24, ఆగస్టు 2020, సోమవారం

అనేక రూపాలలో ఒకడు - కంచి పరమాచార్యుల వారు


ఒకే ఒక పరమాత్మ విభిన్న దేవతలుగా కనబడతాడు. ఒక్కొక్క భక్తుడు భగవంతుని ఒక్కొక్క రూపానికి అంకితమవుతాడు. భక్తుని భక్తి అధికం చేయటానికి ఆ దేవత యొక్క లక్షణాన్నే ఎక్కువ చేసి, ఇతర లక్షణాలను అణచి ఉంచుతాడు. సారూప్యాలతో వివరాలు తెలుసుకుందాం.

పూర్వం వీధులలో లాంతర్లుండేవి. దీపం చుట్టూ నాలుగు గాజు పలకలుండేవి. కొన్నింటికి మూడు పలకలుండేవి. దీపపు కాంతి మూడు వైపులా విరజిమ్మేది. ఒక్కొక్కసారి ఆ మూడు పలకలకు అలంకారానికై మూడు రంగులు వేసేవారు. దాని ఫలితంగా ఒక్కొక్క గాజు పలక ద్వారా వచ్చే కాంతి ఒక్కొక్క రంగులో ఉండేది. ఒకే పరమాత్మ సృష్టిస్థితిలయములకు కారణం. చైతన్యమే అన్నిటికీ మూలం. ఆ చైతన్యమే మూడు పార్శ్వాలు గల లాంతరులో ఉన్నదనుకోండి. మూడు రంగులలో ఒకటి ఎరుపు - అదే సృష్టి. స్పెక్ట్రోస్కోప్‌లో ఎరుపు రంగును మాత్రమే మొత్తం కాంతి నుండి విడదీస్తే మిగిలినవన్నీ కూడా విరిగిపోతాయి. సృష్టి ఏకం నుండి అనేకమవటమంటే ఇదే. ఈ కారణం చేతనే సృష్టికర్త అయిన బ్రహ్మది ఎరుపు వర్ణమంటారు.

లాంతరులో ఇంకొక రంగు ఊదా. స్పెక్ట్రంలో ఇది ఆఖరి రంగు. మొదటిది ఎరుపు చివరిది నీలం. సృష్టింపబడిన జగత్తును సంస్థితం చేసేటప్పుడు విష్ణువు జ్ఞానంతో ఇలా చెబుతున్నట్లుంటుంది - "ఈ జగత్తు మిథ్య. దీనిని పరమాత్మతో సమానమనుకోకూడదు. ఇదంతా పరమాత్ముని లీల". ఆ జ్ఞానజ్యోతిలో దృశ్యమానమైన జగత్తంతా దగ్ధమైపోతుంది - కాలిన బొగ్గులా మారిపోతుంది. వస్తువు తగలబడిపోయినా రూపమాత్రావశిష్టమై ఉండే దశ అది - అదే, వస్తువు ఇంకా ఉన్నట్లు భ్రమ కలిగిస్తుంది. రూపమైతే ఉండవచ్చు, కానీ, రంగు పోతుంది. జగత్తు ఉండవచ్చు, కానీ, అది సత్యమన్న భ్రమ పోతుంది. "సర్వం విష్ణుమయం జగత్" అంతా నీలి రంగు గల విష్ణువే. నీలమేఘశ్యామల - నీలం, నలుపు, ఊదా - అన్నీ మూడు పలకలు గల లాంతరు వలె రూపాన్ని ధరిస్తాడు. నీలిరంగు అద్దం నుండి బయటకు వచ్చే కాంతిని విష్ణువంటాము.

మూడవ పలకకు ఏ రంగూ లేదు. అంతా జ్ఞానమనే జ్వాలలో దగ్ధమైతే - మొదట బొగ్గులా నల్లగా ఉంటుంది, ఇంకా అగ్నికి గురైతే అది బూడిద అవుతుంది. అస్తికగా మారుతుంది. అది కూడా దగ్ధమై అసలు రూపాన్నే కోల్పోతుంది. మొదట్లో ఉన్న నల్లరంగు పోయి అంతా తెలుపవుతుంది. తెలుపు కూడా స్వచ్ఛమైన కాంతే. పరమాత్మ నుండి వచ్చిన అన్ని రంగులూ అస్తిత్వాన్ని కోల్పోయి మళ్లీ పరమాత్మే అవుతాయి. ప్రతి ఒక్క రంగుకు భ్రమకొల్పే ఉనికి పోతుంది. అదే మహాభస్మం. అదే పరమశివుడు. పైకి చాలా క్రూరమైన కార్యంగా ఈ సంహారం తోస్తుంది. కానీ, దీనితోనే ఆగడు పరమశివుడు. ఆ పని జగత్తుకు తన మూలంతో అనుసంధానం కలిగించే కరుణామయ కార్యమే. తన లీలలో దృశ్యమానమైన జగత్తుకు జ్ఞానం కలిగించినప్పుడు "జగత్సర్వం" ప్రేక్షకునికి బొగ్గులా కనబడింది. అందువల్లే "సర్వం విష్ణుమయం జగత్" అన్న వర్ణన వచ్చింది. లీల ముగిసిన తరువాత, పరమ జ్ఞానం వల్ల సంహారమైనప్పుడు "జగత్సర్వం" లేదు. అందువల్లే అంతా శివమయం అంటాము.

ఒకే లాంతరు - బ్రహ్మ చైతన్యం - ఎరుపు గాజులోంచి చూచినప్పుడు బ్రహ్మగా (సృష్టికర్తగా), నీలపు గాజు ద్వారా చూచినప్పుడు విష్ణువుగా, ఏ రంగూ లేని గాజుపలక ద్వారా చూచినప్పుడు శివునిగా కనబడుతుంది. ఒకే మూర్తి త్రిమూర్తులుగా కనబడే వానిగా పరమాత్మను ఋషులు కొనియాడారు. ఏ సిద్ధాంతానికీ కట్టుబడకుండా విశాలదృక్పథం అలవరచుకున్న కవులు పరమాత్మను త్రిమూర్త్యాత్మకంగానే వర్ణించారు.

23, ఆగస్టు 2020, ఆదివారం

పంచ మాతంగ ముఖ గణపతినా - ముత్తుస్వామి దీక్షితుల వారు


 పంచ మాతంగ ముఖ గణపతినా పరిపాలితోహం సుముఖేన శ్రీ

పంచ భూతాత్మక ప్రపంచోదయాది కరణ వి
రించి హరి రుద్ర నుతేన పంచ వక్త్ర శివ సుతేన

వరదాభయ పాశ శృణి కపాల దంత మోదక ము
ద్గరాక్షమాలా కరేణ కమలాపుర విహారేణ
పురుహూతాద్యఖిల దేవ పూజిత విఘ్నేశ్వరేణ
వర గురుగుహ సోదరేణ సురుచిర లంబోదరేణ
కరుణాంగ గౌరతురేణ కలి మల హర తరేణ


ఐదు గజముఖములు కలిగినవాడు, భక్తుల పాలిట సుముఖుడు అయిన గణపతి నన్ను కాపాడుచున్నాడు. పంచభూతాత్మకమైనవాడు, సృష్టికి కారణమైన వాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే నుతించబడిన వాడు, ఐదు ముఖములు గల శివుని సుతుడు అయిన గణపతి నన్ను కాపాడుచున్నాడు. వరద అభయ ముద్రలతో, పాశము, అంకుశము, కపాలము, ఏకదంతము, మోదకము, ముద్గరము (సమ్మెట), రుద్రాక్షమాల ధరించినవాడు, కమలాపురములో విహరించేవాడు, ఇంద్రాది అఖిల దేవతలచే పూజించబడే విఘ్నేశ్వరుడు, శ్రేష్ఠుడైన కుమారస్వామికి సోదరుడు, అందమైన ఉదరము గలవాడు, కరుణకు ప్రసిద్ధి గాంచినవాడు, కలి దోషములను హరించి భవసాగరమును దాటించే వాడు అయిన గణపతి నన్ను కాపాడుచున్నాడు.

- ముత్తుస్వామి దీక్షితుల వారు

వాతాపి గణపతిం భజేహం -- ముత్తుస్వామి దీక్షితుల వారు

 

వాతాపి గణపతిం భజేహం వారణాశ్యం వరప్రదం శ్రీ

భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం
వీత రాగిణం వినుత యోగినం విశ్వకారణం విఘ్నవారణం

పురా కుంభసంభవ మునివర ప్రపూజితం త్రికోణ మధ్యగతం
మురారి ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్ర స్థితం
పరాది చత్వారి వాగాత్మకం ప్రణవ స్వరూపం వక్ర తుండం
నిరంతరం నిటల చంద్ర ఖండం నిజ వామకర విధ్రుతేక్షు దండం
కరాంబుజ పాశ బీజాపూరం కలుష విదూరం భూతాకారం
హరాది గురు గుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం

గజముఖుడు, వరములనొసగే దైవమైన వాతాపి గణపతిని నేను భజించుచున్నాను. సమస్త భూతగణములచే పూజించబడిన చరణములు కలవాడు, పంచభూతాత్మకమైన ప్రపంచమును భరించేవాడు, మమకారమునకు అతీతమైనవాడు, యోగులచే నుతించబడేవాడు, విశ్వానికి కారణమైన వాడు, విఘ్నములను నివారించే వాడు అయిన వాతాపి గణపతిని నేను భజించుచున్నాను. కుంభసంభవుడైన అగస్త్య మునిశ్రేష్ఠునిచే పూజించబడిన సనాతనుడు, త్రికోణాకార మధ్యమంలో జాగృతమై యుండేవాడు, విష్ణువు మొదలైన ప్రముఖులచే ఉపాసించిబడినవాడు, మూలాధార క్షేత్రములో స్థితుడైనవాడు, పర పశ్యంతి మధ్యమ వైఖరీ వాక్‌స్వరూపుడు, ఓంకార స్వరూపుడు, వక్రతుండుడు, ఎల్లప్పుడూ తలపై చంద్రవంక కలిగిన వాడు, ఎడమ చేతిలో చెరకు గడతో ప్రకాశించేవాడు, కలువలవంటి చేతులలో పాశము, బీజఫలములు కలిగినవాడు, కలుషములు లేనివాడు, పంచభూతాత్మకుడు, పరమశివుడు మరియు కుమారస్వామి సంతోషించే రూపము కలవాడు, హంసధ్వని రాగముచేత అలంకరించబడిన వాతాపి గణపతిని నేను భజించుచున్నాను.


దీక్షితులవారి క్షేత్ర ప్రాధాన్య కృతులలో వాతాపి గణపతిం భజేహం కూడా ఒకటి. తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరుచెంకాట్టంకూడి సమీపంలోని గణపతీశ్వర క్షేత్రంలోని గణపతిని వాతాపి గణపతి అంటారు. ఈ గణపతిని వాతాపి అనటానికి కారణం ఇక్కడ ఉన్న రూపం ఒకప్పుడు చాళుక్యుల రాజధాని అయిన బాదామి (దాని అసలు పేరు వాతాపి) నుండి ఈ విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించటం వల్ల. ఈ క్షేత్రంలో గణపతి పరమశివుని కొలిచినందున దీనికి గణపతీశ్వరం అని పేరొచ్చింది. ఈ గణపతిపై దీక్షితులవారు రచించిన కృతిలో గణపతి తత్త్వాన్ని మొత్తం ఆవిష్కరించారు. ముఖ్యంగా చరణంలో త్రికోణమధ్య గతం మరియు మూలాధార క్షేత్ర స్థితం అన్నవి గణపతి ఉపాసనలో ఆ దేవతాస్వరూపం యొక్క ప్రత్యేకమైన యంత్ర తంత్ర స్వరూపాలను తెలిపేవి. అలాగే పరాది చత్వారి వాగాత్మకం, ప్రణవ స్వరూప అన్న పదాలలో పరమాత్మ తత్త్వాన్ని ఆవిష్కరించారు. పరావాణిగా మూలాధార క్షేత్రమైన వెన్నెముక చివరి భాగము నుండి, పశ్యంతీ వాణిగా తరువాత మణిపూర చక్ర స్థానమైన నాభి నుండి, తరువాత హృదయ స్థానమునుండి మధ్యమవాణిగా, కంఠమునుండి వైఖరీవాణిగా ప్రకటిమయ్యే నాదస్వరూపం పరమాత్మ తత్త్వం. ప్రణవస్వరూపునిగా గణపతిని వర్ణించటం ఆయన రూపంతో పాటు, ఆయన లక్షణాలు, మహత్తుకు కూడా సారూప్యత కలిగి ఉండటం వలనే. గణపతి అథర్వ శీర్షంలో పది అనువాకములలో గణపతి తత్త్వాన్ని ఆవిష్కరించబడింది. ఆ అథర్వశీర్షం సారాన్ని గణపతి రూపవర్ణనలోనూ, తత్త్వావిష్కరణలోనూ దీక్షితుల వారు తు.చ. తప్పకుండా ఈ కృతి ద్వారా మనకు తెలియజేశారు. త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి, త్వం వాఙ్మయస్త్వం చిన్మయః, త్వం భూమిరాపోऽనలోऽనిలో నభః, త్వం మూలాధారే స్థితోऽసి నిత్యం, త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం మొదలైన అథర్వశీర్ష వివరణలను యథాతథంగా వాతాపి గణపతిం భజేహం కృతిలో ఆవిష్కరించారు దీక్షితుల వారు. దీనిని బట్టి వారి ఆధ్యాత్మిక ఔన్నత్యం, వారి జ్ఞానం మనకు తేటతెల్లమవుతాయి. ఉపాసనా మార్గంలో పరిపూర్ణత్వాన్ని పొందే ప్రయాణంలో దీక్షితుల వారు ఇటువంటి యంత్ర మంత్ర స్వరూప లక్షణాలను ఆవిష్కరించే కృతులను ఆయా క్షేత్రాలలో దేవతలను ఉపాసిస్తూ రచించారు. అందుకే దీక్షితులవారి కృతులు కర్ణాటక సంగీత ప్రపంచంలో ఉన్నతమైన స్థానం కలవి.

(రెండవ చిత్రం తిరుచెంకాట్టంగూడి గణపతీశ్వరంలోని వాతాపి గణపతి మూర్తి)

22, ఆగస్టు 2020, శనివారం

హనుమంతుడు - యువకులకు ఆదర్శం

ఒకప్పుడు పెళ్ళికాని యువకులందరూ హనుమంతుని ఆదర్శంగా తీసుకుని ఆరాధించమని, వారి వద్ద హనుమంతుని రూపంతో మెడలో బిళ్ల గాని, విగ్రహం గానీ, ఫోటో గాని ఉంచమని పెద్దలు చెప్పేవాళ్లు. అలాగే హనుమాన్ చాలీసా పఠించటం, హనుమంతుని దేవాలయాలలో ప్రదక్షిణలు చేయటం, హనుమాన్ వ్యాయామశాల పేరిట శరీర దారుఢ్యంపై దృష్టిపెట్టటం జరిగింది. చాలామంది వీటిని పాటించేవారు కూడా. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. దానిని పునరుద్ధరించవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే యువకులు మానసిక దౌర్బల్యంతో, అనేక రకాల అసంతులనలతో అనేక రకాలుగా బాధ పడుతున్నారు. అది వారినే కాదు వారి కుటుంబాలను కూడా ప్రభావితం చేస్తోంది. ఈ పోస్టులో కింది శ్లోకాలు అనేక అంశాలలో ప్రస్తావనకు వాస్తాయి, వాటి అర్థాన్ని ముందు తెలుసుకుందాం.

బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాత్ స్మరణాత్ భవేత్

హనుమంతుని స్మరించటం వలన బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వం, ఆరోగ్యము, జాగరూకత, మాటలలో బలం కలుగుతాయి

మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి

మనస్సు అంత వేగము, వాయువుతో సమానమైన వేగము కలవాడు, ఇంద్రియములను జయించినవాడు, బుద్ధిమంతుడు, శ్రేష్ఠుడు, వాయుసుతుడు, వానరసేనకు ప్రముఖుడు, శ్రీరామదూత అయిన హనుమంతునికి శిరసు వంచి నమస్కరించుచున్నాను.

హనుమంతుని ద్వాదశ నామావళి ఫలశ్రుతిలో

ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠైర్నిత్యం యాత్రే కాలే విశేషతః
తస్య మృత్యు భయం నాస్తి సర్వతర విజయీ భవేత్

కపీంద్రుడైన హనుమంతుని ద్వాదశనామావళిని నిదురించే సమయంలో, నిద్ర నుండి మేల్కొన్నప్పుడు, ప్రయాణ సమయంలో పఠించిన వారికి మృత్యు భయం తొలగి అన్నిటా విజయం కలుగుతుంది అని చెప్పారు.

వీటిని దృష్టిలో పెట్టుకుని హనుమంతుని గుణగణాలను, మహత్తును పరిశీలిద్దాం.

హనుమంతుడు యువకులకు ఏ విధంగా ఆదర్శం? ఎందుకు వారు హనుమంతుని పూజించాలి?

1. ప్రప్రథమంగా హనుమంతుడు సకలవిద్యాపారంగతుడు, జ్ఞాని. తులసీదాసు జ్ఞానగుణ సాగర అని చాలీసాలో కీర్తించాడు. భవిష్యద్బ్రహ్మ హనుమంతుడే. విద్యాభ్యాస్యంలో కావలసిన శ్రద్ధకు, ఏకాగ్రతకు, పరిశ్రమకు హనుమంతుడు అన్నివిధాలా ఆదర్శవంతుడు, ఆరాధ్య దైవం కూడాను.

2. హనుమంతుడు అమిత బలవంతుడు. రామకార్యార్థియై శతయోజనముల సాగరాన్ని లంఘించాడు, సంజీవని పర్వతాన్ని ఎత్తుకు వచ్చాడు. దేహబలానికి రామభక్తి తోడైతే ఇక ఎదురులేదు అన్నది మనకు శ్రీమద్రామాయణంలోని సుందరకాండ, యుద్ధకాండ తెలుపుతాయి. కాబట్టి యుక్త వయసులో దేహదారుఢ్యంపై దృష్టి కలిగితే తరువాత జీవితమంతా ఆరోగ్యకరంగా ఉంటుందని, హనుమంతుని స్మరణ వలన బలము, ఆరోగ్యము కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. ఈనాడు యువతలో అనేక రకాల దౌర్బల్యాలు, తద్వారా సమాజం ఎన్నో దుష్పరిణామాలను ఎదుర్కొంటోంది. హనుమంతుని స్మరణ ఇటువంటి దౌర్బల్యాలనుండి ముక్తిని కలిగిస్తుంది.

3. యుక్తవయసులో ఉద్రేకాలను, ఆకర్షణల వల్ల కలిగే మానసిక మార్పులను నియంత్రణలో ఉంచుకుని ధ్యాస విద్యాభ్యాసం మీద, బుద్ధిర్బలాలు పెంచుకోవటానికి హనుమంతుని ఆరాధన ఎంతో తోడ్పడుతుంది. ఆ వయసులో నిగ్రహంగా ఉంటే తరువాతి జీవితం పూలబాటే. హనుమంతుడు శ్రీరామభక్తితో జితేంద్రియుడైనాడు. బుద్ధిమంతుడు, జితేంద్రియుడు, శ్రేష్ఠుడు అయిన ఆ హనుమను స్మరిస్తే ఆ దిశగా యువతకు స్ఫూర్తి కలుగుతుంది. ఇంద్రియ నిగ్రహం కలిగిన ప్రతి యువకునికి అమితమైన తేజస్సు, యశస్సు కలుగుతాయి.

4. భక్తి ఎంత తొందరగా దృఢ పడితే అంత జీవితం రమ్యమవుతుంది. బ్రహ్మచర్యంలో నిగ్రహానికి భక్తి ఓ గొప్ప సాధనం. హనుమంతుడు భక్తికి నిర్వచనం. రామచంద్రునిపై పరిపూర్ణమైన విశ్వాసంతో కార్యసాధకుడైనాడు, సీతారాములకు ప్రీతిపాత్రుడై, రామభక్తితోనే భక్తులకు అభయాంజనేయుడైనాడు.

5. హనుమంతుడు ఎంత బలవంతుడో, అంతటి వినయసంపన్నుడు. వినయము కలవారు ప్రపంచానికి ప్రీతిపాత్రులవుతారు. ఈ వినయం వల్ల జ్ఞానం సార్థకత పొందుతుంది. అందుకే విద్యాభ్యాస సమయంలో వినయం ఎంతో అవసరం. అటువంటి విద్యార్థులకు గురువులు ప్రీతితో విద్యను ఉపదేశిస్తారు.

6. హనుమంతుడు సమస్త శాస్త్ర కోవిదుడు, ఉత్తమ దూత, వ్యవహారవేత్త మరియు అసమాన కార్యదక్షుడు. ఇది మనకు కిష్కింధకాండ,సుందరకాండలలో స్పష్టంగా తెలుస్తుంది. స్వయంగా శ్రీరామచంద్రుడే వేనోళ్ల హనుమంతుని శుభలక్షణాలను లక్ష్మణునికి వర్ణిస్తాడు. దూతగా హనుమంతుడు సుందరకాండలో కనబరచిన కుశలత, వాక్చాతుర్యం మనకు ఆదర్శం. యుక్త వయసులో ఉన్నవారికి వాక్పటిమ ఎంతో ముఖ్యం. వృత్తిలో, సమాజంలో వాక్పటిమ కలిగిన వారిని ప్రజలు అనుసరిస్తారు. హనుమంతుని ఆరాధన వల్ల వాక్ఛక్తి పుష్కలంగా కలుగుతుంది.

ఈ విధంగా హనుమంతుడు యువకులకు ఆరాధ్యుడు, సమస్త శుభలక్షణాలను కలిగించే దైవం. హనుమాన్ చాలీసా, సాఠికా, బజరంగ్ బాణ్ వంటి మహిమాన్విత స్తోత్రాలు భక్తులను ఉద్ధరిస్తూనే ఉన్నాయి.

ఈ హనుమద్భక్తి మార్గంలో నన్ను ప్రవేశపెట్టిన గురువు గారికి నేను సర్వదా కృతజ్ఞుడను.

శ్రీగురుభ్యోనమః. సియావర్ రామచంద్ర కీ జై! పవన సుత హనుమాన్ కీ జై! 

21, ఆగస్టు 2020, శుక్రవారం

వందేऽనిశమహం - మైసూరు వాసుదేవాచార్యుల వారు

వందేऽనిశమహం వారణ వదనం 
నందీశ వాహన వర నందనం

వందారు మండల విఘ్న వారణం 
బృందారకాద్యపి వందిత చరణం

భాసమాన పాశాంకుశధరం 
భూసురాది పరిపాలనపరం
భాసుర మణి భూషిత కంధరం 
వాసుదేవ చరణార్చనతత్పరం

నమస్కరించే భక్త సమూహముల విఘ్నాలను తొలగించేవాడు, పాశము మరియు అంకుశము ధరించి ప్రకాశించేవాడు, బ్రాహ్మణాదులను రక్షించుటలో నిమగ్నమై యుండేవాడు, ప్రకాశించే మణులు అలంకరించబడిన కంఠము కలిగిన వాడు, శ్రీమహావిష్ణువు చరణముల సేవా తత్పరుడు, నందీశ్వరుడు వాహనంగా కలిగిన పరమశివుని వరపుత్రుడు, గజముఖుడైన గణపతికి నేను ఎల్లప్పుడు నమస్కరించెదను. 

- మైసూరు వాసుదేవాచార్యుల వారు

https://www.youtube.com/watch?v=hRO1jASSbbA

హరినారాయణ యనరే జనులారా జనులారా


హరినారాయణ యనరే జనులారా జనులారా
హరినారాయణ యనరే అరిషడ్వర్గములంటక మునుపే

ధనమనెడు ధనమనెడు మదము తరుమక మునుపే
ఘనరోగములచే గప్పక మునుపే ఘనరోగములచే గప్పక మునుపే

దుర్విషయములలో దూరక మునుపే దుర్విషయములలో దూరక మునుపే
గర్వము మిక్కిలి కలగక మునుపే గర్వము మిక్కిలి కలగక మునుపే

వర కవులతో వాదాడక మునుపే వరకవులతో వాదాడక మునుపే
పర సతులపై మది పారక మునుపే పరసతులపై మది పారక మునుపే

దుష్టుల స్నేహము దొరకక మునుపే దుష్టుల స్నేహము దొరకక మునుపే
కష్టము కండ్లకు గానక మునుపే కష్టము కండ్లకు గానక మునుపే

- ఆకాశవాణి భక్తిరంజని కార్యక్రమానికి బాలమురళీకృష్ణ గారు గానం చేసినది.

నా జీవాధార - త్యాగరాజస్వామి కృతి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గానంలో

 

త్యాగయ్య చిత్రంలో  బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన కృతులలో నా జీవాధార ఎంత ఉత్కృష్టమైనదో చెప్పలేను. బిలహరి రాగం ఆరోగ్యదాయిని అని కర్నాటక సంగీత విద్వాంసులు ఎన్నో మార్లు నిరూపించారు. దానికి ఆద్యం ఈ త్యాగయ్య కృతికి వేదికయే. అకాల మరణం చెందిన ఒక వ్యక్తి కుటుంబం యొక్క దుఃఖాన్ని చూసి కరిగిపోయి త్యాగరాజస్వామి తన నాదోపాసనను ధారపోసి ఆ రామచంద్ర ప్రభువును ప్రార్థించగా సమస్త జీవులకు ఆధారమైన ఆ పరబ్రహ్మం కరుణించి త్యాగయ్య భక్తికి మెచ్చి ఆ వ్యక్తిని పునర్జీవునిగా చేశారు. 

త్యాగరాజస్వామి భావాన్ని, బిలహరి రాగంలోని మహత్తును యథాతథంగా అద్భుతమైన ఉపాసనా రీతిలో ఆలపించి త్యాగయ్య పాత్రకు జీవం పోశారు. ఆలాపనలో ఎంతటి ఆర్ద్రత, భక్తి, శరణాగతి ఉన్నాయో వర్ణించనలవి కానిది. రామునిపై త్యాగరాజస్వామికి గల విశ్వాసాన్ని పరిపూర్ణంగా ఈ కృతి ఆలాపన ద్వారా బాలసుబ్రహ్మణ్యం గారు ఆవిష్కరించారు. ఒక గాయకుని యొక్క ఔన్నత్యాన్ని, ప్రతిభను పతాక స్థాయిలో ఆవిష్కరించాలి అంటే దానికి బాపు వంటి దర్శకులు, మహదేవన్ వంటి సంగీత దర్శకులు కావాలి. ఆ కృతి చివరి పంక్తి యొక్క ఆలాపన రాముడు సాక్షాతకరించాడా అన్న రీతి ఉంటుంది. 

ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారు జీవన్మరణాల మధ్య చేస్తున్న పోరాటంలో ఆయన ఆలపించిన ఈ గీతం ఆయన మనసు ఆలపించి ఆ శ్రీరామచంద్రుడు కరుణించి మనకు గానామృతాన్ని పంచుతున్న బాలు గారు కోలుకునేలా చేయాలని ప్రార్థిస్తూ...

నా జీవాధార! నా నోము ఫలమా!

రాజీవ లోచన! రాజ రాజ శిరోమణి!

నా జూపు ప్రకాశమా! నా నాసికా పరిమళమా!
నా జప వర్ణ రూపమా! నాదు పుజాసుమమా! త్యాగరాజనుత!

కర్మేంద్రియాల ప్రతిస్పందనలను, రసానుభూతులను, కర్మానుష్ఠానముల ఫలాన్ని, జపము చేసే అక్షరాల రూపాన్ని, పూజించే పూవులను రామునిగా భావించి రమించిన యోగి కాకర్ల త్యాగరాజస్వామి. ఆ భావంతో ఈ విధంగా రాముని నుతించి అకాల మృత్యువు పాలైన ఓ వ్యక్తిని  బ్రతికించింది ఓ రెండు వందల సంవత్సరాల లోపే. అదీ భక్తి యొక్క మహిమ. ఆ రామనామాన్ని కోట్లాది మార్లు జపించిన తరువాతే త్యాగయ్య కీర్తనలు వ్రాయటం మొదలు పెట్టారు. అందుకే అవి శాశ్వతమైనాయి. రమయనే సుమర్మము రామయనే శర్మము!

త్యాగయ్య భావనను బాపు గారు ఎంత పవిత్రంగా ఆవిష్కరించారో, బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత ఆర్తితో, సర్వస్య శరణాగతితో పాడారో వినండి!

https://www.youtube.com/watch?v=w0oUr1bDlHE

పల్నాటి యుద్ధం - 1966: చిత్ర విశేషాలు

1966లో విడుదలైన పల్నాటి యుద్ధం తెలుగు చారిత్రక చిత్రాలలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న చిత్రం. గుత్తా రామినీడు దర్శకత్వంలో శ్రీ అనురూపా ...