RightClickBlocker

26, మే 2015, మంగళవారం

అన్నమయ్య ఒక దిశానిర్దేశకుడు ఎలా అయ్యాడు?


అన్నమయ్య ఒక దిశానిర్దేశకుడు ఎలా అయ్యాడు?"వదలక వేదవ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణుకథ
సదనంబైనది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణుకథ"

కృష్ణద్వైపాయన వ్యాస భగవానుడు మనకు అందించిన అమృతము శ్రీమద్భాగవతము. ఆ విశ్వాత్మకుని లీలలను, మహిమలను, అద్భుత గాథలను మనకు పవిత్రంగా భాగవతం ద్వారా తెలియజేశాడు వ్యాసుడు. ఒక్కొక్క అవతారాన్ని కనులకు కట్టినట్లుగా విశదీకరించి భక్తి భావాన్ని మనలో ఇనుమడింపజేసే రసామృతము ఈ భాగవతము. ధర్మ రక్షణకై ఆయా కాలములో తదనుగుణంగా అవతారాన్ని ఎత్తి కర్తవ్యపాలన చేసి ధర్మ స్థాపన చేశాడు శ్రీహరి. భక్తి జీవితానికి మూలం. భక్తి-ముక్తి పథములను సోదాహరణముగా మానవ జీవిత సారూప్యములతో వివరించారు వ్యాసుల వారు. భగవద్భక్తుల గాథలను, భగవంతుని లీలలను మనకు గంగాప్రవాహంలా అందించిన విష్ణురూపుడు వ్యాసమహర్షి. అందుకే దీనిని విదిత పావనము అన్నారు అన్నమాచార్యుల వారు. రెండే రెండు పదాలతో వ్యాస భగవానుని భాగవత వైశిష్ట్యాన్ని తెలిపిన మహనీయుడు అన్నమయ్య.


ఇక సంకీర్తనలంటే ఏమిటి? అవి విష్ణు నివాసము. వర్ణించిన నుతులే విష్ణు నివాసములు అనటానికి అవి ఎటువంటి భవరోగములనైనా జయించగలవు అన్ని నిరూపిత భావనే ఆధారం. సంకీర్తనల ద్వారా ఎంతో మందికి మానసిక సాంత్వనతో శారీరిక స్వాస్థత కలిగించిన ఉదంతాలు ఉన్నాయి. సంకీర్తనామృతముతో మరణ శయ్యపై నుండి కూడా బతికి బయటపడి మృత్యుంజయులైన వారెందరో ఉన్నారు. చెప్పరాని ఆవేదనను చిటికెలో తొలగించే సంజీవని సంకీర్తన. ఏ మందు ద్వారా నయం కాని మానసిక దౌర్బల్యాన్ని తొలగించే అమృతము సంకీర్తన. పరమపురుషుని నామమును, మహిమను ఛందోబద్ధంగా తెలుపబడిన వేద సమానమైనది సంకీర్తన.

"ఇది ఒకటి హరినామమింతైన చాలదా చెదరకీ జన్మముల చెరలు విడిపించ మదినొకటి హరినామ మంత్రమది చాలదా పదివేలు నరక కూపముల వెడలించ" - శ్రీహరి తత్త్వమును తెలిపే ప్రతి సంకీర్తన జన్మమృత్యు వలయమునుండి తప్పించే వజ్రాయుధమే. ప్రతి శ్రీహరి నామము కూడా మనకు నరక బాధలనుండి తొలగించే అద్భుత సాధనములు. ఎలా? భగవత్తత్త్వమును తెలిపే నామ మహిమను, వైశిష్ట్యాన్ని తెలుసుకోవాలంటే మనలోని దివ్యత్వమును ఆ పరమాత్మతో అనుసంధానము చేసుకోవాలి. దీనికి మనసులోని మాలిన్యాలను తొలగించుకొని పరిపూర్ణమైన ప్రేమ భావనను అలవరచుకోవాలి. దానిని జీవనశైలిలో పాటించాలి. నిత్యమూ ఆనందాన్ని అనుభూతి చెందాలి. అప్పుడే నామ మహిమ మనకు త్రికరణ శుద్ధిగా అందుతుంది. అటు పిమ్మట దుఃఖానికి స్థానమే లేదు. ఏ బాధ కూడా బాధించదు. ఏ విషయ వాంఛ కూడా మనలను చలించదు. తామరాకుపై నీటిబొట్టులా మనిషి అలా అలా హంసలా నడచి దైవత్వముతో సంపూర్ణంగా అనుసంధానమై పోతాడు. ఇక వాని ఆత్మకు జన్మమృత్యు జరావ్యాధి బాధలే ఉండవు. ఇంతటి మహత్తు కలది నామ సంకీర్తన.

బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని పాడి కులమత భేదాలలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను మేల్కొల్పి ఏకం చేసే అద్భుతమైన ప్రయత్నం చేశారు. ఈ సందేశాన్ని జానపద ఒరవడిలో రచించి అందరికీ అందేలా చేశాడు. నిద్ర రాజుదైతే నేమి, బంటుదైతే నేమి, బ్రాహ్మణునిదైతే నేమి, చండాలునిదైతే నేమి ఒకటే కదా, ఏనుగు మీద, కుక్క మీద ప్రసరించే ఎండ ఒకటే అయినట్లు పుణ్యులను పాపులను ముక్తిమార్గము వైపు నడిపించేది శ్రీహరినామమొక్కటే అని తెలిపాడు. అలాగే మనం ఎలా భావిస్తే అలాంటివాడు పరమాత్మ అని ఎంతమాత్రమున సంకీర్తనలో తెలిపి శైవం, వైష్ణవం, శాక్తేయం అన్నిటికీ లక్ష్యం ఒక్కటే - ఆ పరమాత్మను తెలుసుకోవటం. మేము గొప్ప అంటే మేము గొప్ప అని ఆధ్యాత్మిక పురోగతిలోఆగిపోయిన వేర్వేరు మార్గాలు అనుసరించేవారికి కనువిప్పు కలిగించాడు.

శ్రీకృష్ణుడు  సాంఖ్యయోగంలో తెలిపిన సందేశాన్ని వాడల వాడల వెంట వాడెవోవాడేవో అనే సంకీర్తన ద్వారా మనకు అందజేశారు. ఆ లక్ష్మీ దేవి మాయగా తానూ సాక్షీభూతునిగా ఆ పరమాత్మ మనచేత ఎలా కర్మలను చేయిస్తాడో వివరించాడు. మధురభక్తిలో తానే నాయికయై స్వామిని అలరించాడు. తన భావనలన్నీ స్వామికి అర్పించి పునీతుడయ్యాడు.  దాహమిచ్చి దప్పితీర్చే కాలమేఘమా అని నుతించి పరమాత్మ వైభవాన్ని చాటాడు .

ఇటువంటి 32 వేల సంకీర్తనలను మనకు అందించాడంటే అన్నమయ్య ఏ దైవసంకల్పముతో ఏ దైవాంశతో జన్మించాడో ఊహించండి. ఒక్కొక్క సంకీర్తన ఒక్కొక్క సందేశ సుగుణ దీపిక. ఒక్కొక్క సంకీర్తన ఒక్కొక్క అమృత గుళిక. ప్రతి సంకీర్తన దేవ దేవుని నామ మహిమా నిధి. ప్రతి సంకీర్తన మానవునికి భవసాగర తారణ వారధి.

అందుకే అన్నమయ్య ఒక అవతారమూర్తి. ఒక సద్గురువు.  ఒక పరిపూర్ణ చైతన్యమూర్తి.


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి