22, నవంబర్ 2020, ఆదివారం

ఇలలో ప్రణతార్తిహరుడనుచు - త్యాగరాజస్వామి కృతి


దైవాన్ని నిందించటం భక్తిమార్గంలో మానవ సహజమే. ఒక దైవాన్ని నమ్ముకున్నప్పుడు అసహాయ స్థితిలో ఆ దైవం పలకకపోతే భక్తునికి నిరాశతో అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ, అది తాత్కాలిక భావనే. త్రికరణశుద్ధిగా కొలిచే భక్తుని దైవం అనుగ్రహించకుండా ఉంటాడా? త్యాగరాజస్వామికి అటువంటి అనుగ్రహాలు ఎన్నో. అందుకే ఆయన రచించిన కృతులలో అన్ని రకాల భావనలకు స్థానం ఉంది. తిరువాయూరులోని  పార్వతీపరమేశ్వరుల రూపమైన ధర్మసంవర్ధిని, పంచనదీశ్వరులపై ఆయన కొన్ని కృతులను రచించారు. వాటిలో ఇలలో ప్రణతార్తిహరుడనుచు ఒకటి. తాను ఎంతో ఉపాసన చేసి, కృశించి, ఎంతో కాలము పాదసేవ చేసినా, నిరంతరము సాష్టాంగ ప్రణామాలు చేసినా భక్తసులభుడని పేరొందిన శంకరునికి తనపై కరుణ కలుగలేదని త్యాగరాజస్వామి నిలదీసి అడుగుతున్నారు. భక్తునికి భగవంతుని మధ్య ఇటువంటి సంభాషణలు అనేకం. ఇక్కడ మనం సాష్టాంగ ప్రణామముల ప్రస్తావన చేసుకోవాలి. సాష్టాంగ నమస్కారము అంటే మనకు ఉన్న ఎనిమిది అంగాలతో నమస్కారము చేయుట అని అర్ధము. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోऽష్టాంగ ఈరితః, అనగా ఉరముతో, శిరస్సుతో, కన్నులతో, మనసుతో, మాటతో, పాదములతో, చేతులతో, చెవులతో దైవానికి నమస్కరించుట. ఇది ఉపాసనా మార్గంలో ఒక ముఖ్యమైన ఆచారం. దైవం ముందు ఈ ప్రణామం చేయటంలో మనలోని అహంకారానికి మాతృకలైన ఈ ఇంద్రియాలను వంచి పరమాత్మకు దాసోహం అనటం. ప్రతి రోజూ కూడా ఇది చేయటం నిత్యానుష్ఠానంలో ఒక విధి. త్యాగరాజస్వామి ఆ సాష్టాంగ ప్రణామాన్ని ప్రస్తావించటంలో ఉద్దేశం నా సర్వస్వమూ నీ పాదముల వద్ద ఉంచి కొలిచినా నీవు పలకటం లేదు అని. కృతి వివరాలు:

సాహిత్యం
========

ఇలలో ప్రణతార్తిహరుడనుచు పేరెవరిడిరే శంకరుడని నీ

తలచి కరగి చిరకాలము పదమున దండమిడిన నా యెడ దయ లేదాయే

కరచరణ యురము నొసలు భుజములు ధరణి సోక మ్రొక్కగ లేదా
శరణనుచును మొరలిడ లేదా పంచనదీశ త్యాగరాజనుత నీ

భావం
======

త్యాగరాజునిచే నుతించబడిన ఓ పంచనదీశ్వరా! ఈ భూమిపై భక్తుల ఆర్తిని తొలగించేవాడని, శంకరుడని నీకు పేరెవరు ఇచ్చారు? నిన్నే తలచి, కృశించి, చిరకాలముగా నీ పదములకు నమస్కరించిన నా పట్ల నీకు దయలేదాయె! చేతులతో, కాళ్లతో, ఉరముతో, నొసలతో, భుజములతో భూమిని తాకేలా మ్రొక్కగా నాపై దయలేదా? నిన్నే శరణనుచు నేను మొరలిడలేదా?! ఈ భూమిపై భక్తుల ఆర్తిని తొలగించేవాడని, శంకరుడని నీకు పేరెవరు ఇచ్చారు? 

శ్రవణం
======

అఠానా రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు

(చిత్రం తిరువాయూర్ పంచనదీశ్వరుడు, ధర్మసంవర్ధిని అమ్మ వారి ఉత్సవమూర్తులు)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి