21, ఆగస్టు 2020, శుక్రవారం

ధర్మము-సత్యము-రామం


రామాయణమంతా గమనిస్తే, వాల్మీకి అత్యంత ఎక్కువగా ఉపయోగించిన పదాలు ధర్మము, సత్యము. ధర్మాత్మ, సత్యసంధ, ధర్మ పరాయణ, సత్య పరాక్రమ, సత్య ధర్మ పరాయణ...వీటి చుట్టూనే రామాయణమంతా. ఎందుకు? 

ఆడినమాట తప్పకుండా ఉండటం ఇక్ష్వాకు వంశస్థుల లక్షణమైతే, ధర్మానికి కట్టుబడి ఉండటం రాముని జీవనం. వాల్మీకితో రాముని గుణగణాలను, రూపలావణ్యాలను వేనోళ్ల పొగడిన నారదుడు, చివరకు "సత్యే ధర్మ ఇవాపరః" అంటాడు. ఇది చాలా అర్థం కలిగిన మాట. సత్యనిష్ఠలో సాక్షాత్తూ ధర్మదేవతగా రాముడు వ్యవహరిస్తాడని నారదుని భావన. తమేవ గుణ సంపన్నం రామం సత్యం పరాక్రమం అని నారదుడు నొక్కి వక్కాణించాడు. నారదుడు సూచించిన ఈ రామ లక్షణాలను వాల్మీకి రామాయణమంతా వినియోగించాడు. పరిపరి విధాల సత్య ధర్మ సమన్వయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటారు. రాముడు మూర్తీభవించిన ధర్మ దేవత అని మారీచుడు కూడా రావణుని మందలిస్తాడు. కానీ, సత్యానికి, ధర్మానికి షష్టాష్టకమైన రావణునికి ఆ మాటలు బోధ పడవు.

సత్య పరాక్రమ అనే శబ్దంలో ఎంతో అర్థముంది. సత్యమే పరాక్రమముగా కలవాడన్నది అంతరార్థం. సత్యానికి, నిజానికి కాస్త తేడా ఉన్న విషయం మనం గమనించాలి. మూడు కాలాలలో నిజమైనది సత్యమని వ్యవహారించటం మనం గమనించాలి. భూత భవిష్యద్వర్తమానాలకు వర్తించే శాశ్వత సనాతన సత్యమే రాముని పరాక్రమం అని నారద వాల్మీక ప్రోక్తమైన శ్లోకాల అంతరార్థం. సత్యము, ధర్మము రెండు పాదాలుగా చేసుకొని రాముని అయనం ముందుకు సాగింది కాబట్టే సత్య ధర్మ పరాక్రమః అని వారు ఘోషించారు. 

మనం నడిచేటప్పుడు ఎలాగైతే ఒక కాలు మరొక కాలుకు ఆధారమవుతుందో, అలాగే సత్య ధర్మాలు రాముని నడవడికలో ఒకదానికొకటి ఆధారమైనాయి. ఈ రెండిటినీ సమన్వయ పరచుకుంటూ సన్మార్గంలో ముందుకు  సాగినవాడు రాముడు. 

రామాయణంలో అనుక్షణం మనకు సత్యధర్మ సమన్వయం మనకు గోచరిస్తుంది. మొదటి ఉదాహరణ:

ప్రజల మేలు కోరి ప్రజల అభీష్ఠం, ఆమోదం మేరకు జ్యేష్ఠ కుమారునికి పట్టాభిషేకం చేయాలనుకున్న దశరథుని సంకల్పం ధర్మ సమ్మతము, కాబట్టే దానికి వశిష్ఠుని ఆమోదం లభించింది. కానీ, దశరథుడు కైకకు మాట ఇచ్చింది నిజం. ఇది కేవలం దశరథుడికే తెలుసు. ఆడిన మాట తప్పడం రఘువంశంలో లేదు, కాబట్టే, సత్యసంధుడైన దశరథుడు ధర్మ సందేహంలో పడిపోతాడు. దశరథుని మనోరథం ధర్మ సమ్మతం, కైకకోరిక సత్యనిష్ఠకు పరీక్ష. సత్యాన్ని పాలిస్తే ధర్మం కుంటుబడుతుంది, ధర్మం నెగ్గాలంటే సత్యం అసత్యమవుతుంది. కైక పెట్టిన ఈ పరీక్షకు కారణం మంథర. కైక మంథరకు లొంగిపోయింది. సత్యం సాకుతో ఆమె తన దౌర్బల్యాన్ని బయటపెట్టుకుని కుటుంబంలో అల్లకల్లోలం సృష్టించింది. కానీ, సత్య పరాక్రముడైన రాముడు తన కర్తవ్యాన్ని వెంటనే గుర్తించి మంథర నాటిన విషవృక్షాన్ని మందారవనంగా మార్చాడు, సత్య ధర్మాలకు సామరస్యం కూర్చాడు. 

రాముని నిర్ణయం ఎంత దృఢమైనదంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కైక మాటను శిరసావహించాడు. నీకీ మాట ఎలా చెప్పాలో అని నాన్నగారు జంకుతూ మగతగా పడుకున్నారు అని కైక చెప్పగానే

అనుక్తోహ్యత్రభవతా భవత్యా వచనాదహం
వనే వత్స్యామి విజనే వర్షాహీణ చతుర్దశ

అమ్మా, ఈ మాట నాన్నగారు చెప్పాలా? నువ్వు చెబితే చాలదా? నాన్నగారు చెప్పినా చెప్పకపోయినా నీ మాట మీద నేను పదునాలుగు సంవత్సరాలు అరణ్యంలో ఆనందంగా గడుపుతాను అన్నాడు. భరతుడు వచ్చేలోగా రాముడు అడవికి వెళ్లకపోతే కథ అడ్డం తిరుగుతుందని కంగారు పడుతున్న కైక ముఖకవళికలను చూసి రాముడు తన దృఢ సంకల్పాన్ని ఇలా చెబుతాడు:

నాహమర్థపరో దేవి లోకమావస్తుముత్సుహే
విద్ధి మాం ఋషిభిస్తుల్య విమలం ధర్మమాశ్రితం

నాకు ధన కనక వస్తు వాహనాది అర్థములపై ఆసక్తి లేదు. నాకు కావలసింది రాజ్యం కాదు, రాష్ట్రం. లోకం నాకోసం ఎదురు చూస్తున్నాయి. నిర్మలమైన ధర్మ నిర్వహణతో ఋషుల మధ్య జీవితం గడపాలని నా మనస్సు ఉవ్విళ్లూరుతున్నది అని పలుకుతాడు. ఇదీ ధర్మ పరాయణత్వం, సత్య వాక్పరిపాలనంటే. ఈ మాటలలోని రహస్యం కైకకు బోధపడితేగా? ఎంతమంది ఏమి చెప్పినా, కన్నతల్లి కౌసల్య చెప్పినా రాముడు దృఢచిత్తుడై నిలిచాడు. 

నాస్తి శక్తిః పితుర్వాక్యం సమతిక్రమమితుం మమ

అమ్మా - నాన్న గారి మాట కాదనేనంత సామర్థ్యం నాకు లేదు అన్నాడు. రాజ్యం అక్కరలేదు నాయనా, నా కళ్లెదుట ఉండు చాలు, అది ధర్మ లోపం కాదు అని కౌసల్య చెప్పినా, సత్యసంధుడు, ధర్మ పరతంత్రుడు అయిన రాముడు ఆమెకు తన నిర్ణయాన్ని నచ్చజెబుతాడు:

త్వయా మయా చ వైదేహ్యా లక్ష్మణేన సుమిత్రయా
పితుర్నియోగే స్థాతవ్యం ఏష ధర్మః సనాతనౌ

అమ్మా - తండ్రి ఆజ్ఞకు నేనే కాదు, నీవు, సీత లక్ష్మణుడు, సుమిత్రాదేవి అందరమూ బద్ధులమే. ఇదే సనాతన ధర్మం అంటాడు. 

కైక మనసులో ఉన్నట్టుంది చెలరేగిన కీర్తి దుమారానికి రాజవంశమంతా చలించింది. కానీ, సత్య ధర్మ పరాక్రముడైన రాముడు ఝంఝానిలాన్ని మలయమారుతంగా మారుస్తాడు. 

రామో విగ్రహవాన్ ధర్మః! సత్య ధర్మ పరాయణః!

20, ఆగస్టు 2020, గురువారం

భరత వాక్యం


మనం చాలా సార్లు భరత వాక్యం పలికారు అన్నది వింటూంటాము. ఇది రామాయణం నుండి వచ్చిందే.

శ్రీరాముడు లంకలో రావణుని సంహరించి సీతాలక్ష్మణ సమేతుడై విజయుడై అయోధ్యకు తిరిగి వస్తున్నాడన్న వార్త హనుమంతుని ద్వారా భరతునికి తెలుస్తుంది. ఆనందపడి రాముని స్వాగతానికి ఏర్పాట్లు చేస్తాడు భరతుడు. పధ్నాలుగు సంవత్సరాల ముందు జరుగవలసిన పట్టాభిషేకం ఇప్పుడు జరిపించేందుకు ఏర్పాట్లకు యంత్రాంగాన్ని పురమాయిస్తాడు. పితృవాక్య పరిపాలనకై అన్న తనకిచ్చిన రాజ్యాన్ని మళ్లీ అన్నకు అప్పగించే సమయంలో భరతుడు చెప్పిన మాటలను భరతవాక్యం అంటారు. ఈ మాటలు రామరాజ్యానికి నాంది, రామాయణ మహాయనానికి మంగళ వాక్యము పలుకుతాయి. ఇదే భరత వాక్యంగా ప్రసిద్ధి చెందింది.

ఏమిటీ భరత వాక్యం?

పూజితా మామికా మాతా దత్తం రాజ్యమిదం మమ
తద్దదామి పునస్తుభ్యం యథా త్వమదదా మమ

అమ్మ చెప్పిన మాటను ఆదరించి ఆమెను ఆరాధించాము, ఆమె కోరిన ప్రకారం నీవు నాకిచ్చిన రాజ్యాన్ని మళ్లీ నీకు యథాతథంగా అప్పజెబుతున్నాను అంటాడు భరతుడు. మాటదాటని భరతుడు, తండ్రి మాట నెరవేర్చిన రాముడు ఇక్ష్వాకు వంశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. తన కోసం కాకపోయినా ప్రజల అభీష్టం మేరకు రాముడు సింహాసనాన్ని అధిష్టించాలని భరతుని మనసులోని మాట.

జగదద్యాభిషిక్తం త్వామనుపశ్యతు రాఘవ
ప్రతపంతమివాదిత్యం మధ్యాహ్నే దీప్తతేజసం

మధ్యాహ్నవేళ పరిపూర్ణమైన వెలుగుతో జ్యోతిర్మండలం మధ్య ప్రకాశించే సూర్యునిలా శ్రీరాముడు అయోధ్యకు రాజుగా పట్టాభిషిక్తుడు కావటం లోకానికి ఆనందకరం. దీనికోసం ఈ లోకం ఎదురు చూస్తోంది. అంతటితో ఆగలేదు భరతుడు. చివరగా ఇలా పలికాడు:

యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధరా
తావత్ త్వమిహ లోకస్య స్వామిత్వమనువర్తయ

రామరాజ్యం ఎలా ఉంటుందో ఈ శ్లోకం చాలా చక్కగా చెబుతుంది. కాలచక్రం సక్రమంగా తిరుగుతున్నంత వరకు, ఈ కాలగమనంలో భూమి వికాసంతో వర్ధిల్లుతున్నంత వరకూ, అన్నగారు లోకానికి స్వామిగా ఉండి లోక కల్యాణం సాధించాలి అని ఈ భరత వాక్యంలోని అర్థం. బాగుంది, కానీ, పై శ్లోకాలలో నిగూఢమైన అర్థముంది:

ఇక్కడ కీలకమైన పదాలు మధ్యాహ్నం, చక్రం, వసుంధర, లోకం, అనువర్తయ. వీటిని జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రతి సంవత్సరం మనం శ్రీరామనవమి ఉత్సవాలలో సీతారాముల కల్యాణము, పట్టాభిషేకోత్సవం జరుపుకుంటాము. ఈ రామనవమి ఉత్సవాలలో గొప్ప రహస్యం దాగి ఉంది. అదే రహస్యం ఈ భరత వాక్యంలో కూడా ఉంది. సూర్యుడు మేషరాశిలో ఉండగా చంద్రుడు కర్కాటాకరాశిలోనూ పునర్వసు నక్షత్రంలో ప్రవేశించిన శుభ ముహూర్తమే శ్రీరామనవమి. అలాగే సూర్యుడు సింహరాశిలో ఉండగా చంద్రుడు వృషభరాశిలో రోహిణీ నక్షత్రంలో ప్రవేశించిన పుణ్యదినాన్ని జన్మాష్టమిగా జరుపుకుంటాము. తాత్త్విక దృష్టితో చూస్తే, సూర్యచంద్రుల పరస్పర సంబంధాన్ని పురస్కరించుకొని ఈ రెండు పండుగలు ఏర్పడ్డాయి. సూర్యమండలంలోని ప్రతి గ్రహానికి ఒక రాశి ఉచ్చస్థానంగా ఉంటుంది. అలాగే, మరో రాశి స్వక్షేత్రమవుతుంది. ఈ దృష్టితో చూస్తే మేషం సూర్యుడికి ఉచ్చరాశి, సింహం స్వక్షేత్రం. వృషభం చంద్రుడికి ఉచ్చరాశి, కర్కాటకం స్వక్షేత్రం. అంటే సూర్యుడు ఉచ్చంలో ఉండగా చంద్రుడు స్వక్షేత్రంలో పునర్వసులోకి వచ్చినప్పుడు సూర్యవంశపు రాజైన రామచంద్రుని పర్వకాలం, అలాగే సూర్యుడు స్వక్షేత్రంలో ఉండగా చంద్రుడు ఉచ్చలో రోహిణీ నక్షత్రంలో ప్రవేశించినప్పుడు చంద్రవంశపు రాజైన శ్రీకృష్ణ పర్వదినం వస్తుంది. సూర్యవంశ ప్రభువైన రాముడు మధ్యాహ్నం అవతరిస్తే చంద్రవంశప్రభువైన కృష్ణుడు అర్థరాత్రి ఆవిర్భవించాడు. దీనిని బట్టి రామకృష్ణుల జ్యోతిర్మయ స్వరూపం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. సంవత్సర పరిమితిలో సంభవించే సూర్యచంద్రుల ఈ పరస్పర సన్నివేశాలను మహర్షులు ప్రత్యక్షంగా భావించి అనుభూతి చెంది వీటికి మహత్తర రూపకల్పన చేశారు. కాలస్వరూపుడైన పరమాత్మ చైత్రంలో రామునిగా, శ్రావణంలో కృష్ణునిగా సాక్షాత్కరించాడు. ఒకే పరతత్త్వం కాలగతిని బట్టి రెండు రూపాలలో తన ఆరాధ్యస్వరూపాన్ని కాలజ్ఞులకు అవగత చేస్తుంది. కాలచక్రంలోని ఈ బిందువునే వసుంధర కలకాలం ధరిస్తుందని, దానికి ప్రభువుగా రాముడు లోకాలోకాన్ని అనువర్తిస్తూ ఉంటాడని భరతుని వాక్యంలోని అంతరార్థం. ఈ భరత వాక్యమే రామాయణ పరమార్థం.

19, ఆగస్టు 2020, బుధవారం

సీతారామ వైభవం - కన్యాదాన మంత్రం


ఒక్క మారు మన వివాహ వ్యవస్థకు మూలమైన సీతారాముల కల్యాణ ఘట్టంలోని కన్యాదాన మంత్రాన్ని స్మరించుకుని మనకు అన్వయించుకుందాం.

సీతారాముల కల్యాణం మనకందరికీ మహదానందకరమైనది. నిజమే, లోకాభిరామునికి, లోకపావనికి జరిగే కల్యాణం కదా! మరి, ఆ కల్యాణ సమయంలో కన్యాదాన మంత్రం నేడు సనాతన ధర్మ ప్రకారం జరిగే ప్రతి వివాహంలోనూ పఠించబడుతుంది. వివాహానికి మంత్రాలు పవిత్రతను చేకూర్చుతాయి, అది ఒక మహత్తరమైన కర్మ అవుతుంది. రెండు జీవులు ఒక ధర్మబద్ధమైన నడవడికకు ఆనాడు అంకురార్పణ చేసే శుభ సమయం అది. అర్థం తెలుసుకుంటే మన వివాహ వ్యవస్థ ఎంత గొప్పదో అర్థమవుతుంది. అందులో వధువు తండ్రి తన బిడ్డను వరునికి అప్పగిస్తూ చెప్పే శ్లోకం అత్యంత ముఖ్యమైనది.

కన్యాదాన మంత్రం:

ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ
ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా

ఇదుగో మా అమ్మాయి సీత. నీకు ధర్మకార్య నిర్వహణలో సహచరిగా ఉపకరిస్తుంది. ఈమెను స్వీకరిస్తే నీకు శుభం కలుగుతుంది. ఈమెను పాణిగ్రహణం చేసి చేదోడు వాదోడుగా ఇద్దరూ జీవించండి.

సీతారామ సమాగమం సీతా సమేత అయిన రాముని అయనానికి మొదటి మెట్టు. ఈ సమాగమంలో రహస్యం, దీనికి గల ప్రాశస్త్యం జనకుడు పాణిగ్రహణ సమయంలో పై శ్లోకం ద్వారా చెప్పాడు. రాజర్షి జనకుడు చెప్పిన మాటలు మంత్రభావంతో మననం చేయదగినవి.

ఇందులో రామాయణ మహాయనమంతా సూక్ష్మంగా గోచరిస్తుంది. వాల్మీకి వర్ణించిన సీతారామ కల్యాణ ఘట్టానికి ప్రాణప్రాయమైంది ఈ శ్లోకం. ఇందులోని మొదటి పంక్తిలో ఇయం (ఈమె), మమ (నా), తవ (నీ) అని మూడు సర్వనామాలున్నాయి. ఇవి కేవలం సీత, జనకుడు, రామునికే కాదు సమస్త మానవాళికి వర్తిస్తాయి. మా అమ్మాయి సీత, మా ఇంట్లో పెరిగి మీ ఇంటికి వచ్చుచున్నది. ఎందుకు? ధర్మం నిలబెట్టేందుకు. ఈమె యందు నీకు పరిపూర్ణమైన అనురాగం (ఇచ్ఛ) ఉంటే నీకు శుభం కలుగుతుంది. ఎన్ని చిక్కులు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, మీ ఇరువురి మధ్య ఇచ్ఛాశక్తి దృఢంగా ఉంటే మీకేమీ అపాయం లేదు. ఇచ్ఛకు, ప్రతీచ్ఛకు మధ్య చిన్న పెద్ద, హెచ్చు తగ్గులు, హానివృద్ధులు ఉండే అవకాశం లేదు. సమరసభావం సహచరుల జీవితానికి సంతోషం, సార్థక్యం సమకూర్చగలుగుతుంది. ఇదీ జనకుని మాటల ఆంతర్యం.

సాక్షాత్తూ పరమేశ్వరి తన యింట పెరిగినందుకు, అలాంటి సీతమ్మను పరమేష్ఠి స్వరూపుడైన రాముని చేతుల్లో పెడుతూ జనకుడు ఎంతగా పొంగిపోయి ఉంటాడో, మమ సుతా అన్న చిన్న వాక్యం చెబుతుంది. ఇయం సీతా అనటంలో సీతాదేవి పుట్టుపూర్వోత్తరాలు, తవ అనే మాటలో దశరథనందనుని ఘనత వెయ్యి విధాల వ్యక్తమవుతున్నట్లు భావించాలి.

ఇక్కడ పారమార్థం ఏమిటి?

ఇది ఒక లోకోత్తరమైన భావ భూమిక. ఇందులో పార్థివమైన సౌందర్యానికి, సంతోషానికి తావులేదు. అది మహానంద నిలయము. సీతారాముల అద్వైత రససిద్ధికి ఆధారభూతమైన జీవధార. మట్టిలో పుట్టి మట్టిలో లయమైన జానకి జీవితమంతా ఆ జీవధారకే అంకితమైంది. సూర్యవంశంలో ప్రభవించిన శ్రీరామచంద్రమూర్తి వెలుగులకు వెలుగును ప్రసాదించిన వేవెలుగైతే, భూసారం నుండి ప్రభవించిన సీతాదేవి ఆ వెలుగులో వెలసిన వెలలేని వేల్పు. ఆకాశం శూన్యం, ధరణి పరిపూర్ణం. శూన్యాన్ని పరిపూర్ణంతో సమీకరించే సుందర సన్నివేశం సీతారామ సమాగం.

దీనిని మనం ఎలా అన్వయించుకోవాలి?

పురుషుని కర్తవ్య నిర్వహణలో స్త్రీది ఎంతటి ముఖ్యమైన పాత్రో ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవాలి. పురుషార్థములలో అత్యంత ముఖ్యమైన ధర్మాచరణకు స్త్రీ, ఆ స్త్రీ సాహచర్యంలో తాను ధర్మాన్ని నిర్వర్తిస్తూ అభ్యున్నతి పొందే అద్భుతమైన మార్గం ఈ వివాహ వ్యవస్థ. కన్యాదాత బిడ్డను మనకు అమ్మటమూ లేదు, మనము కొనుక్కోవటమూ లేదు. సమస్త విద్యలను, ధర్మాలను బోధించి శక్తి స్వరూపిణి అయిన ఒక కన్యను పురుషార్థియై వచ్చిన వరునికి అప్పగించి, కర్తవ్య నిర్వహణ, ధర్మాచరణ చేయటానికి మహోపకారం చేస్తున్నాడు వధువు తండ్రి, అనగా మామగారు. మరి అటువంటి కన్యాదాతను ఎలా గౌరవించాలి? నిరంతరం కృతజ్ఞతతో వ్యవహరించాలి. అలాగే, ధర్మాచరణలో సహాయకారి అయిన భార్యను ఎలా చూసుకోవాలి? జనకుడు చెప్పినట్లు అన్యోన్య భావనతో, పరస్పరేచ్ఛాచరణతో. స్త్రీలేని పురుషునికి ధర్మాచరణలో పరిపూర్ణత ఎక్కడ? కర్మ సాఫల్యమెక్కడ?

ఇదే మన వివాహ వ్యవస్థ గొప్పతనం. దీనిని వక్రీకరించి, వివాహమంటే ఒక ఆడంబరం చేసి, మంత్రార్థం మరచి, పవిత్రతను కాలరాసి, దారుణాలకు ఒడిగడుతున్న స్త్రీపురుషులకు ఈ మంత్రమొక కనువిప్పు. ఈ ఒక్క మంత్రార్థం తెలుసుకుంటే చాలు, ఎన్ని ఒడిదుడుకులైనా ఎదుర్కొనగలరు. ఇదే మన వివాహ వ్యవస్థకు, కేవలం ఒడంబడికలైన ఇతర వ్యవస్థలకు తేడా. ఇందులో స్త్రీలకున్న స్థానం, గౌరవం మరెక్కడా లేదు. దానిని వికృతం చేసే వ్యవస్థను సనాతన ధర్మ వ్యవస్థగా చిత్రీకరించే వారికి సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతో ఉంది.

సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి!

15, ఆగస్టు 2020, శనివారం

సగుణారాధన - శ్రీరామ శరణ్ శ్రీ కుందుర్తి వేంకట నరసయ్య గారు


 పంచభూతాలకు పరమాత్మకు సంబంధమేమిటి?

ఆకారము లేని భగవంతుడు ప్రకృతి అనే రూపము దాల్చి మనకు కనిపిస్తున్నాడు. ప్రకృతిన్యాం అధిష్ఠాయ సంభవమ్యాత్మ మాయయా - నా యొక్క మాయ చేత ప్రకృతిని ఆశ్రయించి రూపం దాలుస్తానని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తెలిపాడు. పంచభూతాలే ప్రకృతిలోని మూలద్రవ్యాలు. ఇవి కాక మనస్సు, బుద్ధి, అహంకారము అనే మూడున్నాయి. ఎనిమిదింటితో కూడిన ఆలోచనలే మన సనాతన ధర్మానికి మూలస్థంభాలు. మానవుడు ఈ అష్ట ప్రకృతులను కలిగియున్నాడని ఆ కృష్ణ పరమాత్మే గీతలో చెప్పాడు.

దేవుళ్లు ఎలా ఏర్పడ్డారు?

పరమాత్మ పంచభూతముల ద్వారా సృష్టిని జరిపించాడు. ఆకారము, రూపము లేని పరమాత్మ పంచభూతములనే దుస్తులను ధరించి మనకు సాక్షాత్కరిస్తున్నాడు. ఒక్కొక్క ఆకారంలో ఒక్కొక్క పేరుతో పిలువబడ్డాడు

ఏ పేర్లు ఎలా వచ్చాయి?

ఆకాశస్యాధిపో విష్ణుః అగ్నేశ్చైవ మహేశ్వరి వాయూ సూర్యః క్షితిరేశః జీవనస్య గణాధిపః - అనగా ఆకాశం విష్ణువు, అగ్నియే శక్తి, వాయువు సూర్యుడు, పృథ్వి ఈశ్వరుడు, జలం గణపతి. ఇలా ఐదు పేర్లతో ఉపాసించబడుతున్నారు. ఆకాశం అనగా సర్వవ్యాపకమైనది, నీలవర్ణము కలది, విష్ణువు కూడా అంతటా ఉన్నవాడు, నీలవర్ణుడు, ఆకాశ లక్షణం శబ్దం, అలాగే విష్ణువు కూడా సంకీర్తనల ద్వారా శబ్దం ద్వారా ఉపాసించబడుతున్నాడు. అలాగే అగ్ని ఎరుపు రంగు కలది. అగ్ని అంశతో శక్తి ఏర్పడినది. శక్తిని ఉపాసించువారు కుంకుమ, ఎర్రని పూలు, ఎర్రని వస్త్రములతో పూజితారు, ఎర్రని పండ్లు, పులిహోర నైవేద్యం పెడతారు. వాయువు అంశగల దేవత సూర్యుడు, ఇతడు బంగారు వర్ణం కలవాడు, సూర్యునిలో వాయువులున్నట్లు అందరూ ఎరిగినదే. పృథ్వి అంశ గలవాడు శివుడు, ధవళ వర్ణుడు, పృథ్వి నుండి వచ్చిన జలముతో శివునికి అభిషేకం చేస్తారు, పూలతో, దళములతో పూజిస్తారు. జలము యొక్క అంశతో గణపతి ఏర్పడ్డాడు. అందుకే పూజ అనంతరం గణపతిని నీటిలో నిమజ్జనం చేస్తారు. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క దేవత పైవిధంగా ఏర్పడ్డారు.

మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులెవరు?

మనిషి యొక్క ప్రకృతులలో పంచభూతములు గాక మనస్సు, బుద్ధి, అహంకారము అన్నవి ఉన్నాయి కదా. మనస్సు బ్రహ్మకు, బుద్ధి విష్ణువునకు, అహంకారము రుద్రునకు ప్రతీకలుగా ఉన్నాయి. అవే సృష్టి, స్థితి, లయములను జరుపుతున్నాయి.

మీరు చెప్పిన ఐదుగురు దేవతలను భారతదేశములోని వివిధ ప్రాంతాలలో ఆరాధిస్తున్నారు కదా? ఈ ఐదింటి యొక్క సమైక్య రూపాన్ని ఆరాధించే ప్రక్రియ ఏదైనా ఉందా?

ఉన్నది. పంచభూతముల సమైక్య రూపముగా గాయత్రిని ఉపాసిస్తారు. పంచముఖీ గాయత్రీ ధ్యాన శ్లోకం ముక్తావిద్రుమహేమనీలధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః అనే శ్లోకంలో ఈ విషయాన్ని గ్రహించవచ్చు.

"సగుణారాధన" - శ్రీరామ భక్తాగ్రేసరులు శ్రీరామ శరణ్ శ్రీ కుందుర్తి వేంకట నరసయ్య గారితో జరిగిన గోష్టి నుండి

శ్రీరాముడు-శ్రీకృష్ణుడు జనన కాల రహస్యాలు


సూర్యుడు మేషరాశిలో ఉండగా, చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో ప్రవేశించిన ముహూర్తమే శ్రీరామనవమి. అలాగే, సూర్యుడు సింహరాశిలో ఉండగా, చంద్రుడు వృషభరాశిలో రోహిణి నక్షత్రంలో ప్రవేశించిన పుణ్యదినాన్ని జన్మాష్టమి లేదా శ్రీజయంతి అంటాము. చాంద్రమానానికి ప్రచారం వచ్చిన తరువాత నవమి మరియు అష్టమి ఈ రెండు పండుగులకు ప్రధాన తిథులైనాయి. కానీ, తాత్విక దృష్టితో చూస్తే సూర్యచంద్రుల పరస్పర సంబంధాన్ని పురస్కరించుకొని ఈ రెండు పండుగలు ఏర్పడ్డాయి. సూర్యమండలంలోని ప్రతి గ్రహానికీ ఒక రాశి ఉచ్చస్థానంలో ఉంటుంది. అలాగే, మరో రాశి స్వక్షేత్రమవుతుంది. ఈ దృష్టితో చూస్తే మేషం సూర్యుడికి ఉచ్చరాశి, సింహం స్వక్షేత్రం. వృషభం చంద్రుడికి ఉచ్చరాశి, కర్కాటకం స్వక్షేత్రం. అంటే సూర్యుడు ఉచ్చంలో ఉండగా, చంద్రుడు స్వక్షేత్రంలో పునర్వసులోకి వచ్చినప్పుడు సూర్యవంశపు రాజైన రామచంద్రునికి పర్వకాలమవుతుంది. అలాగే సూర్యుడు స్వక్షేత్రంలో ఉండగా చంద్రుడు ఉచ్చంలో రోహిణీ నక్షత్రంలో ప్రవేశించినప్పుడు చంద్రవంశ ప్రభువైన శ్రీకృష్ణుని జయంతి వస్తుంది. సూర్యవంశ ప్రభువు మధ్యాహ్నం అవతరిస్తే చంద్రవంశపు ప్రభువు అర్ధరాత్రి ఆవిర్భవించాడు. దీనిని బట్టి రామకృష్ణుల జ్యోతిర్మయ స్వరూపం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. సంవత్సర పరిమితిలో సంభవించే సూర్యచంద్రుల ఈ పరస్పర సన్నివేశాలను మహర్షులు ప్రత్యక్షంగా భావించి వీటికి మహత్తరమైన రూపకల్పన చేశారు. కాలస్వరూపుడైన పరమాత్ముడు చైత్రంలో రామస్వామిగా, శ్రావణంలో కృష్ణపరమాత్మగా సాక్షాత్కరిస్తాడు. ఒకే పరతత్త్వం కాలగతిని బట్టి రెండు రూపాలలో తన ఆరాధ్య స్వరూపాన్ని కాలజ్ఞులకు అవగతం చేస్తుంది. కాలచక్రంలోని ఈ బిందువునే వసుంధర కలకాలం ధరిస్తుందని, దానికి ప్రభువుగా పరమాత్మ లోకాలోకాన్ని అనువర్తిస్తూ ఉంటాడు.

వేదాలు ఎప్పటివి? ఎలా వచ్చాయి? - కంచి పరమాచార్యుల వారు


వేదాలు అపౌరుషేయాలు - అంటే పురుష ప్రమేయం లేనివి అని అర్థం. పౌరుషేయమంటే మానవ కల్పితం. వేదాలు మానవ కల్పితాలు కానందువల్ల ఏ ఋషీ వాటిని రచించలేదు. వారే వ్రాసి ఉంటే ఋషులను మంత్రకర్తలనవచ్చు. కానీ వారిని మంత్రద్రష్టలంటాము. అంటే మంత్రాలను దర్శించిన వారన్నమాట. దీని వల్ల మనకు తెలిసేదేమిటి? ఋషులు మంత్రాలను కనుగొన్నారు, లేక దర్శించారు, వాటిని రచించలేదు, సృష్టించలేదు.

కొలంబస్ అమెరికాను కనుగొన్నాడన్న మాటకు అర్థం ఏమిటి? అతడు అమెరికాను సృష్టించడని కాదుగా? అప్పటికే ఉన్న అమెరికాను మిగిలిన లోకం దృష్టికి తీసుకు వచ్చాడు. న్యూటన్, ఐన్‌స్టైన్ వంటి శాస్త్రజ్ఞులు భౌతిక నియమాలను కొన్నిటిని ప్రతిపాదించి ప్రసిద్ధులైనారు. అంతేకానీ, వారే ఆ నియమాలను సృష్టించలేదు. భూమ్యాకర్షణ వల్లనే కదా న్యూటన్‌కు పూర్వం కూడా వస్తువులు క్రింద పడేవి? ఆయన దానిని కనుగొన్నాడు, అంతే. ఈ శాస్త్రవేత్తలు ఉన్న ప్రకృతి నియమాలను అర్థం చేసుకుని లోకానికి మొట్టమొదటిసారి చెప్పారు. ఆ విధంగానే సంస్థితమైన మంత్రాలను ఋషులను గ్రహించి, లోకానికి చెప్పారు. మంత్రాలు ఎప్పుడూ ఉండనే ఉన్నాయి. ఋషులు వాటిని కనుగొనటం వలన ఆ మంత్రాలకు వారి పేర్లను జోడించారు. అప్పటికే ఉండి అజ్ఞాతంగా మిగిలిన వేదమంత్రాలను మానవలోకానికి ఎఱుకపరచిన ఘనత ఋషులకు దక్కుతుంది. అందువల్లనే వారి పేర్లను చెప్పేటప్పుడు మనం వారి స్మృతికి గౌరవసూచకంగా శిరస్సుతో నేలను తాకుతాం. వారు చేసిన మహత్కార్యానికి నివాళి ఇది. మంత్రాన్ని ఉచ్చరించటానికి పూర్వం కూడా ఈ భావంతోనే వారి పేర్లను పేర్కొంటాము. ఋషులు మంత్రాలను కనుగొన్నారన్నప్పుడు వారు కనుగొనక పూర్వం ఎక్కడ ఉండేవి? "అనాది" అంటే అవి ఎప్పుడూ ఉండేవని అర్థమా? ఉంటే ఎక్కడ ఉన్నాయి? అంతరిక్షంలోనా? ఒకవేళ సృష్టితో పాటే పరమాత్మ వేదాలను కూడా సృష్టించాడా? లేక సృష్టికి పూర్వమే సృజించాడా?

సృష్టికి పూర్వమే వేదాలుండేవని, బ్రహ్మ తన సృష్టిని శబ్దరూపంలో సంస్థితమై యున్న వేదమంత్రాలతోనే కొనసాగించాడనీ శాస్త్రాల వల్ల మనకు తెలుస్తుంది. శ్రీమద్భాగవతంలోని బ్రహ్మ సృష్టి గురించిన వివరణను బట్టి ఈ విషయం తెలుసుకోవచ్చు. మరి వేదాలు ఎలా వచ్చాయి? ఈ వేదార్భివ సమయ నిర్ణయమనే గందరగోళానికి సమాధానం వేదములోనే ఉంది. బృహదారణ్యకోపనిషత్తులో ఇలా ఉంది - ఋక్, యజుః, సామరూపాలలో - ఈశ్వరుని "నిశ్శ్వాసితం" మాత్రమే. నిశ్శ్వాసితము అన్న మాటకు అర్థం ఊపిరి విడవటమని. ఊపిరి లేకుండా ఉండగలమా? ఆ విధంగానే వేదాలు పరమాత్మ ఊపిరేనన్నమాట. ఆద్యంతాలు లేని పరమాత్మ నిత్యుడైతే, ఆయన యొక్క ఊపిరే అయిన వేదాలు కూడా అనాది. ఆయనతో పాటే అవి సంస్థితమై ఉంటాయి.

ఇక్కడ గమనించవలసిన విషయమిది: భగవంతుడు కూడా వేదాలను సృష్టించలేదని. మన ఊపిరిని మనమే కల్పించుకోలేము కదా! మనం పుట్టినప్పటి నుండి ఊపిరి ఉంటూనే ఉంటుంది. ఈ విధంగానే ఈశ్వరుడు, వేదాలూను. వేద భాష్యాన్ని వ్రాసిన విద్యారణ్యులు తన గురువు సాక్షాత్తూ ఈశ్వరుడేనంటూ ఆయన యొక్క "నిశ్శ్వాసమే" వేదాలను స్తుతించాడు. విద్యారణ్యుల వారు తన భాష్యంలో గురువు వేదాలలో ఎట్లా లీనమై పోయారో వర్ణించటమే గాక వేదాలు ఈశ్వర సృష్టి కావని కూడా నొక్కి చెప్పారు. అందుకే, వేదాలు పునాదిగా గల సనాతనధర్మం మిగిలిన ధర్మాల కన్నా గొప్పది. స్వయంగా పరమాత్మ నిశ్శ్వాస అయిన వేదాలు శాశ్వతం, సమస్త జీవరాశికి మార్గదర్శకం.

వేదాలు అనంతం - కంచి పరమాచార్యుల వారు


వేదాలు అనంతమనటానికి ఒక కథ ఉంది. భరద్వాజ మహర్షి మూడు జన్మలలో వేదాలను అధ్యయయనం చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకు ఇంకొక జన్మనిస్తాను. ఆ జన్మతో చేస్తావు అని అడిగితే, భరద్వాజుడు "అదనంగా లభించే ఆ జన్మ కూడా వేదాధ్యయనానికే వినియోగిస్తాను" అన్నాడు. అన్ని వేదాలనూ ఎన్ని జన్మలెత్తినా పూర్తిగా అధ్యయనం చేయటం అసంభవమని, ఋషి పట్ల జాలితో అతను ఎదురుకుంటున్న సమస్య ఎంత జటిలమైనదో తెలియజేయటానికై పరమేశ్వరుడు మూడు పెద్ద పర్వతాలను సృష్టించి వాటి నుండి గుప్పెడు మట్టి తీసుకుని "నీవిప్పటివరకు అధ్యయనం చేసినదంతా ఈ పిడికెడు మట్టితో సమానం. నీవింకా అధ్యయనం చేయవలసింది ఈ పర్వతాల మేర ఉన్నది" అన్నాడుట. భరద్వాజునికి సంబంధించిన ఈ గాథ కాఠక భాగములో ఉంది. ఇటువంటి గాథల వల్ల వేదాలు అనంతమని విశదమవుతుంది.

మంత్రాలు భరద్వాజుని వంటి ఎందరో తపస్సంపన్నులైన ఋషులకు అభివ్యక్తమైనవే. అందువల్ల ఆయా మంత్రాలు ఆయా ఋషులకు చెందినవైనాయి. ఆ మంత్రాలను ఆలకించటానికి వారికి దివ్యమైన చెవులున్నాయి. యోగశాస్త్రం ప్రకారం మనస్సులోని మౌనం విశ్వాంతరాళంతో అనుసంధానం చేస్తే అంతరిక్షంలో తేలుతున్న శబ్దాలన్నీ వినబడతాయి. విశ్వమంతటితో తాదాత్య్మం చెందగలిగిన వారికే ఇది సాధ్యం. అందువల్లే, ఋషులు లోక శ్రేయస్సుకై ఆ మంత్రాలను బయట పెట్టరే తప్ప వాటిని వారు సృష్టించలేదు. ఈ మహోపకారాన్ని చేసి మానవాళికి అజ్ఞాతంగా సంస్థితమైన వాటిని తెలియజేశారు. గంగను రప్పించిన వానికి మనం ప్రణమిల్లుతాం. కానీ, గంగను అతను సృష్టించలేదు కదా! దివి నుండి భువికి తీసుకు వచ్చాడు అంతే. అయినా ఎంతో తపోశక్తిని ధారపోసి లోకకల్యాణార్థం ఎంతో దూరం నుండి తీసుకు వచ్చాడని కృతజ్ఞత తెలుపుకుంటాం. మనకు అందుబాటులో లేని మంత్రాలను మనకు అనుగ్రహించిన ఋషులను ఎంతగా కొనియాడాలి? అందుకే సంధ్యావందనం, అనుష్ఠానం మొదలైనవి. అవి నిత్యం చేస్తేనే మనం ఋషి ఋణం తీర్చుకొనగలిగేది. తద్వారా రోజులో మూడుసార్లు మన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనలను పునరుత్తేజితం చేసుకోవటానికి సుస్పష్టమైన విధివిధానం నిర్ణయించబడింది. అందులో అంతర్భాగమే ఈ ఉపాకర్మ కూడా. వైదిక కర్మలు పూర్తిగా స్వీయోద్ధరణ ద్వారా లోకకల్యాణార్థమనే అద్భుతమైన లక్ష్యం కొరకు నిర్దేశించబడినవి. ఎంత శ్రద్ధాసక్తులతో ఆచరిస్తే అంత ఫలితం.

పల్నాటి యుద్ధం - 1966: చిత్ర విశేషాలు

1966లో విడుదలైన పల్నాటి యుద్ధం తెలుగు చారిత్రక చిత్రాలలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న చిత్రం. గుత్తా రామినీడు దర్శకత్వంలో శ్రీ అనురూపా ...