29, డిసెంబర్ 2020, మంగళవారం

పరిమళ రంగనాథం భజేऽహం - దీక్షితుల వారి క్షేత్ర కృతి

దీక్షితుల వారి క్షేత్ర కృతులలో ఒకటి తమిళనాడు తిరువిందళూరులోని పుండరీకవల్లీ సమేత పరిమళరంగనాథునిపై రచించినది. ఈ క్షేత్రానికి స్థల పురాణం ఉంది. శ్రీమహావిష్ణువు మత్స్యావతారుడై వేదాలను రక్షించి తిరువిళందూరులోని వనంలో తపస్సు చేసి ఆ వేదాలను వల్లించి వాటికి, తనకు కూడా శాశ్వతమైన పరిమళాన్ని ఆపాదించుకున్నాడు. అంతే కాదు, ఆ వనం కూడా పరిమళ వనంగా మారింది. ఇక్కడి విమానం పేరు వేదామోద విమానం. చంద్రుడు శాపవిముక్తికై ఈ క్షేత్రంలోనే తపస్సు చేసి శ్రీహరి అనుగ్రహం పొందాడు. ఈ క్షేత్రంలో అందుకే చంద్రుడు, అంబరీషుల మూర్తులు ఉంటాయి. ఈ విషయాలన్నీ దీక్షితుల వారు తన కృతిలో ప్రస్తావించారు. వివరాలు:

సాహిత్యం
========

పరిమళ రంగనాథం భజేऽహం వీరనుతం
పరిపాలిత భక్తం పుండరీకవల్లీనాథం

హరిం అంబరీష శీతాంశు వేదాది పూజితం
మురహరం భయహరం నరహరిం ధృత గిరిం
సురనర మునిజన ముదితం
పురహర గురుగుహ విదితం

సుగంధ విపినాంతరంగ శయనం రవిశశి నయనం
శుకశౌనకాది హృద్సదనం సరసిజ వదనం
ఖగరాజ తురంగం కమనీయ శుభాంగం
కనకాంబర కౌస్తుభమణి ధరం కంబు కంధరం
గగన సదృశమాబ్జకరం గజరాజ క్షేమ కరం
నగపతి సుతా సోదరం నర వరద దామోదరం

భావం
=====

వీరులచే నుతించబడేవాడు, భక్తులను పరిపాలించేవాడు, పుండరీకవల్లికి నాథుడైన పరిమళ రంగనాథుని నేను భజిస్తున్నాను. అంబరీషుడు, చంద్రుడు వేదములచే పూజించబడేవాడు, మురాసురుని సంహరించినవాడు, భయమును హరించేవాడు, నరసింహుడు, మందర పర్వతమును ధరించినవాడు, దేవతలు, మానవులు, మునిజనులకు ఆనందం కలిగించినవాడు, పరమశివుడు, సుబ్రహ్మణ్యునిచే గ్రహించబడిన వాడు అయిన పరిమళ రంగనాథుని నేను భజిస్తున్నాను. సుగంధవనము మధ్యలో శయనించేవాడు, సూర్యచంద్రులు కన్నులుగా కలవాడు, శుకశౌనకాది మునుల హృదయములో నివసించేవాడు, కమలము వంటి ముఖము కలవాడు, గరుత్మంతుడు వాహనముగా కలవాడు, అందమైన, శుభకరమైన శరీరవయవములు కలవాడు, బంగారు వస్త్రములు, కౌస్తుభమణి ధరించే వాడు, శంఖము వంటి కంఠము కలవాడు, ఆకాశమును పోలినవాడు, గజేంద్రునికి క్షేమము కలిగించినవాడు, హిమవంతుని కుమార్తె అయిన పార్వతికి సోదరుడైనవాడు, మానవులకు వరదుడు, దామొదరుడైన పరిమళ రంగనాథుని నేను భజిస్తున్నాను. 

శ్రవణం
=======

హమీర్ కల్యాణి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని చారులత మణి గారు ఆలపించారు

28, డిసెంబర్ 2020, సోమవారం

రంగనాయకం భావయేऽహం - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


సాహిత్య సంపదలో, ఆధ్యాత్మిక వైభవంలో, సంస్కృత భాషా విశేషణాలలో, సంగీతత్రయంలో ముత్తుస్వామి దీక్షితుల వారిది అగ్రస్థానం. వారి ఉపాసనా బలమంతా ఈ మూడు కోణాల ద్వారా ఆయన రచనలలో అద్భుతంగా గోచరిస్తుంది. అటువంటి ఒక కృతి వారు శ్రీరంగంలోని రంగనాథునిపై రచించినది. వివరాలు:

సాహిత్యం
========

రంగనాయకం భావయేऽహం శ్రీరంగనాయకీ సమేతం శ్రీ

అంగజ తాతమనంతమతీతం అజేంద్రాద్యమరనుతం సతతం
ఉత్తుంగ విహంగ తురంగం కృపాపాంగం రమాంతరంగం శ్రీ

ప్రణవాకార దివ్య విమానం ప్రహ్లాదాది భక్తాభిమానం
గణపతి సమాన విష్వక్సేనం గజ తురగ పదాది సేనం
దినమణికులభవ రాఘవారాధనం మామక విదేహ ముక్తి సాధనం
మణిమయ శశివదనం ఫణిపతి శయనం పద్మనయనం
అగణితసుగుణగణ నతవిభీషణం ఘనతర కౌస్తుభమణి విభూషణం
గుణిజన కృత వేదపారాయణం గురుగుహ ముదిత నారాయణం శ్రీ

భావం
=====

రంగనాయకీ సమేతుడైన శ్రీరంగనాయకుని నేను ధ్యానిస్తున్నాను. మన్మథునికి తండ్రి, అనంతుడు, అన్నిటికీ అతీతుడు, బ్రహ్మేంద్రాది దేవతలచే ఎల్లప్పుడూ నుతించబడేవాడు, గరుత్మంతుని వాహనంగా ఆకాశంలో విహరించేవాడు, కృపావీక్షణములు కలవాడు, లక్ష్మీదేవి హృదయములో ఉండేవాడు అయిన శ్రీరంగనాయకుని ధ్యానిస్తున్నాను. ఓంకారమనే దివ్యవిమానంలో విహరించేవాడు, ప్రహ్లాదాది భాగవతోత్తములను ప్రీతితో అనుగ్రహించేవాడు, గణపతితో సమానమైన విష్వక్సేనునిచే పూజించబడేవాడు, గజములు, అశ్వములు, సైనికులతో కూడిన సైన్యము కలవాడు, సూర్యవంశములో జన్మంచి రాఘవునిగా కొలువబడినవాడు, దేహముక్తి పొందేందుకు నాకు సాధనమైనవాడు, మణులతో ప్రకాశించేవాడు, చంద్రుని వంటి ముఖము కలవాడు, విభీషణునిచే నుతించబడినవాడు, శ్రేష్టమైన కౌస్తుభ మణిని వక్షస్థలమున ఆభరణముగా కలవాడు, ఉత్తములైన పండితులచే వేద పారాయణ ద్వారా నుతించబడిన వాడు, సుబ్రహ్మణ్యునికి ఆనందం కలిగించేవాడు, శ్రీమన్నారాయణుడైన రంగనాయకుని నేను ధ్యానిస్తున్నాను. 

శ్రవణం
=======

ఖరహరప్రియ జన్యమైన నాయకి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు.

25, డిసెంబర్ 2020, శుక్రవారం

కరుణ జూడవయ్య మాయయ్య కావేటి రంగయ్య - త్యాగరాజస్వామి శ్రీరంగ పంచరత్న కృతి

త్యాగరాజస్వామి వారు రచించిన శ్రీరంగ పంచరత్న కీర్తనలలో మరొకటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా. శ్రీరంగంలో స్వామి వైభోగాన్ని అనేక సేవలలో చూసి ఆనందించి రచించిన కృతి ఇది. 

సాహిత్యం
========

కరుణ జూడవయ్య మాయయ్య కావేటి రంగయ్య

పరమ పురుష విను మాపాలి పెన్నిధానమా
వరద నలుగురిలో వరమొసగి కరమిడి

చారడేసి కన్నులచే చెలంగు ఉభయ నా
చ్చారులతోను మరి సద్భక్తులతో యా
ళ్వారులతో నీవు వర నైవేద్యముల
నారగించు వేళల హరి త్యాగరాజుని పై

భావం
=====

మా తండ్రివైన ఓ కావేటి రంగయ్యా! నాపై కరుణతో చూడవయ్యా! మా పాలిట పెన్నిధివైన ఓ పరమ పురుషా నా మటలు ఆలకించు! ఓ వరదా! నలుగురిలో వరములు, అభయమునిచ్చి కరుణతో చూడవయ్యా! ఓ శ్రీహరీ! చారెడు కన్నులు కలిగిన శ్రీదేవి భూదేవిలతో, సద్భక్తులతో, ఆళ్వారులతో నీవు శ్రేష్టమైన నైవేద్యములు ఆరగించు వేళ త్యాగరాజునిపై కరుణతో చూడవయ్యా!

శ్రవణం
======

సారంగ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు

23, డిసెంబర్ 2020, బుధవారం

ఓ రంగశాయీ యని బిలచితే - త్యాగరాజస్వామి శ్రీరంగ పంచరత్న కృతి


త్యాగరాజస్వామి శ్రీరంగ పంచరత్న కృతులలో బాగా పేరొందిన కృతి ఓ రంగశాయీ. శ్రీరంగం తీర్థయాత్ర వెళ్లి రంగనాథుని ప్రార్థించనప్పుడు ఆయన అనుగ్రహం వెంటనే కలుగనప్పుడు ప్రశ్నిస్తూ ఈ కృతిని రచించారు. వివరాలు:

సాహిత్యం
========

ఓ రంగశాయీ యని బిలచితే ఓ యని రారాదా

సారంగధరుడు జూచి కైలాసాధిపుడు గాలేదా

భూలోక వైకుంఠమిదియని నీలోనె నీవే యుప్పొంగి
శ్రీలోలుడై యుంటే మా చింత దీరే దెన్నడో
మేలోర్వ లేని జనులలో నే మిగుల నొగిలి దివ్య రూపమును ముత్యాలసరుల యురమున గన వచ్చితి త్యాగరాజ హృద్భూషణ

భావం
=====

స్వామీ! ఓ రంగశాయీ యని నిన్ను మనసారా పిలచితే ఓ యని రావచ్చు కదా! కరిచర్మం ధరించే పరమశివుడు నీ అనుగ్రహము పొందిన తరువాత కైలాసాధిపతి అయినాడు కదా! ఈ క్షేత్రము భూలోక వైకుంఠమని నీలో నీవే ఉప్పొంగి ఎల్లప్పుడూ లక్ష్మీదేవిపైనే ధ్యాస కలిగియుంటే మా చింతలు ఎప్పుడు తీరేను? నా శ్రేయస్సును ఓర్వలేని జనుల మధ్య నేను ఎంతొ నలిగి నీ దివ్యరూపమును, ముత్యాల దండలను నీ వక్షస్థలములో చూచి ఆనందించుటకు వచ్చాను. త్యాగరాజుని హృదయమునకు ఆభరణమైన స్వామీ! ఓ రంగశాయీ అని నిన్ను మనసారా పిలచితే ఓ అని రావచ్చు కదా! 

శ్రవణం
=======

కాంభోజి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం అద్భుతంగా ఆలపించారు

22, డిసెంబర్ 2020, మంగళవారం

రంగ రాజు వెడలె జూతాము రారే - త్యాగరాజస్వామి వారి శ్రీరంగ పంచరత్న కృతి


త్యాగరాజస్వామి వారు శ్రీరంగ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు రంగనాథునిపై ఐదు కృతులను రచించారు. వాటిని శ్రీరంగ పంచరత్న కృతులు అంటారు. శ్రీరంగంలో జరిగే తిరునాళ్లలో స్వామిని రాజుగా అలంకరించి అశ్వంపై ఊరేగించే వైభోగాన్ని ఆయన ఒక కృతిలో వివరించారు. వైకుంఠ ఏకాదశి సమయంలో శ్రీరంగంలో 21 రోజుల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. వాటిలో ఎనిమిదవ రోజున స్వామిని బంగారు అశ్వ వాహనంపై విహరింపజేస్తారు. ఈ ఉత్సవాన్ని వేడుపరి అంటారు. దీని వెనుక ఒక గాథ ఉంది మంగైమన్నన్ అనే రాజు కుముదవల్లి అనే వైష్ణవకన్యపై మనసు పడి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. అతనికి విష్ణుభక్తి కలిగించాలన్న సంకల్పంతో కుముదవల్లి కొన్ని షరతులతో వివాహానికి ఒప్పుకుంటుంది. వాటిలో ముఖ్యమైనది ప్రతిరోజూ 1008 వైష్ణవులకు భోజనం పెట్టడం. ఆ షరతును నెరవేర్చటానికి మంగై మన్నన్ అనేక కష్టాలు పడతాడు. చివరకు తన వద్ద ఉన్న ధనమంతా కోల్పోయి ఒకరోజు దొంగతనానికి పాల్పడతాడు. తిరువీధులలో వధూవరుల వేషంలో వస్తున్న స్వామి, అమృతవల్లీ తాయారులను నిలువరించి వారి నగలను దోచుకుంటాడు. కానీ ఆ నగల మూటను భూమి మీద నుండి ఎత్తలేకపోతాడు. అప్పుడు స్వామి అతనిని అనుగ్రహించి తన నిజరూప దర్శనమిచ్చి అతనికి అష్టాక్షరీ మంత్రోపదేశం చేస్తాడు. అప్పటి నుండి తిరుమంగై మన్నన్ తిరుమంగై ఆళ్వారుగా పిలువబడ్డాడు. ఈతనే ఆఖరి ఆళ్వారు. ఈ ఘట్టాన్ని ప్రతి ఏడు జరిగే వేడుపరి ఉత్సవాలలో ఆవిష్కరిస్తారు. స్వామిని బంగారు అశ్వంపై చిత్రవీధిలో వేగంగా అశ్వధాటి రీతి ఊపుతారు. శ్రీరంగనాథుడు ఈ ఉత్సవాలలో రంగరాజుగా కొలువబడతాడు. దీనినే త్యాగరాజస్వామి ఈ కృతి ద్వారా ఆవిష్కరించారు. వివరాలు:

సాహిత్యం
=======

రాజు వెడలె జూతాము రారే కస్తురి రంగ 

తేజినెక్కి సామంతరాజులూడిగము సేయ
తేజరిల్లు నవరత్నపు దివ్య భూషణములిడి రంగ

కావేరీ తీరమునను పావనమగు రంగపురిని
శ్రీ వెలయు చిత్ర వీధిలో వేడ్కగ రాగ
సేవను గని సురలు విరులచే ప్రేమను పూజించగ
భావించి త్యాగరాజు పాడగ వైభోగ రంగ

భావం
=====

రాజైన కస్తూరి రంగడు శ్రీరంగపుర వీధులలో విహరిస్తున్నాడు చూద్దాము రండి. మేలుజాతి అశ్వమునెక్కి, సామంతరాజులు సేవలు చేయుచుండగా నవరత్నాలతో పొదిగిన దివ్యమైన ఆభరణములు ధరించి ప్రకాశిస్తున్న రంగనాథుడు శ్రీరంగ వీధులలో విహరిస్తున్నాడు చూద్దాము రండి. కావేరీ తీరములో పావనమైన శ్రీరంగ క్షేత్రంలో సిరులొలికే చిత్ర వీధులలో స్వామి వేడుకగా రాగా, ఆ సేవను కనులారా జూచి దేవతలు పుష్పములతో భక్తితో పూజించగా, ఆ అద్భుతమైన దృశ్యమును చూచి త్యాగరాజు వైభోగ రంగ అని పాడుచున్నాడు, స్వామిని చూద్దాము రండి. 

శ్రవణం
======

దేశిక తోడి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని రంజని-గాయత్రి సోదరీమణులు ఆలపించారు

18, డిసెంబర్ 2020, శుక్రవారం

సింగరామూరితివి చిత్తజు గురుడవు - అన్నమాచార్యుల వారి కృతి

 

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకునికి తిరుమలలో నిత్యకల్యాణముతో పాటు అనేక అద్భుతమైన సేవలు. వాటిలో కొన్ని ఏడాదికి ఒకమారు నిర్వహిస్తారు. అటువంటి సేవ ఒకటి తెప్పోత్సవం. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి సమయంలో ఐదు రోజుల పాటు ఈ తెప్పోత్సవాన్ని ఎంతో వైభవంగా స్వామి పుష్కరిణిలో నిర్వహిస్తారు. మొదటిరోజు సీతారామలక్ష్మణులు, రెండవరోజు రుక్మిణీకృష్ణులు, మిగిలిన మూడు రోజులు శ్రీదేవి-భూదేవి సమేతుడైన మలయప్ప మూర్తులను పుష్కరిణిలో విహరింపజేస్తారు. అన్నమాచార్యుల వారు తమ కృతులలో స్వామికి జరిగే అనేక సేవలను, ఉత్సవాలను ప్రస్తావించటమే కాదు మనోజ్ఞంగా వర్ణించారు. ఈ వార్షిక తెప్పోత్సవంపై కూడా సద్గురువులు అద్భుతమైన కృతిని రచించారు. వివరాలు: 

సాహిత్యం
========

సింగారమూరితివి చిత్తజు గురుడవు సంగతి జూచేరు మిము సాసముఖ

పూవుల తెప్పలమీద పొలతులు నీవునెక్కి పూవులు ఆకసము మోప పూచిచల్లుచు
దేవదుందుభులు మ్రోయ దేవతలు కొలువగా సావధానమగు నీకు సాసముఖ

అంగరంగవైభవాల అమరకామినులాడ నింగినుండి దేవతలు నినుజూడగా
సంగీత తాళవాద్య చతురతలు మెరయ సంగడిదేలేటి నీకు సాసముఖ

పరగ కోనేటిలోన పసిడి మేడనుండి అరిది యిందిరయు నీవు ఆరగించి
గరిమ శ్రీవేంకటేశ కన్నుల పండువకాగ సరవి నోలాడు సాసముఖ

భావం
=====

ఓ వేంకటేశా! నీవు శృంగారమూర్తివి, మన్మథుని తండ్రివి! మీ సన్నిధిలో అందరూ మిమ్ములను చక్కగా చూచుచున్నారు. పూవులతో అలంకరించబడిన తెప్పల మీద నీవు శ్రీదేవి భూదేవిలతో కూడి యుండగా, పూవులు ఆకాశములో మొలచాయా అన్నట్లుగా మీపైన చల్లబడుతున్నాయి, దేవదుందుభులు మ్రోగుచుండగా దేవతలు మిమ్ములను కొలుచుచుండగా మీ సన్నిధినయున్నవారికి సావధానముగా నున్నది! అంగరంగవైభవముగా దేవకాంతలు నృత్యము చేయుచుండగా దేవతలు మిమ్ము చూచుచుండగా, సంగీత తాళవాద్యములు నైపుణ్యముగా మెరయుచుండగా తెప్పలలో విహరించుచున్న దృశ్యము మీ సన్నిధినయున్నవారికి కన్నులపండువగానున్నది. ఆరగింపులను సేవించి ఎంతో ఒప్పుగా పుష్కరిణియందు బంగారు తెప్పలో శ్రేష్ఠులైన మీరు, అపురూపమైన లక్ష్మీదేవి ఓలలాడుచున్న దృశ్యము మీ సన్నిధినయున్నవారికి ఎంతో కన్నులపండువగా నున్నది. 

శ్రవణం
======

ఖమాస్ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని శ్రీమతి శ్వేతా ప్రసాద్ గారు ఆలపించారు.

14, డిసెంబర్ 2020, సోమవారం

పార్వతీపతిం ప్రణౌమి సతతం - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి

హంసధ్వని రాగాన్ని సృష్టించింది ముత్తుస్వామి దీక్షితుల వారి తండ్రి అయిన రామస్వామి దీక్షితుల వారు. వీరు 18వ శతాబ్దంలో తంజావూరు మహారాజులు అమరసింహ భోసలే, తులజాజీ భోసలలే కొలువులలో ఆస్థాన విద్వాంసునిగా పనిచేశారు. వీరు 108 రాగాలతో చేసిన రాగమాలిక అత్యంత ఎక్కువ నిడివి కలిగిన రాగమాలికగా ఇప్పటికీ ప్రసిద్ధం. తండ్రిపై గౌరవంతో దీక్షితులవారు వాతాపి గణపతిం భజేऽహం అనే కృతిని ఈ రాగంలో స్వరపరచారు. ఆయన ఈ రాగంలో స్వరపరచిన మరొక కృతి పార్వతీపతిం ప్రణౌమి సతతం. వివరాలు:

సాహిత్యం
=======

పార్వతీపతిం ప్రణౌమి సతతం ఆశ్రితజన మందారం శశిధరం

పర్వత రాజ నుత పదాంబుజం భద్ర ప్రద కైలాస విరాజం
గర్విత త్రిపురాది హర చతురం గురుగుహ వందిత శివ శంకరం

భావం
=====

ఆశ్రితజనులకు కల్పవృక్షము వంటి వాడు, చంద్రుని ధరించినవాడు, పార్వతీదేవికి పతియైన పరమశివునికి నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను. పర్వతరాజైన హిమవంతునిచే నుతించబడిన పదకమలములు కలవాడు, శుభఫలములను ప్రసాదిస్తూ కైలాస పర్వతముపై విరాజిల్లేవాడు, గర్వితులైన త్రిపురాసురులు మొదలైన రాక్షసులను సంహరించిన నిపుణుడు, సుబ్రహ్మణ్యునిచే పూజించబడిన శివునికి, శంకరునికి నేను ఎల్లప్పుడూ నమస్కరించుచున్నాను. 

శ్రవణం
======

ప్రఖ్యాత కర్నాటక శాస్త్రీయ సంగీత విద్వాంసులు సంగీత కళానిధి, పద్మభూషణ్ గుర్తింపులను పొందిన శ్రీ త్రిచూర్ రామచంద్రన్ గారు ఈ క్ర్తిని ఆలపించారు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవిత విశేషాలు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆధునిక భారతదేశంలో ఆధ్యాత్మిక సందేశాన్ని విద్య, వైద్యం, తాగునీరు, సేవా కార్యక్రమాలతో ముడిపెట్టిన మహనీయులు. ఆయన 1926...