12, ఆగస్టు 2020, బుధవారం

శంభో మహాదేవ శంకర గిరిజా రమణ - త్యాగరాజస్వామి


 శంభో మహాదేవ శంకర గిరిజా రమణ

శంభో మహాదేవ శరణాగత జన రక్షక
అంభోరుహ లోచన పదాంబుజ భక్తిం దేహి|

పరమ దయాకర మృగధర గంగాధర ధరణీ
ధర భూషణ త్యాగరాజ వర హృదయ నివేశ
సురబృంద కిరీట మణివర నీరాజిత పద గో
పురవాస సుందరేశ గిరీశ పరాత్పర భవహర

శంభో! మహాదేవా! పార్వతీపతీ! శరణాగత జనులను రక్షించే వాడా! పద్మముల వంటి నేత్రములు కలవాడా! నీ చరణకమలముల యందు భక్తిని ప్రసాదించుము. పరమ దయాకరా! జింకను చేతియందు కలవాడా! గంగను శిరసున ధరించినవాడా! భూమిని ధరించినట్టి శేషుడు అలంకారముగా కలవాడా! త్యాగరాజుని హృదయము నివాసముగా కలవాడా! దేవతా సమూహము యొక్క కిరీటములలోని మణుల కాంతులచే నీరాజనము ఇవ్వబడిన పాదములు కలవాడా! గోపురమునందు వెలసిన సుందరేశా! గిరీశా! పరమేశ్వరా! సంసార చక్రములో పాపములను హరించే పరమశివా! నీ చరణకమలముల యందు భక్తిని ప్రసాదించుము.

(మృగధరుడు అంటే చంద్రుడని నిఘంటువు ప్రకారం అర్థం, కానీ, మృగము అంటే జింక. జింక చేతిలో కలవాడన్న అర్థమే సరైనది అనిపించింది. గోపురము అనగా తమిళనాడులోని కోవురు. అక్కడ సుందరేశ్వరుడంటే త్యాగరాజస్వామికి ఎంతో భక్తి)

యజ్ఞాల ప్రాధాన్యము, ప్రయోజనము - కంచి పరమాచార్యుల వారు


మన మతంలోనే యజ్ఞాలు ఉండటానికి కారణం విశ్లేషించే ముందు మానవ జీవితం ఎలా సాగుతుందో గమనిద్దాం. ఒక ప్రాంతంలో ఏ పదార్థమైనా ఎక్కువగా లభిస్తే దానిని ఆ పదార్థం సమృద్ధిగా లేని ప్రాంతానికి పంపి ఆ రెండో ప్రాంతం నుంచి మనకు లేని దానిని తెచ్చుకుంటాం. వడ్రంగులు, మేస్త్రీలు మనకు పని చేసి పెడితే వారి జీవనాధారానికి మనం డబ్బులిస్తాం. ఆవుకి మేత పెడతాం అది పాలు ఇస్తుంది. ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తాం, మనకు భద్రత, ఇతర అవసరాలన్నీ ప్రభుత్వం చూసుకుంటుంది. ఆ విధంగానే పరలోకాలలో కూడా ఇచ్చి పుచ్చుకోవటాలున్నాయి. ఇంజనీర్లు వర్షపు నీటీని కాలువద్వారా పారనీయగలరు, జలాశ్రయాలలో నిలువ చేయగలరు. అంతే కానీ, వర్షాన్ని కల్పించటం చాలా కష్టం. మనకు వర్షాలు కావాలంటే దేవలోకానికి కొన్ని పదార్థాలను పంపాలు. ఈ పరస్పర సంబంధాలనే గీత ఇలా సూచిస్తుంది:

సహయజ్ఞాః ప్రజాసృష్టా పురోవాచ ప్రజాపతిః
అనేన ప్రసవిష్యద్వమేషవోऽస్త్విష్టకామధుక్

దేవాన్ భావయతానేన తేదేవా భావయంతునః
పరస్పరం భావయంతః శ్రేయఃపరమవాప్స్యథ

యజ్ఞాల వలన దేవతలను సంతుష్టపరచుచు, దేవతలు వర్షాలు మొదలైన వాటితో నిన్ను షంతుష్టుని చేయనీ. ఈ విధంగా ఒకరికొకరు సహాయపడుతూ అందరూ వర్ధిల్లు గాక!

క్లుప్తంగా చెప్పాలంటే, ప్రతిదేవతకీ మంత్రసమేతంగా ఉపహారం సమర్పించటమే యజ్ఞం. ఒకవిధంగా చెప్పాలంటే సామవేద మంత్రాలే దేవతా స్వరూపాలు., యజ్ఞంలో సమర్పించిన ఆహార దినుసులవలె ఈ మంత్రాలలోని పదాలే ఆయా దేవతలకు పోషకాలై వారికి పుష్టిని కలిగిస్తాయి. కాబట్టి మంత్రాలకు అనేక ప్రయోజనాలున్నాయి. ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించేందుకు మనం వివిధ రకాల పన్నులు కడతాము. ఒక్కో పన్ను ఒక్కో చోట కట్టాలి - అంటే ఆదాయపు పన్ను, భూమి శిస్తు, అమ్మకపు పన్ను, వాహనాల పన్ను మొదలైనవి. ఒక్కో అధికారి ఒక్కో రకమైన రసీదు ఇస్తాడు. అలాగే ప్రతి క్రతువుకూ ఒక ప్రత్యేకమైన మంత్రము, దేవత, ఉపహారము, సమయము ఉన్నాయి. ఒక్కో యజ్ఞానికి ఒక్కో నియమావళి ఉన్నా అన్నిటి ధ్యేయమూ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవటమే. మనం ఎక్కడ చెల్లించినా, పన్ను ప్రభుత్వాదాయంలోనే జమ అవుతుందని మనకు తెలుసు కదా. అలాగే, వేరువేరు దేవతలకై మనం చేసే వివిధమైన యజ్ఞాలు ఆ దేవతల ద్వారా పరమేశ్వరునికి చేరుతాయనే అనుకోవాలి.

11, ఆగస్టు 2020, మంగళవారం

రామాయణ అరణ్యకాండ విశేషాలు - కబంధ వృత్తాంత రహస్యం


శుభాశుభ లక్షణాలు కలగలుపుగా కనిపిస్తున్న కాననసీమల్లో రామలక్ష్మణులు ముందుకు సాగుతుండగా కబంధుడు కనిపిస్తాడు. నడుము నుండి మెడవరకు అన్ని అవయవాలనూ కుదించుకుని విశాలబాహువులతో ఆ అరణ్యంలో విహరిస్తున్న భయంకరాకారాన్ని చూచి లక్ష్మణుడు భయపడతాడు. కానీ, రాముడు ధైర్యంతో కబంధుడు వాళ్లిద్దరినీ కబళించబోయే వరకు వేచి చూస్తాడు. చివరకు ఆత్మరక్షణ కోసం రామలక్ష్మణులిద్దరూ చెరొక చేయిని ఛేదిస్తారు. కబంధుడు నిజంగా రాక్షసుడు కాడు. శాపగ్రస్తుడైన సుందరాంగుడు. బాహువులు తెగిపోగానే అతనికి స్వస్వరూపం గోచరిస్తుంది. తన పార్థివ శరీరాన్ని దహనం చేస్తే ఆపదలో ఉన్న రామలక్ష్మణులకు ఆప్తులైన మిత్రులను చేరే దారి తెలుపగలనని అంటాడు. అలాగే దహనం చెయ్యగానే అతడు దివ్యరూపంలో రామలక్ష్మణులకు సాక్షాత్కరించి పంపాతీరంలో ఋష్యమూక పర్వతం మీద సుగ్రీవుడనే వానరరాజున్నాడనీ, అతనితో సఖ్యం చేస్తే తమ కార్యం నెరవేరుతుందనీ సూచిస్తాడు. పరమ రమణీయమైన పంపాసరోవరం యొక్క ప్రాశస్త్యాన్ని పారవశ్యంతో వివరిస్తూ ఆ సరస్సు ఒడ్డునే ఉన్న మతంగవనాన్ని, ఆ వనంలో ఉన్న శబరిని కూడా వర్ణిస్తాడు. ఈ వర్ణనలు కబంధుని నోట వింటుంటే అతనికి తెలిసిన రహస్యాలు మరెవ్వరికీ తెలియవని తోస్తుంది.

అసలు కబంధ వృత్తాంతమే ఒక అద్భుతమైన గాథ. మరణించిన తరువాతనే అతనికి రహస్యాలన్నీ తెలుస్తాయి. పార్థివబంధం నుండి ముక్తి లభించిన తరువాతనే అతని దివ్యత్వం వ్యక్తమవుతుంది. ఈ ఘట్టాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఇది రామాయణ మహాయనంలో అనాహత నాదాన్ని వినిపించే మహత్తర సోపానంగా గోచరిస్తుంది. కబంధుడు రామలక్ష్మణులకు కనిపించే ముందు అతని శబ్దం వాళ్లకు వినిపిస్తుంది.

సంజజ్ఞే విపులః శబ్దః ప్రభంజన్నివ తద్వనం
సంవేష్టితమివాత్యర్థం గహనం మాతరిశ్వనా

దట్టమైన అరణ్యాన్ని చీల్చుకొని స్వయంగా వాయుదేవుడే ప్రవేశించినట్లుగా నలువైపులా విస్తరించిన మహారవం వినిపించిందట. మహారవంతో ప్రవేశించిన కబంధుడు మహానాదంతో నిష్క్రమిస్తాడు. అతని శరీరం నశించినా అతని నాదం నశించదు. అదే రామకథలోని అనాహత తత్త్వం. కైక వరాలలో మూలాధారాన్ని వదలిన కుండలినీ యానం పాదుకా పట్టాభిషేకంలో స్వాధిష్ఠానాన్ని చేరి, అత్రి-అనసూయ-అగస్త్యుల వంటి మహర్షుల మన్ననలతో మణిపూర మాధుర్యాన్ని ఆస్వాదించి, కబంధ శాపవిమోచనంతో అనాహత నాదాన్ని వింటుంది. మూలాధారంలోని శుద్ధ పార్థివ తత్త్వం స్వాధిష్ఠాన మణిపూరాల్లో నీటినీ, నిప్పునూ మాటు పెట్టుకొని అనాహత నాదంలో వాయుయానాన్ని అధిరోహిస్తుంది. ఇక చేరవలసిన విశుద్ధి చక్రంలోని ఆకాశతత్త్వం. దానికి కబంధుని అనాహతనాదమే దారి చూపిస్తుంది. పంపాసరోవరం-సుగ్రీవ మైత్రి-హనుమత్సమాగం అన్నీ పవన సంభవమైన పావన వాగ్విభూతికి సూచనలు. ఇది సామాన్యమైన వాక్సంపద కాదు, ఋషి భాషితమైన ఋష్యమూకం.

9, ఆగస్టు 2020, ఆదివారం

పార్వతీపతిం ప్రణౌమి సతతం - ముత్తుస్వామి దీక్షితుల వారు

పార్వతీపతిం ప్రణౌమి సతతం ఆశ్రితజన మందారం శశిధరం

పర్వత రాజ నుత పదాంబుజం భద్రప్రద కైలాస విరాజం
గర్విత త్రిపురాది హర చతురం గురుగుహ వందిత శివ శంకరం

శరణుకోరిన జనులకు పాలిట కల్పవృక్షమైన, చంద్రుని ధరించిన, పార్వతీదేవి పతి అయిన పరమశివునికి ఎల్లప్పుడూ నమస్కరించెదను. పర్వతరాజైన హిమవంతునిచే పూజించబడిన పదకమలములు గలవాడు, కైలాసపర్వతముపై స్థిరుడై ప్రకాశిస్తూ రక్షణము కలిగించేవాడు, గర్వాంధులైన త్రిపురాసురులు మొదలైన వారిని హరించిన చతురుడు, కుమారస్వామికి వంద్యుడు, శుభములను కలిగించే పరమశివునికి ఎల్లప్పుడూ నమస్కరించెదను.

- ముత్తుస్వామి దీక్షితుల వారు

4, ఆగస్టు 2020, మంగళవారం

సన్న్యాస సూక్తం - మహానారాయణోపనిషత్తు


న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః
పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజదేతద్యతయో విశంతి

వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగాద్యతయశ్శుద్ధసత్త్వాః
తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్పరిముచ్యంతి సర్వే

దహ్రం విపాపం పరమేశ్మభూతం యత్పుండరీకం పురమధ్యసగ్గ్ స్థం
తత్రాపి దహ్రం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం

యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః
తస్య ప్రకృతి లీనస్య యః పరస్స మహేశ్వరః

కర్మలు చేయటం, సంతానం, ధన సముపార్జన వల్ల ముక్తి కలుగదు, త్యజించుట వల్లనే అమృతత్వము లభిస్తుంది. స్వర్గమును మించినదైన ఈ స్థితి ఎంతో నిగూఢమై సన్యాసుల హృదయాలలో ప్రకాశిస్తుంది. వేదాంత విజ్ఞానము సునిశ్చితముగా కలిగి, సన్యాసయోగమును శుద్ధ అంతఃకరణముతో పాటించినవారికి, సచ్చిదానందస్థితిలోనున్న వారికి దేహాంత సమయములో విముక్తిని పొందెదరు. దేహమనే నగరం మధ్యలో సూక్ష్మమైన హృదయ కమలముంటుంది. నిర్మలమైనది, పవిత్రమైనది అయిన ఈ హృదయ కమలం పరమాత్మకు నివాసం. సూక్ష్మరూపమై, శోకాతీతమై యున్న ఆ పరమాత్మను ఉపాసన చేయుము. సనాతనమైన శబ్దంగా వేదాలలో వివరించబడిన ఓంకార నాదం వేదాంతములలో (ఉపనిషత్తులలో) పరమ సత్యముగా నిరూపించబడినది. ఇది భౌతికానికి అతీతమని గ్రహించినవాడే పరమేశ్వరుడు.

-సన్న్యాస సూక్తం (మహానారాయణోపనిషత్తు నుండి)

లంకాధిపతి - రావణ రాక్షస ప్రవృత్తి రహస్యం


సంసారమగ్నుడైన జీవుని లాగా సముద్ర మధ్యంలో నిలిచి యున్న నగరం లంక. దానికి పాలకుడు రావణుడు. అతిభయంకరుడు, దశగ్రీవుడు. గ్రీవం భోగాశకు చిహ్నం. దశేంద్రియాలతో అనుభవించాలని ఆరాటపడే జీవుడు రావణుడు. ఆ ఇచ్ఛయే అతణ్ణి ముల్లోకాలను జయింపజేసింది, దిశాధిపతులచే దాస్యం చేయించుకున్నది. అనుభవేచ్ఛ అహంకారపూరితమైనది. అహంకారి ముల్లోకాలను జయించినా తన ప్రకృతిని జయించలేడు. అందువల్లే సీతమ్మను వశం చేసుకోలేకపోయాడు. రావణుడు రాక్షస ప్రవృత్తి కలవాడు, పరమాత్మను మెప్పించటానికి తనువులోని పంచభూత ప్రకృతిని తపింపజేయటం రాక్షస తపస్సుకు ముఖ్యలక్షణం. అలాగే నారాయణుడైన రాముణ్ణి పొందటానికి సీతమ్మను తపింపజేశాడు. దశరథుడు తన ఆర్తితో భగవంతుణ్ణి భూతలానికి దింపాడు. అది సాత్త్వికమైన ఆర్తి. దశకంఠుడు అహంకారి కావటం చేత తాను ఆర్తిని ప్రకటించడు; సీతయందు ఆర్తిని సృష్టిస్తాడు. ఆ రాముడు లంకకు వస్తాడని ఆ జీవుని తపన. ఉద్ధతుడైన రావణుని గూఢాహంకార వైరభక్తి విశేషమది.

సీతను దశకంఠుడు చెరపట్టి అశోకవనంలో ఉంచుతాడు. తనను గూర్చి ఘనంగా చెప్పుకొని తనను స్వీకరించమని అడుగుతాడు. పరిచారికల చేత ప్రబోధం చేయిస్తాడు. ఫలితం లేదని తెలిసి సమయం కొరకు నిరీక్షిస్తాడు. సీతను కామించిన రావణుడు ఆమెను బలాత్కారం చేయలేదు, చేయలేడు కూడా. సీతాసౌముఖ్యం లేకపోతే అతని తల వేయి వ్రక్కలవుతుంది. అందుకే, ఆమె సౌముఖ్యాన్ని కోరతాడు. ఆమె వశమైతే ప్రకృతిని జయించిన పురుషుడవుతాడు. ఆమె వశం కాకపోతే ఆమెను రాముడే రక్షించుకుంటాడు. తాను ప్రకృతిని జయించలేని నాడు పరమాత్మ సాన్నిధ్యం పొందటానికి సీత కారణమవుతుంది. ఆ పని భక్తితో చేస్తే భగవంతుడు రక్షిస్తాడు, అహంకారంతో చేస్తే తగినట్లు శిక్షిస్తాడు. ఆ శిక్ష అహంకారానికి ఆధారమైన అతని శరీరాన్ని కూల్చటం. మరణం అతని దైహికానుభవేచ్ఛకు సమాప్తి; అతని జీవుని వేదన అతని ముక్తికి సాధనం. అందుకే రాముని చేతిలో రావణునికెంత శిక్షో అంత వరం. వైరభక్తిలో శిక్షయే వరంగా మారుతుంది. వైరభక్తి మార్గంలో రాముణ్ణి పొందే ప్రవృత్తికి లంక ప్రతీక.

1, ఆగస్టు 2020, శనివారం

మనవి ఆలకించరాదటే - త్యాగరాజస్వామి


మానవునిగా జన్మించి నడతతో లోకారాధ్యుడైనాడు రాముడు. త్యాగరాజ స్వామి ఈ రహస్యాన్ని మనవి ఆలకించరాదటే అన్న కృతిలో తెలిపారు. అదే ఆ అవతార రహస్యం అన్నది త్యాగరాజస్వామి మనోగతము. మారి ఆ రాముడెలాంటి వాడు? ఘనుడు, కరుణాంతరంగుడు, రామో విగ్రహవాన్ ధర్మః. ధర్మాచరణే మానవ జన్మకు సోపానమన్నది అడుగడుగునా మనకు నిరూపించినవాడు. ఆ ధర్మాచరణే మానవుడైన రాముని పరమపురుషునిగా చేసింది. నళినకాంతి రాగంలో త్యాగరాజస్వామి ఈ కృతిని స్వరపరచారు.

మనవి ఆలకించరాదటే మర్మమెల్ల దెల్పెదనే మనసా

ఘనుడైన శ్రీరామచంద్రుని కరుణాంతరంగము తెలిసి నా

కర్మకాండ మతాకృష్టులై భవ గహనచారులై గాసి చెందగా
కని మానవావతారుడై కనిపించినాడే నడత త్యాగరాజు

ఓ మనసా! నా మనవిని ఆలకించుము, శ్రీరాముని అవతార రహస్యమును తెల్పెదను. శ్రేష్ఠుడైన శ్రీరాముని కరుణాహృదయమును తెలిసిన నా మనవిని ఆలకించుము. కర్మకాండలనే మతములలో చిక్కుకున్న వారై భవసాగరమనే అరణ్యములో అలసిపోయిన మానవులను చూసి మానవావతారమునెత్తి ధర్మాచరణ వంటి ఉత్తమ లక్షణములను తన నడవడికచే నిరూపించి మనకు దారి చూపాడు. ఈ మర్మము తెలిసిన త్యాగరాజుని మనవిని ఆలకించుము.

కృష్ణా! నీ పేరు తలచినా చాలు (ఏకవీర చిత్రం - 1969)

ఒక్క నారాయణరెడ్డి గారికే చెల్లు ఇటువంటి సాహిత్యం. గోపిక మనసులో కృష్ణుని పట్ల ఉండే మధురభక్తిని అణువణువునా అక్షరాలలో పొందుపరచారు, గోపస్త్రీల మ...