2, సెప్టెంబర్ 2020, బుధవారం

నిమిషమైన శ్రీరామ యనరాద - మైసూరు వాసుదేవాచార్యుల వారు


 

నిమిషమైన శ్రీరామ యనరాద నిత్యము గాదీ మానవ జన్మము

అమిత మహిమ గలవాడని రాముని ఆ మహాదేవుడే సన్నుతించుచుండగ

హరిహర మంత్రమునకు జీవ వర్ణాత్మకుడు సురరిపు రావణుని నిగ్రహించినవాడు
పరమ భక్తులనెల్ల పాలించువాడు పరమ పురుషుడతడే వాసుదేవుడని తెలిసి

ఓ మనసా! ఈ మానవ జన్మ శాశ్వతము కాదు కదా, ఒక్క నిమిషమైన శ్రీరామ యని పలుకరాదా? అమితమైన మహిమ గలవాడని ఆ పరమశివుడే రాముని సన్నుతించుచున్నాడు, ఒక్క నిమిషమైనా ఆ రామ నామము పలుకరాదా? హరిహరుల మంత్రములలోని జీవమైన రా, మ అక్షరములకు రూపమైన వాడు, దేవతలకు శత్రువైన రావణుని అణచిన వాడు, పరమ భక్తులనందరినీ బ్రోచేవాడు, పరమపురుషుడు, అతడే వాసుదేవుడని తెలిసి ఒక్క నిమిషమైన శ్రీరామ యని పలుకరాదా?

సామ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మణి కృష్ణస్వామి గారు ఆలపించారు

భజరే రే మానస శ్రీ రఘువీరం - మైసూరు వాసుదేవాచార్యులవారు


 

భజరే రే మానస శ్రీ రఘువీరం భుక్తి ముక్తి ప్రదం వాసుదేవం

వృజిన విదూరం విశ్వాధారం సుజన మందారం సుందరాకారం

రావణ మర్దనం రక్షిత భువనం రవి శశి నయనం రవిజాతి మదనం
రవిజాది వానర పరివృతం నరవరం రత్న హార పరిశోభిత కంధరం
రవి శశి కుజ బుధ గురు శుక్ర శనీశ్వర రాహుకేతు నేతారం
రాజ కుమారం రామం పవనజాప్త అవనిజా మనోహరం

ఓ మనసా! రఘువీరుడు, భుక్తిని, ముక్తిని ప్రసాదించేవాడు, వాసుదేవుడు అయిన శ్రీరాముని భజింపుము. పాపములను నాశనము చేసేవాడు, విశ్వానికి ఆధారమైన వాడు, సుజనుల పాలిట కల్పవృక్షమైన వాడు, సుందరమైన రూపము కల శ్రీరాముని భజింపుము. రావణుని సంహరించి ముల్లోకాలను రక్షించిన వాడు, సూర్యచంద్రులు నేత్రములుగా కలవాడు, సూర్యవంశమునకు ఆనందం కలిగించిన వాడు, సుగ్రీవాది వానరుల సమూహము పరివారంగా కలవాడు, పురుషశ్రేష్ఠుడు, రత్న హారములతో ప్రకాశించే కంఠము కలవాడు, నవగ్రహములను నియంత్రించేవాడు, దశరథరాజ కుమారుడు, ఆంజనేయునికి ఆప్తుడు, సీతాదేవి మనోహరుడు అయిన రాముని భజింపుము.

ఆభేరి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని సుధా రఘునాథన్ గారు ఆలపించారు

1, సెప్టెంబర్ 2020, మంగళవారం

పంచభూతలింగ కృతి - ఆనంద నటన ప్రకాశం - ముత్తుస్వామి దీక్షితుల వారు



ఆనంద నటన ప్రకాశం చిత్సభేశం ఆశ్రయామి శివకామవల్లీశం

భాను కోటి సంకాశం భుక్తి ముక్తి ప్రద దహరాకాశం
దీనజన సంరక్షణ చణం దివ్య పతంజలి వ్యాఘ్రపాద దర్శిత కుంచితాబ్జ చరణం

శీతాంశు గంగాధరం నీలకంధరం శ్రీ కేదారాది క్షేత్రాధారం
భూతేశం శార్దూల చర్మాంబరం చిదంబరం భూసుర త్రిసహస్ర మునీశ్వరం విశ్వేశ్వరం (నవ)
(నవ)నీత హృదయం సదయ గురుగుహతాతమాద్యం వేద వేద్యం
వీత రాగిణం అప్రమేయాద్వైత ప్రతిపాద్యం సంగీత వాద్య వినోద తాండవ జాత బహుతర భేద చోద్యం

ఆనంద తాండవములో ప్రకాశించే, చిత్సభకు ఈశుడైన, శివకామసుందరి పతియైన చిదంబర నటరాజస్వామిని నేను ఆశ్రయించుచున్నాను. కోటి సూర్యులకు సమానమైన ప్రకాశము గల, భుక్తి, ముక్తి ప్రసాదించే, హృదయ కమలంలో ఉన్న చిదాకాశుడైన, నిరంతరం దీనజనులను రక్షించే, పతంజలి, వ్యాఘ్రపాదాది యోగులచే దర్శించబడిన ఎత్తిన పదకమలము గల చిదంబర నటరాజస్వామిని నేను ఆశ్రయించుచున్నాను. చంద్రుడు మరియు గంగను శిరసున ధరించిన, నీలకంఠుడు, కేదారనాథ్ మొదలైన క్షేత్రాలలో దైవమైన, సమస్త భూతములకు ఈశ్వరుడైన, పులి చర్మమును ధరించిన, చిదంబరుడైన, బ్రాహ్మణులు మరియు మూడు వేల మునులచే పూజించబడిన, సమస్త విశ్వమునకు ఈశ్వరుడైన, వెన్నవంటి హృదయము కలిగిన, సుబ్రహ్మణ్యుని తండ్రియైన, ఆదియోగియైన, వేదవేదాంతములలో నుతించబడిన, రాగద్వేషములకు అతీతమైన, అగోచరుడైన, అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించిన, సంగీత వాద్యము, తాండవములో అనేక విభిన్న అద్భుత లీలల ద్వారా సృష్టి పరిణామమును విశదీకరించే చిదంబర నటరాజేశ్వరుని నేను ఆశ్రయించుచున్నాను.

దీక్షితుల వారి క్షేత్ర కృతులలో, పంచలింగ స్థల కృతులు ప్రత్యేకమైనవి. నిన్న తేజోలింగ రూపమైన అరుణాచలేశ్వరునిపై రచించిన కృతి వివరాలు తెలుసుకున్నాము. ఆనందనటన ప్రకాశం అనే కృతి చిదంబరంలో ఆకాశలింగ రూపమైన నటరాజస్వామిని దీక్షితుల వారు అద్భుతంగా కొనియాడారు. చిదంబరం దేవాలయంలోని చిత్సభలో నటరాజుడు శివకామసుందరీ దేవిల వైభవం కళ్లారా చూడవలసినదే. అద్భుతమైన శైవక్షేత్రం చిదంబరం. తమిళనాడులో చెన్నైకి దక్షిణాన 231 కిలోమీటర్ల దూరంలో కడలూరు జిల్లాలో చిదంబరం ఉంది. సనాతనమైన ఈ దేవాలయాన్ని చోళులు, పాండ్యులు, చేరులు, విజయనగర రాజులు పోషించారు. ఇప్పుడున్న కట్టడం 12వ శతాబ్దం నాటిది. 40 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో అనేకదేవతా సమూహమై యున్న ఈ దేవాలయం పంచభూత స్థలములలో ఆకాశాన్ని సూచించేది. శివరాత్రికి జరిగే నాట్యాంజలి ఉత్సవాలకు ఈ దేవస్థానం పేరొందింది. నాలుగు వైపుల నాలుగు గోపురముల ద్వారా ఈ దేవస్థానంలోకి ప్రవేశించ వచ్చు. ఐదు సభలకు ఈ క్షేత్రం ప్రసిద్ధి - చిత్సభ (గర్భగుడి), కనకసభ (నిత్యసేవలు జరిగే మంటపము), నాట్యసభ, వేయి స్థంభములతో సహస్రార చక్రాన్ని సూచించే రాజసభ, దేవసభ (గణేశుడు, సోమస్కందుడు, శివానందనాయకి, చండికేశ్వరులకు నిలయమైన సభ). 14వ శతాబ్దంలో హిందూ ద్వేషి అయిన ఇస్లాం రాజు మాలిక్ కఫూర్ దాడులలో ఈ గుడిని కూడా ధ్వంసం చేయగా తరువాత దానిని పునరుద్ధరించారు. దీక్షితుల వారు తమ శైలికి అనుగుణంగానే ఈ కృతిని కేదార రాగంలో స్వరపరచి ఆ రాగ నామాన్ని కృతిలో సముచితంగా ప్రస్తావించారు. దీక్షితుల వారు ఈ క్షేత్రంలో శివకామేశ్వరీ అమ్మను ఉపాసన చేశారని ఆయన చరిత్ర తెలుపుతుంది. మీరు దీక్షితుల వారి చరిత్రను నిశితంగా పరిశీలిస్తే ఆయన జీవితమంతా అనేక క్షేత్రాలను సందర్శించి అక్కడి దేవతను ఉపాసన చేసి అనన్యమైన ఆధ్యాత్మిక సంప్దను మూటగట్టుకున్న విషయం అర్థమవుతుంది. ఆనంద తాండవంలో ప్రకాశించే ఆ నటరాజుని వైభవం తనివితీర అనేకమార్లు ఆయన అనుభూతి చెందారు. ఆయన ఉపయోగించిన పద సంపుటిని గమనించండి - దహరాకాశం, వీతరాగిణం, అప్రమేయం, అద్వైత ప్రతిపాద్యం, సంగీత వాద్య వినోద తాండవ జాత బహుతర భేద చోద్యం. లయకారకుడైన శివుడు ఆనంద తాండవ హేలలో ఏ విధముగా సంగీత వాద్య నృత్యములను ఆనందిస్తూ ఈ సృష్టి క్రమమును ముందుకు సాగిస్తున్నాడో అద్భుతంగా పలికారు. దీక్షితుల వారి కృతులలో మరో ప్రత్యేకత ఆయా దేవతా స్వరూపాన్ని వర్ణిస్తూ మహిమలను, వైభవాన్ని తెలియజేయటం. ఈ రెంటిని అద్భుతమైన సమన్వయంతో ప్రతిపాదించటం ఆయన ఘనత. ఈ కృతిలో కూడా ఆయన అదే శైలిని కనబరచారు. శివతత్వాన్ని, రూపాన్ని, మహిమలను క్షేత్ర వర్ణన చేసే కృతిలో మనోజ్ఞమైన పద ప్రయోగముగా మలచి మనకు శాశ్వత ఆధ్యాత్మిక వారసత్వ సంపదగా అందజేశారు. అందుకే, ఆయన సాహిత్యం వెలకట్టలేనిది, మహత్కరమైనది. ఈ కృతి భరతనాట్య ప్రదర్శనలలో చాలా అందంగా కళాకారులు ఆవిష్కరించే సాహిత్యం కలది. తదనుగుణంగా గాయకులు నృత్యరీతికి సంబంధించిన స్వరాలను ఈ కృతితో ఆలపిస్తారు. కేదార రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బాంబే జయశ్రీ గారు ఆలపించారు

30, ఆగస్టు 2020, ఆదివారం

సారసముఖి సకల భాగ్యదే - ముత్తయ్య భాగవతార్ కృతి

సారసముఖి సకల భాగ్యదే! శ్రీ చాముండేశ్వరి!

మారజనక సోదరి! మహిషాసుర మర్దిని!

హసిత వదనే! ఆర్ద్ర హృదయే! హరికేశ నిరతే సదయే!
రసికజన సమ్మోద రుచిరే! రాజేశ్వరి రక్షిసౌ!

కలువ వంటి ముఖము కలిగిన ఓ చాముండేశ్వరి! మాకు సమస్త భాగ్యములను ప్రసాదించుము! మన్మథుని తండ్రియైన శ్రీహరి సోదరీ! మహిషాసురుని సంహరించిన తల్లీ! మాకు సమస్త భాగ్యములను ప్రసాదించుము! చిరునవ్వు మోము, కరుణా హృదయము కలిగి, హరికేశుడైన పరమశివుని అర్థాంగివై దయ చూపే అమ్మవు! రసికుల హృదయాలకు ఆనందము కలిగించే రాజరాజేశ్వరివి. మమ్ములను రక్షింపుము.

ఇది క్షేత్ర కృతి. మైసూరు చాముండేశ్వరిని నుతిస్తూ వాగ్గేయకారులు ముత్తయ్య భాగవతార్ గారు రచించి గౌడ మల్హర్ రాగంలో స్వరపరచారు.

మైసూరు చాముండేశ్వరి వివరాలు:

క్రౌంచపురిగా పేరుగాంచిన మైసూరు ప్రాంతంలో చాముండి పర్వతశ్రేణిపై వెలసిన దుర్గ చాముండేశ్వరి. మహిషాసురుని ఈ కొండపై సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. 12వ శతాబ్దంలో హోయసళ రాజులు ఈ దేవాలయాన్ని నిర్మించగా తరువాత శతాబ్దంలో విజయనగర రాజులు దీనికి గోపురాన్ని కట్టించారు. 3000 అడుగుల ఎత్తున ఉన్న ఈ కొండపైకి 17వ శతాబ్దంలో వడయారు రాజులు మెట్ల మార్గాన్ని నిర్మించారు. 800వ మెట్టు వద్ద 16 అడుగుల ఎత్తైన నల్లరాతి నంది ఈ క్షేత్రానికి ఆకర్షణ. ఈ విగ్రహాన్ని మైసూరు మహారాజా దొడ్డదేవరాజ వడయార్ బహుకరించారు. అష్టాదశ శక్తిపీఠాలలో క్రౌంచ పీఠంగా పేరుగాంచిన ఈ క్షేత్రంలోని అమ్మవారిని మైసూరు వడయార్ పాలకులు కొలిచారు. ఇక్కడ దేవతామూర్తులు చాముండేశ్వరి, మహాబలేశ్వరుడు. ఈ చాముండి క్షేత్రాన్ని మహాబలాద్రిగా కూడా చరిత్రలో చెప్పబడింది. చతురస్రాకారంలో ద్రావిడ శైలిలో నిర్మించినబడిన ఈ దేవాలయంలో నవరంగ మంటపం, అంతరాళ మంటపం, గర్భగుడి ఉన్నాయి. అద్భుతమైన శిల్ప సంపదతో ఏడంచెల గోపురం ఈ గుడి ప్రత్యేకత. గణపతి, భైరవుడు మొదలైన దేవతామూర్తులు కూడా ఈ దేవాలయంలో ఉన్నాయి. గర్భగుడిలొ అష్టభుజములు కలిగిన మహిషాసుర మర్దిని రూపములో చాముండేశ్వరి అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ వడయార్ రాజుల విగ్రహాలు, అమ్మ వారి సింహవాహనం కూడా చూడవచ్చు. శరన్నవరాత్రులలో వేద పఠనంతో పాటు అమ్మకు వైభవంగా పూజలు చేస్తారు. ఆశ్వయుజ పౌర్ణమి నాడు అమ్మకు రథోత్సవం, తెప్పోత్సవం కన్నుల పండువగా జరుగుతాయి.

సారసముఖి సకల భాగ్యదేహి అనే కృతిని రంజని గాయత్రి సోదరీమణులు పాడారు.

వల్లీనాయక నీవే గతియని - ముత్తయ్య భాగవతార్ కృతి

వల్లీనాయక నీవే గతియని మనసారగ నమ్మినాను బ్రోవుము

తల్లి తండ్రి గురు దైవము నీవని తలచి నిన్ను సంతతము మ్రొక్కితి

సారమైన నీ మహిమలను పొగడు వారి కార్యము వహియింతువని నీ
చరణాబ్జంబుల చక్కగ బట్టితి షణ్ముఖ హరికేశపుర నివాస

ఓ వల్లీనాయకా! నీవే నాకు గతియని మనసారా నమ్మినాను నన్ను రక్షింపుము. నీవే తల్లి తండ్రి గురువు దైవమని తలచి నీకు నిత్యము మ్రొక్కినాను నన్ను రక్షింపుము. ఓ షణ్ముఖా! హరికేశపుర నివాసా!శ్రేష్ఠమైన నీ మహిమలను పొగడే వారి కార్యములను నిర్వర్తించెదవని నీ చరణ కమలములను చక్కగా శరణంటిని నన్ను రక్షింపుము.

షణ్ముఖప్రియ రాగంలో కూర్చబడిన కృతిని మల్లాది సోదరులు ఆలపించారు.

హిమగిరి తనయేహేమలతే - ముత్తయ్య భాగవతార్ కృతి


హిమగిరి తనయే! హేమలతే! అంబ! ఈశ్వరి! శ్రిలలితే! మామవ

రమా వాణి సంసేవిత సకలే! రాజరాజేశ్వరి! రామ సహోదరి!

పాశాంకుశేక్షుదండకరే! అంబ! పరాత్పరే! నిజ భక్త పరే!
ఆశాంబర హరికేశ విలాసే! ఆనంద రూపే! అమిత ప్రతాపే!

బంగారు తీగవలె ఉన్న ఓ పర్వతరాజ పుత్రీ! అంబా! ఈశ్వరీ! శ్రీలలితా! నన్ను రక్షింపుము. లక్ష్మీ సరస్వతులచే పూజించబడిన పరదేవతవు! రాజరాజేశ్వరివి! నారాయణుని సోదరివి! నన్ను రక్షింపుము. పాశము, అంకుశము,చెఱకు గడ ధరించిన అంబా! శ్రేష్ఠమైన వానిలో శ్రేష్ఠురాలవు! నిజ భక్తులకు ఆనందము కలిగించే దానవు! దిక్కులే అంబరములుగా గల పరమశివుని పత్నివి! సచ్చిదానంద స్వరూపవు! అమిత పరాక్రమవంతురాలవు! నన్ను రక్షింపుము.

శుద్ధ ధన్యాసి రాగంలో కూర్చబడిన ఈ కృతిని మాంబళం సోదరీమణులు ఆలపించారు.

శరవణ భవ! సమయమిదిరా - ముత్తయ్య భాగవతార్ కృతి


 

శరవణ భవ! సమయమిదిరా! సరగున నన్ను బ్రోవరా!

పరమ పురుష! పశుపతి ప్రియ! సుర సేవిత! సుకుమారా!

చిరునాడ నీ చింతన తోడను మరి మరి నీ మహిమ బల్కు నాదు
తరము దీర్ప తరుణమిదిరా హరికేశపుర ఆది నాయక!

రెల్లుగడ్డిలో జన్మించిన ఓ కుమారా! నన్ను బ్రోచుటకిది సమయము. శివునకు ప్రియకుమారుడవైన,దేవతలచే సేవించబడిన, సుకుమారుడవైన ఓ పరమ పురుషా! నన్ను బ్రోవుము. ఓ హరికేశపురమునకు అధినాయకుడవైన కుమారా! చిన్ననాటి నుండి నిన్నే స్మరించుచున్న వాడను. మరల మరల నీ మహిమలనే పలుకుచున్నాను. నన్ను ఈ సాగరాన్ని దాటించుకుటకు ఇది సమయము. వచ్చి బ్రోవుము.

కర్ణాటక సంగీత త్రయమైన త్యాగయ్య, దీక్షితులు, శ్యామశాస్త్రి తరువాత వాగ్గేయకారునిగా పేరొందిన వారిలో ముత్తయ్య భాగవతార్ గారు అగ్రగణ్యులు. 1877వ సంవత్సరంలో తమిళనాడులోని తిరునల్వేలిలో జన్మించిన వీరు పట్నం సుబ్రహ్మణ్య అయ్యరు గారి ప్రభావంతో సంగీత సాధనలో ముందుకు వెళ్లారు. సంస్కృతము, తెలుగు, తమిళము, కన్నడ భాషలలో ప్రావీణ్యులు వీరు. మదురై, మైసూరు, ట్రావెన్‌కోర్‌లలో జీవించిన వీరు సంగీతంలో అసమాన ప్రతిభ కలవారు. 1927 ప్రాంతంలో మైసూరు మహారాజ జయచామరాజ వడయార్ వారి ఆస్థానంలో విద్వాంసునిగా ఎంతో పేరొందారు. 1938లో ట్రావెన్‌కోర్ వెళ్లి స్వాతి తిరునాళ్ సంగీత అకాడెమీకి తొలి ప్రధాన అధ్యాపకునిగా పని చేశారు. మహారాజా స్వాతి తిరునాళ్ వారి కీర్తనలను స్వరపరచి ప్రచారంలోకి తీసుకు వచ్చారు. ఎన్నో కీర్తనలను రచించి 1945లో పరమపదించారు. వీరి ముద్ర ఇంటి పేరైన హరికేశనల్లూరులోని "హరికేశ". వీరి రచనలలో హిమగిరి తనయే హేమలతే, సుధామయి సుధానిధి, అంబ వాణి నన్నాదరించవే, గం గణపతే మొదలైనవి. వీరు కూడా ముత్తుస్వామి దీక్షితుల వారివలెనే సుబ్రహ్మణ్య స్వామిని ఉపాసన చేసిన వారు.

పశుపతిప్రియ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని రంజని-గాయత్రి సోదరీమణులు గానం చేశారు.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవిత విశేషాలు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆధునిక భారతదేశంలో ఆధ్యాత్మిక సందేశాన్ని విద్య, వైద్యం, తాగునీరు, సేవా కార్యక్రమాలతో ముడిపెట్టిన మహనీయులు. ఆయన 1926...