22, డిసెంబర్ 2020, మంగళవారం

రంగ రాజు వెడలె జూతాము రారే - త్యాగరాజస్వామి వారి శ్రీరంగ పంచరత్న కృతి


త్యాగరాజస్వామి వారు శ్రీరంగ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు రంగనాథునిపై ఐదు కృతులను రచించారు. వాటిని శ్రీరంగ పంచరత్న కృతులు అంటారు. శ్రీరంగంలో జరిగే తిరునాళ్లలో స్వామిని రాజుగా అలంకరించి అశ్వంపై ఊరేగించే వైభోగాన్ని ఆయన ఒక కృతిలో వివరించారు. వైకుంఠ ఏకాదశి సమయంలో శ్రీరంగంలో 21 రోజుల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. వాటిలో ఎనిమిదవ రోజున స్వామిని బంగారు అశ్వ వాహనంపై విహరింపజేస్తారు. ఈ ఉత్సవాన్ని వేడుపరి అంటారు. దీని వెనుక ఒక గాథ ఉంది మంగైమన్నన్ అనే రాజు కుముదవల్లి అనే వైష్ణవకన్యపై మనసు పడి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. అతనికి విష్ణుభక్తి కలిగించాలన్న సంకల్పంతో కుముదవల్లి కొన్ని షరతులతో వివాహానికి ఒప్పుకుంటుంది. వాటిలో ముఖ్యమైనది ప్రతిరోజూ 1008 వైష్ణవులకు భోజనం పెట్టడం. ఆ షరతును నెరవేర్చటానికి మంగై మన్నన్ అనేక కష్టాలు పడతాడు. చివరకు తన వద్ద ఉన్న ధనమంతా కోల్పోయి ఒకరోజు దొంగతనానికి పాల్పడతాడు. తిరువీధులలో వధూవరుల వేషంలో వస్తున్న స్వామి, అమృతవల్లీ తాయారులను నిలువరించి వారి నగలను దోచుకుంటాడు. కానీ ఆ నగల మూటను భూమి మీద నుండి ఎత్తలేకపోతాడు. అప్పుడు స్వామి అతనిని అనుగ్రహించి తన నిజరూప దర్శనమిచ్చి అతనికి అష్టాక్షరీ మంత్రోపదేశం చేస్తాడు. అప్పటి నుండి తిరుమంగై మన్నన్ తిరుమంగై ఆళ్వారుగా పిలువబడ్డాడు. ఈతనే ఆఖరి ఆళ్వారు. ఈ ఘట్టాన్ని ప్రతి ఏడు జరిగే వేడుపరి ఉత్సవాలలో ఆవిష్కరిస్తారు. స్వామిని బంగారు అశ్వంపై చిత్రవీధిలో వేగంగా అశ్వధాటి రీతి ఊపుతారు. శ్రీరంగనాథుడు ఈ ఉత్సవాలలో రంగరాజుగా కొలువబడతాడు. దీనినే త్యాగరాజస్వామి ఈ కృతి ద్వారా ఆవిష్కరించారు. వివరాలు:

సాహిత్యం
=======

రాజు వెడలె జూతాము రారే కస్తురి రంగ 

తేజినెక్కి సామంతరాజులూడిగము సేయ
తేజరిల్లు నవరత్నపు దివ్య భూషణములిడి రంగ

కావేరీ తీరమునను పావనమగు రంగపురిని
శ్రీ వెలయు చిత్ర వీధిలో వేడ్కగ రాగ
సేవను గని సురలు విరులచే ప్రేమను పూజించగ
భావించి త్యాగరాజు పాడగ వైభోగ రంగ

భావం
=====

రాజైన కస్తూరి రంగడు శ్రీరంగపుర వీధులలో విహరిస్తున్నాడు చూద్దాము రండి. మేలుజాతి అశ్వమునెక్కి, సామంతరాజులు సేవలు చేయుచుండగా నవరత్నాలతో పొదిగిన దివ్యమైన ఆభరణములు ధరించి ప్రకాశిస్తున్న రంగనాథుడు శ్రీరంగ వీధులలో విహరిస్తున్నాడు చూద్దాము రండి. కావేరీ తీరములో పావనమైన శ్రీరంగ క్షేత్రంలో సిరులొలికే చిత్ర వీధులలో స్వామి వేడుకగా రాగా, ఆ సేవను కనులారా జూచి దేవతలు పుష్పములతో భక్తితో పూజించగా, ఆ అద్భుతమైన దృశ్యమును చూచి త్యాగరాజు వైభోగ రంగ అని పాడుచున్నాడు, స్వామిని చూద్దాము రండి. 

శ్రవణం
======

దేశిక తోడి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని రంజని-గాయత్రి సోదరీమణులు ఆలపించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి