29, ఆగస్టు 2020, శనివారం

నెనరుంచినాను - సద్గురువులు త్యాగరాజస్వామి


నెనరుంచినాను అన్నిటికి నీ దాసుడని నేను నీదుపై

ఘనాఘ జీమూతాశుగ జలధి గంభీర నీ పాదములపై

కలిలో మాటలు నేర్చుకొని కాంతలను తనయులను బ్రోచుటకు
శిలాత్ముడై పలుకనేరనుర శ్రీత్యాగరాజాప్త నీ యెడ

ఓ రామా! అన్ని విషయములలో నీదాసుడనన్న భావముతో నీపై విశ్వాసం కలిగియున్నాను. గొప్ప పాపములనే మేఘములను చెల్లాచెదరు చేసే వాయువు వంటి వాడవు, సముద్రమంతటి గాంభీర్యము కలవాడవు అని తలచి నీ పాదములపై విశ్వాసము కలిగి యున్నాను. కలికాలములో ఇతరులవలె నేను కూడా మాటలు బాగా నేర్చి భార్యాబిడ్డలను పోషించటానికి పాషాణహృదయముతో అసత్యములను పలుకజాలను, పరమశివునికి ఆప్తుడవైన శ్రీరామా! నీపై విశ్వాసముంచినాను.

మాళవి రాగంలో కూర్చబడిన ఈ కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు అద్భుతంగా ఆలపించారు

నగు మోము గలవాని నా మనోహరుని- సద్గురువులు కాకర్ల త్యాగరాజస్వామి



నగు మోము గలవాని నా మనోహరుని
జగమేలు శూరుని జానకీవరుని

దేవాది దేవుని దివ్య సుందరుని
శ్రీవాసుదేవుని సీతారాఘవుని

సుజ్ఞాన నిధిని సోమ సూర్య లోచనుని
అజ్ణాన తమమును అణచు భాస్కరుని

నిర్మలాకారుని నిఖిలాఘహరుని
ధర్మాది మోక్షములు దయ చేయు ఘనుని

బోధతో పలుమారు పూజించి నేనా
రాధింతు శ్రీ త్యాగరాజసన్నుతుని

చిరునవ్వు మోము కలిగిన, నా మనస్సును హరించిన, జగములనేలే శూరుడైన, జానకి వరించిన శ్రీరాముని నేనారాధించెదను. దేవాది దేవుడు, దివ్య సుందర స్వరూపుడు, వాసుదేవుడైన సీతారాముని నేనారాధించెదను. సుజ్ఞానమునకు నిధియైన వాడు, సూర్యచంద్రులు కన్నులుగా కలవాడు, అజ్ఞానాంధకారాన్ని అణచి వేసే సూర్యుడైన రాముని నేనారాధించెదను. నిర్మలమైన రూపము కలవాడు, సమస్త పాపములను నాశనము చేసే వాడు, ధర్మార్థ కామ మోక్షములను అనుగ్రహించే ఘనుడైన శ్రీరాముని నేనారాధించెదను. శివునిచే నుతించబడిన శ్రీరాముని నేను జ్ఞానముతో అనేక విధముల పూజించి ఆరాధించెదను.

మధ్యమావతి రాగంలో కూర్చబడిన ఈ ఉత్సవ సాంప్రదాయ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు (ఆల్బంలో 54వ నిమిషం దగ్గర ఈ కృతి మొదలవుతుంది)

రామ భక్తి సామ్రాజ్యమే మానవులకబ్బెనో - సద్గురువులు త్యాగరాజస్వామి

 


రామ భక్తి సామ్రాజ్యమే మానవులకబ్బెనో మనసా
ఆ మానవుల సందర్శనమత్యంత బ్రహ్మానందమే

ఈలాగని వివరింపలేను చాలా స్వానుభవవేద్యమే
లీలా సృష్ట జగత్రయమనే కోలాహల త్యాగరాజనుతుడగు

ఓ మనసా! తన లీలలచేత ముల్లోకాలను సృష్టించి కోలాహలము చేసినవాడు, పరమశివునిచే నుతించబడిన వాడైన శ్రీరాముని యెడ భక్తి అనే సామ్రాజ్యము ఏ మానవులకు కలిగిందో వారి సందర్శన అత్యంత ఆనందకరమైనది. ఆ ఆనందం ఇలా ఉంటుంది అని వర్ణించలేను, అది పూర్తిగా అనుభవైకవేద్యమే.

శుద్ధ బంగాళా రాగంలోని ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు.

మనసులోని మర్మమును తెలుసుకో- త్యాగరాజస్వామి


 

మనసులోని మర్మమును తెలుసుకో! మానరక్షకా! మరకతాంగ! నా

ఇనకులాప్త నీవేగాని వేరెవరు లేరు ఆనంద హృదయ!

మునుపు ప్రేమగల దొరవై సదా చనువునేలినది గొప్ప గాదయా!
కనికరమ్ముతోనీవేళ నా కరము బట్టు త్యాగరాజ వినుత!!

భక్తుల గౌరవమును కాపాడే, మరకతము వంటి దేహపు ఛాయగల శ్రీరామా! నా మనసులోని రహస్యమును తెలుసుకొనుము. సూర్యవంశ తిలకుడవు, ఆనందహృదయుడవైన శ్రీరామ! నీవు తప్ప నాకు వేరెవ్వరు లేరు. పరమశివునిచే నుతించబడిన శ్రీరామా! ఇంతకు మునుపు ప్రేమగల ప్రభువుగా నన్ను వాత్సల్యముతో ఏలుకున్నది గొప్ప కాదు, కనికరము చూపించి ఈ రోజు చేయిపట్టుకు నడిపించు.

సృష్టి స్థితి లయ కారకుడైన పరమాత్మకు మానవ జన్మ ఎత్తిన ఈ జీవి మనసులోని మాట తెలియదా? అసలు ఆ మనసు, సంకల్పం, కోరిక అన్ని కూడా ఆయన ప్రేరితమైనవే కదా! మరి ఆయనకు మనం చెప్పేదేమిటి? ఇక్కడ చెప్పవలసింది విశ్వాత్ముడైన పరమాత్మ తత్త్వాన్ని గుర్తించి దానితో అనుసంధానం చేసుకొని ఈ భవసాగరాన్ని దాటే శక్తిని పొందటం. అదే వాగ్గేయకారుల కృతులలో సింహభాగం ఉన్న భావన. త్యాగరాజస్వామి శ్రీరామునితో ఎన్ని రకాలా భావనలను వ్యక్తపరచారో! వాటిలో మనసులోని మర్మమును తెలుసుకో అన్న కృతిలో "ఇంతకు మునుపు నన్ను కాపాడవు, అదేమీ గొప్ప కాదు, ఇప్పుడు నన్ను చేయిపట్టుకు నడిపించు" అని ప్రశ్నించటంలో అంతరార్థం మానవునికి ఆధ్యాత్మికయానంలో కలిగే అనేక రకాల స్పందనలకు అక్షర రూపం ఇవ్వటమే. పిల్లలు తల్లిదండ్రులు గతంలో వారి ఆనందం కొరకు చేసిన పనులను, కొన్న వస్తువులను గుర్తు పెట్టుకొని అది చాలు అన్న భావనలో ఉండరు, మళ్లీ మళ్లీ తల్లిదండ్రులు అలానే చేస్తూ ఉండాలని కోరుకుంటారు. అలాగే, భగవంతుని మాత్రమే నమ్ముకున్న భక్తునికి ఆ స్వామి మళ్లీ మళ్లీ కాపాడలన్న భావన బలంగా ఉంటుంది. దానినే త్యాగరాజస్వామి ఈ కృతి ద్వారా వ్యక్తపరచారు. ఈ కృతిలో ముఖ్యంగా మనం గమనించవలసింది "నీవే గాక వేరెవెరు లేరు" అన్న శరణాగతి.

హిందోళ రాగంలోని ఈ కృతిని సుగంధా కాలమేఘం గారు ఆలపించారు.

రాగ సుధా రస పానము జేసి రాజిల్లవే - సద్గురువులు త్యాగరాజస్వామి


రాగ సుధా రస పానము జేసి రాజిల్లవే ఓ మనసా

యాగ యోగ త్యాగ భోగఫలమొసంగే

సదాశివమయమగు నాదోంకార స్వర
విదులు జీవన్ముక్తులని త్యాగరాజు తెలియు

ఓ మనసా! రాగములనే అమృత రసాన్ని గ్రోలి ప్రకాశించుము! యజ్ఞ యాగాదులు, త్యాగము, ఐహిక భోగములనిచ్చేది ఈ రాగామృతము. స్వరరాగ యుక్తమైన ఈ ఓంకార జనితమైన, శివతత్త్వముతో నిండిన నాదోపాసన మనలను జీవన్ముక్తులను చేయును అని త్యాగరాజు ఎఱిగినాడు, దానిని పానము చేసి ప్రకాశించుము.

నాదోపాసన యొక్క మహత్తును త్యాగరాజస్వామి పలికినట్లు ఇంకే వాగ్గేయకారులూ వివరించలేదు. నాదతనుమనిశం శంకరం, శోభిల్లు సప్తస్వర, నాదసుధారసంబిలను, నాదలోలుడై వంటి ఎన్నో కృతుల ద్వారా ఈ సంగీతోపాసన వైభవాన్ని మనకు తెలిపారు. అటువంటి కృతే రాగ సుధారస పానము జేసి. నాదోపాసన చేసిన వారికి సమస్త ఫలములు లభినుచునని ఆయన తెలిపారు. ఓంకారమునుండి ఉద్భవించిన సప్తస్వరాలు నాదోపాసనకు మూలము. పరమశివుడు ఈ నాదాన్ని తనువంతా కలిగిన వాడు. అందుకే నాదములో శివతత్త్వము జాగృతమై యున్నది అన్న భావనను త్యాగరాజస్వామి ఈ కీర్తన ద్వారా మనకు తెలియజేశారు. నిజమే! భావయుక్తమైన సాహిత్యానికి రాగ యుక్తమైన స్వరములు శృతిలయలతో మేళవించి పాడితే కళాకారుడు తనను తానే మరవటం కాదు శ్రోతలకు కూడా అదే భావన కలిగిస్తాడు. ఆ తాదాత్మ్యత భక్తి మార్గంలో ప్రధానమైన ప్రాతిపదిక. ఎందరో మహాభక్తులు నామ సంకీర్తన ద్వారా జీవన్ముక్తిని పొందారు. ఆ సిద్ధిని పొందిన యోగి త్యాగరాజస్వామి నాదోపాసనా మార్గంలోని గొప్పతనాన్ని ఈ కీర్తన ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. జీవన్ముక్తి కన్నా మానవ జన్మకు సార్థకత ఏముంది? ముక్తి అంటే శరీరాన్ని వీడటం కాదు. మనమెవరో ఎఱిగి ఆ ఆనందంలో నిరంతరం జ్ఞాన సంపన్నులమై ఉండటమే. దానికి నాదోపాసన ఒక ప్రభావవంతమైన మార్గమని త్యాగరాజస్వామి పలికారు. ఆ మహానుభావునికి ఈ భూమి ఎంతో ఋణపడి ఉంది.

ఆందోళిక రాగంలోని ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు

జయతి శివా భవానీ - ముత్తుస్వామి దీక్షితులు

జయతి శివా భవానీ జగజ్జననీ నిరంజనీ

దయా రస ప్రవాహినీ దండితాసుర వాహినీ
భయకృద్భండమర్దినీ భాసమాన కపర్దినీ
శ్రీగురుగుహ రంజనీ జననాది ఖేద భంజనీ

జగజ్జననియైన, నిర్మలమైన, శివునితో యున్న భవానికి జయము జయము. దయారసాన్ని ప్రవహింపజేసే తల్లికి, అసుర సేనను దండించి సంహరించిన జగన్మాతకు జయము జయము. భయోత్పాతము సృష్టించిన భండాసురుని సంహరించిన తల్లికి, పరమశివునితో ప్రకాశించే అమ్మకు, కుమారస్వామికి ఆనందము కలిగించే మాతకు, జనన మరణ ఖేధములను తొలగించే అమ్మకు జయము జయము

దీక్షితుల వారు శ్రీవిద్యా ఉపాసకులు. ఆ అమ్మను అనేక రూపాలలో కొలిచారు. అందులో జగన్మాతను భవాని, దుర్గ, మహిషాసుర మర్దనిగా కూడా అద్భుతంగా కొనియాడారు. మహానవమి అమ్మ మహిషాసురుని సంహరించిన శుభముహూర్తం. అమ్మ కరుణామయి మాత్రమే కాదు, లోకాన్ని పీడించే దుష్టులను దండించగల రౌద్రరూపిణి కూడా. నవరాత్రులలో అనేక రూపములలో వైభవంగా కొలువబడిన అమ్మ ముగురమ్మలు, త్రిమూర్తులు, సమస్తదేవతా సమూహము యొక్క శక్తి కూటమియై దానవ సంహారం చేసి లోకానికి ఆనందం కలిగించింది. ఆ అమ్మను దీక్షితుల వారు ఈ కృతిలో అమ్మ దయారూపమును, అసురులను సంహరించిన రౌద్రరూపమును ఏకకాలములో వర్ణించారు. సిద్ధయోయి అయిన దీక్షితుల వారు అమ్మ సమస్త రూపములను దర్శించి వర్ణించి తరించిన అరుదైన నాదస్వరూపులు.

ముత్తుస్వామి దీక్షితుల వారి కృతిని కావలం శ్రీకుమార్ గారు అద్భుతంగా పాడారు. ఈ కృతి భవాని (భవప్రియ) రాగంలో కూర్చబడింది.

బిరాన వరాలిచ్చి బ్రోవుము - శ్యామశాస్త్రి


బిరాన వరాలిచ్చి బ్రోవుము నిను నెర నమ్మితి!

పురారి మనోహారిణీ! శ్రీ కామాక్షీ! 

కామితార్థదాయకి! దేవీ! నత కల్ప లతికా!
పురాణి! మధురవాణి! శివుని రాణివి గదా! బిరాన వరాలిచ్చి బ్రోవుము!

శ్యామకృష్ణ సోదరీ! గౌరీ! పరమేశ్వరీ! గిరిజా!
అనాథ రక్షణంబు సలుపు దేవీ నను బిరాన వరాలిచ్చి బ్రోవుము!

ఓ కామాక్షీ! పరమశివుని మనోహరీ! నిన్నే నమ్ముకున్నాను, వేగమే వరములిచ్చి నన్ను బ్రోవుము! కామ్యములను తీర్చే దేవీ! నుతించే వారి పట్ల కల్పవృక్షము నీవు. పురాణములలో తెలుపబడిన అమ్మవు నీవు! మధురమైన పలుకులు కలిగిన నీవు ఆ శివుని రాణివి కదా! వేగమే వరములిచ్చి నన్ను బ్రోవుము. ఆ నల్లని కృష్ణుని సోదరీ! గౌరీ! పరమేశ్వరీ! గిరిజా! అనాథలను కాపాడే దేవీ! వేగమే వరములిచ్చి నన్ను బ్రోవుము

కళ్యాణి రాగంలోని ఈ కృతిని ఎం.ఎల్ వసంతకుమారి గారు గానం చేశారు.

పల్నాటి యుద్ధం - 1966: చిత్ర విశేషాలు

1966లో విడుదలైన పల్నాటి యుద్ధం తెలుగు చారిత్రక చిత్రాలలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న చిత్రం. గుత్తా రామినీడు దర్శకత్వంలో శ్రీ అనురూపా ...