RightClickBlocker

8, మే 2015, శుక్రవారం

నన్ను విడచి కదలకురా రామయ్య


నన్ను విడచి కదలకురా! రామయ్య రామా! కోదండ రామా! కళ్యాణ రామా! పట్టాభిరామా! రామయ్య వదలకురా! కదలకురా! వదలకురా!

నిన్ను బాసి అరనిమిష మోర్వనురా ||నన్ను విడచి||

అబ్దిలో మునిగి శ్వాసమును బట్టి ఆణిముత్యము గన్నట్లాయె శ్రీరమణ ||నన్ను విడచి||

తరముగాని యెండవేళ కల్పతరు నీడ దొరికినట్లాయెనీ వేళ ||నన్ను విడచి||

వసుధను ఖననము చేయ ధన భాండనమబ్బిన రీతి కనుగొంటి డాసి ||నన్ను విడచి||

బాగుగ నన్నేలుకోరా వర త్యాగరాజనుత తనువు నీదేరా ||నన్ను విడచి||

సందర్భము:

త్యాగరాజస్వామి రచించిన ప్రహ్లాద భక్తి విజయమనే యక్షగానంలో (సంగీత నాటకం) ఈ సంకీర్తన పొందుపరచబడినది. ప్రహ్లాదుడు ఎంతో కాలానికి శ్రీహరి దర్శనము లభించటంతో భగవంతునితో నన్ను విడచి కదలకురా అని ప్రార్థించాడు.

అర్థము:

ఓ శ్రీహరీ! సముద్రములో మునిగి శ్వాస బిగబట్టినప్పుడు ఆణిముత్యము కనిపించనట్లాయె. సహించలేని ఎండ ఉన్న వేళలో కోరిన కోర్కెలను తీర్చే వృక్షపు నీడ దొరికినట్లు దొరికినావు. భూమిని తవ్వుచుండగా లంకె బిందెలు దొరికినట్లు నిన్ను కనుగొన్నాను. నా శరీరము నీకే సమర్పిస్తున్నాను. నన్ను బాగా ఏలుకో!

వివరణ:

సర్వస్య శరణాగతితో ప్రహ్లాదుడు ప్రార్థించిన రీతిని త్యాగరాజస్వామి ప్రహ్లాద భక్తి విజయంలో వివరించారు. ఆర్తితో కూడిన ఈ సంకీర్తనను త్యాగయ్య అదే రాగ లక్షణాలు కలిగిన రీతిగౌళ రాగంలో కూర్చారు. భావానికి రాగానికి అద్భుతమైన కలయిక సద్గురువులు అందించారు. హరి భక్తిలో ప్రహ్లాదుని ప్రత్యేక లక్షణం అచంచలమైన విశ్వాసం, నిరంతర నామస్మరణ అనే సుధావృష్టిలో ఓలలాడటం. ఆ హరి భక్తి వల్లనే నరహరి రూపంలో వెలసిన ఆ శ్రీహరిని తనను వదలి వెళ్లవద్దు అని పాడినట్లుగా త్యాగరాజస్వామి అద్భుతంగా పలికారు. తానే ప్రహ్లాదుడైనట్లు సుందరమైన భావనలను ఒలికించారు.

దానవ వంశంలో జన్మించిన ప్రహ్లాదుడు పుట్టుకతోనే హరిభక్తుడు. శాపవశాత్తు హరిద్వేషియైన అతని తండ్రి హిరణ్యకశిపుడు హరి నామ స్మరణ మానమని ఎంత చెప్పినా వినలేదు ప్రహ్లాదుడు. ఫలితంగా ఆ దానవేంద్రుడు పెట్టిన బాధలన్నీ శ్రీహరి భక్తితో దాటగలుగుతాడు. క్రోధాగ్నిలో రగిలిన హిరణ్యకశిపుడు స్థంభంలో హరిని చూపించమని ప్రహ్లాదుని అడుగగా, ప్రహ్లాదుని ప్రార్థన విని హరి నరహరియై అవతరిస్తాడు. ఆ దానవరాజును సంహరించి ప్రహ్లాదునికి అభయమిస్తాడు.

శ్రీహరి భక్తులలో ప్రహ్లాదుడు అగ్రగణ్యుడు. ఆతని చరిత్రను సంగీత నాటక రూపంలో త్యాగరాజు శ్రీగణపతిని సేవింపరారే అనే సంకీర్తనతో మొదలుపెట్టి నీ నామ రూపములకు అనే సంకీర్తనతో ముగిస్తాడు. ఈ యక్షగానంలో 45 కృతులు ఉన్నాయి. వాసు దేవయని వెడలిన, వందనము రఘునందన, ఎన్నగ మనసుకు రాని, రారా మాయింటి దాక, జయమంగళం నిత్య శుభమంగళం వంటి ఎన్నో అద్భుతమైన భక్తి ప్రధానమైన సంకీర్తనలను రచించారు త్యాగరాజ స్వామి. ఇది వారి రచనలలో ఒక తలమానికంగా నిలిచింది.

నిత్యశ్రీ మహదేవన్ గారి గాత్రంలో ఈ కీర్తన వినండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి