30, ఆగస్టు 2020, ఆదివారం

సూర్యమూర్తే నమోస్తుతే - ముత్తుస్వామి దీక్షితుల వారు

సూర్యమూర్తే నమోస్తుతే సుందర ఛాయాధిపతే

కార్య కారణాత్మక జగత్ప్రకాశ సింహ రాశ్యాధిపతే
ఆర్య వినుత తేజః స్ఫూర్తే ఆరోగ్యాది ఫలద కీర్తే

సారస మిత్ర మిత్ర భానో సహస్ర కిరణ కర్ణ సూనో
క్రూర పాపహర కృశానో గురుగుహ మోదిత స్వభానో
సూరిజనేడిత సుదినమణే సోమాదిగ్రహ శిఖామణే
ధీరార్చిత కర్మ సాక్షిణే దివ్యతర సప్తాశ్వ రధినే
సౌరాష్ట్రార్ణ మంత్రాత్మనే సౌవర్ణ స్వరూపాత్మనే
భారతీశ హరిహరాత్మనే భక్తి ముక్తి వితరణాత్మనే

సుందరుడు, ఛాయాదేవి పతి అయిన సూర్యమూర్తికి నమస్సులు. కార్యము, కారణము అయినవాడు, జగత్తును ప్రకాశింపజేశేవాడు, సింహరాశికి అధిపతి, ఆర్యులచే నుతించబడిన వాడు, తేజో స్ఫూర్తి అయిన వాడు, ఆరోగ్యము మరియు ఇతర శుభఫలములు ప్రసాదించే వాడు, కీర్తిమంతుడు అయిన సూర్యమూర్తికి నమస్సులు. కమలానికి మిత్రుడు, మిత్ర నామధేయుడు, సహస్ర కిరణములు కర్ణములుగా కల భానుమూర్తి, క్రూరమైన పాపములను హరించే వాడు, అగ్నిరూపుడు, స్వప్రకాశుడైనవాడు, సుబ్రహ్మణ్యునికి ఆనందం కలిగించే వాడు అయిన సూర్యమూర్తికి నమస్సులు. జ్ఞానులచే నుతించబడిన వాడు, రోజునకు మణి వంటి వాడు, చంద్రుడు మొదలైన గ్రహములలో శ్రేష్ఠుడు, ధీరులచే అర్చించబడిన వాడు, కర్మలకు సాక్షియైన వాడు, దివ్యమైన సప్తాశ్వములతో కూడిన రధమును అధిరోహించినవాడు అయిన సూర్యునికి నమస్సులు. సౌర అష్ట వర్ణ మంత్ర స్వరూపుడు, బంగారు కాంతి కలవాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఆత్మ అయిన వాడు, భక్తిని, ముక్తిని ప్రసాదించే వాడు అయిన సూర్యమూర్తికి నమస్సులు.

సౌరాష్ట్ర రాగంలో కూర్చబడిన ఈ కృతిని బాంబే జయశ్రీ రామనాథ్ మరియు శిష్యులు ఆలపించారు

బాగాయనయ్యా నీ మాయలెంతో - సద్గురువులు త్యాగరాజస్వామి


 

బాగాయనయ్యా నీ మాయలెంతో బ్రహ్మకైన కొనియాడ తరమా?

ఈ గారడములనొనరించుచును నే గాదనుచు బల్కేదియును

అలనాడు కౌరవులనణచమన అలరి దోసమనే నరుని జూచి పాప
ఫలము నీకు తనకు లేదని చక్కగ పాలనము సేయలేదా త్యాగరాజనుత!

ఓ శ్రీకృష్ణా! బ్రహ్మకు కూడా పొగడుటకు తరము కాని నీ మాయలెంతో బాగున్నవయ్యా! ఈ మాయలన్నీ నీవే చేస్తూ నేను కాదని పలికేవు. ఆ నాడు కురుక్షేత్రములో కౌరవులను నాశనం చేయమని చెప్పగా ఆ అర్జునుడు అది దోషమని దుఃఖించగా, తనకు పాపము కలుగదు కర్మఫలము నాది అని చక్కగా కర్తవ్యబోధ చేయలేదా! ఇటువంటి నీ మాయలు బ్రహ్మకు కూడా కొనియాడ శక్యము కానివి.

చంద్రజ్యోతి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు.

మాకేలరా విచారము - సద్గురువులు త్యాగరాజస్వామి


మాకేలరా విచారము? మరు గన్న శ్రీ రామచంద్ర!

సాకేత రాజ కుమార! సద్భక్త మందార! శ్రీకర!

జత కూర్చి నాటక సూత్రమును జగమెల్ల మెచ్చగ కరము నిడి
గతి తప్పకనాడించేవు సుమ్మీ! నత త్యాగరాజ! గిరీశ వినుత!

మదనుని జనకుడవైన శ్రీరామా! నీవుండగా మాకు విచారమేల? సాకేతపురానికి రాజకుమారుడవైన శ్రీరామా! నీవు సద్భక్తుల పాలిట కల్పవృక్షానివి! సమస్త శుభములు కల్గించేవాడవు, నీవుండగా మాకు విచారమేల? ఈ జగన్నాటకము యొక్క సూత్రములను కూర్చి చేత ధరించి లయ తప్పకుండా ఆడించెదవు సుమా! త్యాగరాజునిచే, పరమశివునిచే నుతించబడిన శ్రీరామా! నీవుండగా మాకు విచారమేల?

రవిచంద్రిక రాగంలోని ఈ కృతిని బాంబే జయశ్రీ రామనాథ్ గారు గానం చేశారు.

బాలమురళీకృష్ణ గారు - త్యాగరాజ శిష్యపరంపర


ఏవండీ బాలమురళి గారు త్యాగరాజ శిష్యపరంపర వారెలా అయ్యారు? ఆ రహస్యం ఆయనే చెప్పారు.

త్యాగరాజస్వామి (1767-1847) వారి బంధువు, వారి శిష్యుడు ఆకుమడుగుల (మానాంబుచావడి) వేంకట సుబ్బయ్య గారు (1803-1862) త్యాగయ్యతో ఎన్నో ఏళ్లు కలిసి తిరువాయూరులో జీవించారు. వీరు త్యాగరాజస్వామి ఆలపించిన కృతులను స్వరాలతో అప్పటికప్పుడు వ్రాశారు. వీరి సంగతి తెలుసుకున్న సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారు (1860-1917, సినిమా సుసర్ల దక్షిణామూర్తి గారు కాదు). ఆంధ్ర నుండి తిరువాయూరు వెళ్లి వారి ఆశీర్వాదం కోరారు. వారి శ్రీమతికి తన కోరికను విన్నవించారు. దాదాపు ఎనిమిది నెలల తరువాత వేంకటసుబ్బయ్య గారు దక్షిణామూర్తి గారిని అనుగ్రహించి ఆశీర్వదించారు. "నేను ఇంకొన్నాళ్లలో మరణిస్తాను, తరువాత వచ్చి నా భార్యను అడిగి కృతుల సాహిత్యం తీసుకు వెళ్లు" అని తెలిపారు. అలా త్యాగరాజస్వామి వారి సాహిత్యం ఆంధ్ర దేశానికి వచ్చింది. ఆ దక్షిణామూర్తి గారి శిష్యులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు (1883-1951). వారి శిష్యులు బాలమురళీకృష్ణ గారు (1930-2016). ఆ విధంగా 750 త్యాగయ్య కృతులు మనకు వారి ద్వారా అందాయి.

కాబట్టి, బాలమురళి గారు ఆలపించే రీతి, ఆయన గానం చేసిన త్యాగయ్య కృతుల సాహిత్యం సద్గురువుల వారి మూలాలను ప్రతిబింబిస్తాయి అన్నది మనం గ్రహించాలి. వీలైనంత దానిని అనుసరిస్తే త్యాగయ్య సాహిత్యాన్ని, స్వరాలను కాపడినట్లే. 

తెలిసి రామ చింతనతో - సద్గురువులు త్యాగరాజస్వామి



తెలిసి రామ చింతనతో నామము సేయవే ఓ మనసా!

తలపులన్ని నిలిపి నిమిషమైన తారకరూపుని నిజతత్త్వములను

రామా యన చపలాక్షుల పేరు కామాదులకోరువారు వీరు
రామా యన బ్రహ్మమునకు పేరు ఆ మానవ జననార్తులు దీరు

అర్కమనుచు జిల్లెడు తరు పేరు మర్కట బుద్ధులెట్లానేరు
అర్కుడనుచు భాస్కరునకు పేరు కుతర్కమనే అంధకారము తీరు

అజమనుచును మేషమునకు పేరు నిజకోరికలేలాగీడేరు
అజుడని వాగీశ్వరునకు పేరు విజయము గల్గును త్యాగరాజనుతుని

భావము:

ఓ మనసా! శ్రీరాముని స్మరించే ముందుగా రామ అనే పదానికి అర్థం తెలుసుకొని, ఆ తరువాత భావం, అంతరార్థం, రాముని తత్త్వము, రాముని మహిమ, రామాయణము, రాముని అవతారము మొదలైనవన్నిటిని తెలిసి అప్పుడు రామచింత ప్రారంభించు అప్పుడే నీకు ముక్తికి అర్హత కలుగుతుంది. రామ మంత్రాన్ని స్మరించే ముందు నీ ఆలోచనలన్నీ ఒక్క నిమిషమైనా నిలిపి శ్రీరాముని ధ్యానించి జపాన్ని చేయి. రామా అనే పదానికి స్త్రీ అని అర్థం ఉంది. ఆ అర్థాన్ని భావించే వారు కాముకులు. భక్తులు కారు. రామ అనగా పరబ్రహ్మకు పేరు. ఇది తెలిసి స్మరించే వారు వేదాంతులు. అర్కము అనగా సూర్యుని పేరు. జిల్లేడు మొక్కకు కూడా అర్కము అని పేరు. సూర్యుని ఆరాధించే వారు జిల్లేడు మొక్క అర్థాన్ని ఆలోచించరు. అట్లా ఆలోచిస్తే అది కోతి బుద్ధి అవుతుంది. అలాగే, అజ అనే శబ్దానికి బ్రహ్మ అనే అర్థంతో పాటు మేక అనే అర్థం కూడా ఉంది. బుద్ధిమంతుడు, జ్ఞాని అయిన వాడు సరైన మార్గంలోనే పయనిస్తాడు. పదముల భావార్థాలు తెలిసి వ్యవహరిస్తాడు.

రాముని నామంలో ఉన్న అఖండమైన మహిమను తెలుసుకొని చింతన చేయమని మనోజ్ఞంగా బోధించారు త్యాగరాజులవారు. భవతారకము, మోక్షప్రదాయకము, సకలక్లేశ హరణము అయిన తారక నామము రామ నామము. ఈ సృష్టి అనంత ప్రవాహంలో అనంతకోటి భక్తులను తరించిన దుఃఖభంజనము రామ నామము. తెలిసితే మోక్షము.

సంకీర్తన ద్వారా మోక్ష మార్గాన్ని విశదపరిచే వారు సద్గురువులు. సన్మార్గానికి భావము ఎంత ప్రాధాన్యమో ఈ సంకీర్తన ద్వారా తెలిపారు త్యాగరాజుల వారు. భావ విహీనమైన జీవనము ఎందుకూ పనికి రానిది. భావాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకొని స్మరణ చేస్తే అది మహా యజ్ఞమవుతుంది. సాఫల్యమవుతుంది. భావమే జీవము. భావమే జీవనము. భావమే భక్తికి మూలాధారము. 

పూర్ణచంద్రిక రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని నేదునూరి కృష్ణమూర్తి గారు ఆలపించారు

ఎందరో మహానుభావులు - షడ్కాల గోవింద మారర్



త్యాగరాజస్వామి వారి ఘనరాగ పంచరత్న కీర్తనలలో అత్యంత ప్రజాదరణ పొందింది శ్రీ రాగం లోని ఎందరో మహానుభావులు. ఈ కృతి ఆయన ఎప్పుడు, ఎలా ఆలపించారు అన్న విషయంలో ఒక్కొక్క చరిత్ర ఒక్కొక్క రకంగా చెబుతున్నాయి. కానీ, 1927లో ఆంగ్లంలో ఎం.ఎస్. రామస్వామి అయ్యరు గారు రచించిన "Thiagaraja, a great musician saint" అన్న పుస్తకంలో ఉన్న సందర్భమే చాలా సముచితం అనిపించింది. ఆ వివరాలు.

కేరళలోని రామమంగళంలో 1798లో జన్మించి అతిపిన్న వయసులోనే సంగీతం నేర్చుకుని మహావిద్వాంసులైన వారు గోవింద మారర్ గారు. ఆయన శాస్త్రీయ సంగీతాన్ని ఆరు కాలాలలో పాడి ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆరుకాలాలలో ఆలపించటమంటే స్వరాలపై ఎంతటి పట్టుండాలో ఊహించండి. ఇప్పటి వారు మూడు కాలాలకే ఇబ్బంది పడతారు. అందుకే ఆయనకు షడ్కాల గోవింద మారర్ అని పేరు వచ్చింది. వీరు కీళ్లవాతంతో అంగవైకల్యం పొందినా, ఒక చేత తంబుర మరొక చేత కంజీర మీటుతూ ఆలపించిన ఘనులు. వీరు త్యాగరాజస్వామి వారి సమకాలీకులు. త్యాగయ్య సంగీత వైభవం గురించి విన్న ఆయన వారి గాత్రాన్ని ప్రత్యక్షంగా విని ఆనందించాలని కోరుకున్నారు. తిరువనంతపురం రాజాస్థానంలో పనిచేసే నల్లతంబి ముదలియార్ అనే ఆయన ఓపికగా మారర్ గారిని 1838వ సంవత్సరంలో తిరువాయూరు తీసుకువెళ్లారు. ప్రతిరోజూ లాగనే త్యాగరాజస్వామి వారు రాత్రి ఎనిమిది గంటల సమయంలో శిష్యులను పిలిచి ఆలపించమన్నారు. శిష్యులు సాధన మొదలు పెట్టారు. ఆ ఊరి ప్రజలంతా అక్కడకు చేరుకున్నారు. గోవింద మారర్, నల్లతంబి ముదలియారులను వడివేలు అనే వ్యక్తి త్యాగరాజస్వామి వారి నివాసానికి తీసుకు వెళ్లారు. వారు త్యాగరాజస్వామి వారికి నమస్కరించి అక్కడ కూర్చున్నారు. శిష్యులు గానం ఆపేశారు. కొన్ని నిమిషాల మౌనం.

త్యాగరాజస్వామి వారు ఒకరు పాడమంటే పాడేవారు కాదు. తన అంతరాత్మ చెబితేనే ఆలపించేవారు. అందుకే ఆయనను శిష్యులు ఎప్పుడూ ఆలపించమనే సాహసం చేసేవారు కాదు. కానీ, ఆరోజు, గోవింద మారర్ గారు ఆయనను ఆలపించమని కోరారు. అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. త్యాగరాజస్వామి వారు కూడా ఆశ్చర్యపోయి "నన్ను పాడమని అడుగుతున్న వీరెవరు? అందులోనూ 79ఏళ్ల వృద్దుడనైన నన్ను ఆలపించమని అడిగే ధైర్యం ఈయనకు ఎక్కడిది" అని స్వరం పెంచి అన్నారు. వడివేలు అప్పుడు "మీకు ఆసక్తి లేకపోతే, మారర్ గారిని ఆలపించమంటాను" అన్నారు. "ఈ వాతరోగంతో బాధపడుతున్న వ్యక్తి ఏమి ఆలపించగలడు" అని ప్రశ్నించారు త్యాగయ్య. "కొద్దిగా" అని సమాధానం చెప్పారు వడివేలు. "సరే" అని తల ఊపారు త్యాగయ్య. అప్పుడు గోవింద మారర్ గారు ఆలాపన మొదలు పెట్టారు.

వ్రేళ్లు వంగిపోయిన మారర్ తన ప్రత్యేకమైన తంబురను తీసి శృతి చేశారు. ఆ తంబుర త్యాగయ్యను ఆకర్షించింది. మారర్ రాగమాలిక ఆలాపన చేశారు - తొలుత తోడి, తరువాత అసావేరి, కీరవాణి రాగాలలో తన మనోభావనలను, అక్కడున్న వారి మానసిక స్థితికి అనుగుణంగా ఆరు కాలాలలో అద్భుతంగా ఆలపించారు. తరువాత ఆయన అద్భుతమైన సంగతులతో పంతువరాళి రాగంలో ఆలపించారు. తరువాత జయదేవుని అష్టపది "చందన చర్చిత నీల కళేబర" అని షడ్కాలములలో అత్యంత తక్కువ గతిలో పాడటం మొదలు పెట్టి నెమ్మదిగా గతిని పెంచి అక్కడున్నవారిని మంత్రముగ్ధులను చేశారు, వారి కంట ఆనందభాష్పాలు అసంకల్పితంగా వెలువడ్డాయి. త్యాగరాజస్వామి వారు ధ్యానస్థితికి వెళ్లిపోయారు.

మారర్ గారి గానం ముగియగానే, త్యాగయ్య అద్భుతం, సుందరం, మధురం అని ఎన్నో విధాలా ఆయన గాత్రాన్ని ప్రశంసించారు. మీ సంగీతం వెండితీగలాగా మా రామునివలె మనోహరమైనది, వైభవమైనది అని ఆయనను కొనియాడారు. వడివేలు మీరు కొద్దిగా పాడతారు అని చెప్పి తప్పు చేశారు, మరి సంగీత గురువులు, సిద్ధులు. మీరు ఇకనుండి గోవింద మారర్ కాదు, గోవిందస్వామి అని అందరికి వినబడేలా పెద్దగా పలికారు. మారర్ గారు వినయంగా "నాకు గోవిందస్వామి కన్నా గోవిందదాసునిగా మిగలటమే ఇష్టం" అని చెప్పి త్యాగరాజస్వామికి నమస్కరించారు.

త్యాగరాజస్వామి వారిలో తొణికిన కించిత్ అహంకారం గోవింద మారర్ గానామృతంతో పటాపంచలైంది. ఆయన గళంలో "ఎందరో మహానుభావులు అందరికీ వందనములు" అన్న అద్భుత భక్తి సుమం శ్రీరామచంద్రుని పాదాల వద్ద వ్రాలింది. "సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము చేయువారెందరో మహానుభావులు" అని త్యాగయ్య తన కళ్లతో శిష్యులను గోవింద మారర్ వైపు చూపి వారికి చేతులెత్తి నమస్కరించారు. ఆనాడు ఇద్దరు నాదయోగుల సత్సంగములో తిరువాయూరు తరించింది.

తరువాత, త్యాగయ్య గోవింద మారర్ గారి వర్ణాల స్ఫూర్తితోనే మిగిలిన నాలుగు పంచరత్న కీర్తనలు రచించారని చరిత్ర చెబుతోంది. గొవింద మారర్ తరువాతి కాలంలో గోవిందస్వామిగా, ఆయన వర్ణాలు గోవిందస్వామి వర్ణాలుగా ఎంతో పేరొందాయి. గోవింద మారర్ తన జీవిత చరమాంకంలో పండరిపూర్ వెళ్ళి అక్కడి విఠలుని సేవలో తరించి గోవిందదాసునిగా పేరు మార్చుకుని 1843వ సంవత్సరంలో ముక్తిని పొందారు. తరువాత నాలుగేళ్లకు త్యాగయ్య రామునిలో ఐక్యమైనారు.

29, ఆగస్టు 2020, శనివారం

కదలేవాడు గాడే రాముడు - త్యాగరాజస్వామి కృతి


 

వాగ్గేయకారుల గొప్పతనం వారి అనుభూతులను అద్భుతమైన వర్ణనలుగా ఆవిష్కరిస్తూనే మూలతత్త్వాన్ని పరిపూర్ణంగా తెలియజేయటంలో కూడా ఉంది. గురుకృప వలన నాకు ఉదయమే త్యాగరాజస్వామి వారి కీర్తనల పుస్తకం తీసి ఆ పేజీలో ఉన్న కీర్తనను అర్థం చేసుకునే అలవాటు కొన్నేళ్లుగా ఉంది. ఈరోజు పరబ్రహ్మమైన రాముని ఆయన అద్భుతంగా సులభమైన పదాలలో వర్ణించిన కృతి కనబడింది. మానవజన్మ ఎత్తి ధర్మాచరణ చేసి ధర్మాన్ని స్థాపించిన రాముడు మనకు తెలుసు. ఆ స్థాయిని దాటి రాముని పరబ్రహ్మ తత్త్వంగా దర్శించి తరించిన త్యాగయ్య ఆ వైభవాన్ని మనతో కూడా పంచుకున్న కృతి ఇది. మానసగోచరమైతే తప్ప ఇటువంటి కృతులను రచించలేరు. అటువంటి రామసాక్షాత్కారం పొంది నిరంతరం రామామృతపానం చేస్తూ తరించిన త్యాగరాజస్వామి మన కర్మభూమిపై మన భాషలో కృతులను రచించటం మన అదృష్టం.

కదలేవాడు గాడే రాముడు కథలెన్నో గలవాడే

మొదలే తానైనాడే తుదమొదలే లేనివాడైనాడే

కల్పనలెన్నడు లేడు సంకల్పములే కలవాడు శేష
తల్పశయనుడే వాడు శ్రీత్యాగరాజ నుతుడైనాడే

శ్రీరాముడు చరాచర స్వరూపుడు. స్థావరరూపుడైనను, జంగమ రూపములతో వేదవేదాంత పురాణేతిహాసములలో అనేక కథలు గలవాడు. సనాతనుడు, శాశ్వతుడు, మొదలు తుది లేనివాడు, సత్యమైనవాడు, మాయాతీతుడు, అనంతమైన సృష్ట్యద్భుతాలనే సంకల్పముగా గలవాడు, నారాయణునిగా ఆదిశేషునిపై శయనించుచున్నవాడు, శంకరునిచే నుతింబడుచున్నాడు శ్రీరామచంద్రుడు. 

నారాయణగౌళ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మల్లాది సోదరులు ఆలపించారు.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవిత విశేషాలు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆధునిక భారతదేశంలో ఆధ్యాత్మిక సందేశాన్ని విద్య, వైద్యం, తాగునీరు, సేవా కార్యక్రమాలతో ముడిపెట్టిన మహనీయులు. ఆయన 1926...