3, నవంబర్ 2020, మంగళవారం

ఆడ మోడి గలదా రామయ్యా! - త్యాగరాజస్వామి కృతి

రామభక్తి సామ్రాజ్యపు దొర హనుమ. మరి ఆ హనుమ స్వామిని మొట్టమొదటి సారి కలిసే రామాయణ ఘట్టంలో రాముడు ఏం చేశాడు? ఇతనెవరో అన్న శంకతో ఉన్న లక్ష్మణుని మాట్లాడేందుకు పంపాడు, తమ్మునికి హనుమ వైభవాన్ని అద్భుతంగా లక్షణయుతంగా వివరించాడు. సకల విద్యాపారంగతుడు, వ్యాకరణాది సమస్త శాస్త్ర కోవిదునిగా అభివర్ణించి లక్ష్మణుని శంకను తొలగించాడు. ఆ విధంగా రాముడు హనుమ గొప్పతనాన్ని చాటాడు. ఆ ఘట్టాన్ని గుర్తు చేసుకుని త్యాగయ్య ఈ కృతి ద్వారా తనను తాను సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు అనిపించినా రాముని మనసులోని మర్మాన్ని, ఆధ్యాత్మిక మార్గంలో పరమాత్మ ఎప్పుడు ఎలా అనుగ్రహిస్తాడు అన్న దానిని సూచించేందుకే ఈ కృతి. రామాంజనేయ సమాగమ ఘట్టం నుండి మనకు సందేశం ఏమిటి? అన్నీ తెలిసిన పరమాత్మ లీలానాటకాలు కార్యాకారణ సంబంధం కలవి. హనుమ యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలిసేది ఎలా? ఈ విధంగానే. 

ఆడ మోడి గలదా రామయ్యా చారుకేశి రాగంలో కూర్చబడింది. నూకల చినసత్యనారాయణ గారు ఈ కృతికి త్యాగరాజస్వామి ఈ రాగాన్నే ఎందుకు ఎన్నుకున్నారో అద్భుతంగా వివరించారు. చారుకేశి శంకరాభరణం, తోడి సమ్మేళనం. శంకరాభరణ స్వరాలతో త్యాగరాజునికి, మనకు, తోడి స్వరాలతో రాముని మేళవించి,ఒకే రాగంగా చారుకేశి అయిన సీతాదేవిని తిరిగి పొందటం అనే ఒకే సంకల్పంగా ఒకరికొకరు సన్నిహితులై ఐక్యతను సాధించే సన్నివేశంగా అభివర్ణించారు. సాహిత్య సంగీత రస భావ ప్రకటనను ఆ విధంగా త్యాగరాజస్వామి అద్భుతంగా వివరించారు అని నూకల వారు ఎంతో ఉన్నతంగా తమ త్యాగరాజ సాహిత్య సర్వస్వంలో వివరించారు. రామాంజనేయుల సమాగమం శంకరభరణం తోడిల కలయికల ఫలితం చారుకేశి రాగం. త్యాగరాజస్వామి వారు వాల్మీకి అవతారమనేది పరమ సత్యం. ఇంతటి లోతన వివరణ ఇచ్చిన మహామహోపాధ్యాయ నూకల వారికి సాష్టాంగ ప్రణామాలు. 

ఆడ మోడి గలదా రామయ్యా మాట(లా)

తోడు నీడ నీవే యనుచు భక్తితో గూడి పాదముల బట్టిన మాట(లా)

చదువు లన్ని తెలిసి శంకరాంశుడై సదయుడాశుగసంభవుండు మ్రొక్క
కదలు తమ్ముని బల్క జేసితివి గాకను త్యాగరాజేపాటి మాట(లా)

ఓ రామయ్యా! నాతో మాట్లాడుటకు వెనకడుగెందుకు? నీవే తోడునీడయని భక్తితో పాదములను శరణంటిని, అటువంటి నాతో మాట్లాడుటకు వెనకడుగెందుకు? అవునులే! సమస్త విద్యా పారంగతుడు, పరమశివుని అంశలో జన్మించిన వాడు, శ్రేష్ఠుడు, వాయుపుత్రుడైన హనుమ నీకు మ్రొక్కగా, అతడెవరో యన్న శంకతో యున్న లక్ష్మణుని ఆ హనుమంతునితో మాట్లాడమన్నావు, ఇంక ఈ త్యాగరాజు ఏపాటి? 

ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు అద్భుతంగా ఆలపించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి