4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

ముద్దుగారే యశోద ముంగిటి ముత్తెము వీడు - తాళ్లపాక అన్నమాచార్యుల వారు

ముద్దుగారే యశోద ముంగిటి ముత్తెము వీడు
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు

అంతనింత గొల్లెతల అరచేతి మాణికము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పౘ్చ పూస
చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు

రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖచక్రాల సందుల వైఢూర్యము
గతియై మమ్ము గాచే కమలాక్షుడు

కాళింగుని పడగలపై గప్పిన పుష్యరాగము
ఏలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము
పాలజలనిధిలోన బాయని దివ్యరత్నము
బాలుని వలె తిరిగే పద్మనాభుడు

అక్షరరూపమీయలేని మహిమలు గల దేవకీ సుతుడైన బాలకృష్ణుడు ముద్దులొలికే రూపముతో యశోద ముంగిట ముత్యము వలెనున్నాడు చూడండి! అంతటా ఉండే ఆ పరమాత్మ ఈ గోకులం యొక్క అరచేతికి మాణిక్యము వంటి వాడు, దుష్టుడైన కంసుని పాలిట వజ్రము, తన కాంతులతో మూడు లోకాలలోనూ ప్రకాశించే మరకతము వంటి వాడు ఈ కృష్ణుడు చూడండి! రతికేళిలో రుక్మిణీదేవి అందమైన మోమునకు పగడపు కాంతి వంటి వాడు ఈ కృష్ణుడు, గోకులాన్ని ఇంద్రుని బారి నుండి రక్షించ చిటికిన వేలిన ఎత్తిన గోవర్ధన గిరికి గోమేధికము వంటి వాడు. శంఖచక్రాల నడుమ ప్రకాశించే వైఢూర్యమితడు. కలువలవంటి కన్నులు గల ఈ కృష్ణుడే మనకు గతియై కాచే వాడు, చూడండి!. అహంకారముతో విషమును జిమ్మిన కాళింగుని పడగలపై నర్తిస్తూ పుష్యరాగములా ప్రకాశించిన వాడు, శ్రీవేంకటాద్రి ఏలే నల్లనయ్య ఇంద్రనీలము వంటి వాడు. క్షీరసాగరములో పద్మనాభునిగా విడువలేని దివ్యమైన రత్నమైన వాడు బాలునిలా మన ముందు తిరుగాడుతున్నాడు చూడండి!

అన్నమాచార్యుల వారి సాహితీ వైభవానికి ఈ సంకీర్తన గొప్ప ఉదాహరణ. బాలకృష్ణుని మనోజ్ఞమైన అవతార విశేషాలను వర్ణిస్తూనే ఆయనను సర్వాంతర్యామిగా దర్శించి తరించినవారిలో అన్నమయ్య అగ్రగణ్యులు. యశోదకు శిశువై లాలించబడి అల్లరి చేష్టలు చేసిన ఆ బాలుడు బ్రహ్మకు తండ్రి, భూదేవికి రక్షకుడు అని "చేరి యశోదకు శిశువితడు" అనే కృతిలో నుతించిన అన్నమయ్య, ఈ సంకీర్తనలో నవరత్నాలతో పోలుస్తూ బాలకృష్ణుని వైభవాన్ని ఆవిష్కరించారు. ఆయన ఉపయోగించిన పదాలను నిశితంగా పరిశీలిస్తే ఇది కేవలం వర్ణన కాదు, విశ్వాత్మకుని బాలునిలో గాంచిన అనుభూతుల సారం అని అర్థమవుతుంది. దిద్దలేని మహిమలు గలవాడైన పరమాత్మ కారణ జన్ముడై దేవకి గర్భాన జన్మించి, గోకులంలో యశోద వద్ద పెరిగి లోకోద్ధారకుడైనాడు. ముత్యము ఎలా ఏర్పడుతుంది? నీటిలో నత్తగుల్లలు సంరక్షణార్థమై ఏర్పరచుకునే ఆకృతి నుండి ఉద్భవిస్తుంది. సృష్టి స్థితి లయములలో ఈ విశ్వానికి కలిగే గ్లానిని తొలగించటానికి అనేకరూపాలలో అవతరించే పరమాత్మ ధర్మస్థాపనకై ద్వాపరయుగంలో నాటకీయంగా కారాగారంలో ఉన్న దేవకి గర్భాన ఉద్భవిస్తాడు. స్వచ్ఛమై, సహజమై యుండే ముత్యము వంటి వాడు ఆ చిన్నికృష్ణుడని అన్నమయ్య భావం. అంతటి కృష్ణుడు గోకులానికి మాణిక్యం అని పలికారు అన్నమయ్య. మాణిక్యము అనగా కెంపు శాశ్వతమైన ప్రేమకు ప్రతీక. గోకులంలో ఆ బాలుడు పంచింది ప్రేమే కదా? వజ్రం పదునైనది, పటిష్టమైనది, శక్తివంతమైనది. అందుకే దుష్ట కంసుని పాలిట వజ్రంగా వర్ణించారు. గరుడపౘ్చ జ్ఞానానికి, బుద్ధి వికాసానికి ప్రతీక. జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్ముని ముల్లోకాలలోనూ ప్రకాశించే గరుడపౘ్చగా నుతించారు. పగడము శక్తికి, ధాతుపుష్టికి కారకమైన నవరత్నము. అందుకే రతికేళిలో రుక్మిణి మోవికి పగడంగా స్వామిని అభివర్ణించారు. గోమేధికము భీతావహ స్థితినుండి ఉపశమనం కలిగించే రత్నం. రాహుగ్రహ ప్రేరితమైన ఈ రత్నంగా శ్రీకృష్ణుని అభివర్ణించినప్పుడు గోవర్ధనగిరి ఉదంతాన్ని ప్రస్తావించారు అన్నమాచార్యులు. శంఖ చక్రాలు స్వామి యొక్క సృష్టి స్థితి లయములకు సూచికయైన ఆయుధములు కాగా, వాటి మధ్య మెరిసే వైఢూర్యముగా అన్నమయ్య ఎందుకు వర్ణించారు? వైఢూర్యము ఆధ్యాత్మికతకు ప్రతీక. సృష్ట్యాది, ప్రళయము మధ్య ఆధ్యాత్మిక ప్రకాశమైన వానిగా తెలుపటానికి వైఢూర్యాన్ని వినియోగించారు. అందుకే తదుపరి పంక్తిలో గతియై మమ్ము గాచే కమలాక్షుడు (శంఖచక్రములతో యున్న ఆధ్యాత్మికశక్తి) అని శ్రీహరి అవతరమైన బాలకృష్ణుని స్తుతించారు. అహంకారాన్ని నాశనం చేసేది, దుష్టశక్తుల నుండి కాపాడేది, పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టేది పుష్యరాగము. మరి ఈ అహంకారము, దుష్టశక్తి రూపమే కదా కాళింగుడు. వానిని అణచి కాళీయమర్దునిగా లోకఖ్యాతిని పొందిన వాడు కృష్ణుడు. అందుకే అన్నమయ్య పుష్యరాగంగా వర్ణించారు. మరి నల్లనిదేహముతో నీలమణి కాంతితో ఉండేవాడు శ్రీనివాసుడు. ఆ శ్రీనివాసుడు దేనికి ప్రసిద్ధి? మన కర్మఫలములను తొలగించి ఆపదలనుండి కాపాడి రక్షించే వాడు. ఇంద్రనీలమణి ఈ పాపసంచయమును పోగొట్టి సమస్త సంపదలను ప్రసాదించే నవరత్నము. అందుకే ఏలేటి శ్రీవేంకటాద్రి ఇంద్రనీలము అని అన్నమాచార్యుల వారు ప్రస్తుతించారు.

మొత్తం మీద నవగ్రహముల శుభఫలములను ప్రసాదించే నవరత్నములు - మౌక్తికము (ముత్యము), పద్మరాగము (మాణిక్యము/కెంపు), వజ్రము, మరకతము (గరుడపౘ్చ), ప్రవాళము (పగడము),గోమేధికము,వైడూర్యము, పుష్యరాగము, నీలము - వీటి వైశిష్ట్యాన్ని సమస్త సద్గుణ సంపన్నుడు, శుభకరుడు, భవహరుడు, జగన్మోహనుడు అయిన శ్రీకృష్ణుని లీలల వర్ణనలో పొందుపరచి మనకు రత్నశాస్త్రాన్ని, నవగ్రహాల అనుగ్రహము పొందే మార్గాన్ని కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసునిగా అత్యద్భుతంగా పలికారు. అందుకే ఆయన సద్గురువులైనారు. ఒక్కొక్క సంకీర్తన మంత్ర సమానమై శతాబ్దాల అనంతరం కూడా ఆధ్యాత్మిక సుగంధాలు ఈ ప్రపంచమంతా వెదజల్లుతున్నాయంటే అది అన్నమాచార్యుల వారి వైశిష్ట్యాన్ని, వారి దార్శనికతను, భక్తి సంపదను తెలుపుతాయి. నందకాంశగా జన్మించిన ఆయన సంకీర్తనలలోని భావాన్ని పైవివరాలతో తెలిపిన డాక్టర్ శోభారాజు గారికి నా శతసహస్ర వందనాలు. వారి వివరణను నా పదాలలో తెలిపే ప్రయత్నం చేశాను. తప్పులు దొర్లి ఉంటే అన్యథా భావించరాదు. అన్నమయ్య తత్త్వాన్ని అర్థం చేసుకొవటం అంటే మాటలు కాదు. అవి అనుభవైకవేద్యం. కఠోర సాధనతోనే సాధ్యం. ఆ మార్గంలో సఫలీకృతులైన శోభారాజు గారికి ఆ శ్రీనివాసుడు సమస్త శుభములు కలిగించాలని నా ప్రార్థన. వారికి నా ధన్యవాదాలు. ఎందరో మహానుభావులు.

ముద్దుగారే యశోద సంకీర్తన శోభారాజు గారి పాడిన లింక్ యూట్యూబ్‌లో దొరకలేదు. ఈ లింక్‌లో ఆ పాట క్లిక్ చేసి వినవచ్చు.

ఇతడొకడే సర్వేశ్వరుడు - తాళ్లపాక అన్నమాచార్యుల వారు

ఇతడొకడే సర్వేశ్వరుడు సిత కమలాక్షుడు శ్రీ వేంకటేశుడు

పరమ యోగులకు భావ నిధానము అరయ నింద్రాదులకైశ్వర్యము
గరిమ గొల్లెతల కౌగిట సౌఖ్యము సిరులొసగేటి ఈ వేంకటేశుడు

కలికి యశోదకు కన్న మానికము తలచిన కరికిని తగు దిక్కు
అల ద్రౌపదికిని ఆపద్బంధుడు చెలరేగిన ఈ శ్రీవేంకటేశుడు

తగిలిన మునులకు తపము సత్ఫలము ముగురు వేల్పులకు మూల మీతడె
ఒగి నలమేల్మంగకొనరిన పతియై జిగి మించిన ఈ శ్రీవేంకటేశుడు

వికసించిన కమలముల వంటి కన్నులు గల ఈ శ్రీవేంకటేశ్వరుడే సర్వేశ్వరుడు. శ్రేష్ఠులైన యోగులు భావించే పెన్నిది, అనుభూతి చెందగా ఇంద్రాదులకు నిధియైన వాడు, ఉత్తములైన గోపికల కౌగిటి సౌఖ్యము, సమస్త సంపదలనొసగే ఈ వేంకటేశ్వరుడే. మనోజ్ఞమైన యశోదకు మాణిక్యము వంటి కుమారుడు, ఆపదలో తలచిన గజేంద్రునికి దిక్కు, కురు సభలో శరణాగతితో ఆలపించిన ద్రౌపదికి చీరలిచ్చి మానము కాపాడిన ఆపద్బంధువు, ఈ దివ్యంగా ప్రకాశించే వేంకటేశ్వరుడే. కఠోరమైన తపస్సు చేసే మునులకు సత్ఫలమైన వాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మూలమైన పరమాత్మ, చక్కనైన అలమేలుమంగకు తగిన పతియై అనంతమైన కాంతి కలవాడు ఈ వేంకటేశ్వరుడే. 

ఏమైనా తిరుమల శ్రీనివాసుని వైభవమే వైభవం. అందుకే అన్నమయ్య జిగి మించిన శ్రీవేంకటేశుడు అన్నాడు. ఆ జిగి అంతా ఆయన మహత్తుల వల్లే. అనేక ఉదాహరణలతో, ఆయా సందర్భాలలో మహిమలను ఉట్టంకిస్తూ శ్రీనివాసుడే సర్వేశ్వరుడని మనోజ్ఞంగా స్వామి గుణవిభవములను ఆవిష్కరించారు అన్నమాచార్యుల వారు. మోహన రాగంలో కూర్చబడిన ఈ కృతిని గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారు ఆలపించారు.

విశ్వప్రకాశునకు వెలియేడ లోనేడ - తాళ్లపాక అన్నమాచార్యుల వారు

విశ్వప్రకాశునకు వెలియేడ లోనేడ శాశ్వతునకూహింప జన్మమికనేడ

సర్వపరిపూర్ణునకు సంచారమికనేడ నిర్వాణమూర్తికిని నిలయమికనేడ
ఉర్వీధరునకు గాలూదనొకచోటేడ పార్వతీస్తుత్యునకు భావమికనేడ

నానాప్రభావునకు నడుమేడ మొదలేడ ఆననసహస్రునకు నవ్వలివ్వలేడ
మౌనిహృదయస్థునకు మాటేడ పలుకేడ జ్ఞానస్వరూపునకు గాన విన నేడ

పరమయోగీంద్రునకు పరులేడ తానేడ దురితదూరునకు సంస్తుతినిందలేడ
తిరువేంకటేశునకు దివ్యవిగ్రహమేడ హరికి నారాయణునకవుగాములేడ

విశ్వమంతా ప్రకాశించే పరమాత్మకు వెలుపల, లోపల ఎక్కడ? శాశ్వతమైన వానికి జన్మమెక్కడ? అన్నిటా నిండి యున్న వానికి సంచారమెక్కడ? నిర్వాణమైన వానికి నివాసం ఎక్కడ? భూమిని ధరించేవానికి కాలుపెట్టుటకు చోటెక్కడ? పార్వతిచే నుతించబడిన వానికి భావమెక్కడ? అన్నిరకముల తేజస్సులు తానేయైన వానికి మొదలు చివర ఎక్కడ? ఎనలేని శిరసులు కలవానికి ఆవల ఈవల ఎక్కడ?మునుల హృదయాలలో నివసించే వానికి మాటలు, పలుకులెక్కడ? జ్ఞాన స్వరూపమైన వానికి కాంచుట, వినుట ఎక్కడ? యోగిశ్రేష్ఠుడైన వానికి పరులు తనవారు ఎవరు? కష్టాలను తొలగించే వానికి నిందాస్తుతులెక్కడ? తిరుమల వేంకటేశ్వరునికి దివ్యమైన విగ్రహమెక్కడ? హరి, నారాయణుడు అయిన వానికి మంచి చెడులెక్కడ?

పరమాత్మ విశ్వజనీన విశ్వవ్యాప్త నిర్గుణ పరబ్రహ్మ తత్త్వమునకు మంచి-చెడు, జనన మరణాలు, లోపల వెలుపల, నివాసము లేవు, ఆయన భావాతీతుడు, మొదలు చివర లేని వాడు, అటువైపు ఇటువైపు అనే అవధులు లేని వాడు, ఇష్టులు-అయిష్టులు లేని వాడు, నిందాస్తుతులకు అతీతమైన వాడు, రూపారూపములకందని వాడు అని అన్నమాచార్యుల వారు ఎంత భావగర్భితంగా చెప్పారో! హంసనాదం రాగంలో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు చాలా చక్కగా పాడిన ఈ కృతి అన్నమయ్య కృతులలో ఓ ప్రత్యేకమైన స్థానం కలిగినది.

ఎటువంటి మోహమో ఎట్టి తమకమో - తాళ్లపాక అన్నమాచార్యుల వారు

ఎటువంటి మోహమో ఎట్టి తమకమో గాని
తటుకునను దేహమంతయు మరచె చెలియ

పలుకుతేనెల కొసరి పసిడి కిన్నెర మీటి
పలుచనిలుగున నిన్ను పాడి పాడి
కలికి కన్నీరు బంగారు పయ్యెదనొలుక
తలయూచి తనలోనె తలవంచు చెలియ

పడతి నీవును తాను పవళించు పరపుపై
పొడము పరితాపమున పొరలి పొరలి
జడిగొన్న జవ్వాది జారు చెమటల దోగి
ఉడుకునూరుపులనుసురుసురాయె చెలియ

తావి జల్లెడి మోము దమ్మి కడు వికసించె
లోవెలితి నవ్వులను లోగి లోగి
శ్రీ వేంకటేశ! లక్ష్మీకాంత! నినుగలసి
ఈ వైభవములందె యిదివో చెలియ

అన్నమయ్య శృంగార సంకీర్తనలలో ఓ అద్భుతమైన భావం గలది ఈ ఎటువంటి మోహమో అనే సామ రాగంలోని కృతి. తనను తానే మరచియున్న అలమేలుమంగ మరియు శ్రీవేంకటేశ్వరుని శృంగార భావనలను మనోహరంగా ఆవిష్కరించిన కృతి ఇది. సామ రాగంలోని లాలిత్యము, మైమరపు కలిగించే భావన ఈ కృతికి ఎంతో సముచితం. తేనెల వంటి పలుకులతో బంగారు వీణ మీటుతూ మేనిని వయ్యారముగా విరచుచూ స్వామిని స్తుతించుచుండగా ఆనందబాష్పాలు రాలి ఆమె పైటపై జాలువారగా తలయూచుచూ తనలోనే తాను తలవంచుకున్నదట ఆ పద్మావతి. ఆ దంపతుల రతికేళిలోని ఉచ్చ్వాస నిశ్శ్వాసలలో కస్తూరి చెమటలకు కరగి వేడికి ఆవిరైపోయినందట. ఆ స్వామితో ఏకమైన వేళ ఆమె సిగ్గుతో లోలోని నవ్వులు వలన ముఖము కలువవలె వికసించిందట. ఈ వైభవాలన్నీ స్వామితో కూడిన వేళ అని అన్నమయ్య ఈ కృతిలో సుందరంగా వర్ణించారు. సామ రాగంలో కూర్చబడిన ఈ కృతిని గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు గానం చేయగా వినండి.

అదె చూడరె మోహన రూపం - తాళ్లపాక అన్నమాచార్యుల వారు



అదె చూడరె మోహన రూపం
పది కోట్లు గల భావజ రూపం

వెలయగ పదారు వేల మగువలను
అలమిన ఘన మోహన రూపం
వలచిన నంద వ్రజము గొల్లె తల
కులుకు చూపులకు గురియగు రూపం

ఇందిరా వనితనెప్పుడు తన వుర
మందు నిలిపిన మోహన రూపం
కందువ భూసతి కాగిటి సొంపుల
విందులు మరిగిన వేడుక రూపం

త్రిపుర సతుల బోధించి రమించిన
అపురూపపు మోహన రూపం
కపురుల శ్రీవేంకటపతియయి ఇల
నుపమించగ రాని వున్నత రూపం

పదికోట్ల మన్మథుల సమానమైన రూపము గల శ్రీనివాసుని మోహన రూపమును అదిగో చూడండి! కృష్ణావతారంలో పదహారువేల గోపికలను మైమరపింపజేసిన ఘనమైన మోహన రూపము, ప్రేమతో నందవ్రజములోని స్త్రీల కులుకు చూపులకు గురియైన రూపమగు శ్రీనివాసుని మోహన రూపమును అదిగో చూడండి. లక్ష్మీదేవిని తన వక్షస్థలములో ఎల్లపుడూ నిలుపుకున్న మోహనరూపము, నేర్పరితనముతో భూదేవి కౌగిట సొంపులను ఆస్వాదించిన వేడుకైన రూపమగు శ్రీనివాసుని మోహన రూపమును అదిగో చూడండి. త్రిపురాసురుల సంహారంలో బుద్ధావతారమెత్తి సతులకు బోధించి రమించిన అపురూపమైన మోహన రూపము, కాంతులతో ఈ భువిపై పోల్చలేని ఉన్నతమైన రూపమగు శ్రీనివాసుని మోహన రూపమును అదిగో చూడండి.

మోహన రాగంలో కూర్చబడిన ఈ కృతిని ఆలపించిన వారు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు. 

నమో నారాయణాయ నమో - తాళ్లపాక అన్నమాచార్యుల వారు

నమో నారాయణాయ నమో!నమో నారాయణాయ నమో!

నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వ పారాయణాయ శోభన మూర్తయే

నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ
సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో

కరిరాజ వరదాయ కౌస్తుభాభరణాయ మురవైరినే జగన్మోహనాయ
తరుణీందు కోటీర తరుణీ మనస్తోత్ర పరితోష చిత్తాయ పరమాయ తే నమో

పాత్రదానోత్సవ ప్రథిత వేంకటరాయ ధాత్రీశ కామితార్ధ ప్రదాయ
గోత్రభిన్మణి రుచిర గాత్రాయ రవిచంద్ర నేత్రాయ శేషాద్రి నిలయాయ తే నమో

సగుణ పరబ్రహ్మ స్వరూపుడు, అన్నిటాయున్న వాడు, సుందరమైన రూపము గల నారాయణునికి నమస్సులు. శాశ్వతమైనవాడు, జ్ఞానులచే నుతించబడిన వాడు, లోకేశ్వరుడు, ముని సమూహముల విశ్వాసము కలవాడు, సత్యమైన వాడు, ప్రత్యక్షమైన వాడు, సజ్జనుల సాంగత్యములో నుండే వాడు, జగత్తును రక్షించే నారాయణునికి నమస్సులు. గజేంద్రుని కాపాడిన వాడు, కౌస్తుభమును ధరించిన వాడు, మురారియైన వాడు, జగన్మోహనాకారుడు, సముద్రుని కుమర్తె అయిన లక్ష్మీదేవితో ప్రకాశించే వాడు, గోపకాంతల మనస్సులలో తలచబడే వాడు, ఎల్లప్పుడూ ఆనందమయమైన మనస్సు కలవాడు, పరమపురుషుడు అయిన నారాయణునికి నమస్సులు. పాత్రులను అనుగ్రహించేవానిగా ప్రసిద్ధి చెందిన వాడు, వేంకటేశ్వరుడు, ధరణీపతి, కామ్యములను తీర్చేవాడు, ఇంద్రనీలమణి కాంతితో అందమైన దేహము కలవాడు, సూర్య చంద్రులు నేత్రములుగా కలవాడు శేషాద్రి శిఖరముపై నివసించే నారాయణునికి నమస్సులు.

అన్నమాచార్యుల వారు సంస్కృతంలో రచించిన కొన్ని కృతులలో ఇది ఒకటి. శ్రీరాగంలో కూర్చబడిన ఈ కృతిని గానం చేసిన వారు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు, వారి కుమారులు అనిల కుమార్ గారు.

అదె చూడరయ్య పెద్ద హనుమంతుని - - తాళ్లపాక అన్నమాచార్యుల వారు

అదె చూడరయ్య పెద్ద హనుమంతుని
గుదిగొని దేవతలు కొనియాడేరయ్య

ఉదయాస్త శైలములు ఒక జంఘగా చాచె
అదివో ధ్రువమండలమందే శిరసు
చదివె సూర్యుని వెంట సారె మొగము ద్రిప్పుచు
ఎదట ఈతని మహిమ ఏమని చెప్పేమయ్య

దండిగా బ్రహ్మాండము దాక తోకమీదికెత్తి
మెండగు దిక్కుల నిండా మేను పెంచెను
గుండుగూడ రాకాసుల గొట్టగ చేతులు చాచె
అండ ఈతని ప్రతాపమరుదరుదయ్యా

దిక్కుల పిక్కటిల్లగ దేహ రోమములు పెంచె
ప్రక్కన లోకములకు ప్రాణమై నిల్చె
ఇక్కడ శ్రీ వేంకటేశు హితవరి బంటాయె
మిక్కిలి ఈతని లావు మేలుమేలయ్య

అత్యంత విశ్వాసంతో దేవతలు కొనియాడే పెద్ద హనుమంతుని అదిగో చూడండయ్యా! తూర్పు పడమర పర్వత శిఖరాలు తాకేలా ఒక కాలు చాచి, ధ్రువమండలములో శిరసు ఉండే అంతగా ఎదిగి, సూర్యుని వద్ద విద్యలభ్యసించి చక్కగా మోము త్రిప్పుచు ఎదుట ఉన్న ఈ హనుమంతుని మహిమ ఏమని చెప్పేము? బ్రహ్మాండము వరకు ఎదిగి తోకను చాచి, దిక్కుల నిండూగా తన శరీరాన్ని పెంచి, రాక్షస సమూహాన్ని కొట్టేందుకు చేతులు చాచి మనకు అండగా ఉన్నా ఈ హనుమంతుని ప్రతాపము ఎంతో అరుదయ్యా! దిక్కులు పిక్కటిల్లేలా దేహరోమములు పెంచి, ప్రక్కనే తోడుగా ఉంటూ సమస్త లోకములకు ప్రాణమై నిలిచి, ఇక్కడ తిరుమలలో శ్రీవేంకటేశ్వరుని హితునిగా బంటుగా నిలిచిన ఇతని బలము ఎంతో మేలయ్యా! అతనిని చూడండి.

బౌళి రాగంలోని ఈ సంకీర్తనను గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించారు.

(చిత్రం బెంగళూరు మహాలక్ష్మీ లేఔట్‌లో వెలసిన ప్రసన్న వీరాంజనేయస్వామి)

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవిత విశేషాలు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆధునిక భారతదేశంలో ఆధ్యాత్మిక సందేశాన్ని విద్య, వైద్యం, తాగునీరు, సేవా కార్యక్రమాలతో ముడిపెట్టిన మహనీయులు. ఆయన 1926...