RightClickBlocker

4, మే 2015, సోమవారం

అన్నమయ్య జయంతి - అన్నమాచార్య భావనా వాహిని
తెలిసీ తెలియని వయసులో ఓ ఆడపిల్ల హరిని శరణు అన్నది. హరియే సర్వస్వం అని విశ్వసించింది. దానికి ఫలితం ఒక బృహత్తరమైన కార్యము, మహత్తరమైన లక్ష్యం. ఆ స్త్రీలోని శక్తి సామర్థ్యాలను, మనసులోని నైర్మల్యాన్ని చూసే స్వామి ఆమెను కార్యోన్ముఖురాలను చేశాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, అర్థ బలం, అంగబలం లేకపోయినా, ఎన్నో త్యాగాలు చేసి, మహాద్బుతమైన సద్గురు తత్త్వాన్ని ఆయన సంకీర్తనల వైశిష్ట్యాన్ని మనకు అందిస్తున్నారు అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపకులు, ప్రముఖ భక్తి సంగీత కళాకారిణి, అన్నమయ్య పదకోకిల, పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు. 

యుగాన్ని బట్టి పరమాత్మను కనుగొనే సాధనం మారుతుంది. ఎందుకంటే, యుగలక్షణాలు మానవుని ఆలోచనలను, కర్మలను ప్రభావితం చేస్తాయి. సృష్టినుండి ప్రళయం వరకు జరిగే యుగక్రమంలో మానవునిలో నిర్మలత్వం తగ్గుతుంది. తదనుగుణంగా మోక్షమార్గాలు కూడా మారుతూ ఉంటాయి. కలిలో సంకీర్తనమే మోక్షమునకు అత్యుత్తమమైన సాధనం అని ఆర్యోక్తి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణుడు గీతలో అర్జునునికి చెప్పాడు. దానికి నిరూపణగా, అటు తరువాత ఎందరో మహానుభావులు ఈ కర్మభూమిని అధర్మం నుండి రక్షించటానికి అవతరించారు. అటువంటి వారిలో తాళ్లపాక అన్నమాచార్యుల వారు మన తెలుగుజాతిలో 15వ శతాబ్దంలో జన్మించారు. దాదాపు శతసంవత్సమురల జీవితంలో ఆయన 32 వేలకు పైగా అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశం మరియు మధుర భక్తితో కూడిన సంకీర్తనలను రచన చేశారు. 

ఒక్కొక్క వ్యక్తికి మహాపురుషులపై ప్రత్యేకమైన అభిప్రాయం ఉంటుంది. నా దృష్టిలో అన్నమాచార్యుల వారు సద్గురువులు, గొప్ప సంఘ సంస్కర్త. సమాజానికి ఎప్పుడైనా కావలసినది సంస్కర్తలు. ఎందుకంటే, ధర్మం ఎప్పటికీ ఒకేలా ఉండదు, ఉండకూడదు. కాలానుగుణంగా ధర్మానికి మార్పులు చేర్పులు చేసే గురుతర బాధ్యత సద్గురువులు, పీఠాధిపతులపైనే ఉంది. ఈ భరత భూమిలో గుణము మరియు కర్మలను ఆధారంగా మనుషులకు కులము అనే ఒక లక్షణాన్ని ఇచ్చినా, అది జన్మతః అన్న దుష్ప్రచారంతో మనుషులలో హెచ్చు తగ్గులు అనే భావన మొదలయ్యింది. ఈ విష బీజం మహా వృక్షమైంది. సనాతన ధర్మ సాధకులను విడదీసింది. పరధర్మాలు దీనిని ఆసరగా తీసుకొని భారత దేశాన్ని దండెత్తాయి. మన ఆధ్యాత్మిక సంపదలను నాశనం చేసి, సిరిసంపదలను దోచుకొని మనలను నిర్వీర్యులను చేయటం మొదలు పెట్టారు. 

ఇటువంటి సమయంలో అన్నమాచార్యుల వారు భ్రష్టు పట్టిన కుల వ్యవస్థను సంస్కరించాలనే ఉద్దేశంతో బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే అని తన సంకీర్తనల ద్వారా ఎలుగెత్తి చాటారు. తిండి, నిద్ర, పంచ భూతములు అన్నీ రాజైనా, పేదైనా అందరికీ ఒకటే అన్న సందేశంతో కొన్ని వందల ఏళ్ల తరువాత భరతభూమిని పట్టి పీడించబొయే మహమ్మారి లక్షణాలను నిందించారు, నిజాన్ని పలికారు. 

ఇటువంటి సంఘ సంస్కర్త, అంతకన్నా మించి తన సంకీర్తనల ద్వారా మానవ జన్మ లక్ష్యాన్ని, సత్యాన్ని అద్భుతంగా పలికించిన సద్గురువులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి జయంతి నేడు. అన్నమయ్య తత్త్వాన్ని దశాబ్దాల క్రితం మొట్ట మొదటి సారి తీవ్రమైన శ్రమతో, అకుంఠిత దీక్షతో ప్రచారం మొదలు పెట్టారు శ్రీమతి శోభారాజు గారు. దాని ఫలితమే నేటి అన్నమయ్య సంకీర్తనలకు గల ప్రాచుర్యం. ఏ గాయనీ గాయకుడు కూడా అన్నమయ్య కీర్తనలు పాడనిదే నేడు ఈ సమాజంలో గుర్తింపు పూర్తిగా పొందలేడు అన్నది నిజం. దీనికి బీజం అన్నమాచార్య భావనా వాహిని వేసినదే. ఇది అన్నమయ్య తత్త్వ ప్రచారంలో అద్భుతమైన పురోగతి. నేను మనస్ఫూర్తిగా దీనిని శోభారాజు గారికే ఆపాదిస్తున్నాను, అభినందిస్తున్నాను. 

ఎన్నో ఏళ్లుగా, అన్నమాచార్య భావనా వాహిని శోభారాజు గారి సారథ్యంలో అన్నమయ్య జయంతి, వర్ధంతి తిథులకు మహానగర సంకీర్తన నిర్వహిస్తోంది. చిక్కడపల్లి వేంకతేశ్వర స్వామి గుడి మొదలు ట్యాంక్ బండ్ పై అన్నమాచార్యుల వారి విగ్రహం వరకు సంకీర్తన చేస్తూ సాగే ఈ కళాకారుల, భక్తుల సమూహం మనలోని భావ కాలుష్యాన్ని తొలగించటానికి ఎంతో గొప్ప ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంగా అందరికీ ఒక విజ్ఞప్తి - అన్నమాచార్యుల తత్త్వాన్ని నిజంగా అర్థం చేసుకొని, ఆచరించ గలిగితే ఆ కళాకారులతో పాటు మనలోని ప్రతి ఒక్కరమూ నిత్యము ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కొని అధిగమించి, ఆధ్యాత్మికోన్నతికి, తద్వారా సమాజాభ్యుదయానికి పాటు పడతామో డాక్టర్ శోభారాజు గారు ప్రతి శనివారం జరిగే స్వరార్చనలో, అన్నమయ్యపురంలో జరిగే ఇతర కార్యక్రమాలలో ఎంతో ప్రభావవంతంగా, అందరికీ అర్థమయ్యేలా వివరిస్తారు. ఈ అవకాశాన్ని అందరు ఉపయోగించుకోవలసినది. 

అన్నమాచార్యుల వారి 607వ జయంతి సందర్భంగా డాక్టర్ శోభారాజు గారి లక్ష్యం నెరవేరి, మనమందరం భావ కాలుష్యాన్ని దూరం చేసుకోవాలని నా ప్రార్థన, సంకల్పం. ఇటువంటి ఉత్తమమైన, పవిత్రమైన లక్ష్య సాధనకు పరమాత్మ, సద్గురువులు తమ అపారమైన అనుగ్రహాన్ని శోభారాజు గారికి, అన్నమాచార్య భావనా వాహినికి ప్రసాదించాలని ప్రార్థన.

కడు పుణ్యులను పాప కర్ములను సరి గావ జడియు శ్రీ వేంకటేశ్వరు నామమొకటే!
బ్రహ్మమొక్కటే! పరబ్రహ్మమొక్కటే!అన్నమాచార్య భావనా వాహిని కార్యక్రమాల వివరాలు తెలుసుకోదలచిన వారు ఈ క్రింది చిరునామాలోని ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. 

http://www.annamayya.org

ANNAMACHARYA BHAVANA VAHINI

ANNAMACHARYA SADANAM, (HiTex Road, Kondapur),
ANNAMAYYAPURAM, HYDERABD - 500084.


TEL : 91-40-23112299. 9848024042 FAX : 91- 40 - 2311242
Email - info2@annamayya.org

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి