27, ఆగస్టు 2020, గురువారం

వందే వాసుదేవం శ్రీపతిం - తాళ్లపాక అన్నమాచార్యుల వారు

 పదకవితా పితామహులు తాళ్లపాక అన్నమాచార్యుల వారు సంస్కృతంలో పలికిన ఓ అద్భుతమైన కృతి శ్రీరాగంలో. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు గానం చేశారు.

వందే వాసుదేవం శ్రీపతిం
బృందారకాధీశ వందిత పదాబ్జం

ఇందీవర శ్యామమిందిరా కుచ తటీ
చందనాంకితలసచ్చారు దేహం
మందార మాలికా మకుట సంశోభితం
కందర్ప జనకమరవిందనాభం

ధగ ధగిత కౌస్తుభ ధరణ వక్షస్థలం
ఖగరాజ వాహనం కమల నయనం
నిగమాది సేవితం నిజరూప శేష ప
న్నగ రాజ శాయినం ఘన నివాసం

కరిపురనాథ సంరక్షణ తత్పరం
కరిరాజ వరద సంగత కరాబ్జం
సరసీరుహాననం చక్ర విభ్రాజితం
తిరు వేంకటాచల దేవం భజే

లక్ష్మీదేవికి పతి, ఇంద్రునిచే పూజించబడిన పదకమలములు కల వాసుదేవునికి నమస్కరిస్తున్నాను. నీలమేఘశ్యాముడు, లక్ష్మీదేవి కుచముల చందనము అలదుకొన్న అందమైన దేహము కలవాడు, మందార మాల, కిరీటముతో శోభిల్లేవాడు, మన్మథునికి జనకుడు, పద్మనాభుడైన వాసుదేవునికి నమస్కరిస్తున్నాను. ధగ ధగ మెరిసే కౌస్తుభమును వక్షస్థలములో ధరించినవాడు, గరుత్మంతుడు వాహనముగా కలవాడు, కమలముల వంటి కన్నులు కలవాడు, వేదవేదాంతములచే సన్నుతించబడినవాడు, నిజరూపములో పన్నగరాజైన ఆదిశేషునిపై శయనించి వైకుంఠమనే ఘనమైన ధామంలో నివసించే వాసుదేవునికి నమస్కరిస్తున్నాను. హస్తినాపురానికి రాజైన ధర్మరాజును రక్షించే కర్తవ్యములో ఉన్నవాడు, గజేంద్రునికి కలువల వంటి కరములతో అభయమిచ్చినవాడు, కలువ వంటి ముఖము కలవాడు, సుదర్శన చక్రము చేత ధరించి ప్రకాశించేవాడు, వేంకటాచలముపై వెలసిన దేవుని నేను భజిస్తున్నాను.

సుబ్రహ్మణ్య తత్త్వ పరిశీలన


సుబ్రహ్మణ్యుడు శివుని శక్తితో జన్మించిన వాడే. ఈ స్కందుని జననం అంతర్ముఖులమై దివ్యత్వాన్ని పొందే మార్గాల యొక్క సూత్రాలను విశదీకరించేది. ఈ అవతారం అనాదిగా ఉన్న అవిద్య మరియు జ్ఞానముల మధ్య ఉండే సంఘర్షణను తెలిపేది. ఈ సంఘర్షణ దేవతలు-అసురుల మధ్య జరిగినదిగా భావించవచ్చు లేదా ఒక వ్యక్తిలో జరిగేది కావచ్చు. ఆ సంఘర్షణలో దివ్యశక్తుల విజయమే స్కందలీలలు.

పరమశివుని ఆజ్ఞాచక్రము నుండి తేజస్సు వెలువడి స్కందుని రూపం దాల్చింది. ఆ విధంగా స్కందుడు జ్ఞానజ్యోతి. పార్వతిచే రెల్లుగడ్డిపై (శరవణములు) ఆరు కమలముల నుండి స్వీకరించబడినవాడు శరవణభవుడు. షడ్చక్రముల ఛేదన ద్వారా అపరోక్షానుభూతి కలుగుతుంది అన్నది మనకు శాస్త్రాలు చెబుతాయి. క్రిందనున్న ఆరు చక్రములలోని కమలములనుండి ఎదిగి జీవాత్మ సహస్రారము నందు పూర్ణయోగ స్థితిని పొందుతాడు. ఈ విధంగా స్కందుడు ఆరు కమలములనుండి ఆవిర్భవించిన సర్వోన్నతమైన దివ్య జ్ఞానశక్తికి సంకేతము. అజ్ఞానాన్ని నాశనము చేసే సర్వోత్కృష్ట జ్ఞానజ్యోతి. ఆ అజ్ఞానమే విరాడ్విశ్వ వ్యవస్థలో అసురులు రూపం. వారిని సంహరించిన వాడు స్కందుడు. దివ్యత్వాన్ని కలిగిన దేవతలకు సేనాధిపతిగా కొలువబడ్డాడు.

ఈ భూమిపై మనకు అవిద్యపై పోరాటంలో సాయపడేవారు గురువులు. అందుకే గురువును మూర్తీభవించిన స్కందశక్తిగా భావిస్తాము. ఈ జగత్తులోని సాధనా శక్తి లేదా యోగశక్తికి రూపము స్కందుడు. ఈ శక్తితోనే మానవుడు అజ్ఞానముపై దండెత్తి పూర్ణజ్ఞానాన్ని పొందగలడు. సాధకుడు పునీతుడై సాధనా చతుష్టయాన్ని పొంది గురువు అనుగ్రహాన్ని పొందే అర్హతను సాధిస్తాడు. అప్పుడు గురువును స్కందుని రూపముగా భావించటం ద్వారా అజ్ఞానం త్వరగా తొలగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి..

స్కందుని అవతారంలో చాలా ముఖ్యమైన విషయం దేవతలు మొట్టమొదటి అడుగులోనే పరమేశ్వరుని వద్దకు వెళ్లి దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధం జరుగుతోంది మీరు కాపాడాలి అని కోరలేదు. మొట్టమొదట వారు ఓ నకారాత్మక శక్తి ఉందని, దానిని వ్యతిరేకించాలన్నది గ్రహించారు. ఆ శక్తి దివ్యత్వానికి వ్యతిరేకమైనదని కాబట్టే దానిని అధిగమించాలి అన్నది తెలుసుకున్నారు. ఈ విధంగా ఆధ్యాత్మిక మార్గంలోని సాధకుడు కూడా తాను అధిగమించవలసిన అవరోధాలను గుర్తించి, అది ఏ విధంగా అవరోధమో తెలుసుకొని, అది సహజ ప్రవృత్తికి ఏ విధంగా భిన్నమైనదో గ్రహించాలి. మనలను మనం దివ్యశక్తులతో అనుసంధానం చేసుకొన్న తరువాత నకారాత్మక శక్తులపై పోరాటం చేయాలి. కేవలం గ్రహింపు వల్ల ఉపయోగం ఉండదు. దానిని ఆచరణలో పెడితేనే ఫలితం. త్రికరణ శుద్ధిగా సంకల్పిస్తేనే అనుగ్రహం కోరటానికి అర్హులమవుతాము. ఈ సిద్ధాంతాన్ని నిరూపించటానికే దేవతలు దానవులపై నిరంతరం యుద్ధాలు చేశారు. ఎన్ని మార్లు చేసినా దుష్ట శక్తులు ఆవిర్భవిస్తూనే ఉన్నాయి కాబట్టే వారు పరమ గురువైన పరమాత్మను ప్రార్థించారు. అటువంటి అత్యవసర పరిస్థితులలోనే పరమాత్మ అనుగ్రహించాడు.

సాధనా శక్తి అనేది జీవుని అజ్ఞానాంధకారము నుండి దీక్ష ద్వారా మేల్కొలపడం. ఈ దీక్ష గురువు ఇస్తాడు. దీక్ష అంటే ఓ మంత్రోపదేశమో వస్త్రధారణో కాదు, గురువు యొక్క సత్సంకల్పాన్ని శిష్యునికి అందజేయడం. ఎటువంటి కర్మలు లేకుండా గురువు యొక్క అనుగ్రహ వీక్షణతో, కొన్ని మాటలతో లేదా కేవలం గురువు యొక్క ఆలోచనతో అందించేది దీక్ష. ఇది ఏ విధంగా చేయాలి అన్నది గురువుకే తెలుసు. ఈ దీక్షను ఆచరణలోకి పెట్టవలసిన బాధ్యత సాధకునిదే. అభ్యాసము అనేది సాధనకు అతి ముఖ్యమైన ప్రాతిపదిక. అభ్యాసమే అనుభూతికి దారి. దేవతలు ఆ విధంగా తమ యుద్ధాలను కొనసాగిస్తూ, విజయం సాధించలేని స్థితిలో పరమేశ్వరుని ప్రార్థించారు, వేడుకున్నారు. అందుకే సనాతనధర్మంలో ప్రార్థన ఓ ముఖ్యమైన అంతర్భాగమైంది.

ప్రార్థనకు అర్థం ఏమిటి? పరమాత్మపై పరిపూర్ణమైన నమ్మకంతో పలికే మాటలు. అహంకారాన్ని, కామ్యములను పరమాత్మ పాదాలవద్ద సమర్పించగలిగే నిజాయితీ ప్రార్థన యొక్క సాఫల్యానికి ఎంతో ముఖ్యం. కాబట్టి శ్రద్ధ, శరణాగతి అనేవి ప్రార్థనకు మూలస్థంభాలయ్యాయి. ఇవి ఉన్నప్పుడు వినమ్రత అలవడుతుంది. కాబట్టి పరమశివుని వద్ద దేవతల ప్రార్థన ఏమిటి? మేము నిమిత్త మాత్రులము, మమ్మలను ముందుకు నడిపించే నాయకుని అనుగ్రహించు స్వామీ అని. ఈ విధంగా కర్తృత్వాన్ని పరమేశ్వరునిపై ఉంచి, తానొక సాధనగానే భావించటం. ఈ విధంగా సాధన భారాన్ని పరమేశ్వరునిపైనే ఉంచటం కూడా. ఇక్కడ దేవతలు లేదా సాధకుడి పురోగతి మొదలవుతుంది. లక్ష్యం దివ్యమైనది, కర్తృత్వం పరమేశ్వరునిది, ఆ దేహము ఒక సాధనము మాత్రమే అన్న స్థితిలో ఆధ్యాత్మిక వికాసం ఆరంభం. కాబట్టి ప్రార్థన యొక్క ప్రధాన లక్ష్యం ఈ దేహములో నివసించి, దివ్యమైన కార్యమునకు పనిముట్టుగా ఉపయోగించమని కోరటం.

ఇక స్కందావతారానికి తిరిగి వద్దాము. స్కంద షష్టి అనగా సుబ్రహ్మణ్యుని యొక్క అజ్ఞానాన్ని తొలగించే దివ్యశక్తిని ఆరాధించటమే. అదే అసురులపై దేవతల విజయం. స్కంద లీలలలోని అత్యద్భుతమైన ఘట్టం తారక, సింహముఖ, శూరపద్ములపై స్వామి విజయం. ఈ అసురులు కర్మ, కామ, అవిద్యలకు ప్రతినిధిత్వం వహిస్తారు. తొలుత తారక సింహముఖులు హతం కాగా, శూరపద్ముడు యుద్ధానికి వస్తాడు. స్కందుని వేలాయుధం ముందు ఎవ్వరు నిలువలేకపోయారని గ్రహించి అతడు వేర్వేరు రూపాలతో మాయాజాలం చేసి స్వామిపై దాడి చేస్తాడు. స్కందుడు ఆతని మాయలను కట్టడి చేసి అతని రథాన్ని విరగ్గొట్టి అతడిని నిరాయుధుడిని చేస్తాడు. శూరపద్ముడు ఓటమి అంగీకరించి తన అహంకారాన్ని స్వామికి అర్పణం చేస్తాదు. స్వామి వేలాయుధంతో అతని అహంకారాన్ని నాశనం చేస్తాడు. అదే శూరపద్ముడనే అవిద్య యొక్క అంతం. వేలాయుధం అనగా బల్లెం. దానికి పైవైపు చివరన చాలా వాడిగల మొనతో ఉంటుంది. ఇది ఏకాగ్రతకు చిహ్నం. ఇది బ్రహ్మాకార వృత్తికి సంకేతం. ఎప్పుడైతే ఈ బ్రహ్మాకార వృత్తి జీవాత్మ యొక్క ప్రవృత్తులను సంహరిస్తుందో అప్పుడా జీవాత్మ అజ్ఞానము, మాయ లేని తురీయావస్థకు చేరుకుంటాడు.

స్కందావతరణం ఎలా జరిగింది?
-----------------------------------------

తనకు తపోభంగం కలిగించిన మన్మథుని దహించటానికి శివుని మూడో కన్ను తెరచుకున్నప్పుడు ఆ అగ్ని కణికలను అగ్ని, వాయుదేవులు గంగానదిలో పడవేయగా ఆ తల్లి ఆ అగ్నికణికలను భరించలేక తన ఒడ్డున ఉన్న రెల్లుగడ్డి పైకి నెడుతుంది. ఈ విధంగా అగ్ని, వాయు, జల, పృథివీ ఆకాశ తత్త్వములు రెల్లుగడ్డిపై కణికల రూపములో ఉన్న శివుని తేజస్సుతో కలిసి ఆరు ముఖములు కల బాలునిగా ఉద్భవించాడు. ఈ విధంగా స్కందుడు జ్ఞానతేజోస్వరూపుడైనాడు.

సారాంశమేమిటి?

1. శివుని తేజస్సు యొక్క అంశ మరియు పంచభూతముల తత్త్వము కలసి షణ్ముఖుడైనాడు. రెల్లుగడ్డిపై జన్మించాడు కాబట్టి శరవణభవుడైనాడు. గంగ ఆ అగ్ని కణికలను ధరించి ఒడ్డుకు నెట్టింది కాబట్టి గాంగేయుడైనాడు, ఆ రెల్లుగడ్డిపై ఆరుముఖములతో ఉన్న బాలుని పార్వతి స్వీకరించింది కాబట్టి పార్వతీ కుమారుడైనాడు.

2. శివుని మూడో నేత్రం నుండి వచ్చిన తేజస్సు యొక్క రూపము కాబట్టి జ్ఞానస్వరూపుడైనాడు.

3. అజ్ఞానాన్ని తొలగించే వాడు కాబట్టి గురు స్వరూపుడైనడు.

4. రహస్యమైన అవతరణ కలిగిన వాడు కాబట్టి గురుగుహుడైనాడు.

5. ఏకాగ్రగత కలిగిన జ్ఞానస్వరూపుడు కాబట్టి సుబ్రహ్మణ్యుడైనాడు.


వల్లీ దేవసేనలు, స్వామి కల్యాణం, ఇతర వివరాలు
---------------------------------------------------------------

తమిళ వాఙ్మయం ప్రకారం శూరపద్మునిపై విజయం తరువాత సుబ్రహ్మణ్యుడు తిరుచెండూరులో కొన్నాళ్లు నివసించాడు. ఇంద్రాది దేవతలు స్వామిని అక్కడ కొలిచారు.

తొలుత కైలాసంలో తల్లిదండ్రుల వద్ద ఉన్నప్పుడు కుమారుడు శ్రీమహావిష్ణువు పుత్రికలైన అమృతవల్లి, సుందరవల్లిలను చూస్తాడు. సుబ్రహ్మణ్యుని అందాన్ని, యశస్సును చూసి వారు అతనిని కోరుకుంటారు. సుబ్రహ్మణ్యుడు వారిని మరల జన్మ ఎత్తవలసిందిగా సలహా ఇస్తాడు. అప్పుడు అమ్మృతవల్లి ఇంద్రుని కుమార్తెగా జన్మించి దేవసేన అని పేరొందగా సుందరవల్లి దక్షిణ భారతాన కొండ జాతిలో నంబిరాజు కుమార్తెగా జన్మించి వల్లిగా పేరొందింది. ఇంద్రుడు తిరుచెండూరులో స్వామిని కొలుస్తూ పెరిగిన తన బిడ్డ దేవసేనను వివాహం చేసుకోవలసిందిగా స్వామి కోరతాడు. స్వామి ఇంద్రుని కోరిక మన్నించి మదురై సమీపంలోని తిరుపురకుండ్రంలో బస చేస్తాడు. ఇంద్రాది దేవతలు, గౌరీశంకరులు, గణపతి మొదలైన వారి సమక్షాన సుబ్రహ్మణ్యుడు-దేవసేనల వివాహం వైభవంగా జరుగుతుంది.

విష్ణుమూర్తి అవతారమైన ఉపేంద్రుడు ఒకసారి వైకుంఠంలో స్వామి దర్శనానికై వెళ్లగా, అదే సమయానికి కణ్వమహర్షి అక్కడికి వస్తాడు. ఆ మహర్షిని విష్ణు దంపతులు, ఉపేంద్రుడు పట్టించుకోకపోవటంతో కణ్వుడు వారిని ఈ విధంగా శపిస్తాడు - విష్ణువు మాటల్లేని ఋషిగా మరల మరల జన్మించాలని, లక్ష్మీదేవి అడవుల్లో తిరిగే జింకగా జన్మించాని, ఉపేంద్రుడు వన్యమృగాలను వేటాడే వేటగానిగా జన్మించాలని. విష్ణువు మునిగా జన్మించి శివునికై తపస్సు చేసి ఆయనను మెప్పించగా శివుడు ఆ శాపాన్ని బహు జన్మల నుండి ఒక జన్మకు ఉపశమనం కలిగిస్తాడు.

విష్ణువు మూగవాడైన శివమునిగా భువిపైన జన్మించి ఓ అడవిలో నివసించాడు. ఉపేంద్రుడు అదే అడవిలో వేటగానిగా జన్మించాడు. లక్ష్మీదేవి అక్కడే జింకగా జన్మించింది. శివముని ఆ జింకను చూసి చలితుడవుతాడు. ఆతని మోహానికి జింక ప్రతిస్పందనకు ఫలితంగా ఓ ఆడబిడ్డ జన్మిస్తుంది. ఆ బిడ్డ తనలా లేదని చూసిన జింక ఆమెను త్యజిస్తుంది. వేటగాడు ఆ ఆడబిడ్డను ఓ తీగలున్న చెట్టు గుబురులో ఏడుస్తూ చూస్తాడు. ఆమెకు వల్లి అని నామకరణం చేసి పెంచుతాడు. ఆ వేటగాడే కొండజాతి రాజైన నంబిరాజు. నారదుడు సుబ్రహ్మణ్యునికి సుందరవల్లిని వివాహమాడతానన్న కైలాస నివాసము నాటి మాటను గుర్తు చేయగా స్వామి ఆమె జాడను తెలుసుకుంటాడు. ఆమె ఒక పర్వతముపై తనకై తపస్సు చేస్తున్నదని గ్రహిస్తాడు. ఒక వేటగాని మారువేషంలో ఆమె వద్దకు వెళ్లి అక్కడకు జింక ఏమైనా వచ్చిందా అని ప్రశ్నిస్తాడు. వల్లి సేవిక లేదు అని సమాధానమిచ్చి అనుచితంగా ఆ ప్రాంతంలో ప్రవేశించినందుకు దూషిస్తుంది. వల్లి ఆ వేటగాని బారి నుండి రక్షించమని తన సోదరులను కోరుతుంది. వేటగాడి వెనుకాడక తనను వివాహం చేసుకోమని వల్లిని కోరతాడు. వల్లి సోదరులు ఆమెను రక్షించాలని అక్కడికి రాగా వేటగాడు వృక్షరూపంలోకి మారిపోతాడు. వారు తిరిగి వెళ్లగానే వేటగాడు మరల తన రూపం పొంది ఆమెను వివాహము చేసుకోవలసిందిగా కోరతాడు. ఆమె అతనిని అడవి చెట్టు కొమ్మతో తరుముతుంది. వేటగాడు ఈమారు వృద్ధుని రూపంలో ఆమెవద్దకు వచ్చి తనను వివాహం చేసుకోవలసిందిగా కోరతాడు. ఆమె తాను షణ్ముఖుని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని చెబుతుంది. అప్పుడు అక్కడకు ఓ మదపుటేనుగు వస్తుంది. అది చూసి ఆమె భయంతో ఆ ముసలివాని ఆశ్రయిస్తుంది. ముసలివాడు తనను వివాహం చేసుకుంటే ఆమెను రక్షిస్తానని అంటాడు. ఆమె వేరే దిక్కు లేక ఒప్పుకుంటుంది. ముసలివాడు ఆ ఏనుగును తరిమివేస్తాడు. వల్లి తన మాట మీద నిలబడదు. అప్పుడు మళ్లీ ఆ ఏనుగు రాగా వేటగాడు తరిమికొడతాడు. అప్పుడు వల్లి అతనిని వివాహం చేసుకోవటానికి అంగీకరిస్తుంది. స్వామి అప్పుడు తన అసలు రూపంలో వేలాయుధుడై దర్శనమిస్తాడు. తన అజ్ఞానానికి వల్లి సిగ్గు పడుతుంది. స్వామి ఆమెను తన భార్యగా స్వీకరిస్తాడు. నంబిరాజు ఎవరో తన కుమార్తెను తీసుకువెళుతున్నాడని గ్రహించి అతనిపై యుద్ధానికి రాగా స్వామి ఆగ్రహించి వారిని సంహరిస్తాడు. వల్లి కోరగా మరల వారిని బ్రతికిస్తాడు. స్వామి అప్పుడు వారికి తన నిజరూప దర్శనమిస్తాడు. నారదముని, ఇంద్రాది దేవతలు, దేవసేన సమక్షంలో స్వామి వల్లిని వివాహమాడతాడు.

సరే, వీరి గాథలు తెలుసుకున్నాము. 

మరి ఈ దేవతామూర్తుల అంతరార్థం ఏమిటి?
--------------------------------------------------------

స్కాంద పురాణంలో స్కందుని లీలలు జీవునిపై మాయ యొక్క నాటకం, జీవుని కష్టనష్టాలు, చివరకు వేలాయుధుడైన షణ్ముఖుని అనుగ్రహంతో ఆ మాయ బారి నుండి విముక్తి. ముందు చెప్పుకున్నట్లు వేలాయుధం స్వామి జ్ఞానశక్తికి ప్రతీక.

ఇక వల్లీదేవసేనలు. వల్లి ఇచ్ఛాశక్తికి ప్రతీక, దేవసేన క్రియాశక్తికి ప్రతీక. ఈ విధంగా దివ్యత్వాన్ని పొందాలని అభిలషిస్తున్న జీవుడు ఇచ్ఛా శక్తిని పొంది, క్రియాశక్తి ద్వారా పోరాడుతూ గమ్యం చేరుకోగలడు. ఈ విధంగా వేలాయుధం - జ్ఞాన శక్తి, వల్లి - ఇచ్ఛా శక్తి, దేవసేన - క్రియాశక్తి - ఈ మూడు షణ్ముఖుని అవతారంలో అంతర్భాగాలై పరిపూర్ణ దివ్యత్వాన్ని సూచిస్తాయి.

పరమాత్మయైన సుబ్రహ్మణ్యుని సన్నిధినుండి దూరమైన జీవాత్మ వల్లి అవిద్య మూలంగా అజ్ఞానపుటడవుల్లో సంచరిస్తూ ఉండగా గురువు నారదుని రూపంలో వచ్చి జీవాత్మ పరమాత్మల కలయికను సిద్ధి చేస్తాడు. వల్లి అనే జీవాత్మ పరమాత్మపై అకుంఠితమైన విశ్వాసం కలదు కాబట్టే ఎన్ని అవరోధాలు వచ్చినా చివరకు స్వామికే చెందింది. వైరాగ్య వివేకములనే రెండు సాధనాలతో వల్లి అనే జీవాత్మ మాయ బంధనం నుండి విముక్తి పొంది స్వామితో ఐక్యమవుతుంది.

సుబ్రహ్మణ్యుని ఆరు ముఖాలలో నాలుగు నలుదిక్కులా, ఒకటి ఊర్ధ్వముఖము మరొకటి అధోముఖముగా ఉంటాయి. ముఖములో ఉండే జ్ఞానేంద్రియాలతో బుద్ధి కలసి ఆరు ముఖాల ద్వారా అంతరాత్మ వస్తువులను భావిస్తాడు. ఈ ఆరు ముఖాల ద్వారానే ఆత్మజ్యోతి బయటకు ప్రసరిస్తుంది. ఈ విధంగా అంతరాత్మకు ఆరు ముఖాలు, అలాగే సుబ్రహ్మణ్యునికి కూడా. ఈ విధంగా ఆయన పరబ్రహ్మ స్వరూపం. అదే విధంగా నిన్న చెప్పినట్లు ఆరుముఖాలు ఆరు చక్రాలను సూచిస్తాయి. వాటి అధిష్ఠాన దేవతల యొక్క రూపమే ఒక్కొక్క ముఖము. ఈ విధంగా కూడా సుబ్రహ్మణ్యుడు పరబ్రహ్మమే. కాబట్టే ఆ స్వామిని ధ్యానించటం బ్రహ్మజ్ఞాన ప్రాప్తిని కలిగిస్తుంది.

చిట్ట చివర సుబ్రహ్మణ్యుని వాహనమైన నెమలి, కుక్కుట ధ్వజము గురించి. నెమలి యొక్క ప్రత్యేకత తన అంతరానందాన్ని నృత్యం చేస్తూ తన పింఛాలను ప్రదర్శిస్తు వ్యక్తపరస్తుంది. అలా చేసినప్పుడు అత్యద్భుతమైన సంతులనను కనబరుస్తుంది. సుబ్రహ్మణ్య తత్త్వానికి ఇది ఓ కీలకమైన ప్రాతిపదిక. రజస్తమో గుణములపై సత్త్వ గుణము యొక్క ఆధిపత్యాన్ని తన స్థితప్రజ్ఞత ద్వారా నెమలి సూచిస్తుంది. ఈ సత్త్వ గుణము వలన కలిగే సంతులన వలన ఆత్మ సంతృప్తి, ఆనందము కలుగుతాయి. స్వానందానికి ప్రతీక నెమలి నృత్యము. ఈ సత్త్వ గుణ ప్రేరితమైన స్వానందము బ్రహ్మజ్ఞానానికి అతి ముఖ్యమైనది కాబట్టి, బ్రహ్మజ్ఞానమునకు సుబ్రహ్మణ్యుడు ప్రతీక కాబట్టి నెమలి స్వామి వాహనమైంది. సుబ్రహ్మణ్యుడు కుక్కుట ధ్వజుడు. అనగా కోడి అతని పతాకముపై చిహ్నము. కోడికూత సూర్యోదయాన్ని సూచిస్తుంది కాబట్టి, జ్ఞానోదయానికి సూచికగా స్వామి ఆ కుక్కుట ధ్వజుడైనాడు.

సుబ్రహ్మణ్యునికి మరొక రూపము కూడా ఉంది, వల్లీ దేవసేనలు లేని దండపాణి రూపము. ఈ రూపము ఇచ్ఛా మరియు క్రియాశక్తి లేని జ్ఞానశక్తికి ప్రతీక. ఈ రూపము కూడా ఉపాసనా మార్గంలో సాఫల్యాన్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్యుడు వల్లిని గాంధర్వ వివాహం చేసుకున్నాడు కాబట్టి వల్లి స్వామి ఇచ్ఛాశక్తి. అలాగే, దేవసేనతో వివాహం అసురులపై ఆయన విజయం సందర్భంగా ఇంద్రుని కృతజ్ఞతకు సూచికగా వేదోక్తంగా జరిగింది. ఆ విధంగా దేవసేన ఆయన క్రియాశక్తికి సూచన.

దండాయుధము సుబ్రహ్మణ్యునికి శివుని శక్తి రూపమైన పార్వతీ దేవి ఇచ్చినది. పరాశక్తి అయిన పార్వతి నుండి వచ్చిన బ్రహ్మజ్ఞానముగా దండాయుధమును భావించవచ్చు. దీని ఆకారము గమనిస్తే, జ్ఞానము జ్యోతిస్వరూపమై మూలాధార చక్రము (ఆయుధము యొక్క క్రింది చివరి భాగము) నుండి మొదలై మధ్యలో ఉన్న నాడులలో ప్రవహిస్తూ (అనగా ఆయుధము యొక్క మధ్యభాగము) సహస్రకమలములున్న బ్రహ్మరంధ్రము (ఆయుధము యొక్క పై చివరి భాగము) ద్వారా వెలువడి అనంతమైన కాంతితో ప్రకాశిస్తుంది.

మరో ఆధ్యాత్మిక విశేషమేమిటంటే, స్వామి వాహనమైన నెమలి యొక్క రూపము. తన పింఛములను విప్పినపుడు ప్రణవరూపము కలిగి ఉంటుంది. దానిమధ్యలో పరబ్రహ్మ బిందురూపమై, జ్యోతిప్రకాశమై ఉంటాడు. అదే సుబ్రహ్మణ్యుని రూపము. నెమలి కాళ్ల కింద ఆధీనములో ఉన్న సర్పము ప్రణవము ఆధీనములో ఉన్న మాయకు ప్రతీక. అలాగే, కుక్కుటము (కోడి) ప్రణవ నాదానికి ప్రతీక. నిన్న చెప్పినట్లు సూర్యోదయాన కోడికూత జ్ఞానోదయానికి ప్రతీక, ప్రణవ నాదం జాగృతమైన జ్ఞానానికి ప్రతీక కదా!

అసురులు తారక, సింహముఖ, శూరపద్ములు. వీరు మాయా జనితులు. దేవతలను హింసించి దేవకుమారులను బంధించిన వీరిని స్వామి తన దండాయుధముతో చంపి దేవకుమారులకు ముక్తి కలిగిస్తాడు. తరువాత దేవసేనను వివహాము చేసుకుంటాడు. దీని అంతరార్థం - మాయ యొక్క ఆ మువ్వురు పుత్రులు సత్త్వ, రజస్తమో గుణాలకు ప్రతెవ్క. త్రిగుణాలకూ మూలం మాయే. జీవుడు నిరంతరం ఈ మాయ యొక్క ప్రభావానికి లోబడి వారి నాటకంలో పాత్రధారి అవుతాడు. పరబ్రహ్మమైన సుబ్రహ్మణ్యుడు జీవాత్మ యొక్క ప్రార్థన విని, వానిని ఈ త్రిగుణములనే మువ్వురు శత్రువుల బారి నుండి కాపాడతాడు, చివరకు ఆ జీవాత్మను పరిణయమనే కర్మ ద్వారా తనలో ఐక్యం చేసుకుంటాడు.

వల్లి తత్త్వము గురించి తెలుసుకుందాము.

ఆమె దట్టమైన అడవిలో వేటగాళ్ల మధ్య తన ధాన్యాన్ని పక్షుల నుండి రక్షించుకునేందుకు రాళ్లు/వడిసెల విసురుతూ ఉన్నా నిరంతరం సుబ్రహ్మణ్యుని ధ్యాసే. సుబ్రహ్మణ్యుడు వచ్చి ఆమెను పరి పరి విధాల (ఏనుగు వినాయకుని రూపము) పరీక్షించి, చివరకు తన రూపాన్ని బహిర్గతం చేసి, ఆమెను తీసుకువెళ్లే సమయంలో ఆమె తల్లిదండ్రుల నుండి వ్యతిరేకత రాగా, వారిని సంహరించి మరల వల్లి కోరగా వారిని బ్రతికిస్తాడు. ఇక్కడ ఆ దట్టమైన అడవి తమస్సు. వేటగాళ్లు రాజసము. వల్లి ఈ రెండిట గుప్పిట ఉన్న జీవాత్మ. ధాన్యాన్ని కాపాడే వృత్తి ఆమె పరబ్రహ్మను కనుగొనే సాధన. వచ్చే పక్షులు ఆమె సాధనకు అవరోధాలు. పక్షులనుండి కాపాడుకునేందుకు ఆమె చేతిలో ఉన్న వడిసెల, రాళ్లు వివేక వైరాగ్యములు. వానిని ఉపయోగించి ఆమె సాధనలోని అవరోధాలను పారద్రోలుతుంది. ఆమె సాధనను పరీక్షించటానికి స్వామి మారు వేషంలో వస్తాడు. ఏనుగు రూపం ద్వారా ఆమెకు ప్రణవాన్ని బోధిస్తాడు. అప్పుడు ఆమె చుట్టూ ఉన్న వేటగాళ్లు అనే రాజస గుణాలు నశిస్తాయి. ఆమె అప్పుడు శుద్ధ సత్త్వమవుతుంది, జీవాత్మ ముక్తిని పొంది పరబ్రహ్మతత్త్వంతో ఏకమవుతుంది.

ఇదీ సుబ్రహ్మణ్య తత్త్వంలోని విశిష్టత. అత్యంత నిగూఢమైన అవతారం కాబట్టే ఆయన గురుగుహుడైనాడు, వల్లీదేవసనలతో కలిసి ఇచ్చాక్రియా మరియు జ్ఞానశక్తులకు ప్రతీక పరిపూర్ణ దివ్య పరబ్రహ్మమైనాడు.

ఓం శరవణభవ! శ్రీ గురుభ్యోనమః!!

పురాణాలు, ఇతిహాసాలు - కంచి పరమాచార్యుల వారు



వేదాలకు పురాణాలు భూతద్దాలనవచ్చు. చిన్నచిన్నవాటిని పెద్దవిగా చేస్తాయి గనుక. వేదాలలోని సూక్తులు క్లుప్తంగా ఉంటాయి - వాటిని కథలుగా, ఆఖ్యానాలుగా పెంచి చూపుతాయి పురాణాలు. ఒక భావాన్ని క్లుప్తంగా చెబితే అది మనస్సులో నాటుకోక పోవచ్చు. దాని ఫలితమూ కనబడక పొవచ్చు. దానినే ఒక కథగానో ఉపాఖ్యానంగానో చెబితే మనసులో నిలిచిపోతుంది. ఒక ఉదాహరణ తీసుకుందాం. వేదాలు "సత్యం వద" అంటాయి. అంటే, "సత్యాన్ని పలుకు" అని. సత్యవ్రతాన్ని పాటించటం ఎంతటి మహనీయతకు దారితీస్తుందో హరిశ్చంద్రుని కథలోని వృత్తాంతాల వల్ల తెలియజేయబడింది. "ధర్మం చర" అంటే ధర్మాన్ని పాటించి. రెండు ముక్కలలో వేదాలు చెప్పిన దానిని మహాభారతంలోని పాండవుల వృత్తాంతం ద్వారా తెలియవస్తుంది. "మాతృదేవో భవ", "పితృదేవోభవ" అంటే తల్లిని, తండ్రిని దైవముగా ఆరాధించు - ఇది వేదవాక్కు. ఈ వైదిక నిర్దేశాలను భూతద్దంలో చూపినట్లు రామాయణంలో తెలుస్తుంది. వైదిక నియమాలైన నిగ్రహం, క్షమ, కరుణ, పవిత్రత వంటి ధర్మాలన్నిటినీ తమ తమ జీవితాలలో ఎందరో స్త్రీ పురుషులు పాటించి చూపుతారు. ఇవన్నీ పురాణేతిహాసాల ద్వారా తెలుస్తాయి. వాటిని వినటం వల్ల చదవటం వల్ల ఆ మహనీయులు పాటించిన ధర్మాలలో మనం కూడా నిమగ్నులమవుతాం. ఆ మహనీయులకు సంభవించిన కష్టాలు, విపత్తులు తెలిసినప్పుడు మన మనస్సు కరుణతో కరిగిపోతుంది. మన అంతరాంతరాలలోని సంశయాలు తొలగి మన దోషాలు క్షాళనమైనట్లు అనిపిస్తుంది. వారి అంతిమ విజయం, ఖ్యాతి మన మనస్సులలో ధర్మాన్ని నిలుపుతాయి. పురాణగాథలు చేసేదిదే.

మన దేశ చరిత్ర లిఖిత పూర్వకంగా లేదని అంటూ ఉంటారు. పురాణాలు ముమ్మాటికీ మన చరిత్రే. మానవుణ్ణి ఉన్నతునిగా చేయటం వాటి లక్ష్యం. అందువల్లే పురాణాలను చదవాలి. చరిత్ర చదువవలసిన అవసరముండటానికి కారణం అది పునరావృతమవటం. పరిస్థితులు, సంఘటనలు, తిరిగి తిరిగి రావటం సహజం. అందుచేత, గతం తెలిస్తే భవిష్యత్తును తెలుసుకోగలం. గతం నుండి గుణపాఠాలను కూడా నేర్చుకోగలం. ఒక పరిస్థితిని ఉపేక్షిస్తే యుద్ధానికో, సంఘవిచ్ఛిత్తికో నాగరికత ధ్వంసానికో దారి తీయగలదని చరిత్ర చెబుతుంది. అటువంటి పరిస్థితే మళ్లీ పొడచూపితే మనం ముందు జాగ్రత్తలు తీసుకొని ఈ దుర్ఘటనలు తప్పించుకోవచ్చు. పురాణాలకు ఇటువంటి చారిత్రకత ఉంది. ఇంకో ముఖ్యమైన అంశం - ప్రజలను సన్మార్గవర్తులను చేయటానికి ఉపకరించే సంఘటనల గురించే అవి చెబుతాయి. పురాణ పఠనం వలన కలిగే ప్రయోజనాలు - 1. పూర్వానుభవం ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనటానికి ఉపకరిస్తుంది 2. సద్వర్తన వలన సత్ఫలితాలను పొందిన సత్పురుషుల జీవితాల అధ్యయనం మనకు మార్గదర్శకమవుతుంది 3. దుష్టకార్యాలను చేసి ఎందరికో ఎన్ని విధాలుగానో కీడు చేసి తత్ఫలితాలను తామే ఇంకా ఎక్కువగా అనుభవించిన వారి జీవితాలను తెలుసుకోవటం మనం పెడదారిలో పడకుండా చేస్తుంది. మనిషి మనస్సును మలచి అతనికీ, సమాజానికీ ఉన్నతమైన జీవితాన్ని కలిగించటం పురాణాల ప్రధాన ప్రయోజనం.

పురాణాల్లో అక్కడక్కడ కల్పనలున్నాయేమో. అవి కూడా కాలక్రమేణా చోటుచేసుకున్న మార్పులు చేర్పులే. కానీ, వాటిలో ఏది కల్పనో, ఏది చేర్పో, ఏది వాస్తవమో ఎవరికి తోచినట్లు వారు విసర్జించటం సరి కాదు. అలా చేస్తే మూల కథ మిగలకపోవచ్చు. మనకు లభించిన రీతిలో పురాణాలను కాపాడుకోవటం మన విధి. కొన్ని కట్టుకథలుంటే ఏమి? ఎంత కాదన్నా పురాణాలు మనల్ని దైవాన్ని దగ్గరగా చేర్చి మనశ్శాంతినిస్తాయి కదా? నవీన శాస్త్రాలు సాధించలేని ప్రయోజనమొకటి పురాణాలకు ఉంది - అది పరమాత్మ తత్త్వం, భక్తి, ధర్మం - గురించి మనకు అధ్యయనం కల్పించటం. ధర్మాచరణపరాయణులు ఆనందంగా ఉంటారని, అధర్మ వర్తనులు దుఃఖిస్తారనీ, అటువంటి వారికి కూడా భగవంతుని క్షమ, భిక్ష, అనుగ్రహం లభిస్తాయనే భావాలు చదివే వారి మనసుల్లో గాఢమైన ముద్రవేయటం వల్ల పురాణాల లక్ష్యం తీరినట్లేగా?

పురాణానికి ఐదు లక్షణాలుండాలి.

1. సర్గ - సృష్ట్యాదికి సంకేతం

2. ప్రతిసర్గ - సృష్టి జరిగిన తరువాత కాలక్రమేణ ప్రపంచంలో వచ్చిన వికాసానికి సంకేతం

3. వంశ - అంటే ఆ వంశ చరిత్ర - ఒక తరం నుండి వేరొక తరానికి రావటం

4. మన్వంతరం - మానవాళి అంతటికీ ఆద్యులైన మనువులు, వెయ్యి యుగక్రమాలు (ఒక్కొక్క యుగక్రమంలో నాలుగు యుగాలు) వీటి చరిత్ర

5. వంశానుచరిత్ర - దేశపాలకుల వంశ చరిత్రలు అంటే సూర్యవంశము, చంద్రవంశము వంటి వివరాలు.

ఇవి కాకుండా అంతరిక్షం యొక్క వర్ణనా ఉండాలి. అంటే పురాణం చరిత్రగానే కాక భూగోళశాస్త్రంగా కూడా వ్యవహరిస్తుందన్నమాట.

ఇతిహాసమంటే?

ఇతి-హా-అసం - అంటే ఈ విధంగా జరిగింది అని అర్థం. మధ్యలో ఉన్న హా అంటే నిజంగానే, నిస్సంశయంగానే అని అర్థం. ఇతిహాసంలో యదార్థ వృత్తాంతమే ఉంటుంది కాని ఊహాగానానికి, కాల్పనికతకు తావులేదు. ఆ వృత్తాంతం జరిగిన కాలంలో వ్రాయించబడినది ఇతిహాసం. రాముడు జీవించి ఉన్నప్పుడు వాల్మీకి రామాయణాన్ని రచించాడు, వ్యాసుడు పంచపాండవులతో పాటు మహాభారతంలో చెప్పబడిన సంఘటనలను స్వయంగా చూశాడు. పురాణం కాబట్టి ప్రాచీన విషయాల గురించి వ్రాసినా ఆయన తన దివ్యశక్తితో ఆయా వృత్తాంతాలను స్మరణకు తెచ్చుకొని ఉంటారు. అయినా ఆ కథనంలోని వృత్తాంతాల యదార్థతను ఆయన సమకాలీకులు గ్రహించలేకపోయి ఉండవచ్చు. కానీ, రామాయణ మహాభారతాలు ఆ కోవకు చెందవు. వాటిని ప్రచురించినప్పుడే అప్పటి వారికి వాటిలోని వ్యక్తులు, వృత్తాంతాలు తెలుసు. మన సందేహాలన్నీ నివృత్తి చేయటానికి వాటి ఇతిహాసాలన్నారు - హా అన్న అక్షరం సత్యాన్ని స్థాపిస్తుంది.

ఇతిహాసాలను వేదాలకు సమానమైన ఘనత కలవి అంటారు. మహాభారతాన్ని పంచమవేదమని ఘోషించారు. వేదాలవల్లనే విదితమయ్యే పురుషుడు దాశరథిగా జన్మనెత్తినపుడు వేదాలు కూడా వాల్మీకి బిడ్డల వలె రామాయణ రూపంలో బయటపడ్డాయంటారు.

ప్రతి పురాణంలోనూ పెద్దవీ, చిన్నవీ అనేక ఉపాఖ్యానాలుంటాయి. ప్రతి కథా ధర్మానికి సంబంధించిన ఒక అంశానికి ప్రాధాన్యతనిస్తుంది. ఇతిహాసం ఆరంభం నుండి చివరి వరకు ఒకే కథ. మధ్య మధ్య వేరే కథలున్నా, వాటికి కూడా మూల కథతో ఏదో సంబంధముంటుంది. పురాణాలలో ఒక్కొక్క ధర్మం గురించి ఒక్కొక్క కథ అయితే ఇతిహాసంలో మొత్తం ధర్మమంతా మూల కథలోనే నిక్షిప్తమై ఉంటుంది.

26, ఆగస్టు 2020, బుధవారం

షిర్డీ సాయి తత్త్వం - వ్యతిరేక ప్రచారానికి సమాధానం


 

మట్టిలో మాణిక్యాలు ఎందరో - వారిలో గురువులు, మహా ఆధ్యాత్మికవేత్తలు, తత్త్వశాస్త్రజ్ఞులు ఉన్నారు. రూపం చూసి ఏ హంగులూ లేని వారిని, మాటను విని ఏ తీపీ లేని వారిని పక్కకు పెట్టకూడదు. అలాచేస్తే ఓ గొప్ప సాంగత్యం కోల్పోయే ప్రమాదముంది. చాలాసార్లు శాస్త్రాలకు ఆచార వ్యవహారాలకు అతీతులైనట్లున్నవారు తారసపడినప్పుడు వారి ఆత్మజ్ఞానాన్ని విస్మరిస్తాము, మనకు సరైనవి, మనం పాటించే పద్ధతులు వారు పాటించనందుకు నిందిస్తాము. అలాగే హంగులు ఆర్భాటాలున్నవారిని చూసి వాటి భ్రమలో పడి అసలు విషయాన్ని విస్మరిస్తాము. ఇక్కడే మన సమయం వృథా అయ్యేది. జ్ఞాన సముపార్జనకు ఈ ప్రపంచంలో మూలాలు సమృద్ధి, గురుతత్త్వానికీ అంతే. బాహ్య విషయలోలత్వంలో అంధులమై అవకాశాలను కోల్పోతాము.

ఈ ప్రపంచంలో నేడు జరుగుతున్న షిర్డీ సాయి వ్యతిరేక ప్రచారానికి పైన చెప్పినవి కొన్ని కారణాలు. ఆయన చెప్పినవి శాస్త్రానికి ధర్మానికి అతీతమని కొందరు పెద్దలు, అలాగే ఆయనవి ఫకీరు చేష్టలని మరికొందరు, మరికొందరు ఆయన తీరు హైందవ వ్యతిరేకమని. ఇవన్నీ పైపైని మాటలే, ఆయన గురించి ఏ మాత్రం తెలుసుకోకుండా అనేవే. గొప్ప వారు ఎప్పుడూ ఆ కాలానికి, సమాజానికి ఉపయుక్తమైన మార్గాలలోనే నడుస్తారు. సాయి చేసింది కూడా అదే. శ్రద్ధ, కూరిమి లేకుండా మూఢంగా ఆరాధిస్తూ, పరధర్మాలను నిందిస్తూ, హింసకు పాల్పడే పరిస్థితులలో, ప్రజలను ఏకం చేసి, సామాన్యులకు కూడా ఆచరణయోగ్యమైన మార్గాన్ని ప్రతిపాదించారు. అదే ఒక శతాబ్దం పాటు నిలిచి విస్తరిస్తోంది. కాలానుగుణంగా ప్రజలకు సముచితమైన మార్గాన్ని బోధించలేక అవస్థ పడుతున్నారు అరకొర జ్ఞానమున్న సనాతనధర్మ గురువులు. అందుకే కదా, జగ్గీ వాసుదేవ్, రవిశంకర్ వంటి వారికి ప్రజాదరణ పెరుగుతోంది? అసలు ఆధ్యాత్మిక సత్తా ఉన్న సనాతనవాదులెంతమంది? వారు బహుళ ప్రజానీకంపై ఎంతటి ప్రభావం చూపగలుగుతున్నారు? వారి పరిధులేమిటి? ఇవి గమనిస్తే, ప్రస్తుతమున్న పీఠాధిపతులు, ఇతర మఠాధిపతుల పరిధి కొన్ని లక్షలమంది వరకే. అదే సమస్య. కొన్ని వేలమంది గురువులు, వారికి కొన్ని లక్షల మంది అనుచరులు. వారి మధ్య ఐక్యత లేదు, సఖ్యత లేదు, సారూప్యత ఉన్నా అంగీకరించలేని పరిస్థితి. పైగా కుళ్ళిపోయిన వ్యవస్థలు. అందుకే వీటికి అతీతంగా వచ్చిన తత్త్వాలు ప్రజాదరణ పొందుతున్నాయి. అంత మాత్రాన అవి సనాతనధర్మ వ్యతిరేకమన్నది పూర్తి అసత్యం. ఇక్కడే సాయి వ్యతిరేకులు తప్పటడుగులు వేస్తున్నది. సాయి భక్తి మార్గంలో సనాతనధర్మంలో చెప్పినదేనినీ ఖండించలేదు, వదులుకోమని చెప్పలేదు. మన వ్యక్తిత్వం, మనం అనుసరించే మార్గంలో కావలసిన ముఖ్యమైన ప్రాతిపదికలను ప్రస్తావించి వాటిపైనే దృష్టి పెట్టారు.

అన్యమత వాతావరణంలో పెరిగిన కబీరు రామదాసుకు ఎలా గురువైనాడు? అదే రీతి సాయి కూడా ఈ కోట్లాది భక్తులకు సద్గురువు, పూజనీయుడు, వారి తత్త్వం పూర్తిగా దత్తాత్రేయ పరంపరతో అనుసంధానమైనది. ఆ దృష్టితో పరిశీలించి విశ్లేషణ చేస్తే ఎటువంటి వైరుధ్యమూ కనబడదు. హిందుత్వాన్ని గౌరవించి అనుసరించిన అబ్దుల్ కలాం మనకు గౌరవనీయుడే కదా? మరి సాయి ఎందుకు కాడు? అబ్దుల్ కలాం మడి, వర్ణాశ్రమ ధర్మాలు పాటించలేదే? ఆయన వ్యక్తిత్వం వాటికి అతీతం. అలాగే, సాయి కూడా.

జైహింద్.

ఆధ్యాత్మికత - మూలాలు, మార్గదర్శులు






ఈ మధ్య కొత్తగా మరో వింత పోకడ మొదలైంది - కొద్దిగా మోడ్రన్‌గా ఉండే గురువులను నిందించటం. ఏ విమర్శకైనా ప్రాతిపదిక, హేతుబద్ధత ఉండాలి. అప్పుడే అది సమాజ శ్రేయస్సుకు తోడ్పడుతుంది. ఈ సనాతన ధర్మ ప్రవాహంలో వచ్చిన కోట్లాది గురు పరంపరలను చూస్తే ఎంతో వైవిధ్యం, ఊహించలేని పరిణామ క్రమం కనబడతాయి. దీనికి అనేక కారణాలు. మార్గాలు వేరు కావటం, కాలానుగుణమైన అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి గురువులు అనేక రకాలు. ఆదిశంకరులున్నట్లు ఇప్పటి శంకరాచార్యులు ఉండలేరు కదా? అలాగే వివిధ ఇతర గురువులు కూడా.

కలియుగంలో ధర్మానికి కలిగే గ్లానిని బట్టి, దేశకాలమాన పరిస్థితులను బట్టి, పాలకులను బట్టి గురువులు. కొందరు మన ధర్మాన్ని బోధించిన పుందరుద్ఘాటించే వారైతే కొందరు ముందుండి పోరాటం చేసి ప్రజలను ఏకం చేసిన వారు. కొందరు తార్కికులైతే మరికొందరు పూర్తి సన్యాసులు. కొందరు అతివాదులైతే మరికొందరు హేతువాదులు, ఇంకొందరు మితవాదులు. కానీ లక్ష్యం ఒక్కటే.

ప్రస్తుతమున్న సమయంలో ధర్మభ్రష్టుత్వం పట్టి, మన ఆత్మవిద్యా విధానాన్ని విస్మరించి ఉపాధి విద్యను ఆశ్రయించిన ప్రజానీకానికి అనేక వికారాలు. ముందు మానసిక దౌర్బల్యం, రెండవది స్వార్థం, ఆ తరువాత విషయం తెలుసుకుందామన్న జిజ్ఞాస లేకపోవటం. ఇది ఎక్కువ శాతం మంది ప్రజల పరిస్థితి. దీనికి తోడు సామాజికంగా కుల మత ప్రాంతీయ వైషమ్యాలను పాలకులే పెంచి పోషించి ప్రజలను దారుణంగా విభజించారు. అనేకానేక కారణాల వల్ల ప్రజలకు జీవితంలో ధర్మం యొక్క మూలాంశాలపై కూడా అవగాహన లేదు. పాశ్చాత్య సంస్కృతిలోని చెడు మార్గాలన్నీ కూడా ప్రజల జీవితాలలో, మనసులలో నాటుకుపోయాయి. ఎంత దారుణమంటే రాముడిని నిందించటం, సీతమ్మను చులకన చేయటం, రావణుని ఆరాధించటం, కృష్ణుని స్త్రీలోలునిగా వక్రీకరించటం, ద్రౌపది గురించి నీచంగా మాట్లాడటం మొదలైన వాటి గురించి పుస్తకాలు కూడా వస్తున్నాయి. అంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోండి.

ఇలాంటి దుర్భర మానసిక వికారాలతో అజ్ఞానంలో కొట్టుమిట్టడుతున్న ప్రజలను అనేకానేక ప్రశ్నలు వేధిస్తున్నాయి. వీటన్నిటికీ సనాతనధర్మంలో పరంపరగా వస్తున్న పీఠాధిపతులు పూర్తిగా ప్రభావవంతంగా సమాధానం చెప్పలేకపోతున్నారు, ఒకరకంగా సమస్య వారి పరిధిని దాటిపోయింది. ప్రజలలో హీనత్వం ఎంత అధమస్తంగా ఉందంటే ప్రశ్నలలోనే జీవిస్తున్నారు, ముందుకు వెళ్లలేకపోతున్నారు, పరధర్మం గడపతొక్కి మన ధర్మాన్ని తూలనాడుతున్నారు కూడా. ఈ స్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించటానికే, నేటి ప్రజలకు అర్థమయ్యేలా, నేటి ప్రశ్నలకు అనుగుణంగా సమాధానం చెప్పటానికి, నేటి భాషలో నేటి సమాచార సాధనలతో, కులాతీత మతాతీతమైన విధానంతో ప్రజలను ఏకం చేసి వారికి మనశ్శాంతికి తోడ్పడుతున్నారు జగ్గీ వాసుదేవ్, శ్రీశ్రీ రవిశంకర్ వంటి గురువులు. అలా అని వాళ్లు అవతారపురుషులా? కాకపోవచ్చు, కానీ అజ్ఞానులను సమాధాన పరచి వారిని ఒక మార్గంలో నడిపించగలగటంలో కొంతవరకు కృతకృత్యులైనారు. అందుకే వారి వారి సంస్థలు బాగా అభివృద్ధి చెందాయి. వీరి మార్గాలను నిశితంగా పరిశీలిస్తే అవి పూర్తిగా సనాతనధర్మ వాఙ్మయంపై ఆధారపడినవే. మన ముందుకు సందేశాన్ని తీసుకువచ్చే పద్ధతి ప్రత్యేకం. అంతే. పీఠాధిపతులు సాంప్రదాయ మార్గంలోనే నడుస్తున్నారు, వారిని నమ్మి అనుసరించేవారు ఆ మార్గంలోనే అద్భుతంగా ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా ఈ కొత్త గురువుల శిష్యవర్గం కూడా. వీరి ఆధ్యాత్మిక పురోగతి ఎంత మన సమాజానికి ఉపయోపడుతుంది అన్నది ఇప్పుడే చెప్పలేం. ఒక 50 ఏళ్ల తరువాత ఆయా గురువుల సంస్థలు ఎంత నిబద్ధతతో పరంపరను కొనసాగించగలుగుతాయి అన్నదానిపై ఈ సాఫల్యం ఆధారపడి ఉంటుంది.

ఈ కొత్తతరం గురువులను పరిశీలించేటప్పుడు మనం గమనించవలసింది సందేశం, అది ఎవరిని ఉద్దేశించబడినది అన్నది. ధర్మాన్ని నమ్మే వారికి సనాతనంగా వస్తున్న మార్గాలు, సంస్థలు ఉన్నాయి. ఏమీ తెలియని వారికి ఈ కొత్తగురువుల మార్గాలు ప్రభావవంతం. కొన్నాళ్ల తరువాత ఈ శిష్యవర్గం మరింత తెలుసుకునేందుకు సాంప్రదాయ మార్గాలను అన్వేషించే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే ఈ గురువులు అనుసరించేది గీత, రామాయణ, మహాభారతాల వంటి కాలపరీక్షను తట్టుకున్న తత్త్వమూలాలే. వీటిని దాటిన కొత్త సిద్ధాంతాలేవి కాలపరీక్షలో పెద్దగా నిలవలేకపోయాయి. జగ్గీవాసుదేవ్ చెప్పే ప్రతి విషయం కూడా ఎంతో సహేతుకంగా వెంటనే మనసును సమాధాన పరచేలా ఉంటుంది. ఆయన అనుసరించే మార్గం మన ధర్మంలో స్పష్టంగా చెప్పబడినదే. అలాగే రవిశంకర్ గారు చెప్పేవి కూడా. ఈ రెండు సంస్థలలోనూ అనాది చెప్పబడిన విధివిధానాలే, సరళంగా చెప్పబడి ఆచరించబడుతున్నాయి. జగ్గీవాసుదేవ్ ఎంతటి సాధన చేస్తే దుర్గమమైన మానస సరోవర్ యాత్రను ప్రతియేడాది, ఇన్నిమార్లు ఎంత సులభంగా చేయగలుగుతున్నారు. అలాగే రవిశంకర్ గారు ఎంత అద్భుతమైన ప్రపంచస్థాయి కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నారు.

ఇంకొక విషయం - ఇటువంటి గురువులు యుగయుగాలుగా వస్తూనే ఉన్నారు. వారి జన్మలకు ఒక లక్ష్యం ఉంటుంది. అవి నెరవేరిన తరువాత వారి శిష్యవర్గం ప్రధాన స్రవంతిలో కలసి ధర్మాన్ని మరింత పరిపుష్టం చేస్తారు. అందుకే గుడ్డిగా కొత్తగా ఏర్పడిన సంస్థలను, వాటి అధిపతులను విమర్శించకూడదు. అందరూ అదే ధర్మపరిక్షణకు తోడ్పడుతున్నవారే. ఈ కొత్త గురువుల సంభాషణలను, వారి అవలంబించే మార్గాలను సమయం వెచ్చించి పరిశీలిస్తే విహంగవీక్షణమవుతుంది. అప్పుడు ఏ రెండిటి మధ్యా వైరుధ్యం కనబడదు. మనం త్యజ్యించవలసింది, గర్హించవలసింది మనలో ఉన్న చీడపురుగులను, ఆధ్యాత్మికత పేరుతో చట్టవ్యతిరేక కార్యక్రమాలను సాగించేవారిని, ప్రజల ధనాన్ని, శాంతిని అపహరించేవారిని. ఇక ఈ నవీన గురువులలో లోపాలున్నాయి కదా అంటారా? ఎవరిలో లేవు చెప్పండి? వారు కూడా మనలాగే మానవజన్మ ఎత్తారు, కొద్దో గొప్పో వికారాలుంటాయి. కానీ వాటి వల్ల మనకు నష్టం కలుగుతోందా లేకా స్థూలస్థాయిలో మనకు ఆనందం, శాంతి కలిగి సమస్యలను పరిష్కరించుకోగలుగుతున్నామా అన్నది ముఖ్యం.

జైహింద్.

వేదాలు - నిర్దుష్టంగా వల్లించే పద్ధతులు - కంచి పరమాచార్యుల వారు

వేదాలలో ఏ చిన్నపొరపాటూ రాకుండా ఉండటానికి మన పూర్వీకులు ఎన్నో పద్ధతులు అవలంబించారు. ఇవేవీ లిఖితరూపంలో కూడా లేవు. వేదమంత్రాల వలన పరిపూర్ణమైన లాభం పొందాలంటే ఆ మంత్రోచ్చారణలో ఏ పొరపాటూ రాకుండా ఉండాలి. అంటే, మంత్రాలను వల్లించేటప్పుడు ఏ పదమూ మారకూడదు, నియమానికి వ్యతిరేకంగా స్వరమూ మారకూడదు. అందువల్లే వేదాధ్యయనంలో అనేక కట్టుబాట్లున్నాయి.

ఒక్కొక్క పదాన్ని ఎంత కాలం పలకాలో తెలిసేటట్లు మాత్రలు కల్పించారు. మాత్ర అంటే ఒక్కొక్క హ్రస్వ అచ్చును పలికే కాలం. శరీరంలో ఏ భాగంలో ప్రకంపన కలగాలో, ఏ విధంగా శుద్ధమైన శబ్దం వస్తుందో తెలుపటానికి శ్వాసకు సంబంధించిన నియమాలను శీష అనే వేదాంగములో చెప్పారు. తైత్తిరీయోపనిషత్తు ఈ "శీక్ష"తో ప్రారంభమవుతుంది.

శీక్షాం వ్యాఖ్యాస్సామః వర్ణ స్వరః మాత్రాబలం సామసన్తానః

(శీక్ష, వర్ణము, స్వరము, మాత్ర, బలము, సామము, సన్తానములతో సంబంధము కలది వేద మంత్రోచ్చారణ)

ఒక్కొక్క మంత్రాన్ని వివిధ రీతులలో వివిధ గతులలో వల్లించటం నిర్దుష్టతకు దోహదం చేస్తుంది. ఇవి వాక్య, పద, క్రమ, జట, మాల, శిఖ, రేఖ, ధ్వజ, దండ, రథ, ఘన వంటివి. కొందరు పండితులను మనం ఘనాపాఠి అంటాము. అంటే, వాళ్లు వేదాలను ఘనమనే పద్ధతిలో వల్లించగల నిష్ణాతులని అర్థం. వారు వేదాన్ని వల్లిస్తుంటే పదాలను అనేకరకాలుగా ముందుకు వెనుకకు మారుస్తున్నది కనిపెట్టవచ్చు. ఇది వినటానికి సొంపుగా ఉండటమే కాక, మనస్సుకు ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తుంది. వేదమంత్రాలకు సహజంగానే గల శోభ ఇంకా పెంపొందినట్లు అనిపిస్తుంది. క్రమం, జట, శిఖ, మాల పద్ధతులలో వేదాలను వల్లించినా అలాగే అనిపిస్తుంది.

ఈ పద్ధతుల ముఖ్య ఉద్దేశం: అనాదిగా వస్తున్న పదాల అర్థం గాని, ఉచ్చారణ గాని మారకుండా పొరపడకుండా ఉండటమే.

మంత్రాలను ఒక వాక్యంలా వల్లె వేయటాన్ని వాక్య పాఠం లేదా సంహిత పాఠం అంటారు. ఒక వాక్యరూపంలో మంత్రాలను వల్లించేటప్పుడు కొన్ని కొన్ని పదాలను కలపవలసివస్తుంది. మంత్రాలలోని ప్రతి పదాన్నీ దేనికది విడిగా వల్లించటాన్ని పదపాఠమంటారు. పదపాఠంలో వాక్యాలకు పదవిభజన జరుగుతుంది. దీని వల్ల వేదాధ్యయనం చేసే వారికి ప్రతి పదమూ తెలుస్తుంది. దీని తరువాతది క్రమ పాఠం. ఈ పద్ధతిలో మొదటి పదాన్ని రెండవ పదానికి, రెండవ పదాన్ని మూడవ పదానికి చేర్చుకుంటూ వాక్యం పూర్తయ్యే వరకూ వల్లిస్తారు. ఈ పద్ధతి వల్ల విద్యార్థికి ప్రతి పదమూ అర్థమవటమే కాక రెండేసి పదాలను కలిపి ఏ విధంగా వల్లించాలో, ఆ కలపటంలో వచ్చే మార్పులేమిటో కూడా తెలుస్తాయి.

కొన్ని ప్రాచీన శాసనాలలో, ముఖ్యంగా దానాలకు సంబంధించిన వాటిలో, ఆ సంబంధిత వ్యక్తుల పేర్ల చివర "క్రమవిత్" అన్న పదముంటుంది. వేదవిత్ వలెనే క్రమవిత్ అంటే ఆ వ్యక్తికి క్రమ పద్ధతిలో వల్లించటం వచ్చని అర్థం. ఇటువంటి శిలాశాసనాలు దక్షిణ భారతంలో కోకొల్లలు.

జటాపాఠంలో మొదటి పదాన్ని, రెండవ పదాన్ని కలిపి వల్లిస్తారు. ఆ తరువాత రెండు పదాలను తిరగవేసి వల్లెవేస్తారు, తరువాత మామూలు వరుసలో చెబుతారు. క్రమపాఠంలో పదాల క్రమం 1-2, 2-3, 3-4, 4-5 ఇలా ఉంటే, జటాపఠంలో 1-2-2-1-1-2 ఇలా ఉంటుంది. ఈ క్రమాన్నే ముందుకు వెనుకకు వల్లిస్తూ ఉంటారు. శిఖాపాఠంలో మూడేసి పదాలను ఈ విధంగా కలుపుతారు.

ఘన పాఠం వీటి కంటే కష్టం. దీనిలో క్రమం 1-2-2-1-2-3-3-2-1-1-2-3;2-3-3-2-2-3-4-4-3-2-2-4 ఇలా ఉంటుంది. ఇవికాక ఇంకొక అయిదు పద్ధతులున్నాయి. పదాల వరుసను మారుస్తూ, రకరకాల జోడింపులు చేస్తూ వల్లెవేస్తారు.

ప్రాణాలను కాపాడే మందును ప్రయోగశాలలో ఎంత జాగ్రత్తగా భద్రపరస్తారో విశ్వకల్యాణానికి ఉపయుక్తమయ్యే వేదాలకు ఏవిధమైన మార్పు, క్షీణింపూ కలుగకుండా, లిఖితపూర్వకంగా కూడా కాకుండా, కేవలం వల్లె వేయించే పద్ధతులలో మన పూర్వీకులు వేదాలను భద్రపరచారు. పదాలను ముందుకు వెనుకకు వల్లె వేసేటప్పుడు విద్యార్థి స్వరాలకేమాత్రమూ భంగం రానీయకూడదు. పదాల సమ్మేళనం స్వరాలనే విధంగా ప్రభావితం చేస్తుందో కూడా విద్యార్థి నేర్చుకోవాలి.

మంత్రంలోని పదాలు సహజమైన వరుసలో వస్తాయి గనుక సంహితపాఠాన్ని, పదపాఠాన్ని ప్రకృతి పాఠమంటారు. మిగిలిన వాటిని వికృతి పాఠమంటారు. క్రమపాఠంలో వరుసగా 1-2-3 వలె రావు, కానీ 2 తరువాత 1, 3 వెనుక 2 తిరగవేసి వల్లించనక్కరలేదు. అందువల్ల దానిని వికృతి అనలేము. వికృతులు ఎనిమిది రకాలు:

జటా మాలా శిఖా రేఖా ధ్వజో దండో రథో ఘనః
ఇత్యష్టౌ వికృతయః ప్రోక్తా క్రమ పూర్వా మహర్షిభిః

పదాన్నీ, శబ్దాన్నీ, ఉచ్చారణను, స్థాయిని, వాటి వాటి సమ్మేళనాలను బట్టి వేదాలలో స్వచ్ఛంగా పరిరక్షించటం కోసమే వల్లె వేయించటంలో ఈ క్లిష్టమైన పద్ధతులు వచ్చాయి. రకరకాలుగా పదాలను పునశ్చరణ చేయటం వల్ల వాటి సంఖ్యను, నిర్మలత్వాన్ని కాపాడుకున్నారు. ఎంత క్లిష్టమైన పద్ధతిలో వల్లె వేస్తే అంత పుణ్యమని కూడా నిర్దేశించి, విద్యార్థులు వాటిని నేర్చుకునేట్లు చేశారు.మన పూర్వీకులు వేదమంత్రాల స్వచ్ఛతను నిలపటానికి అన్ని పద్ధతులనూ అవలంబించారు. అందువల్ల కాలక్రమేణా ఉచ్చారణలో కొంత మార్పులు వచ్చాయి. అవి ఎంత కాలంలో వచ్చాయి అంటూ ఆధునికులు పరిశోధనలు చేయటం సమర్థనీయం కాదు. వీటి వల్ల సత్యాన్వేషణలో ఒక్క అడుగు కూడ ముందుకు పడదు.

25, ఆగస్టు 2020, మంగళవారం

శ్రీమహాగణపతిరవతు మాం - ముత్తుస్వామి దీక్షితుల వారు

 

శ్రీమహాగణపతిరవతు మాం సిద్ధివినాయకో మాతంగ ముఖ

కామజనక విధీంద్ర సన్నుత కమలాలయ తటనివాసో
కోమలతర పల్లవ పదకర గురుగుహాగ్రజ శివాత్మజం

సువర్ణాకర్షణ విఘ్నరాజో పాదాంబుజో గౌరవర్ణ వసన ధరో ఫాలచంద్రో నారదాది వినుత లంబోదరోకువలయ స్వవిషాణ పాశాంకుశ మోదక ప్రకాశకరో భవజలధి నావో మూలప్రకృతి స్వభావ సుఖతరో
రవిసహస్ర సన్నిభ దేహో కవిజననుత మూషికవాహో అవనత దేవతా సమూహో అవినాశ కైవల్య దేహో

గజముఖుడైన సిద్ధివినాయకుడు, మహాగణపతి నన్ను కాపాడు గాక. మన్మథుని తండ్రియైన శ్రీమహావిష్ణువు, బ్రహ్మ, ఇంద్రునిచే సన్నుతించబడినవాడు, కమలాలయ పుష్కరిణి సమీపంలో నివసించేవాడు, చిగురుల వలె కోమలమైన కరములు, పాదములు కలిగినవాడు, సుబ్రహ్మణ్యస్వామికి అగ్రజుడు, శివుని కుమారుడు అయిన శ్రీమహాగణపతి నన్ను కాపాడు గాక. బంగారము వలె ఆకర్షణ కలవాడు, విఘ్నములకు అధిపతి, కలువల వంటి పాదములు కలవాడు, శ్వేత వర్ణము కలిగిన వస్త్రము ధరించినవాడు, శిరసున చంద్రుని ధరించినవాడు, నారదాదులచే నుతించబడిన లంబోదరుడు, ఏకదంతము కలిగి, పాశము, అంకుశము, మోదకము హస్తములలో కలిగి ప్రకాశించేవాడు, సంసారమనే సాగరాన్ని దాటటానికి నావయైనవాడు, మూల ప్రకృతి స్వభావము కలిగి సుఖమును కలిగించేవాడు, సహస్ర సూర్యుల దేహ ప్రకాశము కలిగినవాడు, కవిజనులచే నుతించబడే మూషికవాహనుడు, దేవతా సమూహముచే నమస్కరించబడేవాడు, నాశనము లేనివాడు, మోక్షమును ప్రసాదించేవాడు అయిన శ్రీమహాగణపతి నన్ను కాపాడు గాక.

- ముత్తుస్వామి దీక్షితుల వారు 

గౌళ రాగంలోని ఈ కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు.

పల్నాటి యుద్ధం - 1966: చిత్ర విశేషాలు

1966లో విడుదలైన పల్నాటి యుద్ధం తెలుగు చారిత్రక చిత్రాలలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న చిత్రం. గుత్తా రామినీడు దర్శకత్వంలో శ్రీ అనురూపా ...