములను కలిగిన స్వామిని దర్శించి, వెంటనే మేల్కొన్నాను. రెండు పక్కల అరుదైన శంఖచక్రములను, తిరుగులేని అభయ హస్తమును, శ్రీవేంకటాద్రీశుని రూపమును దర్శించినాను, ఆ శ్రీహరిని, మంత్రోపదేశము చేసిన గురువులు శఠగోప యతీంద్రులను కాంచినాను, అంతలోనే మేల్కొన్నాను.

అన్నమాచార్యుల వారికి స్వప్నంలో స్వామి సాక్షాత్కారమైన సందర్భంలో ఆయన నోట వెలువడిన సంకీర్తన ఇది. ఎంతటి సుకృతము ఆ వాగ్గేయకారునిది? నందకాంశులైన అన్నమయ్య భావపుష్పం ఇంత అద్భుతంగా వికసింది కాబట్టే మనకు దాదాపు 600 ఏళ్ల నాటి అనుభూతులు ఇంకా ఈ కర్మభూమిలో అలా ఆధ్యాత్మిక సుగంధాలు అలదుతూనే ఉన్నాయి. తీవ్రమైన ఆధ్యాత్మిక తాపము, దైవానుగ్రహ్ము ఉంటే తప్ప స్వప్న సాక్షాత్కారము కలుగదు. అందులోనూ కలియుగ దైవమైన శ్రీనివాసుని దర్శనం బహు దుర్లభం. చిన్న వయసులోనే అన్నమాచార్యుల వాఇర్కి ఆ దివ్యానుగ్రహం కలుగటం, దానిని ఆయన మనతో ఈ విధంగా పంచుకోవటం మన సుకృతమే. తిరుమల స్వామి వైభవాన్ని దర్శించి, దానిని మరింత పరిపుష్టం చేసి, ఆ క్షేత్ర ప్రాధాన్యతను ముందుండి నడిపించిన వారిలో భగవద్రామానుజులు, అన్నమాచార్యుల వారు, శ్రీకృష్ణ దేవరాయలు, హాథీరాం బాబా వంటి వారు అగ్రగణ్యులు. సంకీర్తనల ద్వారా స్వామి వైభవాన్ని మనకు సహస్ర విధాలా తెలియజేసిన అన్నమాచార్యుల వారికి ఈ జాతి ఎంతో ఋణపడి ఉంది. ఈ కృతిని గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించారు.

శ్రీ స్వామినాథాయ నమస్తే నమస్తే - దీక్షితుల వారి కృతి

 


శ్రీ స్వామినాథాయ నమస్తే నమస్తే

శాశ్వత శివ సుతాయ సర్వ దేవ సహాయ స్వామిశైల స్థితాయ వరదాయ

గజాంబ రమణాయ గణపతి సోదరాయ గుణత్రయాతీతాయ గుహ్యాకారాయ
అజేంద్ర పూజితాయ ఆశ్రిత ఫలదాయ వరశిఖి వాహనాయ గురు గుహ స్వరూపాయ

శ్రీ స్వామినాథునికి పరి పరి వందనములు. శాశ్వతుడైన వాడు, శివుని సుతుడు, సమస్త దేవతలకు సహాయము చేసే వాడు, స్వామిమలై కొండపై స్థితుడైన వాడు, వరములనొసగేవాడైన స్వామినాథునికి పరి పరి వందనములు. దేవసేనకు పతి, గణపతికి సోదరుడు, త్రిగుణములకు అతీతుడు, అగ్రాహ్యమైన అకారము కలవాడు, బ్రహ్మేంద్రాదులచే పూజించబడిన వాడు, ఆశ్రితులకు ఫలములొసగే వాడు, మేలైన నెమలి వాహనముగా కలవాడు, గురుగుహ స్వరూపుడు అయిన స్వామినాథునికి పరి పరి వందనములు.

ఆరుపడై వీడు (అనగా ఆరు క్షేత్రాలు నివాసముగా కలవాడు) క్షేత్రాలలో ఓ ప్రముఖమైనది తమిళనాడు కుంభకోణం సమీపంలో ఉన్న స్వామిమలై క్షేత్రం. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి స్వామినాథునిగా స్వామిమలై కొండపై కొలువబడుతున్నాడు. ఆ స్వామి క్షేత్ర ప్రాధాన్య కృతే ఈ దీక్షితుల వారి రచన. చరణంలో గజాంబ రమణాయ అని దీక్షితుల వారు స్వామిని నుతించటంలో ఓ రహస్యం ఉంది. తమిళంలో దేవసేనను దేవయానై అంటారు. తమిళంలో ఆనై అంటే ఏనుగు. దేవ, ఆనై అన్న పదాలకు సూచికగా సంస్కృతంలో గజాంబ అని దేవసేనను ప్రస్తావించారు దీక్షితుల వారు. వారి బహుభాషా పాండిత్యం ఇలాంటి కృతుల ద్వారా ప్రస్ఫుటమవుతుంది. దీక్షితుల వారి సుబ్రహ్మణ్యస్వామిని ఉపాసన చేసి సిద్ధి పొందిన సంగతి జగద్విదితమే. ఆ స్వామి కృపతోనే ఆయన గురుగుహ అన్న పదాన్ని తన ముద్రగా కృతులలో ఉపయోగించారు. ఖమాస్ రాగంలోని ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు.

చిత్రంలోని స్వామి మూర్తి నల్లూరు కందస్వామి (యళ్పణం, శ్రీలంక)

రాజగోపాలం భజేహం - దీక్షితులవారి క్షేత్ర కృతి


 

రాజగోపాలం భజేహం రమా లీలం

తేజోమయ మోహనకరం దివ్యాంబరాది ధరం
గజరాజ పూజిత పదం గుణిజన నత గోవిందం

నారదాది కృత భజనం నాద లయాయుత సదనం
హరిద్రానదీ తీరం హత్యాది పాప హరం
పారిజాత తరు మూలం పంకజ నయన విశాలం
గురుగుహ నుత వనమాలం గోపీజనమాలోలం

భావం:

లక్ష్మీదేవితో కూడి లీలలు చేసే రాజగోపాలుని నేను భజించుచున్నాను. తేజోమయుడైన వాడు, అందమైన చేతులు కలవాడు, దివ్యమైన వస్త్రములు, ఆభరణములు ధరించినవాడు, గజేంద్రునిచే పూజించబడిన పదములు కలవాడు, సజ్జనులచే నుతించబడిన వాడు అయిన గోవిందుని నేను భజినంచుచున్నాను. నారదాదులచే భజింప్బడినవాడు, నాదము మరియు లయలో నిమగ్నుడై నిలచినవాడు, పారిజాతవృక్ష మూలమున నివసించేవాడు, కలువలవలె విశాలమైన కన్నులు కలవాడు, గురుగుహునిచే నుతించబడిన వాడు, తులసీమాల ధరించిన వాడు, గోపకులాన్ని రంజిల్లజేసేవాడు అయిన రాజగోపాలుని నేను భజించుచున్నాను.



క్షేత్ర వివరాలు:

దీక్షితుల వారు క్షేత్ర కృతులకు ప్రసిద్ధి అని గతంలో ప్రస్తావించాను. దక్షిణ భారత దేశంలో ఆయన చేయని తీర్థయాత్రలేదు, నుతించని దేవతాస్వరూపం లేదు. ఆయన జీవితమంతా ఇటువంటి అద్భుతమైన వివిధ దేవతల స్మరణతో, ఉపాసనలోనే సాగిపోయింది. అటువంటి ఒక కృతే ఈ రాజగోపాలస్వామిపై రచించినది. తిరువాయూరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్నార్‌గూడి ఓ అద్భుతమైన దేవాలయానికి ప్రసిద్ధి. అదే 10వ శతాబ్దంలో మొదటి కులోత్తుంగ చోళుడు నిర్మించిన రాజగోపాలస్వామి దేవస్థానం. మనోజ్ఞమైన శిల్పసంపదతో 24 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించబడిన ఈ మందిరాన్ని తరువాత చోళ రాజులు మరియు తంజావూరు నాయకులు పునరుద్ధరించి పోషించారు. ఈ దేవాలయంలో 16 గోపురాలు, 7 ప్రాకారాలు, 7 మంటపాలు, 9 తీర్థాలు ఉన్నాయి. అన్నిటికన్నా ప్రసిద్ధి చెందినది ప్రధాన పుష్కరిణి హరిద్రానదీ తీర్థం. 1150 అడుగుల పొడవు, 830 అడుగుల వెడల్పైన ఈ తీర్థం ఈ క్షేత్రానికే తలమానికం. అలాగే వేయికాళ్ల మంటపం. ఇక్కడ స్వామి చేతిలో కొరడా కలిగిన గోవులను కాచే కృష్ణుడు, అమ్మవారు సెంగమల తాయార్ (లక్ష్మీదేవి). ఉత్సవ విగ్రహాలు శ్రీవిద్యారాజగోపాలుడు, రుక్మిణీ సత్యభామలు. ఫాల్గుణ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు ఇక్కడి ప్రత్యేకత. ఈ రాజగోపాలుడు రాజమన్నార్‌గా కూడా పేరొందాడు.

మోహన రాగంలోని ఈ కృతిని అరుణా సాయిరాం గారు గానం చేశారు.

(చిత్రాలు మన్నార్‌గూడి రాజగోపాలుడు, ప్రధాన గోపురం, హరిద్రానదీ పుష్కరిణి)

2, సెప్టెంబర్ 2020, బుధవారం

గోవింద ఘటయ - నారాయణ తీర్థులు (తల్లావఝ్ఝుల గోవిందశాస్త్రి)



గోవింద ఘటయ పరమానందమమృత మిహ
శ్రీ నందతనయ బహు యోగీంద్ర సుర వినుత

అగణిత గుణ గ్రామ అపరిమిత నిజ కామ
నిగమ పరమారామ నిఖిల మోహ విరామ
నగధర ఘన శ్యామ నతజన కుముద సోమ
అఘ హరణ సర్వ సమ అసురమండల భీమ

నవమౌక్తికాహార నంద గోపకుమార
భవ బంధన విదూర భద్రద సుఖాకార
అవనత జనాధార అపరిమిత శుభచార
నవనీతచోర నరనారాయణవతార

శరదిందు సమ వదన శత మన్మధ సమాన
గురుతరానంద ఘన కుంద సుందర రదన
పరి గంధి గణ దళన పాలితాఖిల భువన
సరస నారాయణ తీర్థ సత్య ఫలదాన

నందుని కుమారుడవై, అనేకులైన యోగులు, దేవతల చేత నుతించబడిన శ్రీకృష్ణా! నాకు పరమానందమనే అమృతమును ప్రసాదించుము. గుణించలేనన్ని గుణములకు నెలవు నీవు, నా కామ్యములను తీర్చే అపరిమిత పరాక్రమము కలవాడవు, సమస్త వేదవేదాంగములు చెప్పిన పరమపదము నీవు, సమస్త మోహములను దూరము చేసేవాడవు. మందర పర్వతమును ధరించినవాడవు, దట్టమైన మేఘముల వంటి దేహఛాయ కాలవాడవు, నుతించే జనులనే నీటి కలువల పట్ల చంద్రుని వంటి వాడవు. సమస్త పాపములను హరించేవాడవు, అందరి పట్ల సమధర్మము కలిగిన వాడవు, రాక్షస సమూహాన్ని నాశనం చేసిన పరాక్రమవంతుడవు నీవు. నాకు పరమానందమనే అమృతమును ప్రసాదించుము. ప్రకాశించే ముత్యములు కలిగిన హారమును ధరించిన నందుని కుమారుడవు, సంసార బంధనములను తొలగించి, రక్షించి, సుఖములనొసగే వాడవు, నమస్కరించే వారికి ఆధారమైన వాడవు, అనంతమైన శుభలక్షణములు కలవాడవు, నవనీత చోరుడవు, నరుని రూపములో నారాయణావతారుడవు నీవు. నాకు పరమానందమనే అమృతమును ప్రసాదించుము. శరదృతువులో చంద్రునికి సమానమైన ముఖము కలవాడవు, వంద మన్మథుల వంటి మనోహరమైన రూపము కలవాడవు, సర్వోన్నతమైన ఆనందాన్ని ప్రసాదించేవాడవని పేరొందినావు, మొల్లలవంటి అందమైన పలువరుస కలవాడవు, శత్రు సమూహమును నాశనము చేసి సమస్త లోకములను పాలించేవాడవు, నారాయణ తీర్థులకు సమీపములో నుండి నిజమైన ఫలములనొసగేవాడవు. 

కాంభోజి రాగంలో కూర్చబడిన ఈ కృతిని మల్లాది సోదరులు ఆలపించారు

బ్రూహి ముకుందేతి రసనే - నారాయణ తీర్థులు (శ్రీకృష్ణలీలాతరంగిణి)


 

బ్రూహి ముకుందేతి రసనే
పాహి ముకుందేతి రసనే

అక్రూరప్రియ చక్రధరేతి
హంస నిరంజన కంస హరేతి

రాధారమణ హరే రామేతి
రాజీవాక్ష ఘనశ్యామేతి

కేశవ మాధవ గోవిందేతి
కృష్ణానంత సదానందేతి

అచ్యుత కృష్ణ హరే రామేతి
హరి నారాయణతీర్థ పరేతి

ఓ జిహ్వా! ఆ ముకుందుని నామమును ఉచ్చరించి ఆ స్వామి శరణు కోరుము. అక్రూర ప్రియుడని, చక్రధారియని, పరమాత్మ, శుద్ధచైతన్య స్వరూపుడు, కంసుని హరించిన వాడని ముకుందుని నామమును ఉచ్చరించి ఆ స్వామి శరణు కోరుము. రాధా రమణ, హరి, రామయని, కలువవంటి కన్నులు కలవాడు, నీలమేఘ శరీరుడని ముకుందుని నామమును ఉచ్చరించి ఆ స్వామి శరణు కోరుము. కేశవ, మాధవ, గోవింద, కృష్ణ, అనంత, సదానందాయని ముకుందుని నామమును ఉచ్చరించి ఆ స్వామిని శరణు కోరుము. అచ్యుత, కృష్ణ, హరి, రామ, నారాయణ తీర్థునికి ముక్తిని కలిగించినవాడు అని ముకుందుని నామమును ఉచ్చరించి ఆ స్వామి శరణు కోరుము.

కురంజి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మల్లాది సోదరులు ఆలపించారు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవిత విశేషాలు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆధునిక భారతదేశంలో ఆధ్యాత్మిక సందేశాన్ని విద్య, వైద్యం, తాగునీరు, సేవా కార్యక్రమాలతో ముడిపెట్టిన మహనీయులు. ఆయన 1926...