10, మే 2015, ఆదివారం

ముందు తెలిసెనా ప్రభూ ఈ మందిరమిటులుంచేనా



ముందు తెలిసెనా ప్రభూ ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధుర క్షణమేదో.. కాస్త ముందు తెలిసెనా ప్రభూ..

అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
సుందర మందార కుంద సుమదళములు పరువనా
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును
ముందు తెలిసెనా ప్రభూ
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు
మధుర క్షణమేదో.. కాస్త ముందు తెలిసెనా ప్రభూ..

బ్రతుకంతా ఎదురుచూతు పట్టున రానే రావు
ఎదుర రయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు
కదలనీక నిముషము నను వదలిపోక నిలుపగ
నీ పదముల బంధింపలేను హృదయము సంకెల చేసి
ముందు తెలిసెనా ప్రభూ ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధుర క్షణమేదో.. కాస్త ముందు తెలిసెనా ప్రభూ..


శ్రీకృష్ణుని కోసం వేచి ఉన్న గోపిక భావనను దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు తమ కవితాఝరిగా ఇలా ఆవిష్కరించారు.

ప్రభూ! నీవు వచ్చే వేళ ముందే తెలిస్తే ఈ మందిరాన్ని ఈ మందమతి ఇలా ఉంచేనా! నీవు వచ్చే మధుర క్షణమేదో ముందు తెలిస్తే బాగుండు!

నీ  కనులకు విందుగా ఇంటి ముంగిట అందమైన మందార పూవుల రేకులతో పరచి అలంకరించనా? నీ అడుగు జాడలు నిలిచినా చాలు ప్రభూ! నీవు వచ్చే వేళ ముందే తెలిస్తే ఈ మందిరాన్ని ఈ మందమతి ఇలా ఉంచేనా! నీవు వచ్చే మధుర క్షణమేదో ముందు తెలిస్తే బాగుండు!

జీవితమంతా ఎదురుచూస్తునే ఉన్నాను ఒక పట్టున రానే రావు! ఎదురు చూడని సాయం వేళ వచ్చి చిటికెలో మాయమవుతావు! నా హృదయముతో నీ పాదాలను బంధించి, నన్ను వదిలి వెళ్లకుండా, కదలకుండా ఒక్క నిమిషం కూడా నిన్నుంచలేను ప్రభూ! నీవు వచ్చే వేళ ముందే తెలిస్తే ఈ మందిరాన్ని ఈ మందమతి ఇలా ఉంచేనా! నీవు వచ్చే మధుర క్షణమేదో ముందు తెలిస్తే బాగుండు!

కృష్ణశాస్త్రి కవితలా అని దేవులపల్లి వారి సాహితీసంపదను ఒక కొలబద్దగా సాహిత్యకారులు గౌరవించారు. దానికి కారణం లలితమైన, భావయుక్తమైన, హృదయాన్ని తాకే సాహిత్యాన్ని ఆయన తన రచనలలో గుప్పించారు. హృదయం ఎంత సున్నితంగా ఉండగలదో ఆయన సాహిత్యం మనకు నిరూపిస్తుంది. ఈ గీతంలో నాయిక స్వామికోసం పరితపించి, వేచి వేసారి, ఆయన వచ్చి క్షణంలో మటుమాయమైపోతే కలిగే భావనను ఒక సుందరసుమంలా నిలిపారు. పదధూళి, అడుగుల గురుతులు వంటి పదాలు ఆయన సాహిత్యంలో కోకొల్లలు.  తాను స్వామి వేరు అన్న భావనలో ఉన్న నాయిక నవరసాలను ఒలికిస్తుంది. రానంత కాలము విరహము, రాగానే కలహము, వెళ్లిపోగానే దిగులు...ఇలా ఎన్ని మధుర భావనలో ఆ నాయికలో. ఈ గీతంలో స్వామి తన వద్ద ఉన్న కొద్ది సమయం చాలక నిరాశ, ఆయన వచ్చే విషయం ముందే తెలిస్తే కలయికను మరింత మధురంగా చేద్దామనే తపన..అమితమైన ప్రేమ మరియు భక్తి....హృదయంతో పాదాలకు సంకెలలు వేయలేను అన్న సున్నితమైన సందేశం...దేవులపల్లివారికే చెల్లు.

భాషకు భావం ప్రాణం. భావానికి కవి హృదయంలోని నిర్మలత్వం పునాది. నిర్మలత్వానికి భక్తి, తదనుగుణ జనిత పారవశ్యానుభూతులు ఉచ్ఛ్వాస నిశ్వాసలు. వీటన్నిటికీ పరిపూర్ణమైన ప్రతిబింబం దేవులపల్లి వారి సాహిత్యం. అందుకే ఆయన ఆధునిక తెలుగు కవులలో అగ్రగణ్యుడు. మరే కవికీ అందనంత దూరంలో నిలించిన ధృవతార.

ఈ గీతాన్ని మేఘసందేశం చిత్రంలో ఒక అద్భుతమైన సన్నివేశంలో నాయికా-నాయకులపై చిత్రీకరించారు. గోదావరి ఒడ్డు, నాయిక కుటీరం, నాయకుని పడవ ప్రయాణం, తదుపరి భావావేశం, నాయిక నృత్య స్పందన...ఇదీ ఆ మధుర చిత్రంలోని ఈ గీతానికి గల ఘట్టం. సుశీలమ్మ గొంతులో తెలుగుదనం తేనెతో కలిసి రంగరించి పోసినట్లుగా జాలువారింది ఈ గీతం. రమేష్ నాయుడు గారి సంగీతం అజరామరం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి