29, ఆగస్టు 2020, శనివారం

రావే హిమగిరి కుమారి - శ్యామశాస్త్రి వారి స్వరజతి



రావే హిమగిరి కుమారి కంచి కామాక్షి వరదా
మనవి వినవమ్మ శుభమిమ్మ మాయమ్మ

నతజన పరిపాలినివనుచు నమ్మితిని సదా బ్రోవ
మదమత్త మహిష దానవ మర్దని వెతదీర్చవె దురముగను

కామపాలిని నీవే గతియని కోరితి కొనియాడితి వేడితి
కామితార్ధ ఫలదాయకియనేటి బిరుదీ మహిలో నీకే తగు

కమలముఖి దరగళ ఘన నీల కచభార మృగ విలోచన మణిరదనా
గజగమనా మదిలో నిను సదా తలుచుకొని నీ ధ్యానమే తల్లి
శ్యామకృష్ణ వినుత నా చింతను వేవేగ దీర్చభయమీయవే కళ్యాణి కంచి కామాక్షి నీ పాదమే దిక్కు

హిమవంతుని పుత్రికయైన, వరములనొసగే కంచి కామాక్షీ! రావే మాయమ్మా! నా మనవిని విని శుభములొసగుము. నుతించినవారిని పాలించే తల్లివని నిన్ను నమ్మినాను, నన్ను ఎల్లప్పుడూ బ్రోచుటకు రమ్ము. మదోన్మత్తుడైన మహిషాసురుని సంహరించిన తల్లివి, నా వెతలను వేగమే తీర్చుము. మన్మథుని కాపాడిన తల్లివి, నీవే నాకు గతియని కోరి నిన్ను నుతించినాను, వేడుకున్నాను. కామ్యములనొసగే తల్లివన్న బిరుదు ఈ భువిపై నీకే తగును.ఓ కంచి కామాక్షీ అమ్మా! కమలము వంటి ముఖము, సన్నని కంఠము, ఒత్తైన నల్లని కురులు, జింక వంటి కన్నులు, మణులవలె ప్రకాశించే పలువరుస కలిగి, ఏనుగువలె అందముగా నడిచే నిన్ను నేను మనసులో ఎల్లప్పుడూ తలచుకుంటూ ధ్యానము చేస్తున్నాను. శ్యామకృష్ణునిచే నుతించబడిన తల్లీ! నా చింతలను వేగముగా దీర్చగా అభయములీయుము, సమస్త శుభములు కలిగించే తల్లీ, నీ పాదములే నాకు దిక్కు.

తోడి రాగంలోని ఈ స్వరజతిని ఆలపించినవారు బాంబే జయశ్రీ గారు. 

తల్లీ నిన్ను నెర నమ్మినాను - శ్యామశాస్త్రి


తల్లీ నిన్ను నెర నమ్మినాను వినవే

ఎల్ల లోకములకాధారమైయున్న నా

ఆదిశక్తి! నీవు పరాకు సేయక ఆదరించుటకిది మంచి సమయము
గద! సరోజభవాచ్యుత శంభు నుత పద! నీదు దాసానుదాసుడ నే!

శ్యామకృష్ణ పరిపాలిని! శూలినీ! కామితార్ధ ప్రద! కంజ లోచనీ!
కామారి రాణీ! పురాణీ! పరాశక్తి! కామకోటి పీఠ వాసినీ!

అమ్మా! కంచికామకోటి పీఠములో నివసిస్తున్న కామాక్షీ! నిన్నే నిండుగా నమ్మియున్నాను, వినుము. సమస్త లోకములకు ఆధారమైన నా తల్లీ, నిన్నే నమ్మియున్నాను. ఆదిశక్తీ! నిర్లక్ష్యము చేయక నన్ను ఆదరించుటకు ఇది మంచి సమయము కదా! బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే నుతించబడిన పదముల కల అమ్మా! నేను నీ దాసానుదాసుడను. నిన్నే నిండుగా నమ్మియున్నాను, వినుము. శ్యామకృష్ణుని పాలించే, శూలము ధరించే తల్లీ! కామ్యములను తీర్చే కలువల వంటి కన్నులు గల తల్లీ! మన్మథుని శత్రువైన శివుని రాణివి! పురాణములలో చెప్పబడిన పరాశక్తివి! నిన్నే నిండుగా నమ్మియున్నాను, వినుము.

కల్యాణి రాగంలోని ఈ కృతిని బాంబే జయశ్రీ గారు అలపించారు.

కనకశైల విహారిణి - శ్యామశాస్త్రి


కనకశైల విహారిణి!శ్రీ కామకోటిబాలే! సుశీలే!

వనజభవ హరి నుతే! దేవి! హిమగిరిజే! లలితే! సతతం
వినతం మాం పరిపాలయ! శంకర వనితే! సతి! మహాత్రిపురసుందరి!

కంబుకంఠి! కంజ సదృశ వదనే! కరిరాజ గమనే! మణి సదనే!
శంబర విదారి తోషిణి! శివ శంకరి! సదా మధుర భాషిణి!

చండ ముండ ఖండన పండితే! ఇక్షుదండ కోదండ మండిత పాణీ!
పుండరీకనయనార్చిత పాదే! త్రిపుర వాసినీ! శివే! హర విలాసినీ!

శ్యామలాంబికే! భవాబ్ధి తరణే! శ్యామకృష్ణ పరిపాలిని! జననీ!
కామితార్థ ఫల దాయికే! కామాక్షీ! సకల లోక సాక్షి!

బంగారు మేరు పర్వతముపై విహరించే ఓ కామకోటి బాలా! నీవు సుగుణవతివి. బ్రహ్మ విష్ణువులచే నుతించబడే దేవీ! హిమవంతుని పుత్రీ! నీవు లలితవు! శంకరుని అర్థాంగివి! సతీదేవివి! నీవే మహాత్రిపురసుందరివి! ఎల్లప్పుడూ నిన్ను నుతించే నన్ను కాపాడుము. శంఖము వంటి కంఠము, తామరవంటి ముఖము, గజగమనము కలిగినదానవు! మణిపీఠముపై నివసించెదవు! శంబరుని సంహరించిన శివునికి ఆనందము కలిగించేదానవు! శివశంకరివి! ఎల్లప్పుడూ మధురమైన వచనములు పలికే తల్లివి. చండముండాసురులను సంహరించుటలో నిపుణురాలవు! చెరకు గడతో ప్రకాశించే హస్తము కలదానవు! తెల్లనితామరవంటి కన్నులు కలిగిన విష్ణువుచే అర్చించిన పదములు కలదానవు! త్రిపురవాసినివి! శివానివి! పరమశివునికి ఆనందము కలిగించెదవు. ఓ శ్యామలాంబికా! నీవు ఈ శ్యామకృష్ణుని భవసాగరమును దాటించి రక్షించే జననివి! కామ్యములను తీర్చి ఫలములొసగే కామాక్షివి! సమస్త లోకములకు సాక్షివి నీవు.

పున్నాగవరాళి రాగంలోని ఈ కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు.

నీలాయతాక్షి- శ్యామశాస్త్రి


 

నీలాయతాక్షి! నీవే జగత్సాక్షి!

ఫాలాక్షుని రాణి! పాలిత శ్రిత శ్రేణి!

దీనరక్షకి! అభయదానమీయవే! సామ
గానలోలే! అభిమానమీయవే! దేవీ!

ఆదిశక్తి! కౌమారి! మేదినిలో నిను పొగడ
ఆదిశేషునికైన రాదికనేమిజెప్పుదు! దేవీ!

కామపాలిని విను! నీ నామములే ధర్మార్థ
కామ మోక్షమిచ్చేది! శ్యామకృష్ణ పాలిని! దేవీ!

నల్లని కలువల వంటి కన్నులు గల పార్వతీదేవీ! ఈ జగత్తుకు నీవే సాక్షివి. మూడవ కన్ను కలిగిన పరమశివుని రాణీ! ఆశ్రిత సమూహాన్ని పాలించే తల్లివి నీవు. దీనజన రక్షకివి! నాకు అభయమునొసగుము! సామగానములో లీనమై యుండే దేవీ! నాపై నీ వాత్సల్యము చూపుము. ఓ ఆదిపరాశక్తీ! కౌమారీ! ఈ భువిపై నిన్ను పొగడ ఆదిశేషుని కూడా తరము కాదు, ఇంక నీ మహిమలను నేనేమి జెప్పెదను? మన్మథుని రక్షించిన దేవీ! నా మాటలు ఆలకింపుము! నీ నామములు చతుర్విధ ఫలములిచ్చేవి! శ్యామకృష్ణుని పాలించిన దేవీ! నాకు అభయమొసగుము.

ఈ కృతిని పరజు రాగంలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు

బ్రోవవమ్మా! బంగారు బొమ్మా - శ్యామశాస్త్రి



బ్రోవవమ్మా! బంగారు బొమ్మా! మాయమ్మా!

బ్రోవవమ్మా! నాతో మాట్లాడవమ్మా!
సార్వభౌమ బొమ్మా! కామాక్షమ్మా!

శ్యామకృష్ణ పూజిత! సులలిత! శ్యామలాంబ! ఏకామ్రేశ్వర ప్రియ!
తామసము సేయకనే మాయమ్మా! నా పరితాపములను పరిహరించి

అమ్మా బంగారు కామాక్షీ! నన్ను బ్రోవుము తల్లీ! సమస్త లోకాలకు సామ్రాజ్ఞివైన కామాక్షమ్మా! నాతో మాట్లాడుము. శ్యామకృష్ణునిచే పూజించబడిన అమ్మా! నీవు మనోజ్ఞవు! శ్యామలాంబవు! ఏకామ్రేశ్వరునికి ప్రియమైన కామాక్షివి! ఆలస్యము చేయక నా కష్టములను తొలగించి బ్రోవుము తల్లీ!

నీలాంబరి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఆలపించిన వారు సింధూజ భక్తవత్సలం గారు. 

27, ఆగస్టు 2020, గురువారం

వినాయకా నిను వినా బ్రోచుటకు వేరెవరురా - గోపాలదాసు



వినాయకా నిను వినా బ్రోచుటకు వేరెవరురా విఘ్నరాజా

అనాథ రక్షక నీవే కాదా ఆదరించి నను బ్రోవగ రాదా

సరసీరుహారుణాయుగ చరణ సతతం శ్రితజన సంకట హరణ
పరమకృపాసాగర వర సుగుణ పాలితజన గోపాలదాస నుత

విఘ్నములకు అధిపతివైన ఓ వినాయకా! నన్ను రక్షించుటకు నీవు తప్ప వేరెవరు? అనాథులను రక్షించేది నీవే కదా! నన్ను ఆదరించి బ్రోచుటకు రారాదా! ఎర్రని కలువల వంటి పాదములు కలిగి, నిరంతరము ఆశ్రితులైన వారి సంకటములను తొలగించే వాడవు, అపార కరుణాసముద్రుడవు, ఎన్నో సుగుణములు కలిగి జనులను పాలించేవాడవు, గోపాలదాసునిచే నుతించబడిన వాడవు, నన్ను రక్షించుటకు నీవు తప్ప వేరెవరు? 

గోపాలదాసు (ఈవీ రామకృష్ణ భాగవతార్) 

ఈ కృతిని ఎం.ఎల్. వసంతకుమారి గారు ఆలపించారు

అన్నమాచార్య సాహితీ వైభవం


వాగ్గేయకారుల గొప్పతనం సాహిత్యంలో నిగూఢమైన భావాలను పొందుపరచటం. అందులోనూ అన్నమాచార్యుల వారు ఇటువంటి భావగర్భితమైన సాహిత్యాన్ని అందించినవారిలో అగ్రగణ్యులు. చేరి యశోదకు శిశువితడు అందరికీ తెలిసిన అన్నమాచార్యుల వారి కృతి. అందులో చివరి చరణం

ముంగిట పొలసిన మోహనమాత్మల పొంగించే ఘన పురుషుడు
సంగతి మావంటి శరణాగతులకు అంగము శ్రీ వేంకటాధిపుడితడు

మొదటి పంక్తిని పరిశీలిద్దాం. దీనిని రెండు రకాలుగా విశ్లేషణ చేయవచ్చు. పైపైన చూస్తే ఆయనను మోహించిన గోపికలను ఆనందపరచిన ఘన పురుషుడని భావించవచ్చు. కాస్త లోతుగా వెళితే, ఆయన సాన్నిధ్యాన్ని ఆశ్రయించిన వారిని తన్మయులను చేసి వారి ఆత్మలను ఉద్ధరించే పరమాత్మ అని అన్నమయ్య భావన. అప్పుడే రెండవపంక్తి సంపూర్ణమవుతుంది. మా వంటి శరణాగతులకు నిరంతరం చర్చాంశమైన స్వామే మాకు ఉపాయము అన్నారు అన్నమయ్య. ఇక్కడ అంగము అన్నదానికి ఉపాయము అన్న అర్థం ఎందుకు తీసుకోవాలి?

కలియుగంలో భక్తులకు వెతలెక్కువ, అనేక రకాల భావనలతో, కామ్యములతో స్వామిని శరణు కోరతారు. ఆయన వారిలో పరిశీలించేది అహంకారాన్ని ఎలా సమర్పిస్తున్నారు, ఎంత శరణార్తితో ఉన్నారు అన్నది. అందుకే కదా ముడుపులు, మొక్కులు, తలనీలాలు మొదలైనవి? భక్తుల పాపప్రక్షాళనకు అనేక మార్గాలు సూచించాడు కాబట్టే ఆయన ఉపాయమైనాడు. మీరు భగవద్బంధువుల చర్చలు గమనిస్తే స్వామిని కొలిచేవారిలో ప్రధానంగా మూడు రకాలు - 1. కామ్యార్థులై వెళ్లేవారు 2. కామ్యము నెరవేరిన తరువాత మొక్కు చెల్లించుకునేందుకు వెళ్లేవారు 3. స్వామి సాన్నిధ్యంలోని ఆనందాన్ని మరల మరల రుంచి చూడాలని వెళ్లేవారు. ఏ రకానికి చెందినా, ఒక్కసారి ఆ ఆనంద నిలయంలోకి వెళ్లగానే కలిగేది తన్మయత్వమే. ఎక్కడలేని ప్రశాంతత, స్వామిపై అవ్యాజమైన ప్రేమ కలుగుతాయి. కొద్ది సెకన్లకైనా మోహాలు పటాపంచలవుతాయి. ఎంతో మందికి ఆనందభాష్పాలు, మరెందరికో ప్రాపంచైక విషయాల పట్ల వైరాగ్యం, దాదాపుగా అందరికీ శరణాగతి భావన ఉప్పొంగి గోవిందా గోవిందా అని అప్రయత్నంగానే ఘోషిస్తారు. నామస్మరణంతో ఆనందనిలయం నిరంతరం మారుమ్రోగుతూనే ఉంటుంది. అందుకే అన్నమాచార్యుల వారు ముంగిట నిలచిన మోహనమాత్మల పొంగించే ఘన పురుషుడు అన్నాడు.

వాగ్గేయకారుల సంకీర్తనలు సాఫల్యం పొందేది ఇటువంటి సాహిత్యంతోనే. అవేవీ అల్లాటప్పా పాటలు కావు, మంత్రసమానమైనవి, మోహవికారాలను తొలగించేవి. కావలసింది అర్థం చేసుకునే చిత్తశుద్ధి, పరమాత్మ దివ్యానంద వైభవాన్ని సాహిత్యం ద్వారా అనుభవించగలిగే సంకల్పం. ఇంతటి మహత్తరమైన సాహిత్యాన్ని అందించారు కాబట్టే అన్నమయ్య వారసులు ఆయనను "హరియవతారమీతడు అన్నమయ్య అరయ మా గురుడీతడు అన్నమయ్య" అని నుతించారు. వైకుంఠనాథునికి వడి పాడుచున్నవానిగా అభివర్ణించారు. అది అక్షరసత్యం. స్వామి రూప గుణ విభవములను అనుభూతి చెంది మనకోసం అక్షర రూపంలో ఆవిష్కరించారు అన్నమయ్య. అందుకే ఆయన సద్గురువులు, అవతారపురుషులు.

ఓం నమో వేంకటేశాయ!

పల్నాటి యుద్ధం - 1966: చిత్ర విశేషాలు

1966లో విడుదలైన పల్నాటి యుద్ధం తెలుగు చారిత్రక చిత్రాలలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న చిత్రం. గుత్తా రామినీడు దర్శకత్వంలో శ్రీ అనురూపా ...