30, నవంబర్ 2020, సోమవారం

పరమేశ్వర జగదీశ్వర - ముత్తుస్వామి దీక్షితుల కృతి


ముత్తుస్వామి దీక్షితుల వారు అపార ఆధ్యాత్మిక సంపన్నులు. నాదోపాసనతో పాటు మంత్రానుష్ఠానం చేసి ఎన్నో క్షేత్రాలలోని దేవతల అనుగ్రహం పొందారు. కాశీలో ఎన్నో ఏళ్లు గురువులైన చిదంబరనాథ యోగి గారి దగ్గర ఉండి వారికి సేవ చేసి వారి అనుగ్రహంతో సమస్త విద్యలలోనూ సాఫల్యం పొందారు. ఆయన క్షేత్ర కృతులకు ప్రసిద్ధులని గతంలో ప్రస్తావించాను. ఆయన ఈ దేశంలో దర్శించని క్షేత్రం లేదు అంటే అతిశయోక్తి కాదు. తిరువయ్యారు లోని పంచనదీశ్వర క్షేత్రం సనాతనమైన దేవాలయం. ఇక్కడ ఐదు నదులు, ఐదు పుష్కరిణులు ఉండటం చేత క్షేత్రం ఎంతో పవిత్రతను పొందింది. ఈ క్షేత్ర మహిమను ఉట్టంకిస్తూ దీక్షితుల వారు పరమేశ్వర జగదీశ్వర అనే కృతిని రచించారు. వివరాలు:

సాహిత్యం
=======

పరమేశ్వర జగదీశ్వర శంకర పాహిమాం ప్రణతార్తిహర శ్రీ

పురహర మృగధర సుందరేశ్వర ధర్మసంవర్ధనీ మనోహర

పంచనదీశ్వర గంగాధరేశ్వర పన్నగాభరణ భక్త జనావన
పంచ బ్రహ్మ హత్యాది పాప హర పర శివ తత్వార్ధ బోధిత చతుర
పంచనద క్షేత్ర ప్రభాకర పాలిత గురుగుహ భవభయ హర
వీర క్షేత్ర పాల వినుత చరణ విచిత్ర యమ భయాది నివారణ 

భావం
=====

శరణు కోరినవారి ఆర్తిని తీర్చే ఓ పరమేశ్వరా! జగదీశ్వరా! శంకరా! నన్ను రక్షించుము. త్రిపురాసురులను సంహరించినవాడవు, జింకను ధరించేవాడవు, సుందరేశ్వరుడవు, ధర్మసంవర్ధనీ అమ్మవారి మనోహరుడవు, న్న రక్షించుము. పంచనదీశ్వర క్షేత్రంలో వెలసిన పరమశివుడవు, గంగాధరుడవు, సర్పములు ఆభరణముగా కలిగి భక్త జనులను పోషించేవాడవు, పంచ బ్రహ్మ హత్యా పాతకములను తొలగించేవాడవు, పరశివ తత్త్వార్థమును బోధించే నిపుణుడవు, పంచనదములు కలిగిన ఈ క్షేత్రాన్ని ప్రకాశింపజేసేవాడవు, సుబ్రహ్మణ్యుని రక్షకుడవు, సంసార భయములను తొలగించేవాడవు, వీరులైన క్షేత్రపాలకులచే నుతించబడిన చరణములు కలవాడవు, విచిత్రమైన మృత్యు భయాలను నివారించేవాడవు, నన్ను రక్షించుము. 

శ్రవణం
======

నాట రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మల్లాది సోదర్లు ఆలపించారు.

చిత్రం
=====

తిరువయ్యారు లోని పంచనదీశ్వర స్వామి-ధర్మసంవర్ధనీ అమ్మ వారి ఉత్సవ మూర్తులు.

29, నవంబర్ 2020, ఆదివారం

సదా మదిన్ దలతు గదరా - త్యాగరాజస్వామి కృతి


త్యాగరాజస్వామి వారి శివ కృతులను పరిశీలిస్తే ఆయన ఆ తిరువాయూరు త్యాగరాజస్వామి వారిని ఎంతగా ఆరాధించారో అర్థమవుతుంది. అద్వైతమార్గంలో ఉన్న ఔన్నత్యానికి త్యాగరాజస్వామి వారి కృతులు చక్కని ఉదాహరణలు. రామునిపైనే సింహభాగం కృతులు రచించినా ఎన్నో శివునిపై, అమ్మవారిపై, గణపతిపై కృతులను  సద్గురువులను రచించారు. శివారాధనలో ఉన్న ఆనందాన్ని త్యాగరాజస్వామి తన కృతులెన్నిటో ప్రస్తావించారు. అటువంటి ఒక కృతి సదా మదిన్ దలతు. ఉత్సాహవంతమైన గతిలో సద్గురువులు ఈ కృతిని స్వరపరచారు. వివరాలు:

సాహిత్యం
========

సదా మదిన్ దలతు గదరా ముదాస్పద నగజాధిపతీ

సదాశివానందస్వరూప! సదయ మోద హృదయ పద సరోజములనే

దిగంబరాంధక దైత్య హర దిగీశ సన్నుత గంగాధర
మృగాంక శేఖర నటన చతుర మనుప సమయ మిదిరా త్యాగరాజ నుత

భావం
=====

ఓ పార్వతీపతీ! భక్తులకు ఆనందం కలిగించే నిన్ను ఎల్లప్పుడు నా మదిలో తలచుచున్నాను. ఆనందస్వరూపుడవు, ఆనంద హృదయుడవైన ఓ సదాశివా!  నీ పదకములను నేను ఎల్లప్పుడు మదిలో తలచుచున్నాను. ఓ దిగంబరా! అంధకాసురుని సంహరించిన హరా! ఇంద్రునిచే నుతించబడిన గంగాధారా! చంద్రుని శిరసున ధరించిన నటరాజా! నన్ను రక్షించుటకు ఇది సమయము! త్యాగరాజునిచే నుతించబడిన పరమశివా! నిన్ను ఎల్లప్పుడూ నా మదిలో తలచుచున్నాను. 

శ్రవణం
======

గంభీరవాణి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బీఎన్ చిన్మయి గారు ఆలపించారు.

28, నవంబర్ 2020, శనివారం

కోరి సేవింప రారే కోర్కెలీడేర - త్యాగరాజస్వామి కృతి


త్యాగరాజస్వామి శివ కృతులలో కోవూరి సుందరేశ్వరుని పంచరత్న కృతుల ప్రస్తావన చేసుకున్నాము. సుందరేశ్వరుని, సౌందర్యాంబికను దర్శించి, సేవించి సద్గురువులు ఎంత ఆనందించారో మనకు ఈ ఐదు కృతులలో స్పష్టంగా తెలుస్తుంది. తనను అనుగ్రహించిన ఆ సుందరేశ్వరునిపై రచించిన కోరి సేవింపరారే అనే కృతిలో సద్గురువులు స్వామి వైభవాన్ని, అనుగ్రహాన్ని మనోజ్ఞంగా వర్ణించారు. వివరాలు:

సాహిత్యం
======= 

కోరి సేవింప రారే కోర్కెలీడేర 

శ్రీరమణీకరమౌ కోవురి సుందరేశ్వరుని

సురులు వేయి వన్నె బంగారు విరులచే పూజింపగ భూ
సురులు సనకాది మౌని వరులును నుతింపగ
సిరులిత్తునని కొలువై యుండే శ్రీసౌందర్యనాయికా
వరుని శ్రీ త్యాగరాజ వరదుని పరమాత్ముని హరుని

భావము
======

ఓ జనులారా! మనసులో భావించిన కోర్కెలు తీరుట కొరకు శుభకరుడు, సుందరుడు అయిన కోవూరి సుందరేశ్వరుని సేవించుటకు రండి! దేవతలు వేయి వన్నెలు కల బంగారు పుష్పములచే పూజించగా, బ్రాహ్మణులు, సనకాది మునిశ్రేష్ఠులు నుతించగా సమస్త ఐశ్వర్యములను ఇచ్చెదనని కొలువైయున్న సౌందర్యనాయికకు పతియైనవాని, త్యాగరాజునికి వరములిచ్చిన పరమాత్ముడైన శివుని, మనసులో భావించిన కోర్కెలు తీరుటకు ఈ కోవూరి సుందరేశ్వరుని సేవించుటకు రండి. 

శ్రవణం
======

ఖరహరప్రియ రాగంలోని ఈ కృతిని వోలేటి వేంకటేశ్వర్లు గారు ఆలపించారు.

(చిత్రం మదురైలోని సుందరేశ్వరుని ఉత్సవ విగ్రహం)


26, నవంబర్ 2020, గురువారం

తులశమ్మ మా ఇంట నెలకొనవమ్మ - త్యాగరాజస్వామి కృతి

సనాతనధర్మంలోని నిత్యనైమిత్తికాలలో తులసి పూజ అంతర్భాగం. లక్ష్మీ స్వరూపమైన తులసివృక్షాన్ని పవిత్రంగా భావించి పూజించి దళాలను సేవించి తరించినవారు ఎందరో. వారిలో సద్గురువులు త్యాగరాజస్వామి కూడా ఒకరు. నిత్యమూ తులశమ్మను పూజించి ఆ తల్లిని తన కృతుల ద్వారా నుతించారు కూడా. తులసీదళములచే సంతోషముగా పూజింతు అన్న కృతి చాలా ప్రసిద్ధి చెందింది. అలాగే అమ్మ రావమ్మ తులశమ్మ, తులసీ జగజ్జనని, తులశమ్మ మా ఇంట నెలకొనవమ్మ వంటి కృతుల ద్వారా ఆ తల్లిని ఎంతో భక్తితో నుతించారు. వాటిలో దేవగాంధారి రాగంలో కూర్చబడిన కృతిలో సద్గురువులు తన నిత్యోపాసనలో తులసీ పూజా వైభవాన్ని మనోజ్ఞంగా ఆవిష్కరించారు. సగుణోపాసనలో ఉండే ఔన్నత్యాన్ని ఈ కృతిలో మరో మారు మనకు కళ్లకు కట్టినట్లుగా చెప్పారు. వివరాలు:

సాహిత్యం
=======

తులశమ్మ మా ఇంట నెలకొనవమ్మ శ్రీ

ఈ మహిని నీ సమానమెవరమ్మ బంగారు బొమ్మ

కరకు సువర్ణపు సొమ్ములు బెట్టి సరిగె చీరె ముద్దు కురియగ గట్టి
కరుణ జూచి సిరులను ఒడిగట్టి వరదుని కరమును బట్టి శ్రీ

ఉరమున ముత్యపు సరులసియాడ సుర తరుణులు నిన్ను కొనియాడ
వరమును అష్టదిగీశులు వేడ వరదుడు నిను ప్రేమ జూడ శ్రీ 

మరువక పారిజాత సరోజ కురవక వకుళ సుగంధ రాజ
వర సుమములచే త్యాగరాజ వరద నిను బూజసేతు

భావం
=====

శ్రీతులశమ్మా! మా ఇంటిలో నెలకొనుము తల్లీ! ఓ బంగారు బొమ్మా! ఈ భువిలో నీ సమానమెవరు? మెరసే బంగారపు ఆభరణములు ధరించి, ముద్దులు కురిసేలా బంగారు చీర కట్టుకుని, కరుణతో చూచుచు సమస్త ఐశ్వర్యములను ఒడిలో గట్టుకుని, నారాయణుని కరమును బట్టుకొని మా ఇంటిలో నెలకొనుము తల్లీ! శ్రీతులశమ్మా! మెడలో ముత్యాల వరుసలు కదలుచుండగా, దేవతాస్త్రీలు నిన్ను కొనియాడు చుండగా, అష్టదిక్పాలకులు నిన్ను భక్తితో నుతించగా, నారాయణుడు నిన్ను ప్రేమతో జూడగా మా ఇంటిలో నెలకొనుము తల్లీ! శ్రీతులశమ్మా! మరువము, పారిజాతము, కలువలు, ఎర్ర గోరింటలు, పొగడ పూలవంటి శ్రేష్ఠమైన సుగంధ పుష్పములచే పరమేశ్వరుని అనుగ్రహించిన నిన్ను నేను పూజించెదను, మా ఇంటిలో నెలకొనుము తల్లీ!

శ్రవణం
=======

ఈ కృతిని బెంగళూరు సోదరులు హరిహరన్ అశోక్ ఆలపించారు

24, నవంబర్ 2020, మంగళవారం

హరియే గతి సకల చరాచరములకు - మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి కృతి



మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి బహుముఖ ప్రజ్ఞలో గాత్రం, వయోలిన్ సంగీత విద్వత్తుతో పాటు అద్భుతమైన కృతులను రచించి స్వరపరచి, భావరాగ యుక్తంగా ఆలపించే వాగ్గేయకార నైపుణ్యం కూడా ఉంది. ఆయన కొన్ని వందల కృతులను రచించారు. వాటిలో రాగమాలికలు కూడా ఉన్నాయి. వాగ్గేయకారులకు సంగీతంతో పాటు భాషలో పరిపూర్ణమైన నైపుణ్యం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఛందోబద్ధంగా, తాళానికి తగినట్లుగా సాహిత్యాన్ని రచించాలి కాబట్టి వ్యాకరణంపై పట్టు చాలా ముఖ్యం. ఒకే అర్థాన్ని తెలిపే అనేక పదాల అవగాహన పూర్తిగా ఉండాలి, భక్తిభావాన్ని ఉన్నతంగా ఒలికించే స్థాయిలో పరిజ్ఞానం ఉండాలి. పసిబాలుడిగా ఉన్నప్పుడే కచేరీలు మొదలు పెట్టిన బాలమురళి గారు దశాబ్దాల పాటు ఆలిండియా రేడియోలో విజయవాడలో పని చేశారు, ఎందరో కళాకారులకు మార్గదర్శకులుగా నిలిచారు. ఆ సమయం నుండే ఆయన కృతులను రచించారు. ఆయన కృతులతో పాటు ఎన్నో కొత్త రాగాలను కూడా సృష్టించారు. రాగమాలికగా వారు రచించిన ఒక కృతి హరియే గతి. పల్లవి రేవగుప్తిలో, చరణాలు కాంభోజి, శుద్ధ ధన్యాసి, హంసానంది రాగాలలో స్వరపరచారు మంగళంపల్లి వారు. కృతి వివరాలు:

సాహిత్యం
========

హరియే గతి సకల చరాచరములకు
హరియే గతి విరించి రుద్రాదులకైన

ముద్దుల బాలుడై మురళిని చేపట్టి
బాలమురళివై నాదము పూరించి
ముల్లోకములను మునులను సైతము
మురిపించి మైమరపించిన శ్రీ 

ఆయా యుగముల ధర్మము నిలుపగ
అవతారములను దాల్చిన దైవము
హయవాహనుడై కలియుగమందున
అలమేలుమంగపతివై వెలసిన

భస్మాసురులు నయ వంచకులు
అసహన శూరులు పలు శిశుపాలురు
పట్టి బాధించు నిట్టి తరుణమున
పాలన సేయుటకెవరు మాకెవరు

భావం
=====

సమస్త చరాచర జీవరాశులకు శ్రీహరియే గతి. బ్రహ్మ రుద్రాదులకు కూడా శ్రీహరియే గతి. ఆయా యుగములలో ధర్మమును నిలబెట్టుటకు అవతారములెత్తిన పరమాత్మ, అశ్వమును అధిరోహించి కలియుగములో కల్కిగా, అలమేలుమంగాపతియైన శ్రీనివాసునిగా వెలసిన ఆ శ్రీహరే సమస్త చరాచర జీవరాశులకు గతి. భస్మాసురుని వంటి దుష్టులు, దారుణంగా మోసం చేసే వారు, సహనములేని శూరులు, శిశుపాలుని వంటి నీచులు అనేకులు ఈ సమాజాన్ని పట్టి బాధించే ఈ సమయంలో మమ్మలను పాలించేవారెవరు? సమస్త చరాచర జీవరాశులకు ఆ శ్రీహరియే గతి.

శ్రవణం
======

అద్భుతమైన చిట్టస్వరాలతో ఉన్న ఈ కృతిని డాక్టర్ బాలమురళీకృష్ణ గారి ఆలాపనలో దృశ్యశ్రవణంగా వీక్షించండి

22, నవంబర్ 2020, ఆదివారం

ఇలలో ప్రణతార్తిహరుడనుచు - త్యాగరాజస్వామి కృతి


దైవాన్ని నిందించటం భక్తిమార్గంలో మానవ సహజమే. ఒక దైవాన్ని నమ్ముకున్నప్పుడు అసహాయ స్థితిలో ఆ దైవం పలకకపోతే భక్తునికి నిరాశతో అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ, అది తాత్కాలిక భావనే. త్రికరణశుద్ధిగా కొలిచే భక్తుని దైవం అనుగ్రహించకుండా ఉంటాడా? త్యాగరాజస్వామికి అటువంటి అనుగ్రహాలు ఎన్నో. అందుకే ఆయన రచించిన కృతులలో అన్ని రకాల భావనలకు స్థానం ఉంది. తిరువాయూరులోని  పార్వతీపరమేశ్వరుల రూపమైన ధర్మసంవర్ధిని, పంచనదీశ్వరులపై ఆయన కొన్ని కృతులను రచించారు. వాటిలో ఇలలో ప్రణతార్తిహరుడనుచు ఒకటి. తాను ఎంతో ఉపాసన చేసి, కృశించి, ఎంతో కాలము పాదసేవ చేసినా, నిరంతరము సాష్టాంగ ప్రణామాలు చేసినా భక్తసులభుడని పేరొందిన శంకరునికి తనపై కరుణ కలుగలేదని త్యాగరాజస్వామి నిలదీసి అడుగుతున్నారు. భక్తునికి భగవంతుని మధ్య ఇటువంటి సంభాషణలు అనేకం. ఇక్కడ మనం సాష్టాంగ ప్రణామముల ప్రస్తావన చేసుకోవాలి. సాష్టాంగ నమస్కారము అంటే మనకు ఉన్న ఎనిమిది అంగాలతో నమస్కారము చేయుట అని అర్ధము. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోऽష్టాంగ ఈరితః, అనగా ఉరముతో, శిరస్సుతో, కన్నులతో, మనసుతో, మాటతో, పాదములతో, చేతులతో, చెవులతో దైవానికి నమస్కరించుట. ఇది ఉపాసనా మార్గంలో ఒక ముఖ్యమైన ఆచారం. దైవం ముందు ఈ ప్రణామం చేయటంలో మనలోని అహంకారానికి మాతృకలైన ఈ ఇంద్రియాలను వంచి పరమాత్మకు దాసోహం అనటం. ప్రతి రోజూ కూడా ఇది చేయటం నిత్యానుష్ఠానంలో ఒక విధి. త్యాగరాజస్వామి ఆ సాష్టాంగ ప్రణామాన్ని ప్రస్తావించటంలో ఉద్దేశం నా సర్వస్వమూ నీ పాదముల వద్ద ఉంచి కొలిచినా నీవు పలకటం లేదు అని. కృతి వివరాలు:

సాహిత్యం
========

ఇలలో ప్రణతార్తిహరుడనుచు పేరెవరిడిరే శంకరుడని నీ

తలచి కరగి చిరకాలము పదమున దండమిడిన నా యెడ దయ లేదాయే

కరచరణ యురము నొసలు భుజములు ధరణి సోక మ్రొక్కగ లేదా
శరణనుచును మొరలిడ లేదా పంచనదీశ త్యాగరాజనుత నీ

భావం
======

త్యాగరాజునిచే నుతించబడిన ఓ పంచనదీశ్వరా! ఈ భూమిపై భక్తుల ఆర్తిని తొలగించేవాడని, శంకరుడని నీకు పేరెవరు ఇచ్చారు? నిన్నే తలచి, కృశించి, చిరకాలముగా నీ పదములకు నమస్కరించిన నా పట్ల నీకు దయలేదాయె! చేతులతో, కాళ్లతో, ఉరముతో, నొసలతో, భుజములతో భూమిని తాకేలా మ్రొక్కగా నాపై దయలేదా? నిన్నే శరణనుచు నేను మొరలిడలేదా?! ఈ భూమిపై భక్తుల ఆర్తిని తొలగించేవాడని, శంకరుడని నీకు పేరెవరు ఇచ్చారు? 

శ్రవణం
======

అఠానా రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు

(చిత్రం తిరువాయూర్ పంచనదీశ్వరుడు, ధర్మసంవర్ధిని అమ్మ వారి ఉత్సవమూర్తులు)

21, నవంబర్ 2020, శనివారం

శివ శివ శివ యనరాదా - త్యాగరాజస్వామి కృతి


త్యాగరాజస్వామి నిరంతరం దారితప్పే మనసును సరిదిద్దే సందేశమున్న కృతులను ఎన్నో రచించారు. మనసా ఎటులోర్తునే, మనవి ఆలకించరాదటే వంటి కృతుల ద్వారా మనసును నియంత్రించుకునే మార్గాలను మనకు తెలిపారు. అటువంటి ఒక కృతే శివ శివ శివ యనరాదా. అరిషడ్వర్గాలను, ఇతర దుర్గుణాలను పక్కకు పెట్టి,అన్య స్త్రీలు, అన్యుల ధనముపై ధ్యాస వీడటం మొదలైన వాటిని ఆచరిస్తూ నియమ నిష్ఠలతో పరమశివుని మనసారా కొలువమని చెప్పారు. సజ్జన సాంగత్యం, వేదాధ్యయనం, భగవద్భక్తుల సేవ, శివనామస్మరణ చేస్తే ఈ జన్మకు సంబంధించిన సంసార బాధలను తొలగించుకోవచ్చని హితవు పలికారు. కృతి వివరాలు:

సాహిత్యం
========

శివ శివ శివ యనరాదా ఓరీ భవ భయ బాధలనణచుకోరాదా

కామాదుల తెగగోసి పరభామల పరులధనముల రోసి
పామరత్వము నెడబాసి అతి నేమముతో బిల్వార్చన చేసి 

సజ్జన గణముల గాంచి ఓరీ ముజ్జగదీశ్వరులని మతినెంచి
లజ్జాదుల తొలగించి తన హృజ్జలజమునను పూజించి

ఆగమముల నుతియించి బహు బాగు లేని భాషలు చాలించి
భాగవతులతో పోషించి ఓరీ త్యాగరాజ సన్నుతుడని యెంచి

భావం
======

ఓ మనసా! శివ నామస్మరణము చేస్తూ ఈ జన్మ సంసార భయములను, బాధలను అణచుకోరాదా! కామాది అరిషడ్వర్గములను తెగత్రుంచి, అన్యస్త్రీలను, పరుల ధనాదులపై ఆలోచనలను త్యజించి, అజ్ఞానాన్ని విడిచి అత్యంత నియమనిష్ఠలతో బిల్వార్చనతో శివ నామస్మరణము చేస్తూ ఈ జన్మ సంసార భయములను, బాధలను అణచుకోరాదా! సజ్జన సమూహములను దర్శించుకుని ఆ పరమశివుని మూడులోకాలకు అధిపతి అని గ్రహించి, దురభిమానము మొదలైన దుర్గుణములను తొలగించుకుని, మన హృదయకమలముచే పూజిస్తూ శివ నామస్మరణము చేస్తూ ఈ జన్మ సంసార భయములను, బాధలను అణచుకోరాదా! వేదములను నుతిస్తూ అనవసరమైన సంభాషణలను కట్టి పెట్టి, భాగవతోత్తములను పోషించి, త్యాగరాజునిచే పూజించబడిన వాడని భావించి శివ నామస్మరణము చేస్తూ ఈ జన్మ సంసార భయములను, బాధలను అణచుకోరాదా! 

శ్రవణం
=======

పంతువరాళి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవిత విశేషాలు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆధునిక భారతదేశంలో ఆధ్యాత్మిక సందేశాన్ని విద్య, వైద్యం, తాగునీరు, సేవా కార్యక్రమాలతో ముడిపెట్టిన మహనీయులు. ఆయన 1926...