9, మే 2015, శనివారం

రంగనాథుడే అంతరంగనాథుడే అంతా రంగనాథుడే


రంగనాథుడే అంతరంగనాథుడే అంతా రంగనాథుడే

మంగళప్రదంబులిచ్చు మహనీయ గుణాఢ్యుడే

సతతము వాని నామమే సంకీర్తనములు జేసిన జనుల హృదయకమలమందు జెలగుచునున్నాడే
పతితపావనుడను బిరుదు బట్టి యున్నాడే సద్గతి ఇచ్చు వాడు ఇతడే గరుడగమన దొరయితడే

పదియారు వేల స్త్రీలకు ప్రాణనాథుడితడే పరశురామ గర్వమెల్ల భంగపరచినాడే
ముదము మీర పాండవులకు మోక్షమిచ్చినాడే పరమదయాకరుడే శ్రీప్రహ్లాదవరదుడే


పొన్నయ్య పిళ్లై రచించిన ఈ కృతి సౌరాష్ట్ర రాగంలో కూర్చబడింది.

శ్రీరంగనాథుని నుతిస్తూ కృతి కర్త ఇలా అంటున్నారు:

అంతా ఆ రంగనాథుడే! అంతరంగానికి కూడా నాథుడే!  శుభాలు కలిగించే గొప్ప గుణాలు కలవాడే!

ఎల్లప్పుడూ ఆతని నామమును సంకీర్తనమును చేసే జనుల హృదయాలలో నివసించియున్నాడే! పతితపావనుడనే బిరుదు కలవాడే! మంచి గతిని ఇచ్చేవాడి ఇతడే! గరుత్మంతునిపై అధిరోహించే దొర ఇతడే! ఈ రంగనాథుడే!

పదహారువేల మంది స్త్రీలకు విభుడు ఇతడే! పరశురాముని గర్వమంతా అణచినవాడితడే! సంతోషముతో పాండవులకు మోక్షాన్ని ప్రసాదించిన వాడితడే! అపారమైన దయస్వరూపుడే! ప్రహ్లాదుని కాపాడిన వాడే! ఈ రంగనాథుడే!

పొన్నయ్య పిళ్లై మంచి సంగీత విద్వాంసుల కుటుంబంలో 19వ శతాబ్దం చివరలో జన్మించారు. కర్ణాటక సంగీత త్రయంలో ఒక్కరైన ముత్తుస్వామి దీక్షితుల వద్ద సంగీత విద్యనభ్యసించారు. 15 ఏళ్ల పాటు సంగీతము, నృత్యము, మృదంగము మీనాక్షీ సుందరం పిళ్లై అనే గురువు వద్ద నేర్చుకున్నారు. తంజావూర్ మహారాజా శరభోజి వారి ఆస్థానంలో విద్వాంసులుగా పేరు పొందారు. ఎన్నో అద్భుతమైన కృతులను రచించారు. కర్ణాటక సంగీతంతో భరతనాట్యశాస్త్ర ధర్మాలను నిర్వచించారు. ఎన్నో జతిస్వరాలు, పదవర్ణాలు, శబ్దాలు, జావళులు, తిల్లానలు మరియు కృతులను రచించారు. రాజా అన్నామలై చెట్టియార్ సంగీత కళాశాలలో ఉపన్యాసకులుగా పని చేశారు. తన శిష్య బృదంతో కలిసి తంజావూర్ ప్రాంతంలో ప్రదర్శనలను ఇప్పించారు. ప్రాచుర్యం పొందిన ఆయన రచనలు - మాయాతీత స్వరూపిణీ (మాయామాళవ గౌళ), అంబా నీలాంబరీ (నీలాంబరి), మహాదేవ మనోహరి (దేవమనోహరి) మొదలైనవి. 1932లో వీరికి సంగీత కళానిధి బిరుదునిచ్చి సత్కరించారు.

హైదరబాద్ సోదరులుగా ప్రసిద్ధి పొందిన కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ రాఘవాచార్యులు, శేషాచార్యుల గళంలో ఈ రంగనాథుడే కృతిని వినండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి