ఆనంద తాండవమాడే శివుడు అనంత లయుడు చిదంబర నిలయుడు
ఆనంద తాండవమాడే శివుడు అనంత లయుడు చిదంబర నిలయుడు
నగరాజ సుత చిరునగవులు చిలుకంగ సిగలోన వగలొలికి ఎగిరి ఎగిరి దూకంగ సురగంగ
ప్రణవనాదం ప్రాణం కాగా
ప్రకృతి మూలం తానం కాగా
ప్రకృతి మూలం తానం కాగా
భువనమ్ములే రస భూమికలు కాగా
భుజంగ భూషణుడు అనంగ భీషణుడు
పరమ విభుడు గరళ ధరుడు
భావ రాగ తాళ మయుడు సదయుడు
ఏమి శాంభవ లీల!! ఏమా తాండవ హేల!!
అణువణువులోన దివ్యానంద రసడోల
సురగరుడులు ఖేచరులు విద్యాధరులు
నిటల తట ఘటిత నిజకర కమలులై
నిలువగా కురువరా యని పిలువగా కొలువగా
ధిమి ధిమి ధిమి ధిమి ఢమరుధ్వానం ధిక్కటముల మార్మ్రోయగా
కిణ కిణ కిణ కిణ మణి నూపురముల ఝణత్కారముల మ్రోయగా
విరించి తాళము వేయగా
హరి మురగలు మ్రోయింపగా
ప్రమథులాడగా అప్సరలు పాడగా
ఆడగా పాడగా ఆనంద తాండవమాడే
అమెరికా అమ్మాయి చిత్రానికి డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డిగారు రచించిన శివతాండవ గీతం ఇది. అమెరికాలో జన్మించిన స్త్రీ భారతదేశపు కోడలుగా వచ్చి ఈ గీతంలోని భావాన్ని అనుభూతి చెందుతుంది. ఒక శివాలయంలో కలిగే ఈ అనుభవానికి సినారెగారి గీతం, జి.కె.వెంకటేష్ గారి సంగీతం తోడు కాగా సుశీలమ్మ గారి గొంతులో తేటతేనె తెలుగులో అమృతాన్ని కురిపించింది.
కైలాసంలో పరమశివుని ఆనంద తాండవ హేలను కవి మధుర మనోజ్ఞంగా ఆవిష్కరించారు.
అనంతమైన లయలో నిమగ్నుడైన వాడు, ఆకసమంతా నిండియున్న శివుడు ఆనంద తాండవమాడుతున్నాడు. (చిదంబర నిలయుడు అనగా చిదంబర క్షేత్రంలో వెలసిన నటరాజస్వామి అని కూడా అర్థం చెప్పవచ్చు. కానీ, లయకారకుడైన శివుడు ఆకాశమంతా నిండి ఉన్నాడు అన్నది సముచితము అనిపించింది)
హిమవంతుని కుమార్తె అయిన పార్వతి చిరునవ్వులొలికిస్తూ ఉండగా, శిరసులో జటాఝూటమునందు దేవగంగ వగలు ఒలికిస్తూ ఎగిసి ఎగిసి దూకుచుండంగా, శివుడు ఆనందతాండవం చేస్తున్నాడు.. ప్రణవనాదమైన ఓంకారం ప్రాణమవగా, ప్రకృతికి మూలమైన కాలం తాళం కాగా. సమస్తలోకాలు నవరసాల పాత్రను పోషిస్తుండగా, సర్పములను ఆభరణములుగా కలిగిన వాడు, మన్మథుని దహనం చేసిన వాడు, సర్వేశ్వరుడు, కంఠంలో విషాన్ని ధరించిన వాడు, భావము, రాగము, తాళములలో లయమైన వాడు, అపారమైన దయ కలిగిన వాడు అయిన పరమశివుడు ఆనంద తాండవం చేస్తున్నాడు.
ఆహా! ఎంత అద్భుతమా శివుని లీల? ఏమిటా నృత్య విన్యాసము? అణువణువులో దివ్యమైన ఆనంద రసం పొంగి పొరలుతున్నది! దేవతలు, గరుత్మంతుడు, ఆకాశములో సంచరించే దేవగణములు, జీమూతవాహనుడు మొదలైన దేవ వర్గము (విద్యాధరులు) ముక్కంటి అయిన శివునికి చేతులతో నమస్కరించుచు నిలువగా, కైలాసపతీ అని పిలువగా, కొలువగా పరమశివుడు ఆనందతాండవం చేస్తున్నాడు.
ధిమి ధిమి ధ్వనులతో దిక్కులన్నీ మారుమ్రోగగా, కిణ కిణ కిణ అనే రావముతో గజ్జెలు ఝణత్కారము చేయగా, బ్రహ్మ తాళము వేయగా, విష్ణువు నాదస్వరము వాయించగా, ప్రమథ గణములు ఆడగా, అప్సరసలు పాడగా పరమశివుడు ఆనందతాండవం చేస్తున్నాడు.
సినారె గారి భావ సంపద, భాషా కౌశలం, పద విన్యాసం ఈ తాండవహేలలో ఒక దివ్య పారిజాత సుమంలా వికసించాయి. తెలుగులో మాధుర్యాన్ని, క్రొత్తదనాన్ని కురిపించటంలో సినారె గారికి సాటి ఎవ్వరూ లేరు. ఈ గీతంలోని భావగర్భితమైన ప్రాస దీనికి తార్కాణం. నటేశుని నాట్యాన్ని సమస్త దేవతల నృత్య వాయిద్య గాత్ర సహకారాన్ని, ఆ లయకారుని అద్భుత విన్యాసాన్ని మనకు కళ్లకు కట్టీనట్లుగా సినారె గారి కలంలో జాలువారింది. తాళ వాద్యముల అద్భుత సమన్వయముతో, పార్వతి చిరునవ్వుతో, గంగమ్మ చిందుతో స్వామి ఆనంద పరవశములో నర్తన చేస్తుంటే ఆహా! ఆ భావనే కైలాస గిరి రమణీయ దృశ్య కావ్యావిష్కరణ కనుల ముందు కలుగ జేస్తుంది.
ఇక చిత్రం విషయానికొస్తే, నాయిక ఆన్నె ఒక ఫ్రెంచ్ నర్తకి. ఆమె భారతదేశం వచ్చి వెంపటి చిన సత్యం గారి వద్ద కూచిపూడి అభ్యసించి, ఆ కళలో, భరతనాట్య శాస్త్త్రములో ప్రావీణ్యము సంపాదించి, దేవయాని అనే పేరుతో గొప్ప కళాకారిణిగా పేరు పొందారు. పద్మశ్రీ బిరుదు కూడా పొందారు. మనం స్వధర్మాన్ని, మన ప్రాచీన కళలను వదులుకొని పాశ్చాత్య నాగరికత వెంట పడుతున్న సమయంలో మన కళలలోని దివ్యత్వాన్ని గ్రహించి ఆ కళను ఆరాధించిన ఈమె మనకు మార్గదర్శకురాలు. భాష, సంస్కృతి, సాంప్రదాయము, భావము తెలియని విదేశీ వనిత అన్నీ నేర్చుకొని అత్యున్నత స్థాయికి చేరుకుందంటే అది సామాన్యమైన పట్టుదల కాదు. ఆమెలోని తృష్ణకు, శ్రమకు జోహార్లు. ఇలాంటి వారి మన కళలలోని అద్భుతాలను కనుగొని, వాటిని సముచితంగా గౌరవించే ప్రయత్నం ఇకనైనా చేయాలి.
సుశీలమ్మ గళంలో ఈ పాట మాధుర్యాన్ని, దేవయాని గారి నాట్యంలో ఈ భావ వ్యక్తీకరణను ఆస్వాదించండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి