మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి బహుముఖ ప్రజ్ఞలో గాత్రం, వయోలిన్ సంగీత విద్వత్తుతో పాటు అద్భుతమైన కృతులను రచించి స్వరపరచి, భావరాగ యుక్తంగా ఆలపించే వాగ్గేయకార నైపుణ్యం కూడా ఉంది. ఆయన కొన్ని వందల కృతులను రచించారు. వాటిలో రాగమాలికలు కూడా ఉన్నాయి. వాగ్గేయకారులకు సంగీతంతో పాటు భాషలో పరిపూర్ణమైన నైపుణ్యం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఛందోబద్ధంగా, తాళానికి తగినట్లుగా సాహిత్యాన్ని రచించాలి కాబట్టి వ్యాకరణంపై పట్టు చాలా ముఖ్యం. ఒకే అర్థాన్ని తెలిపే అనేక పదాల అవగాహన పూర్తిగా ఉండాలి, భక్తిభావాన్ని ఉన్నతంగా ఒలికించే స్థాయిలో పరిజ్ఞానం ఉండాలి. పసిబాలుడిగా ఉన్నప్పుడే కచేరీలు మొదలు పెట్టిన బాలమురళి గారు దశాబ్దాల పాటు ఆలిండియా రేడియోలో విజయవాడలో పని చేశారు, ఎందరో కళాకారులకు మార్గదర్శకులుగా నిలిచారు. ఆ సమయం నుండే ఆయన కృతులను రచించారు. ఆయన కృతులతో పాటు ఎన్నో కొత్త రాగాలను కూడా సృష్టించారు. రాగమాలికగా వారు రచించిన ఒక కృతి హరియే గతి. పల్లవి రేవగుప్తిలో, చరణాలు కాంభోజి, శుద్ధ ధన్యాసి, హంసానంది రాగాలలో స్వరపరచారు మంగళంపల్లి వారు. కృతి వివరాలు:
సాహిత్యం
========
హరియే గతి సకల చరాచరములకు
హరియే గతి విరించి రుద్రాదులకైన
ముద్దుల బాలుడై మురళిని చేపట్టి
బాలమురళివై నాదము పూరించి
ముల్లోకములను మునులను సైతము
మురిపించి మైమరపించిన శ్రీ
ఆయా యుగముల ధర్మము నిలుపగ
అవతారములను దాల్చిన దైవము
హయవాహనుడై కలియుగమందున
అలమేలుమంగపతివై వెలసిన
భస్మాసురులు నయ వంచకులు
అసహన శూరులు పలు శిశుపాలురు
పట్టి బాధించు నిట్టి తరుణమున
పాలన సేయుటకెవరు మాకెవరు
భావం
=====
సమస్త చరాచర జీవరాశులకు శ్రీహరియే గతి. బ్రహ్మ రుద్రాదులకు కూడా శ్రీహరియే గతి. ఆయా యుగములలో ధర్మమును నిలబెట్టుటకు అవతారములెత్తిన పరమాత్మ, అశ్వమును అధిరోహించి కలియుగములో కల్కిగా, అలమేలుమంగాపతియైన శ్రీనివాసునిగా వెలసిన ఆ శ్రీహరే సమస్త చరాచర జీవరాశులకు గతి. భస్మాసురుని వంటి దుష్టులు, దారుణంగా మోసం చేసే వారు, సహనములేని శూరులు, శిశుపాలుని వంటి నీచులు అనేకులు ఈ సమాజాన్ని పట్టి బాధించే ఈ సమయంలో మమ్మలను పాలించేవారెవరు? సమస్త చరాచర జీవరాశులకు ఆ శ్రీహరియే గతి.
శ్రవణం
======
అద్భుతమైన చిట్టస్వరాలతో ఉన్న ఈ కృతిని డాక్టర్ బాలమురళీకృష్ణ గారి ఆలాపనలో దృశ్యశ్రవణంగా వీక్షించండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి