9, మే 2015, శనివారం

మరి వేరే గతి యెవరమ్మా మహిలోన బ్రోచుటకు




మరి వేరే గతి యెవరమ్మా మహిలోన బ్రోచుటకు

శరణాగత రక్షకి నీవే యని
సదా నమ్మితి నమ్మితి మీనాక్షి

మధురాపురి నిలయ వాణి రమా సేవిత పద కమల
మధుకైటభ భంజని కాత్యాయిని మరాళ గమన నిగమాంత వాసిని

వరమిచ్చి శీఘ్రమె బ్రోవు శివాంబా! ఇది నీకు బరువా!
నెర దాటవు నీవు గదా! శంకరి!సరోజభవాది సురేంద్ర పూజితే

శుకశ్యామల ఘనశ్యామకృష్ణుని సోదరి కౌమారి
అకళంక కళాధరి బింబాధరి అపార కృపానిధి నీవే రక్షింప

పాదయుగము మదిలో దలచి కోరితి వినుము మదగజగమని
పరుల నుతింపగనే వరమొసగు నిను సతతము మది మరవకనే
మదనరిపుసతి నిను హృదయములో గతియని దలచి స్తుతి సలిపితే
ముదముతో ఫలమొసగుటకు ధరలో నతావన కుతూహల నీవేగా


కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా ప్రసిద్ధి పొందిన సమకాలీకులు కాకర్ల త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు. శ్యామ శాస్త్రులు వీరి మువ్వురిలో పెద్దవారు. ఈయన సంగీతానికి పుట్టిల్లైన తంజావూరు దగ్గరి తిరువారూరులో విశ్వనాథ అయ్యరు, వేంగలక్ష్మి దంపతులకు 1762 (కొన్ని మూలాల్లో 1763గా ఉంది) జన్మించాడు. వేంకటసుబ్రహ్మణ్య అయ్యరుగా నామకరణం చేయబడినా, శ్యామకృష్ణ అన్న ముద్దు పేరుతో పిలువబడ్డాడు.వీరి కులదైవము తంజావూరులో ఉన్న బంగారు కామాక్షీ దేవి. శ్యామకృష్ణులు పసిప్రాయంలోనే తెలుగు, సంస్కృతము, తమిళ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. చిన్నతనంలోనే నారదులు ఈయనపై అనుగ్రహించి సంగీతస్వామి అనే సన్యాసి రూపంలో వీరి ఇంటికి వచ్చి, ఈ బాలునిలో ఉన్న దైవత్వాన్ని గుర్తించి, శ్యామకృష్ణునికి సంగీత జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. తంజావూరు శరభోజీ మహారాజు మన్ననలు పొందినా శ్యామశాస్త్రులు పెద్దగా శిష్యవారసత్వాన్ని సమకూర్చుకునే ఆసక్తి చూపలేదు. మదురై మీనాక్షి, తంజావూరు బంగారు కామాక్షిలపై శ్యామశాస్త్రులు ఎన్నో కీర్తనలు రచించారు. త్యాగయ్య కూడా తంజావూరు ప్రాంతంలోనే ఉండటం చేత శ్యామయ్యకు,త్యాగయ్యకు సాన్నిహిత్యం ఏర్పడింది. సంగీత శాస్త్రమే కాకుండా, శ్యామశాస్త్రులు జ్యోతిష్య శాస్త్రంలో కూడా ప్రావీణ్యం సంపాదించి తంజావూర్ సంస్థానంలో పేరుగాంచారు. శ్యామశాస్త్రులు చాలా మటుకు కృతులు తెలుగు, సంస్కృత భాషలో రచించారు.

చిన్నతనంలోనే బంగారు కామాక్షిని కొలుస్తూ మంత్రాలను వేర్వేరు రాగాలలో ఆలపించి అమ్మకు హారంగా వేశారు శ్యామశాస్త్రి. ఆ కామాక్షి తల్లి అతని హృదయంలో నిలచి పాడించుకునేదట. ఆతని ప్రజ్ఞను మరింత పెంపొందించటానికి ఆ తల్లి స్వయంగా కాశీనుండి ఒక సంగీత ప్రావీణ్యమున్న యోగిని శ్యామశాస్త్రుల తండ్రి విశ్వనాథ అయ్యరు ఇంటికి పంపిస్తుంది. ఇంటికి వచ్చిన ఆ యోగిని తండ్రి భక్తి ప్రపత్తులతో సేవిస్తాడు. అప్పుడు ఆ యోగి శ్యమశాత్రికి సంగీతంలో మంచి భవిష్యత్తు ఉంది, అతనికి శిక్షణ మంచి గురువు వద్ద ఇప్పించమని ఆదేశిస్తాడు. ఆ యోగి వద్దే శ్యామశాస్త్రికి సాధన మొదలవుతుంది. గురువుల అనుగ్రహంతో, తల్లి కృపతో శ్యామశాస్త్రి కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే సంగీత ప్రావీణ్యం పొందుతాడు. యోగి అతన్ని సంగీత సామ్రాజ్యంలో ధృవతారగా నిలుస్తావని మనసారా ఆశీర్వదించి కాశీకి వెళ్లిపోతాడు. పచ్చిమిరియం అడియప్పయ్యర్ అనే విద్వాంసుడు శ్యామకృష్ణుని ఆ కామాక్షి అవతారంగా గ్రహించి ఆప్యాయంగా కామాక్షీ అని పిలిచేవాడట. ఒకసారి తంజావూరు రాజా శరభోజీ ఆస్థానంలో కేశవయ్య అనే పండితుడు శ్యామశాస్త్రిని సంగీత పోటీకి ఆహ్వానిస్తాడు. మొదట కేశవయ్య అద్భుతంగా పాడతాడు. తరువాత శ్యామశాస్త్రి కామాక్షి అమ్మను తలచుకొని 'దేవీ బ్రోవ సమయమిదే' అని చింతామణి రాగంలో అత్యుత్తమమైన స్వర సంచారంతో గానం చేస్తాడు. ఆ సంగీతం విని కేశవయ్య తన అజ్ఞానాన్ని తెలుసుకుంటాడు. రాజా శరభోజీ శ్యామశాస్త్రి ప్రతిభకు ముగ్ధులై 'మహావిద్వాన్' అనే బిరుదుతో సత్కరించి అనేక కానుకలిస్తాడు. శ్యామశాస్త్రులు ఆ కానుకలన్నీ కామాక్షీ తల్లికి సమర్పిస్తాడు. ఎప్పుడూ ధనము, పదవుల ప్రలోభానికి లొంగకుండా శ్యామశాస్త్రులు జీవితమంతా కామాక్షీ ఉపాసనలో తరించారు.


శ్యామశాస్త్రులు మదురై మీనాక్షి అమ్మవారిపై రచించిన తొమ్మిది కృతులు నవరత్న మాలికగా  పేరు పొందాయి. వీటిలో ఆనందభైరవిలో 'మరివేరేగతి యెవ్వరమ్మా', శంకరాభరణంలో 'సరోజదళనేత్రి హిమగిరిపుత్రి' ఆ ఆదిపరాశక్తి వర్ణనలో ప్రత్యేకతను చాటుకున్నాయి. అలాగే, తిరుచిరాపల్లి సమీపంలోని జంబుకేశ్వరంలో పంచభూత లింగాలలో ఒకటైన జలలింగ స్వరూపుడైన శివుని నాయికగా ఉన్న అమ్మ అఖిలాండేశ్వరిని స్తుతిస్తూ ద్విజావంతి రాగంలో 'అఖిలాండేశ్వరి రక్షమాం' అని అద్భుతమైన రచన చేశారు. కులదైవమైన కామాక్షిపై మధ్యమావతిలో 'పాలించు కామాక్షి పావని పాపశమని', చింతామణి రాగంలో 'దేవి బ్రోవ సమయ మిదే', పున్నాగవరాళిలో 'కనకశైలవిహారిణి', తంజావూరు బృహదీశ్వరుని నాయికయైన బృహన్నాయకీ దేవిపై ఆనందభైరవిలో 'హిమాచల తనయ బ్రోచుటకిది మంచి సమయము', మధ్యమావతిలో 'బృహన్నాయకి నన్ను బ్రోవు వేగమే', నాట రాగంలో 'పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి' మొదలైన ఎన్నో కీర్తనలను రచించారు. తంజావూరు పరిసర ప్రాంతాలైన వైదీశ్వరన్ కోయిల్, పుదుక్కోటై మొదలైన క్షేత్రాలలోని ఆరాధ్య దైవాలను తన కీర్తనలలో నుతించారు శ్యామశాస్త్రులు. దాదాపు 300కు కృతులను రచించిన శ్యామ శాస్త్రి 1867 సంవత్సరములో పరమపదించారు. ఈయన కుమారుడైన సుబ్బరాయ శాస్త్రి కూడా ప్రముఖ కృతి కర్త. రీతిగౌళలో 'జననీ నినువినా' అనే కీర్తన సుబ్బరాయ శాస్త్రి రచించినదే.  కృతులలో శ్యామయ్య వారి ముద్ర 'శ్యామకృష్ణ సోదరి'.

శ్యామశాస్త్రుల వారి 'మరివేరే గతి యెవరమ్మా' అనే కృతిలో మదురై మీనాక్షి అమ్మవారిని అనుగ్రహించమని వేడుకుంటున్నారు.

తల్లీ మీనాక్షీ! నన్ను బ్రోచుటకు నీవు తప్ప ఈ భూమిపై వేరే దిక్కెవ్వరు? శరణన్న వారిని కాపాడే తల్లివని నేను ఎల్లప్పుడూ నమ్ముతున్నాను! మదురైలో నివసించే తల్లీ! నీ పదకమలములను సరస్వతి మరియు లక్ష్మి సేవిస్తారు. మధుకైటభులను సంహరించినావు, కాత్యాయనివి. హంసవలే నడచే నీవు సర్వ వేదముల సారము. శీఘ్రముగా వరమిచ్చి నన్ను బ్రోవుము. ఇది నీకొక బరువా? నీ మాట ఎప్పుడు నిష్ఫలము కాదు శంకరీ! బ్రహ్మేంద్రాదులచే పూజించ బడిన తల్లీ! చేతిలో చిలుకను కలిగిన శ్యామలదేవీ! నీవు నల్లని కృష్ణుని సోదరివి! కుమారివి! మచ్చలేని చంద్రుడుని శిరసుపై ధరించినావు, దొండపండువంటి ఎర్రని పెదవుల కలదానవు! అపారమైన కృపకు నిధి నీవు! నీవే నన్ను రక్షించాలి! ఏనుగు వలె మెల్లగా నడిచే తల్లీ! నీ పాదములను మదిలో తలచి కోరుతున్నాను వినుము! ప్రార్థించగానే వరాలిచ్చే నిను ఎల్లప్పుడూ మదిలో మరవకనే యున్నాను. కాముని దహించిన శివుని పత్నివి నీవు! హృదయములో నీవె గతియని స్తుతించితే నీ భక్తులకు ఆనందంతో ఫలములొసగుటకు కుతుహలముగా ఉండే తల్లివి నీవేగా? నాకు వేరే గతి ఎవరమ్మా ఈ భువిలో బ్రోచుటకు?

శ్యామశాస్త్రులవారికి ఆనందభైరవి రాగం అంటే ప్రీతి అని వారి వారసులు వ్రాశారు. భక్తి, శరణాగతితో వేడుకునే భావాన్ని ఈ రాగం అద్భుతంగా పండిస్తుంది. రాగ లక్షణాలకు అనుగుణంగా శ్యామశాస్త్రుల వారు సాహిత్యంలో భావాన్ని గుప్పించారు. కృతి ప్రతి అడుగులోనూ ఈ భావం ప్రస్ఫుటిస్తుంది. శ్యామశాత్రుల వారు మహా శ్రీవిద్యా ఉపాసకులు. తంజావూరులోని బంగారు కామాక్షిని, అటుతరువాత మదురై మీనాక్షిని ఉపాసన చేసి ఆధ్యాత్మికోన్నతిని పొందారు. వారి మాట అక్షరాల నిజమయ్యేదట. అమ్మ వారి నాలికపై నిలిచి పలికేదని అప్పటి వారి అనుభవాలు తెలుపుతున్నాయి. ఈ మరివేరే గతి అనే కృతిలో సంపూర్ణ శరణాగతి, భక్తి, తల్లిపై గల అవ్యాజమైన విశ్వాసము మనకు తేటతెల్లమవుతాయి.

మరివేరే గతి యెవరమ్మా రాధ-జయలక్ష్మి గార్ల గాత్రంలో వినండి

3 కామెంట్‌లు: