శ్రీ నీలోత్పల నాయికే జగదంబికే
శ్రినగర నాయికే మామవ వర దాయికే
దీన జనార్తి ప్రభంజన రీతి గౌరవే
దేశిక ప్రదర్శిత చిద్రూపిణి నత భైరవే
ఆనందాత్మానుభవే అద్రిరాజ సముద్భవే
సూన శరారి వైభవే జ్ఞాన సుధార్ణవే శివే
సంకల్ప వికల్పాత్మక చిత్తవృత్తి జాలే
సాధు జనారాధిత సద్గురు కటాక్ష మూలే
సంకట హర ధురీణతర గురు గుహానుకూలే
సమస్త విశ్వోత్పత్తి స్థితి లయాది కాలే
విటంక త్యాగరాజ మోహిత విచిత్ర లీలే
శంకరి కృపాల వాలే హాటక మయ చేలే
పంకజ నయన విశాలే పద్మరాగ మణిమాలే
శంకర సన్నుత బాలే శారద గాన లోలే
నీలి కలువపై స్థిరమైయున్న ఓ జగదంబా! శ్రీనగర శారదా పీఠానికి నాయికా! నాకు వరములిచ్చే తల్లీ! దీన జనుల ఆర్తిని తీర్చే నీ రీతి వలన అద్భుతమైన కీర్తి కలిగిన తల్లీ! పండితులచే సర్వోన్నతమైన చైతన్యరూపముగా పొగడబడి, భైరవునిచే నుతించబడిన తల్లీ! నిరంతరం ఆనందాన్ని అనుభవిస్తూ ఉండే తల్లీ! హిమవంతుని కుమార్తెవైన నీవు మన్మథుని వైరి అయిన శివునికి వైభవాన్ని కలిగిస్తున్నావు! జ్ఞానసాగరానివి నీవు శివానీ!
సంకల్పము, దానికి వికల్పము కూడా నీ చిత్తము ద్వారా అమలుచేస్తావు. సాధువులచే ఆరాధించబడినావు! సద్గురువుల కటాక్షానికి మూలము నీవు! మా కష్టాలను తొలగించే నిపుణురాలవు నీవు! గురుగుహునికి ఎల్లప్పుడూ అనుకూలంగా ఉన్నావు! ఈ విశ్వము యొక్క సృష్టి, స్థితి, లయములకు కారణము నీవే! నీ ఆశ్చర్యకరమైన లీలలతో శివుని సమ్మోహనుని చేసినావు! శంకరీ! నీవు కృపకు నిలయానివి! బంగారు వస్త్రాలను ధరించిన తల్లివి! కలువల వంటి విశాలమైన కన్నులు కలిగి, కెంపులతో కూడిన హారములను ధరించినావు! శంకరునిచే నుతించబడిన బాలా త్రిపురసుందరివి! గానములో లీనమయ్యే శారదవు నీవు!
ముత్తుస్వామి దీక్షితులవారు కర్ణాటక సంగీత త్రయంలో ఒకరు. ఈ కృతిలో ఆయన అమ్మవారిని రీతిగౌళ రాగంలో నుతించారు. అమ్మ అపారమైన కరుణకు, దయకు, మహిమలకు నిలయం. ఆ తల్లిని ఉపాసన చేసిన దీక్షితులవారు మంత్ర సమానమైన పదాలతో కొలిచారు. చిద్రూపిణి అన్న పదానికి ఎంతో నిగూఢమైన అర్థముంది. లలితా సహస్రనామావళిలో, ఇతర దేవి స్తోత్త్రములలో అమ్మ చిద్రూపిణిగా వర్ణించబడింది. పరిపూర్ణమైన చైతన్య స్వరూపిణి అమ్మ. ఆ చైతన్యమే చిత్. అలాగే, సంకల్పము, వికల్పము రెండూ కూడా తన చిత్తముతో అమలు చేసేది అమ్మ. ఇటువంటి భావనలు అనుభూతి చెందితే తప్ప కలుగవు. దీక్షితుల వారు అమ్మను కమలాంబ నవావర్ణ కృతులను ఎంతో మనోజ్ఞంగా రచించారు. అమ్మ సృష్టి స్థితి లయములకు కారణమని పలికారు. దేవీ ఉపాసనలో అమ్మను సర్వశక్త్యాత్మికగా ముగురమ్మలకు మూలంగా, త్రిమూర్తుల శక్తి సమన్వితగా వైభవంగా నుతించబడినది. అదే తరహాలో దీక్షితుల వారు ఈ కీర్తనలో అమ్మ లీలలను, రూపాన్ని ప్రస్తుతించారు. చిదంబరంలో శివకామి అమ్మవారికి బంగారు చీర అలంకరిస్తారు. అదే రీతిని దీక్షితుల వారు ఈ శాంకరిని హాటకమయ చేలే గా అభివర్ణించారు.
డాక్టర్ బాలమురళీకృష్ణగారి గళంలో ప్రసిద్ధి పొందిన ఈ కృతిని వినండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి