5, జనవరి 2026, సోమవారం

హరికథా కళాకారిణి దాలిపర్తి ఉమామహేశ్వరి గారు



తెలుగుదనంతో పూర్తిగా ముడిపడిన కళ హరికథ. సాహిత్యం, సంగీతం, కూసంత నృత్యం ఖచ్చితంగా వస్తేనే హరికథ చెప్పగలరు. అటువంటి కళను అభ్యసించేందుకు సుమనస్కులు, సంస్కారవంతులు, కళాపోషకులు అప్పటి తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం జమీందారు బలుసు ప్రభాకర బుచ్చి కృష్ణ సత్యనారాయణరావు గారు 1973లో సర్వారాయ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా సర్వారాయ హరికథా పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలలో నేర్చుకుని గొప్ప కళాకారిణి పేరొందారు శ్రీమతి దాలిపర్తి ఉమామహేశ్వరి గారు, ప్రముఖ ఆంధ్రనాట్య కళాకారులు కళాకృష్ణ గారి ధర్మపత్ని. 2024లో వారికి పద్మశ్రీ అవార్డు లభించింది. వారి జీవిత విశేషాలు ఈ పోస్టులో, వారితో ఇంటర్వ్యూ చూడండి, ఎంత చక్కని తెలుగు భాష వారిది! 

శ్రీమతి దాలిపర్తి ఉమామహేశ్వరి గారు తెలుగు మరియు సంస్కృత భాషల్లో ప్రసిద్ధి చెందిన హరికథా కళాకారిణి. సంస్కృతంలో హరికథను ప్రదర్శించిన మొదటి మహిళా హరికథా కళాకారిణి అనే దేశవ్యాప్త ఖ్యాతి ఆమెకు లభించింది.

1960 మే 21న ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో సాంప్రదాయ సంగీతకారుల కుటుంబంలో జన్మించిన ఆమె చిన్న వయస్సు నుంచే శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసిస్తూ, పాఠశాల విద్యను పూర్తిచేశారు. ఆమె తండ్రి తెలంగాణలోని వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయానికి ఆస్థాన నాదస్వర విద్వాంసులు.

హరికథ నేర్చుకోవడంలో శ్రీ ఎస్బీపీబీకే సత్యనారాయణరావు, వారి ధర్మపత్ని శ్రీమతి రాజరాజేశ్వరి గారు ఉమామహేశ్వరి గారిని ఎంతో ప్రోత్సహించారు. హరికథను ఆమె గురువులైన శ్రీ కడలి వీరదాసు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షితులు, రాజశేఖరుని లక్ష్మీపతిరావు, ఎన్సీహెచ్ కృష్ణమాచార్య, వేదిమంచి నరసింహదాసు గారి వద్ద అభ్యసించారు. ఆమె నాట్యాచార్య శ్రీ నటరాజ రామకృష్ణ గారి శిష్యురాలిగా శాస్త్రీయ నృత్యాన్ని కూడా నేర్చుకున్నారు. ఆమె తొలి తెలుగు హరికథ గౌరీకల్యాణం, ఇది ఆమె మాతృసంస్థ అయిన సర్వారాయ హరికథ పాఠశాలలో ప్రదర్శించబడింది. తొలి సంస్కృత హరికథ కాళిదాస కుమారసంభవం, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని ఖ్యాతిగాంచిన కాళిదాస అకాడమీలో ప్రదర్శించారు. అప్పటి నుంచి కాళిదాస అకాడమీలో ఆమె ప్రదర్శనలు ప్రతి యేటా ప్రత్యేక ఆకర్షణగా మారాయి. కాళిదాసుని దాదాపు అన్ని నాటకాలు, కావ్యాలను సంస్కృతంలో ఆమె ప్రదర్శించారు. సర్వారాయ హరికథ పాఠశాల గౌరవ ప్రధానాచార్యురాలిగా ఆమె అనేక మంది బాలికలకు హరికథను వృత్తిగా తీసుకునేలా శిక్షణ, ప్రేరణ అందిస్తున్నారు.ఉమామహేశ్వరి గారు హరికథా పితామహుడిగా పరిగణించబడే ఆది భోట్ల నారాయణదాసు గారి హరికథలను ప్రజలకు విస్తృతంగా పరిచయం చేశారు. రామాయణం, మహాభారతం, భాగవతం వంటి ఇతిహాసాల నుంచి ఎన్నో ప్రత్యేక ఘట్టాలను చేర్చి తన ప్రదర్శనలకు విశిష్టతను తెచ్చారు.రమణ మహర్షి, శారదా దేవి పరమహంస, పొట్టిశ్రీరాములు, ఆదికవి నన్నయ్యలపై హరికథలు రచించి వాటిని ప్రజాదరణ పొందేలా చేశారు. కవయిత్రిగా, రచయితగా కూడా ఆమె విశిష్ట ప్రతిభ చూపారు.

తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం, అన్నవరం, వేములవాడ వంటి అనేక క్షేత్రాలలో ఆమె ప్రదర్శనలు నిరంతరం జరుగుతుంటాయి. ఆమె వృత్తిజీవితంలో అత్యున్నత ఘట్టం 1986లో బద్రినాథ్‌లో జరిగిన శ్రీ ఆది శంకరాచార్య జయంతి వేడుకలలో చేసిన హరికథ ప్రదర్శన. అంతేకాక, ఆమె హార్వర్డ్ విశ్వవిద్యాలయం, యేలు విశ్వవిద్యాలయాలలో జరిగిన వేదిక సదస్సుల్లో పాల్గొన్నారు. దేశం నలుమూలలా, విదేశాలలో కూడా ఆమె హరికథా వైభవాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. 1981లో మలేషియాలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు, 1993లో హార్వర్డ్ వేదసమ్మేళనం, 1996లో అమెరికాలో ఆటా తెలుగు సమావేశం (హ్యూస్టన్), అలాగే యూకే (1996), సింగపూర్, ఇండోనేషియా (2003), ఒమన్ తదితర దేశాలలో ఆమె ప్రదర్శనలు ప్రశంసలు అందుకున్నాయి.

ఆమె కళను సంరక్షించేందుకు అనేక సాంస్కృతిక సంస్థలు ఆమె ఆడియో, వీడియో రికార్డులు నిర్వహించాయి. వాటిలో బొంబాయి నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, న్యూఢిల్లీ సెంట్రల్ సంగీత నాటక అకాడమీ, సాహిత్యకళా పరిషత్, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్, వారణాసిలోని జ్ఞాన ప్రవాహ సంస్థలు ముఖ్యమైనవిగా నిలుస్తాయి. హరికథకు చేసిన విశేషసేవలకు అనేక పురస్కారాలు, గౌరవాలు ఆమెకు లభించాయి. సెంట్రల్ సంగీత నాటక అకాడమీ పురస్కార్, లలితకళా పురస్కారం, కలారత్న పురస్కారం, మహిళా నవరత్న అవార్డు, దుర్గాబాయి దేశ్‌ముఖ్ అవార్డు వంటి అనేక గుర్తింపులు అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్్లో స్థానం పొందిన తొలి మహిళా హరికథ కళాకారిణి ఆమె. శృంగేరి శారదా పీఠాధిపతి ఆమెకు అభినవ మాతంగి బిరుదు ప్రదానం చేశారు. ఉజ్జయినిలోని కాళిదాస అకాడమీ చిత్రకథా సరస్వతి, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఉత్తమ హరికథ ప్రవచనకారిణి వంటి బిరుదులతో ఆమెను సత్కరించాయి.దూరదర్శన్, ఆకాశవాణి లో ఆమె గ్రేడ్‌డ్ ఆర్టిస్ట్. శ్రీ సర్వారాయ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుండి లలితకళా పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సంస్కృతి శాఖ నుండి ఉగాది పురస్కారం కూడా పొందారు.

ఉమామహేశ్వరి గారితో ముఖాముఖీ

అదివో చూడరో అందరు మొక్కరో - అన్నమాచార్యుల కీర్తన



 అదివో చూడరో అందరు మొక్కరో గుదిగొని బ్రహ్మము కోనేటి దరిని

రవిమండలమున రంజిల్లు తేజము దివి చంద్రునిలోని తేజము
భువిననలంబున బొడమిన తేజము వివిధంబులైన విశ్వతేజము

క్షీరాంబుధిలో చెలగు సాకారము సారె వైకుంఠపు సాకారము
యీరీతి యోగీంద్రులెంచు సాకారము సారెకు జగముల సాకారము

పొలసినయాగంబులలో ఫలమును పలుతపములలో ఫలమును
తలచిన తలపుల దానఫలంబును బలిమి శ్రీవేంకటపతియే ఫలము


భావం: 

ఇదిగో చూడండి - ఇది సాధారణ దృశ్యం కాదు. ఇది దర్శించినవారందరూ సహజంగానే నమస్కరించేంత మహిమ కలిగిన స్వరూపం.పుష్కరిణి సమీపంలో వెలసిన ఈ పరబ్రహ్మను బయటి చూపుతో కాదు; మనస్సును అంతర్ముఖం చేసి, లోతుగా ధ్యానించినవారే చేరగల మార్గమిదని అన్నమాచార్యుల వారు చెబుతున్నారు. ఇది జ్ఞానమార్గం కాదు, అహంకారాన్ని వదిలే అంతర్యాత్ర.

సూర్యునిలో కనిపించే ఉజ్జ్వల కాంతి, చంద్రునిలో కనిపించే శాంత ప్రకాశం, అగ్నిలో మండే ఉగ్ర తేజస్సు - ఈ మూడు వేర్వేరు లక్షణాలైనా, మూలంగా అవన్నీ ఒకే తేజస్సు. అది పరబ్రహ్మ తేజస్సు. అంటే దేవుడు ఎక్కడో వేరుగా లేడు. ప్రకృతిలో కనిపించే ప్రతి శక్తి ఆయనే.

అదే పరబ్రహ్మం పాలసముద్రంలో నారాయణుడిగా సాకారమైంది. అదే వైకుంఠంలో నిత్యనివాసిగా ప్రకాశిస్తోంది. యోగులు తమ ధ్యానంలో దర్శించేది కూడా అదే రూపం. అలాగే సమస్త లోకాలకు ఆధారమైన మూలస్వరూపం కూడా ఆయనే. ఇక్కడ అన్నమాచార్యులు నిరాకార–సాకార భేదాన్ని తొలగించే సందేశం యిచ్చారు. రూపం ఉన్నా,లేకున్నా, సత్యం ఒక్కటే అని చెబుతున్నారు.

యజ్ఞయాగముల ఫలము, అనేక తపస్సుల ఫలము, నిరంతరము తలచిన ఫలము, దానములు చేసిన ఫలము, అన్నీ కూడా ఆ శ్రీవేంకటేశ్వరుడే. అన్నమాచార్యుల తత్త్వసారాంశం ఇదే - సాధనలన్నీ గమ్యం కాదు, భగవంతుడే గమ్యం. 

ఈ కీర్తన మొత్తం చెబుతున్నది ఒక్క వాక్యంలో: సర్వత్రా కనిపించే తేజస్సు భగవంతుడే. అన్ని సాధనల పరమ ఫలితం ఆయనే.


శోభారాజు గారి ఆలాపన

27, డిసెంబర్ 2025, శనివారం

భగవద్రామానుజులు - మేల్కోటే రామప్రియ విగ్రహం

 ఆరోజుల్లో చోళరాజు పెడుతున్న హింసలు భరించలేక భగవద్రామానుజులు తన శిష్యగణంతో మైసూరు సమీపంలోని మేల్కోటేలో దాదాపు 20 ఏళ్లు నివసించారు. అక్కడ ఉన్నప్పుడు ఆయన సనాతనధర్మానికి, సమాజానికి చేసిన సేవ అంతా యింతా కాదు. వేదపాఠశాల, చెలువనారాయణస్వామి దేవస్థాన నిర్మాణం, తత్సంబంధమైన వ్యవస్థల ఏర్పాటు, క్షామంతో అలమటిస్తున్న ప్రజల కోసం తొన్నూరు రిజర్వాయర్ నిర్మాణం...ఇవన్నీ రామానుజుల వారి చలవే. అంతే కాదు, మొట్టమొదటిసారి హరిజనులు దేవాలయ ప్రవేశానికి అనుమతించబడింది చెలువనారాయణుని సన్నిధిలోనే, అది రామానుజుల వారి వల్లే.


అక్కడి మహారాజు విష్ణువర్ధనుని చేత తాలక్కాడ్, తొండనూర్, బేలూరు, నాగమంగళ, బెళవాడి అనే ఐదు ప్రదేశాలలో కీర్తినారాయణ, నంబినారాయణ, కేశవనారాయణ, సౌమ్యనారాయణ, వీరనారాయణ దేవస్థానాలను ఏర్పాటు చేయించి శ్రీవైష్ణవ వ్యాప్తికి, స్థిరత్వానికి తోడ్పడ్డారు. నిజం చెప్పాలంటే శ్రీరంగం కన్నా శ్రీవైష్ణవం నిలబడింది మైసూరు ప్రాంతంలో రామానుల వారు చేసిన ప్రయత్నాల వల్లనే. అందుకే ఆయన పంచ నారాయణ క్షేత్ర ప్రతిష్ఠాపనాచార్యగా ప్రసిద్ధి పొందారు.

అంతే కాదు, 82 ఏళ్ల వయసులో కాలినడకన ఢిల్లీ వెళ్లి మొఘల్ సుల్తాను వద్ద నుండి ఉత్సవమూర్తి అయిన రామప్రియ రూపాన్ని పరిపూర్ణమైన భక్తి మహిమతో సాధించి తీసుకు వచ్చి సనాతనధర్మంలోని భక్తి మార్గం యొక్క గొప్పతనాన్ని మరోమారు చాటి శాశ్వతం చేశారు. బీబీ నాంచారి అన్న గాథ ఈ ఉదంతానికి సంబంధించినదే. ఇస్లాంలో జన్మించినా ఆ రామప్రియ ఉత్సవమూర్తిలోని దైవాన్ని గ్రహించి ఆరాధించ గలిగిన స్త్రీ కాబట్టే ఆమెకు పూజనీయ స్థానం కలిగించారు రామానుజుల వారు.

వెయ్యేళ్ల నాడు రామానుజుల వారు ఢిల్లీ నుండి తెచ్చిన రామప్రియ విగ్రహం ఇదుగో!

రామానుజో విజయతే!



27, అక్టోబర్ 2025, సోమవారం

దేవ కార్యం - పితృ కార్యం

మనం చేసే కార్యాలలో హోమంతో కూడినవి దేవతలకు ప్రీతిగా చేసేవి, పితృదేవతలకు ప్రీతిగా చేసేవి ప్రధానంగా రెండు భాగాలు. పర-అపర కర్మలకు అనుసంధానమైనవి ఇవి. వీటిలో మనం వినే పదాలు స్వాహా స్వధా. ఇవి ఏమిటి?
స్వాహా అన్న పదానికి అగ్ని దేవుని భార్య, హవిష్ప్రదానం అన్నవి ప్రధానమైన అర్థాలు. యజ్ఞకాండలో స్వాహా శబ్దం లేకుండా హవిస్సులు వేల్చడం ఉండదు. ఏ దేవతలను ఉద్దేశించి యజ్ఞాదులు చేస్తున్నారో వారికి హవిస్సులు అందడానికి స్వాహా తప్పనిసరి. ఆహుతులు స్వాహాకార, వషట్కార పూర్వకంగా వేల్చినప్పుడే దేవతలకు అందుతాయి. అయితే, సంధ్యావందనంలో కేశవ నామాలు చెప్పేటప్పుడు త్రిరాచమ్య అంటూ ముమ్మారు స్వాహాకారంతో ఆచమనం చేయడం పద్ధతి. ఇక్కడ హోమాగ్ని ప్రసక్తి లేదు. అయినప్పటికీ అవి దేవతలకు సమర్పించేవే కనుక స్వాహా శబ్దాన్ని వాడవలసి వస్తున్నది. స్వాహా శబ్దం హోమ సంబంధమైన సాంకేతిక పదం మాత్రమే కాదు. అది సార్థకమైన వాఙ్నామం కూడా. చక్కగా హుతమగుగాక అనే అర్థాన్ని కొందరు భాష్యకారులు ఉదహరించారు. ఇది మహామహిమాన్వితమైన మంత్రమని కొందరు విద్వాంసుల భావన. వేద మంత్రాలు లేకుండానే స్వాహా మంత్రోచ్చారణ చేసే సందర్భాలు ఉన్నాయి. నిత్యనైమిత్తిక కర్మలలోనూ యజ్ఞ యాగాదులలోనూ ఆచమన క్రియతో స్వాహా సాక్షాత్కరించడం ప్రారంభ మవుతుంది. దేవతలకు ఆహుతులను అందించే శబ్దంగా స్వాహా ప్రసిద్ధమైంది. అంతే కాదు అనేక మంత్రాలకు చివర స్వాహా ఉంటుంది. స్వాహా దేవికి ప్రీతికరమైనది ఘృతము. అందుకే అగ్ని కార్యాలలో ఘృతము ప్రధానమైన భుక్కు.
అగ్నికార్యంలో/ యజ్ఞాలలో స్వాహా శబ్దం వినిపించినట్లే పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వడంలో స్వధా శబ్దం వినిపిస్తుంది. పితృయజ్ఞాలలో స్వాహాదేవియే తర్పణాలలో స్వధా రూపిణిగా వస్తున్నదని శాస్త్రం. (పితృ యజ్ఞేషు స్వధా మాతా) పితృ దేవతలను ఉద్దేశించి వషట్కారం చేయడం స్వధాకారం.(స్వధానమ ఇతి వషట్కారపి). అగ్ని దేవుని భార్య స్వాహాదేవి యొక్క మరో రూపం స్వధా. ఈ స్వధా దేవికి ప్రీతికరమైనవి నల్ల నువ్వులు. అందుకే నల్ల నువ్వులను తర్పణ విధి పూర్వకంగా భుక్కుగా పితృదేవతలకు సమర్పిస్తాము. స్వధానమ తర్పయామి అన్న మంత్రం శ్రాద్ధ కర్మలలో వినిపించే మంత్రం. ఈ మంత్రాన్ని పఠించేటప్పుడు గోత్రం పేరు మరియు రూపాన్ని (వసు రూపం, రుద్ర రూపం, ఆదిత్య రూపం) పేర్కొని, తదనంతరం "స్వధా నమః తర్పయామి" అని మూడు సార్లు చెప్పి తర్పణం సమర్పిస్తాము.
మీరు పై నిర్వచనాలను, ప్రయోజనాలను గమనిస్తే రెండు విభాగాల ప్రక్రియలు కూడా చాలా సారూప్యత కలిగి ఉంటాయి. అందుకే పితృకార్యాలకు, ఇతర అగ్నికార్యాలతో సమానమైన స్థానం, ప్రయోజనాన్ని చెప్పారు మన ఋషులు.
రెండిటిలో ప్రధానమైన భేదాలు రెండిటి మధ్య తేడాను స్పష్టంగా తెలుపటానికి సాంకేతికంగా ఏర్పడినవే అని నా ఉద్దేశం. అందుకే పితృకార్యాలను ఇతర అగ్నికార్యాలను అంతే పవిత్రంగా, అంతే నమ్మకంతో, భక్తి పూర్వకంగా నిర్వర్తించాలి అని ప్రాజ్ఞులు నొక్కివక్కాణిస్తారు.

10, ఏప్రిల్ 2024, బుధవారం

అనరాదు వినరాదు ఆతని మాయలు నేడు - శ్రీరంగం గోపాలరత్నం ఆలపించిన అన్నమయ్య కృతి

తెలుగు గడ్డ మీద పుట్టిన ఓ అనర్ఘ్యరత్నం శ్రీరంగం గోపాలరత్నం గారు. ఆవిడ దివికేగి మూడు దశాబ్దాలు దాటినా ఈనాటికీ కూడా అటువంటి గాత్రం మళ్లీ తెలుగు గడ్డ మీద పుట్టలేదు. ఆవిడ గాత్ర మాధుర్యం, తెలుగుదనం ఉట్టిపడే ప్రతిభ అనన్యం. దాదాపు నాలుగు దశాబ్దాల సంగీత ప్రస్థానంలో ఆవిడ తెలుగు గడ్డపై శాస్త్రీయ సంగీతానికి మహారాణిగా నిలిచారంటే అతిశయోక్తి కాదు. కవిరాయుని జోగారావు గారు, డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి వద్ద సంగీతాన్ని అభ్యసించారు. అతిపిన్న వయసులోనే హరికథలు ఆలపించారు. 

ఆవిడ ఆలపించిన ఓ అన్నమాచార్యుల వారి కృతి, బాలకృష్ణుని లీలలపై, ఆరభి రాగంలో స్వరపరచబడింది. అన్నమాచార్యుల వారికి ఆ కృష్ణుని లీలలు ఎంత అద్భుతంగా కనబడ్డాయో అంతకు మించి అందంగా ఆయన పదాలలో వెలువడ్డాయి. అన్నమాచార్యుల సాహిత్యమంటేనే తెనుగుదనం ఉట్టీపడే జానపదాలు. గోపాలరత్నం గారు ఈ కృతిని రమ్యాతిరమ్యంగా ఆలపించారు.  

అనరాదు వినరాదు ఆతని మాయలు నేడు
దినదిన క్రొత్తలాయదృష్టమిదే మాకు

ఆడెడి బాలుల హరి అంగిలి చూపుమని
తోడనే వాండ్ల నోర దుమ్ములు చల్లి
యీడ మాతో చెప్పగాను యిందరము గూడిపోయి
చూడబోతే పంచదారై చోద్యమాయెనమ్మా

తీట తీగెలు సొమ్మంటూ దేహము నిండ గట్టె
తీటకుగాక బాలులు తెగి వాపోగా
పాటించి యీ సుద్ది విని పారితెంచి చూచితేను
కోటికోటి సొమ్ములాయ కొత్తలోయమ్మా

కాకి జున్ను జున్నులంట గంపెడేసి తినిపించి
వాకొలిపి బాలులెల్ల వాపోవగా 
ఆకడ శ్రీవేంకటేశుడా బాలుల కంటి నీరు
జోకగ ముత్యాలుసేసె జూడగానమ్మా 

ఓ యశోదమ్మా! ఈ చిన్ని కృష్ణుని మాయలు అంతా ఇంతా అని చెప్పలేము, ప్రతి రోజు కొత్త కొత్తగా ఉన్న ఈ మాయలను చూడటం మా అదృష్టం. తనతో ఆడే బాలురి అంగిలి చూపమని చెప్పి వారు నోరు తెరవగానే దుమ్ము చల్లాడుట. ఆ మాట పిల్లలు మాకు చెప్పగా మేమందరము వెళ్లి చూస్తే ఆ దుమ్మంతా పంచదారయ్యింది, ఇదేమి వింతో! దురదలు పుట్టించే తీగెలు ఆభరణాలంటూ తోటి బాలుర దేహముపై కృష్ణుడు కట్టాడుట, ఆ దురదలు భరించలేక బాలులు మా వద్ద వాపోగా, మేమంతా వెళ్లి చూస్తే ఆ తీగెలు అమూల్యమైన కొత్త ఆభరాణాలయినాయమ్మా! చిన్న చిన్న జున్ను ముద్దలు  గంపల కొద్దీ తోటి బాలురకు తినిపించాడుట, వారు ఆ వికారాన్ని భరించలేక మా వద్ద వాపోయారు. మేమంతా వెళ్ళి చూడగా శ్రీనివాసుడా బాలుల కంటి నీరును అద్భుతంగా ముత్యాలుగా మార్చేసాడమ్మా!  

3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

క్షీరసాగర విహార - త్యాగరాజస్వామి కృతి



ఈ కృతి బాలమురళీకృష్ణ గారి గాత్రంలో వింటుంటే ఎంతటి కఠినమైన హృదయమైనా కరిగి పోవలసిందే. త్యాగరాజాది భక్తులను పోషించిన శ్రీరామచంద్రమూర్తి గుణవైభవాన్ని అద్భుతంగా ఆవిష్కరించే కృతి ఇది. త్యాగరాజస్వామి ఉత్సవ సాంప్రదాయ కృతులలో ఒకటి, బాలమురళీకృష్ణ గారు ఎంతో ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు. ఆనందభైరవి రాగంలో స్వరపరచబడింది. త్యాగరాజ శిష్యపరంపరలో ఐదవ తరానికి చెందిన వారు బాలమురళీకృష్ణ గారు. సద్గురువుల సాహిత్యం, స్వరరచన యథాతథంగా కొనసాగించిన వారిలో మంగళంపల్లి వారు అగ్రగణ్యులు. వారి గాత్రంలో ఈ కృతిని విని ఆనందించండి. 

క్షీరసాగర విహార! అపరిమిత ఘోర పాతక విదార!
క్రూర జన గణ విదూర! నిగమ సంచార! సుందర శరీర!

శతమఖాऽహిత విభంగ! శ్రీరామ! శమన రిపు సన్నుతాంగ!
శ్రితమానవాంతరంగ! జనకజా శృంగార జలజ భృంగ!

రాజాధిరాజ వేష! శ్రీరామ! రమణీయ కర సుభూష!
రాజనుత లలిత భాష! శ్రీ త్యాగరాజాది భక్త పోష!

పాలకడలిలో విహరించేవాడు, అనంతమైన ఘోర పాపములను నాశనము చేసేవాడు, రాక్షస సమూహాన్ని సంహరించేవాడు, వేదములలో సంచరించేవాడు, సుందరమైన శరీరము కలవాడు, నూరు యజ్ఞములు చేసిన ఇంద్రుని శత్రువులను నాశనము చేసేవాడు, మన్మథుని శత్రువైన పరమశివునిచే నుతించబడినవాడు, ఆశ్రయించినవారి హృదయములలో నివసించేవాడు, కలువ వంటి సీతమ్మ పాలిట తుమ్మెద వంటివాడు, రాజాధిరాజు అయినవాడు, అందమైన హస్తములు కలిగి, చక్కని ఆభరణములు ధరించినవాడు, రాజులచే నుతించబడినవాడు, మృదువుగా మాట్లాడేవాడు, త్యాగరాజు మొదలైన భక్తులను పోషించేవాడు శ్రీరాముడు. 

- త్యాగరాజస్వామి

25, జనవరి 2021, సోమవారం

ఆనందసాగరమీదని దేహము - త్యాగరాజస్వామి కృతి

త్యాగరాజస్వామి వారి నాదయోగంలో బ్రహ్మానందస్థితిలో రచించిన కృతులెన్నో. ఆ అనందాన్ని అనుభవించలేని దేహం భూమికి భారమే అన్నది కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. బ్రహ్మవిష్ణుమహేశ్వరులు, ఎందరో మహానుభావులు చేసిన నాదోపాసనను మానవుడూ కూడా అనుభూతి చెందాలన్నది సద్గురువుల సందేశం. అటువంటి భావమున్న కృతి ఆనందసాగరమీదని దేహము. వివరాలు:

సాహిత్యం
========

ఆనందసాగరమీదని దేహము భూమిభారమే రామబ్రహ్మా(నందసాగర)

శ్రీనాయకాఖిల నైగమాశ్రిత సంగీత జ్ణానమను బ్రహ్మా(నందసాగర)

శ్రీవిశ్వనాథ శ్రీకాంత విదులు పావనమూర్తులుపాసించలేదా
భావించి రాగలయాదుల భజియించే శ్రీత్యాగరాజనుత 

భావం
=====

ఓ రామా!సీతాపతీ! రామ పరబ్రహ్మమనే ఆనందసాగరములో ఈదని దేహము ఈ భూమికి భారమే. సమస్త వేదములకు ఆశ్రయమైన సంగీత జ్ఞానమనే బ్రహ్మానందమనే సాగరాన్ని అనుభూతి చెందని దేహము భారమైనది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, నిర్మలరూపులు సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉపాసించినారు కదా! ఆ విధముగా భావించి రాగలయాదులతో భజించే పరమశివునిచే నుతించబడే శ్రీరామా! బ్రహ్మానందమనే సాగరాన్ని అనుభూతి చెందని దేహము భారమైనది. 

శ్రవణం
======

గరుడధ్వని రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని కృత్తికా నటరాజన్ గారు ఆలపించారు.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవిత విశేషాలు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆధునిక భారతదేశంలో ఆధ్యాత్మిక సందేశాన్ని విద్య, వైద్యం, తాగునీరు, సేవా కార్యక్రమాలతో ముడిపెట్టిన మహనీయులు. ఆయన 1926...