త్యాగరాజస్వామి వారి శివ కృతులను పరిశీలిస్తే ఆయన ఆ తిరువాయూరు త్యాగరాజస్వామి వారిని ఎంతగా ఆరాధించారో అర్థమవుతుంది. అద్వైతమార్గంలో ఉన్న ఔన్నత్యానికి త్యాగరాజస్వామి వారి కృతులు చక్కని ఉదాహరణలు. రామునిపైనే సింహభాగం కృతులు రచించినా ఎన్నో శివునిపై, అమ్మవారిపై, గణపతిపై కృతులను సద్గురువులను రచించారు. శివారాధనలో ఉన్న ఆనందాన్ని త్యాగరాజస్వామి తన కృతులెన్నిటో ప్రస్తావించారు. అటువంటి ఒక కృతి సదా మదిన్ దలతు. ఉత్సాహవంతమైన గతిలో సద్గురువులు ఈ కృతిని స్వరపరచారు. వివరాలు:
సాహిత్యం
========
సదా మదిన్ దలతు గదరా ముదాస్పద నగజాధిపతీ
సదాశివానందస్వరూప! సదయ మోద హృదయ పద సరోజములనే
దిగంబరాంధక దైత్య హర దిగీశ సన్నుత గంగాధర
మృగాంక శేఖర నటన చతుర మనుప సమయ మిదిరా త్యాగరాజ నుత
భావం
=====
ఓ పార్వతీపతీ! భక్తులకు ఆనందం కలిగించే నిన్ను ఎల్లప్పుడు నా మదిలో తలచుచున్నాను. ఆనందస్వరూపుడవు, ఆనంద హృదయుడవైన ఓ సదాశివా! నీ పదకములను నేను ఎల్లప్పుడు మదిలో తలచుచున్నాను. ఓ దిగంబరా! అంధకాసురుని సంహరించిన హరా! ఇంద్రునిచే నుతించబడిన గంగాధారా! చంద్రుని శిరసున ధరించిన నటరాజా! నన్ను రక్షించుటకు ఇది సమయము! త్యాగరాజునిచే నుతించబడిన పరమశివా! నిన్ను ఎల్లప్పుడూ నా మదిలో తలచుచున్నాను.
శ్రవణం
======
గంభీరవాణి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బీఎన్ చిన్మయి గారు ఆలపించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి