22, డిసెంబర్ 2010, బుధవారం

శ్రీమన్నారాయణీయం - తృతీయ స్కంధము, తాత్పర్యము

శ్రీమన్నారాయణీయం -  తృతీయ  స్కంధము



ఎనిమిదవ దశకము - ప్రళయానంతర జగత్సృష్టి

ఏవం తావత్ప్రాకృతప్రక్షయాంతే
బ్రాహ్మే కల్పే హ్యాదిమే లబ్ధజన్మా |
బ్రహ్మా భూయస్త్వత్త ఏవాప్య వేదాన్
సృష్టిం చక్రే పూర్వకల్పోపమానామ్ || ౮-౧||

ప్రభూ! మహా ప్రళయము జరిగిన తర్వాత బ్రహ్మ కల్పము ప్రారంభమగును. ఆ బ్రహ్మకల్పము యొక్క ప్రారంభ సమయమున బ్రహ్మదేవుడు పైన పేర్కొన్నట్లు నీవలన జన్మించాడు. అట్లే నీ యొక్క అనుగ్రహమువలననే వేదములను పొంది అంతకుముందున్న కల్పమున ఉన్నట్లు సృష్టి చేయుటకు మొదలిడెను. 

సోఽయం చతుర్యుగసహస్రమితాన్యహాని
తావన్మితాశ్చ రజనీర్బహుశో నినాయ |
నిద్రాత్యసౌ త్వయి నిలీయ సమం స్వసృష్టైః
నైమిత్తికప్రళయమాహురతోఽస్య రాత్రిమ్ || ౮-౨||

స్వామీ! వేయి చతుర్యుగముల పరిమాణము గల కాలము బ్రహ్మకు ఒక పగలు. అంతే పరిమాణము గల కాలము ఆయనకు ఒక రాత్రి. ఇంత వరకు ఆయనకు ఇట్టి పగళ్ళు, రాత్రులు ఎన్నో గడిచిపోయాయి. రాత్రులందు అతడు తాను సృష్టించిన చరాచర జగత్తుతో పాటు నీలో విలీనమై నిద్రించును. బ్రహ్మ దేవుడు ఇట్లు నిద్రించియుండు రాత్రిని నైమిత్తిక ప్రళయము అని అందురు.

అస్మాదృశాం పునరహర్ముఖకృత్యతుల్యాం
సృష్టిం కరోత్యనుదినం స భవత్ప్రసాదాత్ |
ప్రాగ్బ్రహ్మకల్పజనుషాం చ పరాయుషాం తు
సుప్తప్రబోధనసమాఽస్తి తదాఽపి సృష్టిః || ౮-౩||

రాత్రి గడచిన తరువాత నిద్రలేచి మేము నిత్యక్రుత్యములను ప్రారంభించునట్లు బ్రహ్మదేవుడు నైమిత్తిక ప్రళయము తర్వాత మీ అనుగ్రహము వలన పునః సృష్టి చేయుటకు ఆరంభించును. భ్రుగు మహర్షి మొదలగు చిరంజీవులు బ్రహ్మ వలెనె నిద్రింతురు మరియు మేల్కొందురు. వారికి పూర్వ స్మృతి యుండును. ఇతర జీవులకు ఆ స్మృతి ఉండదు.

పంచాశదబ్దమధునా స్వవయోఽర్ధరూపమ్
ఏకం పరార్ధమతివృత్య హి వర్తతేఽసౌ |
తత్రాంత్యరాత్రిజనితాన్కథయామి భూమన్
పశ్చాద్దినావతరణే చ భవద్విలాసాన్ || ౮-౪||

ప్రస్తుతము బ్రహ్మదేవుని వయస్సులో సగమైన యాభై సంవత్సరములు గడచి పోయినవి. దీనిని పరార్థమందురు. ఈ మొదటి పరార్థము గడచిన తర్వాత పగలు ప్రారంభమగుచున్నప్పుడు నీవు ప్రదర్శించిన విలాసములను ప్రస్తుతము వర్ణింతును.

దినావసానేఽథ సరోజయోనిః
సుషుప్తికామస్త్వయి సన్నిలిల్యే |
జగంతి చ త్వజ్జఠరం సమీయు-
స్తదేదమేకార్ణవమాస విశ్వమ్ || ౮-౫||

బ్రహ్మదేవుని మొదటి పరార్థము యొక్క చివరి పగలు గడచిన తర్వాత రాత్రియైనప్పుడు అతడు నిద్రపోదలచి నీ యందు విలీనమయ్యెను. ఆ సమయమున సమస్త లోకములు నీ యందే విలీనమైనవి. అప్పుడు విశ్వమంతయు జలమయమై యుండెను.

తవైవ వేషే ఫణిరాజ శేషే
జలైకశేషే భువనే స్మ శేషే |
ఆనందసాంద్రానుభవస్వరూపః
స్వయోగనిద్రాపరిముద్రితాత్మా || ౮-౬||

విశ్వమంతయు జలమయమై యుండగా నీయొక్క అంగభూతమైన శేషతల్పముపై పరుండి పరమానంద స్వరూపుడవగు నీవు యోగ నిద్ర యందు మునిగి యుంటివి.

కాలాఖ్యశక్తిం ప్రళయావసానే
ప్రబోధయేత్యాదిశతా కిలాదౌ |
త్వయా ప్రసుప్తం పరిసుప్తశక్తి-
వ్రజేన తత్రాఖిలజీవధామ్నా || ౮-౭||

ఓ నారాయణా! ప్రళయ సమయమందు సమస్త శక్తులు నీలో విలీనమగును. ఆ సమయమున సమస్త జీవులకు ఆశ్రయమైన నీవు కాలశక్తితో "ఈ ప్రళయము చివర నన్ను లేపు" మని ఆజ్ఞాపించి నిదుర పోతివి.

చతుర్యుగాణాం చ సహస్రమేవం
త్వయి ప్రసుప్తే పునరద్వితీయే |
కాలాఖ్యశక్తిః ప్రథమప్రబుద్ధా
ప్రాబోధయత్త్వాం కిల విశ్వనాథ || ౮-౮||

జగన్నాథా! నీవిటుల ఒంటరిగా శేషతల్పముపై వేయి మహాయుగములు నిదుర పోవుచున్నప్పుడు తొలుత నుండియు మేలుకొనియే యున్న కాలశక్తి బ్రహ్మరాత్రి గడచిన తరువాత తాను నిన్ను యోగ నిదుర నుండి లేపినది.

విబుధ్య చ త్వం జలగర్భశాయిన్
విలోక్య లోకానఖిలాన్ప్రలీనాన్ |
తేష్వేవ సూక్ష్మాత్మతయా నిజాంతః
స్థితేషు విశ్వేషు దదాథ దృష్టిమ్ || ౮-౯||

జలములందు నిదుర పోవుచున్న నారాయణా! నీవు లేచి చూడగా సమస్త లోకములు నీ యందు విలీనమై కనిపించినవి. నీ యందు సూక్ష్మరూపమున విలీనమై యున్న ఆ లోకములన్నిటినీ నీవు చూచితివి.

తతస్త్వదీయాదయి నాభిరంధ్రా-
దుదంచితం కించన దివ్యపద్మమ్|
నిలీననిశ్శేషపదార్థమాలా
సంక్షేపరూపం ముకుళాయమానమ్ || ౮-౧౦||

స్వామీ! శేష శయ్యపై పడుకొని యున్న నీ యొక్క నాభి రంధ్రము నుండి అర్ధ వికసితమైన ఒక దివ్య పద్మము ఉదయించినది. నీ యందు విలీనమైన సమస్త పదార్థములు అతి సూక్ష్మ రూపమైన దానిలో ఉండినవి.

తదేతదంభోరుహకుడ్మలం తే
కళేబరాత్తోయపథే ప్రరూఢమ్ |
బహిర్నిరీతం పరితః స్ఫురద్భిః
స్వధామభిర్ధ్వాంతమలం న్యకృంతత్ || ౮-౧౧||

ప్రభూ! నీ నాభి యందు అంకురించిన ఈ తామర మొగ్గ నీటి నుండి  బయటకు వచ్చి వికసించినది. ఈ విధముగా బయటకు వచ్చిన ఆ పద్మము యొక్క కాంతి నాలుగు దిక్కులయందు వ్యాపించి అచ్చట నున్న చీకటి నంతా తొలగించినది.

సంఫుల్లపత్రే నితరాం విచిత్రే
తస్మిన్భవద్వీర్యధృతే సరోజే |
స పద్మజన్మా విధిరావిరాసీత్
స్వయంప్రబుద్ధాఖిలవేదరాశిః || ౮-౧౨||

ప్రభూ! నీ యోగశక్తిచే ప్రభావితమైన ఆ కమలము మిగుల విచిత్రముగా ఉండెను. దాని దళములు బాగా వికసించి యుండెను. పూర్వము బ్రహ్మదేవుని యొక్క ఆవిర్భావము ఈ కమలము నందే జరిగెను. నీ అనుగ్రహము వలననే ఆయనకు వెద రహస్యములు స్వయముగా అవగతమయ్యేను.

అస్మిన్పరాత్మన్ నను పద్మకల్పే
త్వమిత్థముత్థాపితపద్మయోనిః |
అనంతభూమా మమ రోగరాశిం
నిరుంధి వాతాలయవాస విష్ణో || ౮-౧౩||

పరమాత్మా! గురువాయుపుర నిలయా! శ్రీ మహావిష్ణూ! ఈ విధముగా బ్రహ్మకల్ప ప్రారంభమున చరాచర సృష్టి చేయుటకై బ్రహ్మదేవుని ఆవిర్భవింప చేసితివి. ఈ విధముగా అనంతమైన మహిమలున్న శ్రీకృష్ణా! నీవు దయతో నా రోగములన్నిటినీ పోగొట్టుము.

తొమ్మిదవ దశకము - జగత్సృష్టిప్రకార వర్ణనము

స్థితః స కమలోద్భవస్తవ హి నాభిపంకేరుహే
కుతః స్విదిదమంబుధావుదితమిత్యనాలోకాయన్ |
తదీక్షణకుతూహలాత్ప్రతిదిశం వివృత్తానన-
శ్చతుర్వదనతామగాద్వికసదష్టదృష్ట్యంబుజామ్ || ౯-౧||

స్వామీ! నీ నాభికమలమందున్న బ్రహ్మ దేవుడు "అగాధము, విశాలమైన ఈ సముద్రములో పద్మము ఏ విధముగా వచ్చినది" అని ఆశ్చర్యమునకు లోనయ్యెను. వెంటనే ఆ కమలము ఏర్పడిన స్థానము తెలిసికొనుటకై అన్ని దిక్కులందు చూచినాడు. ఈ విధముగా నాలుగు దిక్కులందు ముఖములనుంచి చూచినందు వలెనే ఆయన చతుర్ముఖుడయ్యెను. 

మహార్ణవవిఘూర్ణితం కమలమేవ తత్కేవలం
విలోక్య తదుపాశ్రయం తవ తనుం తు నాలోకయన్ |
క ఏష కమలోదరే మహతి నిస్సహాయో హ్యహం
కుతః స్విదిదమంబుజం సమజనీతి చింతామగాత్ || ౯-౨||

ప్రభూ! మహా సముద్రమున స్థిరముగా నున్న ఆ కమలమును మాత్రమే చూచినా బ్రహ్మదేవుడు దానికి ఆధారముగా నున్న నీ తనువును గమనింప లేకపోయెను. అంతట అతడు "ఈ మహా కమలగర్భమున నేను ఒక్కడనే నిస్సహాయుడనై యున్నాను. ఇంతకును ఈ కమలము ఎక్కడినుండి వచ్చినది?" - అని చింతింప సాగెను.

అముష్య హి సరోరుహః కిమపి కారణం సంభవేత్-
ఇతిస్మ కృతనిశ్చయః స ఖలు నాళరంధ్రాధ్వనా |
స్వయోగబలవిద్యయా సమవరూఢవాన్ప్రౌఢధీః
త్వదీయమతిమోహనం న తు కళేబరం దృష్టవాన్ || ౯-౩||

ఈ పద్మమునకు ఆధార రూపమైన వస్తువేదియో ఉంది యుండునని బ్రహ్మ దేవుడు స్థిర నిశ్చయము చేసికొనెను. గొప్ప ప్రజ్ఞ కల ఆ బ్రహ్మదేవుడు తన యోగ విద్యా బలమున ఆ పద్మము యొక్క ఆధారము తెలిసికొనుటకై ఆ పద్మ నాళమున ప్రవేశించి వేడుక సాగెను. ఐనప్పటికిని సుందర మోహన రూపమైన నీ దివ్య శరీరము మాతము అతనికి కనిపించలేదు.

తతస్సకలనాళికావివరమార్గగో మార్గయన్
ప్రయస్య శతవత్సరం కిమపి నైవ సందృష్టవాన్ |
నివృత్య కమలోదరే సుఖనిషణ్ణ ఏకాగ్రధీః
సమాధిబలమాదధే భవదనుగ్రహైకాగ్రహీ || ౯-౪||

ఈ విధముగా బ్రహ్మదేవుడు ఆ పద్మ నాళమున ప్రవేశించి నూరు దివ్య సంవత్సరములు అతి శ్రమతో ప్రయత్నించి నప్పటికీ అతనికేమియు కనపడలేదు. అందువలన నిరాశతో తిరిగి వచ్చి ఆ పద్మను నందు సుఖాసమున కూర్చుండి ఏకాగ్ర చిత్తముతో నీ అనుగ్రహమును కోరుకొనుచు తన తపస్సమాధి యందు నిమగ్నుడయ్యెను.

శతేన పరివత్సరైర్దృఢసమాధిబంధోల్లసత్-
ప్రబోధవిశదీకృతః స ఖలు పద్మినీసంభవః |
అదృష్టచరమద్భుతం తవ హి రూపమంతర్దృశా
వ్యచష్ట పరితుష్టధీర్భుజగభోగభాగాశ్రయమ్ || ౯-౫||

ఈ విధముగా పద్మ సంభవుడైన బ్రహ్మ దేవుడు నూరు దివ్య సంవత్సరములు తపస్సమాధి యందుండెను. అట్టి తపస్సమాధి వలన బ్రహ్మ దేవునకు జ్ఞానోదయం అయ్యెను. అందువల్ల సంతోషించి తానింతవరకూ చూడనిది అత్యద్భుతమైనది, ఆదిశేషుని పడగలను ఆధారము చేసుకొనియున్నది అగు నీ దివ్య రూపమును అంతర్జ్ఞానము చే చూసి సంతోషించెను.

కిరీటముకుటోల్లసత్కటకహారకేయూరయుక్
మణిస్ఫురితమేఖలం సుపరివీతపీతాంబరమ్ |
కలాయకుసుమప్రభం గళతలోల్లసత్కౌస్తుభం
వపుస్తదయి భావయే కమలజన్మనే దర్శితమ్ || ౯-౬||

స్వామీ! బ్రహ్మదేవునకు గోచరించిన నీ రూపము ఇట్లున్నది. నీ శిరమున కిరీట మకుటములు శోభిల్లు చున్నవి. మణి బంధము నందు కంకణములు, వక్షః స్థలమున ముత్యాల హారములు, బాహువుల యందు భుజకీర్తులు విరాజిల్లుచున్నవి. నీ నడుమున మణులు గూర్చిన కటి ఆభరణము మిలమిల లాడుచున్నది. నీవు ధరించిన పట్టు పీతాంబరం మనోహరముగా నున్నది. నీ హారమునందు కౌస్తుభమణి ధగ ధగ లాడుచున్నది. నల్ల కలువల కాంతులు వెదజల్లుతున్న అట్టి నీ దివ్య స్వరూపమును నేను ధ్యానించు చున్నాను.

శ్రుతిప్రకరదర్శితప్రచురవైభవ శ్రీపతే
హరే జయ జయ ప్రభో పదముపైషి దిష్ట్యా దృశోః |
కురుష్వ ధియమాశు మే భువననిర్మితౌ కర్మఠా
మితి ద్రుహిణవర్ణితస్వగుణబృంహిమా పాహి మామ్ || ౯-౭||

'లక్ష్మీ పతి! అంతులేని నీ వైభవమును  వేదములు స్తుతించు చున్నవి. శ్రీ హరీ! అట్టి నీకు ఎల్లప్పుడూ జయము కలుగు గాక! నా అదృష్టము వలన నీవు నాకు కనిపించితివి.  అందువలన నీవు అనుగ్రహించి నా బుద్ధి ఈ విశ్వసృష్టి కార్యమున త్వరగా నిమగ్నమగునట్లు చేయుము అని బ్రహ్మ దేవుడు స్తుతించెను. అట్టి దివ్య వైభవము కల శ్రీ హరీ! నన్ను కరుణతో రోగ బాధనుండి రక్షింపుము.

లభస్వ భువనత్రయీరచనదక్షతామక్షతాం
గృహాణ మదనుగ్రహం కురు తపశ్చ భూయో విధే |
భవత్వఖిలసాధనీ మయి చ భక్తిరత్యుత్కటే-
త్యుదీర్య గిరమాదధా ముదితచేతసం వేధసమ్ || ౯-౮||

అప్పుడు నీవు బ్రహ్మ దేవునితో "విధీ! ముల్లోకములను సృష్టించు నీ సామర్థ్యము అకుంఠితముగా ఉందును. నా అనుగ్రహం నీకు తప్పక లభించును. నీవు ఇంకను తపస్సు చేయవలెను. అన్ని విధములైన కోరికలను తీర్చు నా భక్తి నీకు పరిపూర్ణముగా లభించును". అని చెప్పినందు వలన అతనికి అంతులేని సంతోషము కలిగెను.

శతం కృతతపాస్తతః స ఖలు దివ్యసంవత్సరా-
నవాప్య చ తపోబలం మతిబలం చ పూర్వాధికమ్ |
ఉదీక్ష్య కిల కంపితం పయసి పంకజం వాయునా
భవద్బలవిజృంభితః పవనపాథసీ పీతవాన్ || ౯-౯||

నీవు ఆజ్ఞాపించి నట్లే బ్రహ్మ దేవుడు నూరు దివ్య సంవత్సరములు నియమ నిష్ఠలతో తపస్సు చేసెను. అందువలన అతనికి పూర్వము కంటే అధికముగా తపోబలము, బుద్ధిబలము కలిగినవి. అప్పుడు అతడున్న పద్మము గాలి వలన నీటిలో అటు ఇటు కదలసాగింది. అంతట బ్రహ్మదేవుడు నీ ప్రభావము వలన అధికమైన బలమును పొంది ప్రళయకాల వాయువును మరియు నీటిని ఉపసంహరించెను.

తవైవ కృపయా పునః సరసిజేన తేనైవ సః
ప్రకల్ప్య భువనత్రయీం ప్రవవృతే ప్రజానిర్మితౌ |
తథావిధకృపాభరో గురుమరుత్పురాధీశ్వర
త్వమాశు పరిపాహి మాం గురుదయోక్షితైరీక్షితైః || ౯-౧౦||

తరువాత ఆ బ్రహ్మ దేవుడు నీ అనుగ్రహము చేత తానున్న తామర పుష్పము చేతనే ముల్లోకములను సృష్టించెను. అటు పిమ్మట జీవ సృష్టి కూడా చేయుటకు మొదలు పెట్టెను. గురువాయురప్ప! ఈ విధముగా నీవు గొప్ప దయ కలవాడవు. అట్టి నీ కరుణా కటాక్షములను దీనుడనై యున్న నాపై కూడా చూపి నన్ను రక్షింపుము.

పదవ దశకము సృష్టిభేదదర్శనము

వైకుంఠ వర్ధితబలోఽథ భవత్ప్రసాదా-
దంభోజయోనిరసృజత్కిల జీవదేహాన్ |
స్థాస్నూని భూరుహమయాని తథా తిరశ్చాం
జాతీర్మనుష్యనివహానపి దేవభేదాన్ || ౧౦-౧||

వైకుంఠ నాథా! నీ అనుగ్రహము వలన తపోబలమును బుద్ధి బలమును మిక్కుటముగా సంపాదించుకున్న బ్రహ్మ దేవుడు సృష్టిని ప్రారంభించెను. అతడు స్థిరముగా ఉండు వృక్షాదులను. అడ్డముగా ఉండి నడిచే పశువులను, పక్షులను, అట్లే మానవులను, సిద్ధులు, చారనులు మొదలైన దేవతలను సృష్టించెను. ఈ విధముగా బ్రహ్మదేవుడు అనేక విధములైన జీవులను సృష్టించెను.

మిథ్యాగ్రహాస్మిమతిరాగవికోపభీతి-
రజ్ఞానవృత్తిమితి పంచవిధాం స సృష్ట్వా |
ఉద్దామతామసపదార్థవిధానదూన
స్తేనే త్వదీయచరణస్మరణం విశుద్ధ్యై || ౧౦-౨||

బ్రహ్మదేవుడు అనేక విధములగు జీవులను సృష్టించిన తరువాత తమోగుణ ప్రధానమైన ఐదు అజ్ఞాన చిత్తవృత్తులను సృష్టించెను. అవి మిథ్యాగ్రహము, అహంభావము, రాగము, కోపము, భయము అనునవి. ఈ తామస చిత్తవృత్తులను సృష్టి చేసిన తరువాత బ్రహ్మదేవుని మనస్సంతయు బాధతో నిండి పోయెను. ఆ బాధను తొలగించు కొనుటకు, తన యొక్క మానస పరిశుద్ధికి అతడు నీ పాదారవిందములను భక్తితో స్మరింప సాగెను.

తావత్ససర్జ మనసా సనకం సనందం
భూయం సనాతనమునిం చ సనత్కుమారమ్ |
తే సృష్టికర్మణి తు తేన నియుజ్యమానా
స్త్వత్పాదభక్తిరసికా జగృహుర్న వాణీమ్ || ౧౦-౩||

ఆ తరువాత బ్రహ్మదేవుడు తన సంకల్ప బలమువలన సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్కుమారుడు అను బ్రహ్మర్షులను సృష్టించెను. సృష్టి కార్యమునందు పాల్గొన వలసినదిగా బ్రహ్మదేవుడు వారిని ఆదేశించెను. కాని వారందరూ పరమాత్మవగు నీ పాద పద్మములందు అంతులేని భక్తి కలవారు కావున అతని మాటలను గౌరవించ లేదు.

తావత్ప్రకోపముదితం ప్రతిరుంధతోఽస్య
భ్రూమధ్యతోఽజని మృడో భవదేకదేశః |
నామాని మే కురు పదాని చ హా విరించే
త్యాదౌ రురోద కిల తేన స రుద్రనామా || ౧౦-౪||

తన మానస పుత్రులు తాను చెప్పిన మాట వినుట లేదని బ్రహ్మ కోపగించెను. అతడు తన కోపమును బయటకు తెలియకుండా బిగబట్టి నప్పుడు అతని కనుబొమ్మల మధ్య నుండి నీ అంశ స్వరూపమైన రుద్రుడు కలిగెను. అతడు పుట్టగానే " బ్రహ్మ దేవా! నాకు తగిన పేర్లను, నేనున్డుటకు తగిన స్థానములను కల్పించుము" - అని బిగ్గరగా ఏడ్చినందు వలన అతనికి రుద్రుడని పేరు ఏర్పడెను.

ఏకాదశాహ్వయతయా చ విభిన్నరూపం
రుద్రం విధాయ దయితా వనితాశ్చ దత్త్వా |
తావంత్యదత్త చ పదాని భవత్ప్రణున్నః
ప్రాహ ప్రజావిరచనాయ చ సాదరం తమ్ || ౧౦-౫||

అప్పుడు బ్రహ్మదేవుడు పరమాత్మవగు నీ ప్రేరణ వలన రుద్రునకు పదకొండు పేర్లు గల వివిధములైన రూపములను ఏర్పరచెను. ఇంకను ఆ ఏకాదశ రుద్రులకు పదకొండు భార్యలను ఇచ్చి వారందరూ ఉండుటకు భిన్న భిన్నమైన ప్రదేశములను కూడా ఏర్పరచెను. ఆ తరువాత సంతాన అభివృద్ధి చేయుడని సాదరముగా వారిని కోరెను.

రుద్రాభిసృష్టభయదాకృతిరుద్రసంఘ-
సంపూర్యమాణాభువనత్రయభీతచేతాః |
మా మా ప్రజాః సృజ తపశ్చర మంగలాయే
త్యాచష్ట తం కమలభూర్భవదీరితాత్మా || ౧౦-౬||

బ్రహ్మదేవుని మాటను అనుసరించి ఏకాదశ రుద్రులు సంతాన అభివృద్ధి చేయసాగిరి. వార సంతానము మహా భయంకరముగా ఉండి ముల్లోకములను భయపెట్ట సాగెను. అట్టి రుద్ర సంతానము ముల్లోకముల యందు నిండు చుండగా బ్రహ్మదేవునకు కూడా భయము కలిగెను. అందువలన నీ ఆదేశాముచే బ్రహ్మదేవుడు "ఇక మీరు సంతాన సృష్టిని నిలిపివేసి లోకములకు మంగళము కలుగుటకై తపస్సు ఆచరింపుడు" అని కోరెను.

తస్యాథ సర్గరసికస్య మరీచిరత్రిః
తత్రాంగిరాః క్రతుమినిః పులహః పులస్త్యః |
అంగాదజాయత భృగుశ్చ వసిష్ఠదక్షౌ
శ్రీనారదశ్చ భగవన్ భవదంఘ్రిదాసః || ౧౦-౭||

స్వామీ! చక్కగా సృష్టిని చేయుచున్న బ్రహ్మదేవుని యొక్క వివిధములైన అవయవముల నుండి మరీచి, అత్రి, అంగీరసుడు, క్రతువు, పులహుడు, పులస్త్యుడు, భ్రుగువు అను మహర్షులు జన్మించిరి. అట్లే వశిష్ఠుడు, దక్ష ప్రజాపతి, నారదుడు కూడా జన్మించిరి.

ధర్మాదికానభిసృజన్నథ కర్దమం చ
వాణీం విధాయ విధిరంగజసంకులోఽభూత్ |
త్వద్బోధితైః సనకదక్షముఖైస్తనూజై
రుద్బోధితశ్చ విరరామ తమో విముంచన్ || ౧౦-౮||

అత్రి, మరీచి మొదలైన మహర్షులను సృష్టించిన తరువాత బ్రహ్మ కర్దమ ప్రజాపతిని, ధర్ముడు మొదలైన వారిని కూడా సృష్టించెను. పిమ్మట సరస్వతిని సృజించెను. ఆమె అందచందములను చూసి బ్రహ్మ దేవుడు మోహ పరవశు డయ్యెను. అప్పుడు నీ ప్రేరణ వలన సనకుడు దక్షుడు మొదలైన వారు బ్రహ్మదేవుని అడ్డుకొని సమ్యక్ జ్ఞానము కలుగునట్లు చేసిరి. ఆ విధముగా తన పుత్రుల బోధనవలన బ్రహ్మ తమో గుణమును వదలి స్వస్థుడు అయ్యెను.

వేదాన్పురాణనివహానపి సర్వవిద్యాః
కుర్వన్నిజాననగణాచ్చతురాననోఽసౌ |
పుత్రేషు తేషు వినిధాయ స సర్గవృద్ధి
మప్రాప్నువంస్తవ పదాంబుజమాశ్రితోఽభూత్ || ౧౦-౯||

తరువాత చతుర్ముఖ బ్రహ్మ సమస్త వేదములను, పురాణములను, సకల విద్యలను, తన నాలుగు ముఖముల నుండి ఆవిర్భవింప చేసెను. అట్లే అతడు ఆ వేదవిద్యలను అన్నిటినీ తన పుత్రులకు ఉపదేశించెను. ఈ విధముగా బ్రహ్మ చరాచరములను, విద్యలను సృష్టించిన తరువాత తిరిగి సృష్టి చేయ జాలక తిరిగి నీ పాద పద్మములను ఆశ్రయించెను.

జానన్నుపాయమథ దేహమజో విభజ్య
స్త్రీపుంసభావమభజన్మనుతద్వధూభ్యామ్ |
తాభ్యాం చ మానుషకులాని వివర్ధయంస్త్వం
గోవింద మారుతపురాధిప నిరుంధి రోగాన్ || ౧౦-౧౦||

అప్పుడతనికి సృష్టిని పెంపొందింప చేయు ఉపాయము తట్టినది. అందువలన అతడు తన శరీరమును రెండుగా విభజించు కొనెను. అతని శరీరము నందలి ఒక భాగము పురుషుడుగా, మరియొక భాగము స్త్రీగా అయ్యెను. వారే మనువు, అతని భార్య యైన శాత రూప. నీవు ఆ జంట వలన ఈ సృష్టి ఇంకను వృద్ధి చెందునట్లు చేసితివి. ఈ విధముగా సృష్టిని పెంపొందింప చేసిన గురువాయురప్ప! గోవిందా! నీవు నా రోగములన్నిటినీ దయతో తొలగించుము.


పదకొండవ దశకము  - హిరణ్యాక్ష హిరణ్యకశిపుల జననము

క్రమేణ సర్గే పరివర్ధమానే కదాపి దివ్యాః సనకాదయస్తే |
భవద్విలోకాయ వికుంఠలోకం ప్రపేదిరే మారుతమందిరేశ || ౧౧-౧||

గురువాయుపుర దేవా! ఈ విధముగా చరాచర సృష్టి అనుదినము జరుగుచుండినది. ఒకనాడు బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందాది మహర్షులు నిన్ను దర్శించు కొనవలెనను కుతూహలముతో వైకుంఠమునకు వచ్చిరి.

మనోజ్ఞనౌశ్రేయసకాననాద్యైరనేకవాపీమిణిమందిరైశ్చ |
అనోపమం తం భవతో నికేతం మునీశ్వరాః ప్రాపురతీతకక్ష్యాః || ౧౧-౨

స్వామీ! మీరు నివశించుచున్న వైకుంఠ లోకములో 'నైశ్రేయసము' అను పేరుగల గొప్ప ఉద్యానవనమున్నది. ఇట్టి ఉద్యాన వనములెన్నియో అక్కడ ఉన్నవి. అట్లే, అనేకమైన దిగుడు బావులున్నవి. అక్కడ ఉన్న భవనములన్నియు మణి రత్న ఖచితములు. అటువంటి నీ వైకుంఠములోని కక్ష్యలన్నియు గడచి సాటిలేని సౌందర్యము కల నీ భవనమును ఆ మహర్షులు చేరుకొనిరి.
 
భవద్దిదృక్షూన్భవనం వివిక్షూన్ద్వాఃస్థౌ జయస్థాన్ విజయోఽప్యరుంధామ్ |
తేషాం చ చిత్తే పదమాప కోపః సర్వం భవత్ప్రేరణయైవ భూమన్ || ౧౧-౩

మహర్షులు నీ దివ్య దర్శనము చేసుకొనవలెనని నీ మహా భవనములోనికి ప్రవేశించ కోరుచుండగా అచ్చటి ద్వార పాలకులైన జయుడు, విజయుడు అనువారు వారిని అడ్డగించిరి. అందువలన మహర్షులకు మిక్కిలి కోపము కలిగినది. స్వామీ! ఇదంతయు నీ ప్రేరేపణ చే జరిగినది.

వైకుంఠలోకానుచితప్రచేష్టౌ కష్టౌ యువాం దైత్యగతిం భజేతమ్ |
ఇతి ప్రశప్తౌ భవదాశ్రయౌ తౌ హరిస్మృతిర్నోఽస్త్వితి నేమతుస్తాన్ || ౧౧-౪

"జయవిజయులారా! దుష్టులైన మీరు ఈ వైకుంఠ లోకమున తగని విధముగా ప్రవర్తించినందు వలన రాక్షసులై పోవుదురు గాక!" అని శపించిరి. స్వామీ! నిన్ను సదా ఆశ్రయించుకొని యుండెడు జయ విజయులు తమ తప్పును గుర్తించి శ్రీ హరి స్మృతి మాత్రము నశింప కుండా మమ్ము అనుగ్రహించుడు అని మహర్షులను వేడుకొనిరి.

తేదేతదాజ్ఞాయ భవానవాప్తః సహైవ లక్ష్మ్యా బహిరంబుజాక్ష |
ఖగేశ్వరాంసార్పితచారుబాహురానందయంస్తానభిరామమూర్త్యా || ౧౧-౫||

కమలలోచనా! గురువాయుపుర స్వామీ! జయ విజయులు చేసిన అవినయ కర్మయు, మహర్షులు వారిని శపించిన విషయమంతయు నీకు తెలిసినది. అందువలన లక్ష్మీ దేవి వెంటరాగా గరుత్మంతునిపైన అందమైన నీ బాహువుల నుంచి నీ దివ్య సుందరమైన విగ్రహము చేత సనక సనందాది మహర్షుల నందరను ఆనంద పరచుహ్చు వారున్న ప్రదేశమునకు నీవే స్వయముగా వచ్చితివి.

ప్రసాద్య గీర్భిః స్తువతో మునీంద్రాననన్యనాథావథ పార్షదౌ తౌ
సంరంభయోగేన భవైస్త్రిభిర్మాముపేతమిత్యాత్తకృపాం న్యగాదీః || ౧౧-౬

ప్రభూ! నీ దివ్య సుందర రూపమును సందర్శించిన సనక సనందాదులు ఆనందముతో నిన్ను స్తుతించు చుండగా నీ మధురాతి మధురమైన మాటలచే వారిని సంతోష పెట్టితివి. అట్లే నిన్ను సదా ఆశ్రయించుచున్న జయ విజయులతో "మీరు వైరా భక్తితో నన్ను సేవించుచు మూడు జన్మలెత్తిన తరువాత నా దగ్గరకు వత్తుర"ని అనుగ్రహముతో పలికితివి.

త్వదీయభృత్యావథ కాశ్యపాత్తౌ సురారివీరావుదితౌ దితౌ ద్వౌ |
సంధ్యాసముత్పాదనకష్టచేష్టౌ యమౌ చ లోకస్య యమావివాన్యౌ || ౧౧-౭

స్వామీ! నీ భ్రుత్యులైన జయ విజయులు కశ్యప మహర్షికి, దితికి రాక్షస వీరులై జన్మించినారు. వారు రాక్షస కాలమైన సాయం సంధ్యాసమయమందు తల్లి గర్భమున పడినందు వలన దుర్మార్గులై నారు.  కవలలుగా జన్మించిన ఆ రాక్షసులు మిగుల లోక భయంకరులుగా ఉండిరి.

హిరణ్యపూర్వః కశిపుః కిలైకః పరో హిరణ్యాక్ష ఇతి ప్రతీతః |
ఉభౌ భవన్నాథమశేషలోకం రుషా న్యరుంధాం నిజవాసనాంధౌ || ౧౧-౮

దితికి కశ్యపమహర్షికి జన్మించిన ఆ రాక్షసులలో ఒకడు హిరణ్య కశిపుడు, ఇంకొకడు హిరణ్యాక్షుడు. వారు పుట్టగానే పూర్వ జన్మ వాసన జ్ఞానమును కోల్పోయి హీనులైరి. అందువలననే నీ ఆధీనమందున్న  సకల లోకములను వారి మిక్కిలి భయపెట్టసాగిరి.

తయోర్హిరణ్యాక్షమహాసురేంద్రో రణాయ ధావన్ననవాప్తవైరీ |
భవత్ప్రియాం క్ష్మాం సలిలే నిమజ్య చచార గర్వాద్వినదన్ గదావాన్ || ౧౧-౯

ఆ రాక్షసులందు చిన్న వాడైన హిరణ్యాక్షుడు కండకావరము వలన మిక్కిలి గర్వించి గదను మాత్రమే ఆయుధముగా తీసుకొని దేవదానవులు మొదలైన వారి నందరిని ఓడింప సాగెను. అందువల్ల తనతో యుద్ధము చేయగలిగిన వాడు ఈ ప్రపంచమున ఎక్కడ కూడా లేడను గర్వముతో నీ ప్రియురాలైన భూమిని సముద్రములో ముంచివేసి గర్జించుచు ప్రపంచమంతా తిరుగసాగెను.


తతో జలేశాత్సదృశం భవంతం నిశమ్య బభ్రామ గవేషయంస్త్వామ్ |
భక్తైకదృశ్యః స కృపానిధే త్వం నిరుంధి రోగాన్ మరుదాలయేశ || ౧౧-౧౦

ఈ విధముగా హిరణ్యాక్షుడు మహా గర్వముతో తిరుగుచున్నప్పుడు జలాధిపతియైన వరుణుడు అతనితో, "నీతో యుద్ధము చేయగలిగిన వాడు, నీకు సమానమైన వాడు శ్రీ హరియే" యని తెలిపెను. అందువలన హిరణ్యాక్షుడు నిను వెదక సాగినాడు. నీవు నీ భక్తులకు మాత్రము కనిపించువాడవు, అట్టి మహా మహిమ కలవాడవు, దయా సముద్రుడవగు గురువాయూరు పురాధీశా! శ్రీ శ్రీమన్నారాయణా! నీవు నా యొక్క రోగాములనన్నిటినీ దయ చేసి తొలగించుము.

పన్నెండవ దశకము - వరాహావతార వర్ణనము

స్వాయంభువో మనురథో జనసర్గశీలో
దృష్ట్వా మహీమసమయే సలిలే నిమగ్నామ్ |
స్రష్టారమాప శరణం భవదంఘ్రిసేవా-
తుష్టాశయం మునిజనైః సహ సత్యలోకే || ౧౨-౧||

ప్రభూ! స్వయంభువ మనువు సృష్టి కార్యమున నిమగ్నుడై యుండెను. అది ప్రళయ సమయము కాకున్నను భూమి నీటిలో మునిగి యుండుటను అతడు గమనించెను. వెంటనే అతడు మునీశ్వరులను అందరిని వెంట బెట్టుకొని సత్యలోకమునకు వెళ్ళెను. నిరంతరమూ నీ పాద పద్మములను సేవించు చుండెడి బ్రహ్మను అతడు శరణు వేడెను.

కష్టం ప్రజాః సృజతి మయ్యవనిర్నిమగ్నా
స్థానం సరోజభవ కల్పయ తత్ప్రజానామ్ |
ఇత్యేవమేష కథితో మనునా స్వయంభూ-
రంభోరుహాక్ష తవ పాదయుగం వ్యచింతీత్ || ౧౨-౨||

పిమ్మట మనువు బ్రహ్మను ఇట్లు వేడుకొనెను. "పద్మ సంభవా! నేను ప్రజా సృష్టిలో నిరతుదనై యుండగా భూమి నీటిలో మునిగి పోయినది. ప్రాణులకు సంకట పరిస్థితి ఏర్పడినది. ఈ స్థితిలో సమస్త ప్రాణులు తల దాచుకొనుటకు స్థానమును కలిపించుము' అని విన్నవించిన వెంటనే ఓ కమలాక్షా! బ్రహ్మదేవుడు నీ పాద పద్మములను ధ్యానించెను.

హా హా విభో జలమహం న్యపిబం పురస్తాద్
అద్యాపి మజ్జతి మహీ కిమహం కరోమి |
ఇత్థం త్వదంఘ్రియుగళం శరణం యతోఽస్య
నాసాపుటాత్సమభవః శిశుకోలరూపీ || ౧౨-౩||

"ప్రభూ! ప్రళయ కాల జలములను నేను మునుపే త్రాగి యుంటిని కదా! ఇప్పుడు మరల భూమి నీటిలో మునుగు చున్నదేమి? అయ్యో ఇంక నేనేమి చేయవలెను?. ఇప్పుడు నా పాదములే దిక్కు"  ఇట్లు బ్రహ్మ పలుకుచున్డగానే నీవు అతని నాసికా పుటము నుండి వరాహ శిశు రూపమున ఆవిర్భవించితివి.


అంగుష్ఠమాత్రవపురుత్పతితః పురస్తాత్
భూయోఽథ కుంభిసదృశః సమజృంభథాస్త్వమ్ |
అభ్రే తథావిధముదీక్ష్య భవంతముచ్చైః
విస్మేరతాం విధిరగాత్సహ సూనుభిః స్వైః || ౧౨-౪||

ప్రభూ! తొలుత నీవు అంగుష్ఠ మాత్ర శరీరుడవై బయట పదిటివి. ఆయన చూచుచుండగనే ఏనుగు శరీరము వంటి శరీరముతో నీవు విజృంభించితివి. ఈ విధముగా వెంటనే పెరిగి ఆకాశమంత ఎత్తుగా నున్న నిన్ను చూసి బ్రహ్మదేవుడు తన పుత్రులతో సహా మిక్కిలి ఆశ్చర్యమునకు లోనయ్యెను.

కోఽసావచింత్యమహిమా కిటిరుత్థితో మే
నాసాపుటాత్కిము భవేదజితస్య మాయా |
ఇత్థం విచింతయతి ధాతరిశైలమాత్రః
సద్యో భవన్కిల జగర్జ్జిథ ఘోరఘోరమ్ || ౧౨-౫||

దేవా! బ్రహ్మ దేవుడు నీ వరాహ రూపమును చూసి ఆశ్చర్యముతో "అద్భుతమైన మహిమ గల ఈ వరాహమూర్తి నా నాసాపుటమున ఎట్లు ఉదయించెను? యితడు ఎవ్వరు? ఇది పరమాత్మ యొక్క మాయ కాబోలును?" అని పరిపరి విధములుగా ఆలోచించు చున్నప్పుడు నీవు వెంటనే పెద్ద పర్వతమంత ప్రమానమున ఎదిగి మహా భయంకరముగా గర్జించితివి.

తం తే నినాదముపకర్ణ్య జనస్తపఃస్థాః
సత్యస్థితాశ్చ మునయో నునువుర్భవంతమ్ |
తత్స్తోత్రహర్షులమనాః పరిణద్య భూయ-
స్తోయాశయం విపులమూర్తిరవాతరస్త్వమ్ || ౧౨-౬||

జనోలోకమున, తపోలోకమున, సత్యలోకమున నివసించు చున్న మునీశ్వరులు నీ గర్జన విని భక్తి ప్రపత్తులతో నిన్ను స్తుతించ సాగిరి. ఆ మహర్షులు చేయుచున్న స్తుతులకు నీవు బాగా సంతోషించి ఇంకను బిగ్గరగా గర్జించి, విశాలమైన శరీరముతో సముద్రములో ప్రవేశించితివి.


ఊర్ధ్వప్రసారిపరిధూమ్రావిధూతరోమా
ప్రోత్క్షిప్తవాలధిరవాంగ్ముఖఘోరఘోణః |
తూర్ణప్రదీర్ణజలదః పరిఘూర్ణదక్ష్ణా
స్తోతౄన్మునీన్ శిశిరయన్నవతేరిథ త్వమ్ || ౧౨-౭||

స్వామీ! నీ శరీరమండున్న బూడిద రంగు గల కేశములు నిక్క బొడుచుకొని యున్నవి. వాలము పైకి లేచినది. ముఖము కిందకు ఉన్నది. నీ వేగమునకు మబ్బులన్నియు తొలగి పోసాగినవి. నీ కండ్లు చిత్ర విచిత్రముగా తిరుగ సాగినవి. అట్టి నిన్ను చూచి మహర్షులందరూ స్తుతించు చుండగా నీఎవు వారిని అనుగ్రహించుచు ఒక్క మారు జలములో దూకితివి.


అంతర్జలం తదను సంకులనక్రచక్రం
భ్రామ్యత్తిమింగిలకులం కలుషోర్మిమాలమ్ |
ఆవిశ్య భీషణరవేణ రసాతలస్థా-
నాకంపయన్వసుమతీమగవేషయస్త్వమ్ || ౧౨-౮||

స్వామీ! నీవు సముద్ర జాలములో ప్రవేశించ గానే అందున్న మొసళ్ళు తల్లడిల్లి పోయినవి. తిమింగలములు ఎటూ తోచక తిరుగ సాగినవి. సముద్రములోని నీరంతా కలుషితము కాగా పెద్ద పెద్ద అలలు రాసాగినవి. అట్టి సముద్రములో నీవు ప్రవేశించి గర్జించుటచే కలిగిన భయంకరమైన శబ్దమునకు రసాతలమున నున్న వారు కూడా భయపడసాగిరి. ఆ విధముగా నీవు భూమిని కనుగొనుటకు సముద్రమంతయు వెదకితివి.

దృష్ట్వాఽథ దైత్యహతకేన రసాతలాంతే
సంవేశితాం ఝటితి కూటకిటిర్విభో త్వమ్ |
ఆపాతుకానవిగణయ్య సురారిఖేటాన్
దంష్ట్రాంకురేణ వసుధామదధాః సలీలమ్ || ౧౨-౯||

పరమాత్మా! మాయా వరాహ రూపమున నీవు భూమికి వెదకుచు రాక్షసాధముడైన హిరణ్యాక్షుడు భూమిని రసాతలము కింద ఉంచిన విషయమును తెలిసికొంటివి. వెంటనే భూమిని తెచ్చుటకు నీవు పోగా రాక్షసులందరూ ఒక్కుమ్మడిగా నీ పై పడిరి. వారిని అందరిని ఏ మాత్రము లెక్క చేయక నీయొక్క కోర చివర ఈ భూమిని అవలీలగా ధరించితివి.


అభ్యుద్ధరన్నథ ధరాం దశనాగ్రలగ్న-
ముస్తాంకురాంకిత ఇవాధికపీవరాత్మా |
ఉద్ధాతఘోరసలిలాజ్జలధేరుదంచన్
క్తీడావరాహవపురీశ్వర పాహి రోగాత్ || ౧౨-౧౦||

పరమేశ్వరా! నీవు సముద్రములోనుండి భూమిని నీ కోరపై ఎత్తి పట్టుకొన్నప్పుడు అది నీ కోరపై తగుల్కొనిన మొలక వలె కనిపించినది. మిక్కిలి లావుగా క్రీడా వరాహ రూపమున ఉన్న నీవు సముద్ర జలముల నుండి పైకి వచ్చితివి. అట్టి మాయా వరాహ రూపా! నీవు నా రోగాములనన్నిటినీ తొలగించి నన్ను రక్షింపుము.

పదమూడవ దశకము - హిరణ్యాక్ష వధ

హిరణ్యాక్షం తావద్వరద భవదన్వేషణపరం
చరంతం సాంవర్తే పయసి నిజజంఘాపరిమితే |
భవద్భక్తో గత్వా కపటపటుధీర్నారదమునిః
శనైరూచే నందన్ దనుజమపి నిందంస్తవ బలమ్ || ౧౩-౧||

భక్తులు కోరు వరముల నొసగు శ్రీమన్నారాయణా! హిరణ్యాక్షుడు నిన్ను తనతో సమానమైన బలము కలవాడవని భావించి నీతో యుద్ధముకై వెదకుచుండెను. అంతులేని ప్రళయ సముద్రము అతనికి మోకాళ్ళ వరకు మాత్రమే వచ్చుచుండెను. అంత ఎత్తున హిరణ్యాక్షునితో నీయొక్క మహాభక్తుడైన నారద మునీంద్రుడు కపట బుద్ధితో నీ బలమును కించ పరచుచు, హిరణ్యాక్షుని పొగడుచు మెల్లగా ఇట్లు పలికెను.

స మాయావీ విష్ణుర్హరతి భవదీయం వసుమతీం
ప్రభో కష్టం కష్టం కిమిదమితి తేనాభిగదితః |
నదన్ క్వాసౌ క్వాసావితి స మునినా దర్శితపథో
భవంతం సంప్రాపద్ధరణిధరముద్యంతముదకాత్ || ౧౩-౨||

"హిరణ్యాక్షా! మాయావియైన విష్ణువు నీయొక్క భూమిని హరింప దలచినాడు. ఇది చాలా అన్యాయము. ఇది తప్పుకూడా!" అని నారద మహర్షి యనెను. అప్పుడు హిరణ్యాక్షుడు గర్జించుచు ఆ మాయావి ఎక్కడ ఎక్కడ? - అని అడుగగా నారదుడు నీవున్న ప్రదేశమును చూపించేను. అప్పుడు నీవు సముద్రములో నుండి భూమిని ఉద్ధరించు చుంటివి. అట్టి నిన్ను ఆ రాక్షసుడు సమీపించెను.

అహో ఆరణ్యోఽయం మృగ ఇతి హసంతం బహుతరై-
ర్దురుక్తైర్విధ్యంతం దితిసుతమవజ్ఞాయ భగవన్ |
మహీం దృష్ట్వా దంష్ట్రాశిరసి చకితాం స్వేన మహసా
పయోధావాధాయ ప్రసభముదయుంథా మృధవిధౌ || ౧౩-౩||

"ఇది అడవి మృగము కదా" అని హిరణ్యాక్షుడు నవ్వుచు అనేక మాటలతో నిన్ను నిందించు చుండెను. అతనిని నీవు ఏ మాత్రము లెక్క చేయలేదు. ఆ సమయమున నీ దంష్ట్రాగ్రమున నున్న భూదేవి భయముచే కంపించి పోవుచుండుట నీవు గమనించితివి. అట్టి భూమిని నీ మహాత్త్వము వలన సముద్రమందు నిలిపి ఆ దుష్ట రాక్షసునితో యుద్ధము చేయుటకు సిద్ధమైతివి.


గదాపాణౌ దైత్యే త్వమపి హి గృహీతోన్నతగదో
నియుద్ధేన క్రీడన్ఘటఘటరవోద్{}ఘుష్టవియతా |
రణాలోకైత్సుక్యాన్మిలతి సురసంఘే ద్రుతమముం
నిరుంధ్యాః సంధ్యాతః ప్రథమమితి ధాత్రా జగదిషే || ౧౩-౪||

రాక్షసాధముడైన హిరణ్యాక్షుడు గద పట్టుకొని యుద్ధము చేయుటకు రాగా నీవు కూడా చాలా గొప్ప గదను చేత పట్టుకొని ద్వంద్వ యుద్ధమునకు పూనుకొంటివి. ఆకాశమందు మీ ఇద్దరి గడలు ఒకదానికొకటి తగులుత వలన ఘట ఘట శబ్దము వ్యాపించినది. మీ ఇద్దరి యుద్ధము చూడవలెనని దేవతలు కుతూహలముతో బారులు కట్టి నిలబదిరి. అప్పుడు బ్రహ్మదేవుడు నీతో 'పరమాత్మా! ఈ రాక్షసాధముని సంధ్యాకాలము ముందే వధించుము' అని సూచన చేసి యుండెను.

గదోన్మర్దే తస్మింస్తవ ఖలు గదాయాం దితిభువో
గదాఘాతాద్భూమౌ ఝటితి పతితాయామహహ ! భోః ! |
మృదుస్మేరాస్యస్త్వం దనుజకులనిర్మూలనచణం
మహాచక్రం స్మృత్వా కరభువి దధానో రురుచిషే || ౧౩-౫||

ప్రభూ! గదా యుద్ధమున మీ గద రాక్షసుడైన హిరణ్యాక్షుని గదా ఘాతమునకు భూమిపై పడిపోయినదట. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయము? నీవు కూడా ముఖమందు చిరునవ్వు వెలుగుచుండగా రాక్షసులందరినీ సంహరించుట యందు ఖ్యాతి నొందిన నీ చక్రమును మనస్సులో స్మరించుకొంటివి. అప్పుడది నీ యొక్క చేతికి వచ్చి చేరెను. అంతట నీవు అద్భుతముగా విరాజిల్లితివి.


తతః శూలం కాలప్రతిమరుషి దైత్యే విసృజతి
త్వయి ఛిందత్యేనత్ కరకలితచక్రప్రహరణాత్ |
సమారుష్టో ముష్ట్యా స ఖలు వితుదంస్త్వాం సమతనోత్
గళన్మాయే మాయాస్త్వయి కిల జగన్మోహనకరీః || ౧౩-౬||

మృత్యువు వలె మహా భయంకరుడు అయిన హిరణ్యాక్షుడు నీపై తన శూలమును విసరివేసెను. అప్పుడు నీవు చక్రాయుధమును ప్రయోగించగా అతని శూలము ముక్కలు ముక్కలయ్యెను. అందువల్ల హిరణ్యాక్షుడు అమితమైన కోపముతో నీపై ముష్టిప్రహరమును గావించెను. అట్లే అతని సమస్త మాయలు నిన్ను ఏమియు చేయలేకపోయినను ఆ రాక్షసుడు జగత్తు నంతయు మోహమున ముంచు మాయలను నీ పై ప్రయోగించెను.

భవచ్చక్రజ్యోతిష్కణలవనిపాతేన విధుతే
తతో మాయాచక్రే వితతఘనరోషాంధమనసమ్ |
గరిష్ఠాభిర్ముష్టిప్రహృతిభిరభిఘ్నంతమసురం
స్వపాదాంగుష్ఠేన శ్రవణపదమూలే నిరవధీః || ౧౩-౭||

హిరణ్యాక్షుడు ప్రయోగించిన మాయలన్నిటినీ నీ చక్ర కాంతి అవలీలగా నాశనము చేసినది. అందువలన ఆ రాక్షసునకు కోపము అధిక మయ్యెను. అతడు కోపమును పట్టజాలక నీపై ఘనమైన ముష్టి ఘాతములకు దిగెను. అప్పుడు నీవు నీ పాదాంగుష్ఠముచేత హిరణ్యాక్షుని యొక్క చెవి దగ్గర ఒక దెబ్బ కొట్టితివి.

మహాకాయఃస్సోఽయం తవ కరసరోజప్రమథితో
గళద్రక్తో వక్త్రాదపతదృషిభిః శ్లాఘితహతిః |
తదా త్వాముద్దామప్రమదభరవిద్యోతిహృదయా
మునీంద్రాస్సాంద్రాభిః స్తుతిభిరనువన్నధ్వరతనుమ్ || ౧౩-౮||

దేవా! మహా కాయుడైన హిరణ్యాక్షుడు నీ పాద ప్రహారముల ధాటికి నోటినుండి రక్తము గ్రక్కుచు అసువులను వీడి పడిపోయెను. అతనిని నీవు అట్లు దెబ్బ తీసినందులకు  అప్పుడు రుషులందరును  నిన్ను పొగడ సాగిరి. వారి హృదయములలో ఆనందము పొంగి పొరలెను. అంతట వారు భక్తితో స్తోత్రములను చేయుచు యజ్ఞ స్వరూపుడవైన నిన్ను స్తుతించ సాగిరి.


త్వచి చ్ఛందో రోమస్వపి కుశగణశ్చక్షుషి ఘృతం
చతుర్హోతారోఽంఘ్రౌ స్రుగపి వదనే చోదర ఇడా |
గ్రహా జిహ్వాయాం తే పరపురుష కర్ణే చ చమసా
విభో సోమో వీర్యం వరద గళదేశేఽప్యుపసదః || ౧౩-౯||

పరమ పురుషా! నీ శరీర చర్మమే గాయత్రీ మొదలగు ఛందస్సులు, నీ రోమములే దర్భలు, నీ నేత్రములే ఘ్రుతము. అధ్వర్యుడు, ఉద్గాత, హోత, బ్రహ్మ అని ఈ నలుగురును నీ నాలుగు పాదములు. నీ ముఖమే స్రుక్కు, ఉదరమే 'ఇడ', నీ నాలుకయే గ్రహము, కర్ణములే చమసములు, వీర్యమే సోమరసము, నీ గలమే ఉపసదము అను ఇట్టి విశేషము. కనుక నీవు సంపూర్ణముగా యజ్ఞ స్వరూపుడవు.


మునీంద్రైరిత్యాదిస్తవనముఖరైర్మోదితమనా
మహీయస్యా మూర్త్యా విమలతరకీర్త్యా చ విలసన్ |
స్వధిష్ణ్యం సంప్రాప్తః సుఖరసవిహారీ మధురిపో
నిరుంధ్యా రోగం మే సకలమపి వాతాలయపతే || ౧౩-౧౦||

గురువాయూర్ పురాధిపా! శ్రీ కృష్ణా! ఈ విధముగా మునీంద్రులు అందరును చేసిన అనేక విధములగు స్తోత్రములకు నీవు చాలా సంతుష్టుడవైతివి. విశాలము, ఉన్నతమైన శరీరముతో, నిర్మలమైన కీర్తితో ప్రకాశించుచు నీవు నీలోకమైన వైకుంఠమునకు చేరి ఆనందమున ఎప్పటివలె విహరించు చుంటివి. మధుసూదనా! నా సమస్త రోగములను కృపతో  తొలగించుము.

పదునాలుగవ దశకము - కపిలోపాఖ్యానము 

సమనుస్మృతతావకాంఘ్రియుగ్మః స మనుః పంకజసంభవాంగజన్మా |
నిజమంతరమంతరాయహీనం చరితం తే కథయన్సుఖం నినాయ || ౧౪-౧

ప్రభూ! బ్రహ్మ దేవుని శరీరము నుండి జన్మించిన మనువు ప్రతిదినము నీ పాద పద్మములను ధ్యానించుచు నీ దివ్య గాథలను  కీర్తించు చుండెను. అందువలన అతడు నిరాటంకముగా నీ గాథలను గానము చేయుచు తన మంవంతరమును సుఖముగా గడపెను.

సమయే ఖలు తత్ర కర్దమాఖ్యో ద్రుహిణచ్ఛాయభవస్తదీయవాచా |
ధృతసర్గరసో నిసర్గరమ్యం భగవంస్త్వామయుతం సమాః సిషేవే || ౧౪-౨

భగవాన్! ఆ సమయమందు బ్రహ్మదేవుని శరీర చాయ నుండి పుట్టిన కర్దముడను ప్రజాపతి తన తండ్రియైన బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసావహించి సంతానాభివ్రుద్ది చేయుటకు పూనుకోనేను. అందువలన సుందరుడవైన నీ పాద పద్మములను స్మరించుచు కొన్ని వేల సంవత్సరములు తపస్సు ఆచరించెను.


గరుడోపరి కాళమేఘకమ్రం విలసత్కేలిసరోజపాణిపద్మమ్ |
హసితోల్లసితాననం విభో త్వం వపురావిష్కురుషే స్మ కర్దమాయ || ౧౪-౩

ప్రభూ! అనన్య భావముతో నీ పాద పద్మములను స్మరించుచు తపస్సు చేయుచున్న ఆ కర్దమ ప్రజాపతిని అనుగ్రహించ దలచి నీవు ప్రత్యక్షమైతివి. గరుత్మంతునిపై యున్న నీ ఆకారము నీల మేఘమువలె అందముగా ఉండెను. విలాసమునకై నీవు పట్టుకున్న తామర పువ్వు నీ కరపద్మమున విరాజిల్లు చుండెను. నీ ముఖమందు చిరునవ్వు కనిపించు చుండెను. అట్టి నీ దివ్య సుందర విగ్రహమున కర్దమ ప్రజాపతికి నీవు దర్శన మొసగితివి.

స్తువతే పులకావృతాయ తస్మై మనుపుత్రీం దయితాం నవాపి పుత్రీః |
కపిలం చ సుతం స్వమేవ పశ్చాత్ స్వగతిం చాప్యనుగృహ్య నిర్గతోఽభూః || ౧౪-౪

దేవా! కర్దమ ప్రజాపతికి నీ దర్శనమై నంతనే అతడు ఆనంద పరవశు డయ్యెను.  ఆయన శరీరము పులకించేను. అనంతరము ఆయన చేసిన స్తోత్రములకు మిక్కిలి సంతోషించి నీవు ఆయనకు ఇట్లు వరములు ఒసగితివి. "కర్దమ ప్రజాపతీ! మనువు పుత్రిక యగు దేవహూతి  నీకు భార్య యగును. మీకు తొమ్మిది మంది పుత్రికలు కలుగుదురు. నేనే స్వయముగా కపిలుడు అను పేరుతో మీకు పుత్రునిగా అవతరింతును. నీవు తనువు చాలించిన పిమ్మట వైకుంఠమునకు చేరుకొందువు" - అని వరములను ప్రసాదించిన పిమ్మట నీవు అంతర్ధానమైతివి.

స మనుశ్శతరూపయా మహిష్యా గుణవత్యా సుతయా చ దేవహూత్యా |
భవదీరితనారదోపదిష్టస్సమగాత్కర్దమమాగతిప్రతీక్షమ్ || ౧౪-౫||

స్వామీ నీవు మనువుతో అతని పుత్రికయైన దేవహూతిని కర్దమ ప్రజాపతికిమ్మని చెప్పునట్లు నారదుని ప్రేరేపించితివి. అతడు మనువుతో భగవంతుని ఆజ్ఞను తెలిపెను. అందులకు మనువు సంతోషించి తన భార్య అయిన శతరూపను, దేవ హూతిని వెంట బెట్టుకొని కర్దమ ముని ఆశ్రమమునకు పోయెను. అప్పుడా కర్దమ మహాముని కూడా నారాయణుని వరము అనుసరించి మనువు యొక్క ఆగమనమునకై ఎదురు చూచు చుండెను.

మనునోపహృతాం చ దేవహూతిం తరుణీరత్నమవాప్య కర్దమోఽసౌ |
భవదర్చననిర్వృతోఽపి తస్యాం దృఢశుశ్రూషణయా దధౌ ప్రసాదమ్ || ౧౪-౬

ప్రభూ! మనువు దేవహూతిని తనకిచ్చి వివాహము చేసినందు వలన కర్దమ ప్రజాపతి చాలా సంతోషించెను. నీ అర్చన యందు నిరతుడై యున్న అతడు దేవహూతి తనకు చేయుచున్న సేవల వలన ఆమె యందు మిక్కిలి ప్రసన్నుడయ్యెను.

సపునస్త్వదుపాసనప్రభావాద్దయితాకామకృతే కృతే విమానే |
వనితాకులసంకులో నవాత్మా వ్యహరద్దేవపథేషు దేవహూత్యా || ౧౪-౭||

కర్దమ ప్రజాపతి నీ ఉపాసనా బలము వలన తన భార్య యైన దేవహూతి కోర్కె తీర్చుటకు ఒక విమానమును నిర్మించు కొనెను. అందు పరిచారికలు కోలుస్తుండగా దేవహూతితో కలసి నూతన సుందర రూపమును ధరించి ఆకాశ మార్గమున విహరించ సాగెను.

శతవర్షమథ వ్యతీత్య సోఽయం నవ కన్యాః సమవాప్య ధన్యరూపాః |
వనయానసముద్యతోఽపి కాంతాహితకృత్త్వజ్జననోత్సుకో న్యవాత్సీత్ || ౧౪-౮

ఈ విధముగా కర్దమ ప్రజాపతి వంద సంవత్సరములు సుఖముగా గడిపెను. అతనికి మిక్కిలి సుందరులైన తొమ్మిది మంది కుమార్తెలు కలిగిరి. వానప్రస్థ ఆశ్రమము స్వీకరించ వలెనని అనుకున్నప్పటికీ దేవహూతికి సంతోషము కలిగించుటకై పరమాత్మ వాగు నీ అవతారమునకై ఎదురుచూస్తూ కాలము గడిపెను.


నిజభర్తృగిరా భవన్నిషేవా నిరతాయామథ దేవ దేవహూత్యామ్ |
కపిలస్త్వమజాయథా జనానాం ప్రథయిష్యన్పరమాత్మతత్త్వవిద్యామ్ || ౧౪-౯

దేవా! దేవహూతి తన భర్త యగు కర్దముడు చెప్పినట్లు పరమాత్మవగు నిన్ను సేవించు చుండెను. కొంత కాలమునకు కపిలుడను పేరుతో నీవు దేవహూతికి జన్మించి పరమాత్మ తత్త్వ విద్యను లోకమున ప్రచార మొనర్చితివి.


వనమేయుషి కర్దమే ప్రసన్నే మతసర్వస్వముపాదిశంజనన్యై |
కపిలాత్మక వాయుమదిరేశత్వరితం త్వం పరిపాహి మాం గదౌఘాత్ || ౧౪-౧౦

కపిలుడను పేరుతో ప్రసిద్ధి చెందిన గురువాయురప్ప! నీ తండ్రి యైన కర్దమ ప్రజాపతి వానప్రస్థ ఆశ్రమము స్వీకరించి అడవులకు పోయినప్పుడు నీ తల్లియైన దేవహూతికి సాంఖ్య యోగమును ఉపదేశించితివి. అట్టి స్వామీ! కరుణతో నా రోగాములన్నిటినీ తొలగించి నన్ను రక్షింపుము.

పదునైదవ దశకము - కపిలోపదేశము

 మతిరిహ గుణసక్తా బంధకృత్తేష్వసక్తా
త్వమృతకృదుపరుంధే భక్తియోగస్తు సక్తిమ్ |
మహదనుగమలభ్యా భక్తిరేవాత్ర సాధ్యా
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః || ౧౫-౧||

"మనస్సు విషయములందు ఆసక్తమైనచో అది సంసార బంధములకు కారణ మగుచున్నది. అట్లే, ఆ మనసు విశ్యాసక్తిని పెట్టుకోననిచో మోక్షము కలుగును. సంసార బంధన కారణమైన విశ్యాసక్తిని భక్తియోగము సులభముగా పోగొట్టును. అట్టి భక్తి యోగము సత్సంగము వలననే లభించును. కావున భక్తి మార్గామునే అవలంబించవలెను. " - అని కపిలుని రూపమను నున్న నీవు తల్లి యగు దేవహూతికి బోధించితివి.

ప్రకృతిమహదహంకారాశ్చ మాత్రాశ్చ భూతా-
న్యపిహృదపి దశాక్షీ పూరుషః పంచవింశః |
ఇతి విదితవిభాగో ముచ్యతేఽసౌ ప్రకృత్యా
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః || ౧౫-౨||

"మూల ప్రకృతి, మహాత్తత్త్వము, అహంకారము, ఐదు తన్మాత్రలు, పృథివి మొదలైన పంచభూతములు, మనస్సు, ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, ఆత్మ స్వరూపుడైన పురుషుడు అని పంచవింశతి తత్త్వములను చక్కగా తెలిసికొన్నచో త్రిగుణాత్మకమైన ప్రకృతి బంధము తొలగును. " - అని కపిలుని రూపమను నున్న నీవు తల్లి యగు దేవహూతికి బోధించితివి.

ప్రకృతిగతగుణౌఘైర్నాజ్యతే పూరుషోఽయం
యది తు సజతి తస్యాం తద్గుణాస్తం భజేరన్ |
మదనుభజనతత్త్వాలోచనైః సాప్యపేయాత్
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః || ౧౫-౩||

"ఈ పురుషుడు వాస్తవముగా ప్రకృతికి అతీతుడు. కనుక అతడు దానికి సంబంధించిన త్రిగుణములకు  అధీనుడై యుండడు. కాని అతడు ప్రకృతి యందు ఆసక్తుడైనచో ఆ త్రిగుణములు అతనిని బంధించును. అట్టి ప్రకృతి బంధమునకు దూరము కావలెనన్నచో నిన్ను సేవించుచు నీ తత్త్వ చింతనను ఎల్లప్పుడూ చేయవలెను" - అని కపిలుని రూపమను నున్న నీవు తల్లి యగు దేవహూతికి బోధించితివి.


విమలమతిరుపాత్తైరాసనాద్యైర్మదంగం
గరుడసమధిరూఢం దివ్యభూషాయుధాంకమ్ |
రుచితులితతమాలం శీలయేతానువేలం
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః || ౧౫-౪||

"సాధకుడు యమ నియమముల ద్వార బాహ్యాభ్యంతర శుచిని పొందవలెను. ఆసనాది యోగ క్రియలను అనుష్ఠించవలెను. అంతట తమాల శ్యామల వర్ణ శోభితుడవు, దివ్య ఆభరణ, ఆయుధ ధారుడవు, గర్త్మంతుని పై అధిష్ఠించిన వాడవు ఐన నీ యొక్క దివ్య రూపమును ఆ సాధకుడు నిరంతరము ధ్యానించ వలెను" - అని కపిలుని రూపమను నున్న నీవు తల్లి యగు దేవహూతికి బోధించితివి.

మమ గుణగుణలీలాకర్ణనైః కీర్తినాద్యైః
మయి సురసరిదోఘప్రఖ్యచిత్తానువృత్తిః |
భవతి పరమభక్తిః సా హి మృత్యోర్విజేత్రీ
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః || ౧౫-౫||

"పరమాత్మనగు  నా యొక్క కళ్యాణ గుణములను దివ్య లీలలను వినుచు కీర్తించుచు, అనుభవించు చుండవలెను. అప్పుడు పరమ భక్తి లభించును. ఆ పరమ భక్తి మృత్యువును సైతము జయించును" - అని కపిలుని రూపమను నున్న నీవు తల్లి యగు దేవహూతికి బోధించితివి.

అహ హ బహులహింసాసంచితార్థైః కుటుంబం
ప్రతిదినమనుపుష్ణన్ స్త్రీజితో బాలలాళీ |
విశతి హి గృహసక్తో యాతనాం మయ్యభక్తః
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః || ౧౫-౬||

"మానవుడు తన కుటుంబమును పోషించు కొనుటకై పెక్కుమందిని బాధించుచు ధనమును సంపాదిన్చును. స్త్రీలకు వశుడై తన సంతానమును లాలించుచు గృహ కర్మలందు ఆసక్తుడగు చుండును. నా యందు భక్తి లేని అట్టి గృహస్థుడు అనేక బాధలను అనుభవించు చుండును ఇది యెంత శోచనీయము" - అని కపిలుని రూపమను నున్న నీవు తల్లి యగు దేవహూతికి బోధించితివి.

యువతిజఠరఖిన్నో జాతబోధోఽప్యకాండే
ప్రసవగలితబోధః పీడయోల్లంంఘ్య బాల్యమ్ |
పునరపి బత ముహ్యత్యేవ తారుణ్యకాలే
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః || ౧౫-౭||

"జీవుడు స్త్రీ గర్భమున ప్రవేశించినప్పటి నుండి దుఃఖములను అనుభవించుచు, తాను పుట్టుటకు ముందు పరమాత్మ కరుణ వలన జ్ఞానము కలిగినను భూమి మీద పడగానే ఆ జ్ఞానము అంతరించును. అతని బాల్యమంతయు అనేక బాధలతో గడచి పోవును. అట్లే, యౌవనమున మోహము వలన సమస్త జ్ఞానము కోల్పోవును." అని కపిలుని రూపమున నీవు దేవహూతికి బోధించితివి.

పితృసురగణయాజీ ధార్మికో యో గృహస్థః
స చ నిపతతి కాలే దక్షిణాధ్వోపగామీ |
మయి నిహితమకామం కర్మ తూదక్పథార్థే
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః || ౧౫-౮||

"పితృ దేవతలను, ఇతర దేవతలను నియమ నిష్ఠలచే పూజించుచు ధార్మిక జీవనము గడుపు గృహస్థుడు దక్షిణాయన మార్గమున స్వర్గాది ఊర్ధ్వ లోకములకు పోయి కర్మ భోగములను అనుభవించి తిరిగి జన్మ ఎత్తుతున్నాడు. కానీ నీ యందు భక్తి కలిగి, ఎట్టి కోరికలు లేక కర్మలను ఆచరించు వాడు ఉత్తరాయణ మార్గమున పోయి మోక్షమును పొందును" అని కపిలుని రూపమున ఉన్న నీవు తల్లి యగు దేవహూతికి బోధించితివి.

ఇతి సువిదితవేద్యాం దేవ హే దేవహూతిం
కృతనుతిమనుగృహ్య త్వం గతో యోగిసంఘైః |
విమలమతిరథాఽసౌ భక్తియోగేన ముక్తా
త్వమపి జనహితీర్థం వర్తసే ప్రాగుదీచ్యామ్ || ౧౫-౯||

ఈ విధముగా నువ్వు తల్లియైన దేవహూతికి సాంఖ్య యోగము బోధించి నందువలన ఆమె జ్ఞానవంతురాలై నిన్ను అనేక విధముల స్తుతించినది. అప్పుడు నీవు ఆమెను అనుగ్రహించి యోగి సంఘములు సేవించు చుండగా వారితో కూడి వెళ్లి పోయితివి. దేవహూతి నీ యెడ కల నిశ్చలమైన భక్తి యోగాముతో ముక్తిని పొందెను. నీవు కూడా లోక కళ్యాణము కొరకు ఈశాన్య దిక్కుకు పోయి అచ్చట నివసించితివి.

పరమ కిము బహూక్త్యా త్వత్పదాంభోజభక్తిం
సకలభయవినేత్రీం సర్వకామోపనేత్రీమ్ |
వదసి ఖలు దృఢం త్వం త్వద్విధూయామయాన్మే
గురుపవనపురేశ త్వయ్యుపాధత్స్వ భక్తిమ్ || ౧౫-౧౦||

పరమాత్మా! గురువాయురప్పా! ఇన్ని మాటలేల? నీ పాదపద్మము లందలి భక్తి సమస్త భయములను తొలగించుననియు, అన్ని విధములైన కోరికలను తీర్చుననియు స్పష్టముగా బోధించితివి. ఈ విధముగా మనవ కళ్యాణమునకై జ్ఞాన బోధ చేసిన నీవు నీయందు దృఢమైన భక్తి కలుగునట్లు నన్ను అనుగ్రహింపుము. అట్లే నాయొక్క సమస్త రోగములను దయతో తొలగించుము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి