9, డిసెంబర్ 2010, గురువారం

మధురాష్టకం - తాత్పర్యము

అఖిలం మధురం - ఎందుకయ్యా ఇంత మధురం

రాధా మోహనుడు, శ్యామ సుందరుడు, సురుచిర గాత్రుడు, తరుణారుణ కిరణాధర సరసుడు, వనమాలి, శిఖి పింఛ మౌళి, శ్రీ కౌస్తుభ ధరుడు, కిసలయ పాణి, వేణు నాద లాస్యాన్వితుడు, షోడశ సహస్ర గోపికా జన హృదయ వల్లభుడు, రుక్మిణీ మనోహరుడు, భక్త జన హృదయ నివాసుడు, యశోదా లాలితుడు, నంద గోకుల బృంద నాయకుడు, గోప కుటీర పయోఘృత చోరుడు, యదువంశ సుధాంబుధి చంద్రుడు, రాజీవ లోచనుడు, సరసీరుహ పాద పంకజుడు, తులసీ మాలా విభూషితుడు, శ్రీ గంధ సుగంధ లేపితుడు, నారీ జన మానస చోరుడు, కస్తూరి తిలక భూషితుడు, నవ రత్న విభూషిత కేయూర ధారుడు - ఇలా ఎన్ని శుభ లక్షణ గుణ గణ సమన్వితుడు ఆ శ్రీ కృష్ణుడు?. ఆ నీల  మేఘ శరీరుని స్తుతించటానికి, ఆయన మధుర లక్షణ వర్ణనకు మధురాష్టకమే సాటి. వల్లభాచార్యులు రచించిన ఈ అష్టకం లో ఆ శ్రీకృష్ణుని ఆణువణువూ మధురమే అని ఎంతో విలక్షణమైన వర్ణన జరిగింది.

ఇదివరకు కృష్ణాష్టమి సందర్భంగా మధురాష్టకం ఒక వ్యాసంలో ప్రస్తావించాను. ఈసారి తాత్పర్యముతో పూర్తిగా మధురాష్టకం మీదే ఈ ప్రచురణ. సుస్వరలక్ష్మి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి ఆపాత రసామృతం,  విజయ్ ఏసుదాస్ గారి ఇటీవలి గానం

ఇంత అద్భుతమైన రచన చేసిన శ్రీమద్వల్లభాచార్యులకు నా నమస్సుమాంజలి. 

బాల గోపాల కృష్ణ పాహి పాహి

అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం
హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం

వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం
చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం

వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ
నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం

గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం
రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం

కరణం మధురం తరణం మధురం హరణం మధురం రమణం మధురం
వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం

గుంజా మధురా మాలా మధురా యమునా మధురా వీచీ మధురా
సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురం

గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం ముక్తం మధురం
దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురం

గోపా మధురా గావో మధురా యష్టిర్మధురా సృష్టిర్మధురా
దలితం మధురం ఫలితం మధురం మధురాధిపతేరఖిలం మధురం

ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం మధురాష్టకం సంపూర్ణం


శ్రీ వత్సాంకిత   శ్రీ కౌస్తుభ ధర 
 
తాత్పర్యము: 

(ఇక్కడ మధురాధిపతి అనే పదానికి రెండు అర్థాలు అనుకోవచ్చు. మధుర పట్టణానికి అధిపతి (కంసుని జయించాడు కాబట్టి మధుర ఆయన ఆధీనంలోనే ఉన్నట్టు లెక్క) లేదా మాధుర్యానికి అధిపతి. రెండు బానే నప్పుతాయి. అష్టకంలో మధురం గురించి కాబట్టి మాధుర్యానికి అధిపతి అనేదే నేను ఇక్కడ ఉపయోగిస్తాను)

ఆ శ్రీకృష్ణుని పెదవులు, ముఖము, కళ్ళు, నవ్వు, హృదయము, నడక - ఎంతో మధురం. మాధుర్యానికి అధిపతి అయిన శ్రీ కృష్ణునిలో అన్నీ మధురమే. 

ఆ శ్రీకృష్ణుని మాటలు, చేష్టలు, వ్యక్తిత్వము, వస్త్రములు, నడక, ప్రవర్తన, తిరుగుట - ఎంతో మధురం. మాధుర్యానికి అధిపతి అయిన శ్రీ కృష్ణునిలో అన్నీ మధురమే. 

ఆ శ్రీకృష్ణుని వేణువు, పాద ధూళి, హస్తములు, పాదములు, నృత్యము, స్నేహితము (సాహచర్యము) - ఎంతో మధురం. మాధుర్యానికి అధిపతి అయిన శ్రీ కృష్ణునిలో అన్నీ మధురమే. 

ఆ శ్రీకృష్ణుడు గానం చేయుట , పానము చేయుట, (పీతం అంటే పచ్చని వస్త్రము అని కూడ అనుకోవచ్చు కానీ ఇక్కడ మిగిలినవన్నీ క్రియలె కాబట్టి ఇది కూడ క్రియగా పానము చేయుట అనుకుంటున్నాను), తినుట, నిద్రించుట, రూపము, తిలకము - ఎంతో మధురం. మాధుర్యానికి అధిపతి అయిన శ్రీ కృష్ణునిలో అన్నీ మధురమే. 

ఆ శ్రీకృష్ణుని నటన లేదా పనులు చేయుట, ఈదుట/దాటుట, దొంగిలించటం, ఆడుట, గొణుగుట, శాంతముగా పనులు చేయుట - - ఎంతో మధురం. మాధుర్యానికి అధిపతి అయిన శ్రీ కృష్ణునిలో అన్నీ మధురమే. 

ఆ శ్రీకృష్ణుని పిల్లన గ్రోవి ఆలాపన, మెడలో హారము, యమునా నది, అందులోని అలలు, నీరు, కలువలు - ఎంతో మధురం. మాధుర్యానికి అధిపతి అయిన శ్రీ కృష్ణునిలో అన్నీ మధురమే. 

ఆ శ్రీకృష్ణుని గోపికలు, వారితో రాసలీలలు, వారిని కృష్ణుడు పట్టుకొనుట, విడువుట, కృష్ణుని దృష్టి పడినది, సత్ప్రవర్తన - ఎంతో మధురం. మాధుర్యానికి అధిపతి అయిన శ్రీ కృష్ణునిలో అన్నీ మధురమే. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి