ఎవ్వరని నిర్ణయించిరిరా నిన్నెట్లారాధించిరిరా నరవరు
శివుడనో మాధవుడనో కమలభవుడనో పరబ్రహ్మమనో
శివ మంత్రమునకు 'మ' జీవము మా
ధవ మంత్రమునకు 'రా' జీవము ఈ
వివరము తెలిసిన ఘనులకు మ్రొక్కెద
వితరణ గుణ త్యాగరాజ వినుత
"మునులు, మానవ శ్రేష్ఠులు నిన్ను ఎవరని నిర్ణయించారు? ఏ విధంగా కొలిచారు? శివుడనా? విష్ణువుగానా? బ్రహ్మగానా? లేక పరబ్రహ్మగానా? శివమంత్రము 'నమశ్శివాయ' లో "మ"కారము, విష్ణు మంత్రమగు 'నారాయణాయ'లో 'రా" అక్షరము కలిసి రామనామమేర్పడినది. ఈ వివరాన్ని తెలిపిన గొప్పవారికి మ్రొక్కెదను ఓ ఔదార్యగుణము గల రామా!"
- సద్గురువులు త్యాగరాజస్వామి వారు
శివకేశవుల మూలమంత్రములనుండి అక్షరాలను కలిపి ఏర్పడిన మహత్తరమైన మంత్రము రామ నామము. కాబట్టీ రామ తత్త్వము హరిహరాద్వైతము ప్రతిపాధిస్తూ పరబ్రహ్మాన్ని బోధిస్తున్నదని ఈ కీర్తన సారాంశం.
శివపార్వతుల సంభాషణలో పార్వతి శివునితో ఈ విధంగా అడుగుతుంది:
కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం
పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో
"ఓ ప్రభో! ఏ విధముతో పండితులు నిత్యము విష్ణు సహస్రనామములు చదివిన ఫలము సులభముగా కలుగునో చెప్పవల్సినది. నాకు వినాలను కోరికగా ఉన్నది"
దీనికి సమాధానంగా శంకరుడు పార్వతితో:
శ్రీరామరామరామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!
"ఓ సుందరమైన ముఖము కల పార్వతీ! శ్రీరామ రామ రామ అని మూడు మార్లు రామ నామాన్ని పఠిస్తే సహస్రనామములు పఠించినంత ఫలము. ఈ చెవులకు ఇంపుగా ఉండే రామ నామమును నేను మనసులో రమించి చిదానందంగా ఉంటాను! "
ఈ విధంగా శివుడు నిరంతరము రమించే మహాద్భుత మంత్రము రామ నామము. భవతారకమని ఎందరో మహానుభావులు మనకు ఎంతో వివరంగా సంకీర్తనలలో తెలిపారు. వారి జీవితాలే దీనికి తార్కాణాలు. శివుడు తలచే రామనామము కన్నా మించినది ఏముంటుంది? అందుకే రామనామమే పరబ్రహ్మ తత్త్వమని తెలియజేసిన వారికి నా నమస్కారాలు అని త్యాగరాజుల వారు ఈ అద్భుతమైన కృతిలో మనకు వివరిస్తున్నారు. మనకు నిరంతరం వచ్చే ప్రశ్నకు సమాధానం ఉంది ఈ కీర్తనలో.
శ్రీకరమౌ శ్రీరామ నామం శ్రితజన మందారం
పావనమే రఘురామ నామం భవతారక మంత్రం
సుధా రఘునాథన్ గారి గళంలో ఎవరని నిర్ణయించిరిరా వినండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి