కర్నాటక సంగీత త్రయంలో త్యాగరాజస్వామికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ఐదు రకాల పంచరత్న కృతులను రచించారు. అవి ఘనరాగ పంచరత్న కృతులు, తిరువొట్ట్రియూర్ పంచరత్న కృతులు, కోవూరు పంచరత్న కృతులు, శ్రీరంగ పంచరత్న కృతులు, లాల్గుడి పంచరత్న కృతులు. వీటిలో ఘనరాగ పంచరత్న కృతులు జగత్ప్రసిద్ధమైనవి, తిరువాయూరులో, ప్రపంచమంతటా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలలో ఆలపించబడేవి. మిగిలినవి తిరువొట్ట్రియూరులోని త్యాగరాజస్వామి దేవస్థానంలోని త్రిపురసుందరీ అమ్మవారిపై, కోవూరు సుందరేశ్వరునిపై, శ్రీరంగంలోని రంగనాథస్వామిపై, లాల్గుడిలోని సప్తఋషీశ్వర స్వామి దేవస్థానంలోని స్వామిపై, అమ్మపై రచించారు.
సుబ్రహ్మణ్యుని శాపం నుండి విముక్తి కలిగేందుకు సప్తఋషులు తపస్సు చేసి పరమశివుని కరుణతో శాపవిముక్తులైనారు. అందుకే లాల్గుడిలో వెలసిన ఆ పరమశివుని రూపానికి సప్తఋషీశ్వరుడని పేరు వచ్చింది. ఇక్కడ అమ్మవారి పేరు మహిత ప్రవృద్ధ శ్రీమతి. ఇక్కడి దేవాలయం ఎనిమిదవ శతాబ్దంలో చోళులచే నిర్మించబడింది, స్వామి లింగం స్వయంభూ. లాల్గుడిని సందర్శించినప్పుడు త్యాగరాజస్వామి అయ్యవారిపై, అమ్మవారిపై రచించిన పంచరత్న కృతులు - గతి నీవని (తోడి), లలితే శ్రీప్రవృద్ధే (భైరవి), దేవ శ్రీ (మధ్యమావతి), మహిత ప్రవృద్ధ (కాంభోజి), ఈశ పాహిమాం (కల్యాణి). చివరి కృతి వివరాలు:
సాహిత్యం
========
ఈశ పాహిమాం జగదీశ పాహిమాం
ఆశరగణ మదహరణ బిలేశయ భూష సప్తఋషీ(శ)
శ్రీనాథ కరార్చిత దొరికేనాల్పులకీదర్శన
మేనాటి తపఃఫలమో నీ నామము దొరకె
శ్రీ నారద గానప్రియ దీనార్తి నివారణ పర
మానందార్ణవ దేవ యనాపజనక సప్తఋషీ(శ)
వ్యాసార్చిత పాలిత నిజదాస భూలోక కై
లాసంబను పల్కులు నిజమే సారెకు గంటి
నీసాటి ఎవరయ్యా నీ సాక్షాత్కారమున
వేసట లెల్ల దొలగె నేడే జన్మము సాఫల్యము
సామాది నిగమ సంచార సోమాగ్ని తరణి లోచన
కామాది ఖండన సుత్రామార్చిత పాద
హేమాచల చాప నిను వినా మరెవరు ముని మనో
ధామ త్యాగరాజ ప్రేమావతార జగ(దీశ)
భావం
======
పరమేశ్వరా! జగదీశ్వరా! నన్ను రక్షించుము. రాక్షస గణముల అహంకారాన్ని అణచేవాడవు, సర్పములు ఆభరణములు కలవాడవు, సప్తఋషీశ్వరుడవైన పరమేశ్వరా! జగదీశ్వరా! నన్ను రక్షించుము. శ్రీహరి కరములచే పూజించబడిన వాడవు, అల్పులకు నీ దర్శనము దొరికేనా? ఇది ఏ నాటి తపస్సుల ఫలమో నీ నామము లభించింది. నారదుని గానాన్ని ఆనందించేవాడవు, దీనజనుల ఆర్తిని నివారణ చేసే వాడవు, పరమానందమనే సముద్రము వంటి వాడవు, అగ్నిదేవునికి తండ్రివి, సప్తఋషీశ్వరుడవైన పరమేశ్వరా! జగదీశ్వరా! నన్ను రక్షించుము. వ్యాసునిచే పూజించబడిన వాడవు, నిజభక్తులను రక్షించేవాడవు, కాబట్టే ఈ లాల్గుడి సప్తఋషీశ్వర క్షేత్రానికి భూలోక కైలాసమన్న పేరు సార్థకము. మరల మరల నిన్ను దర్శించాను, నీ సాటి ఎవ్వరూ లేరు, నీ సాక్షాత్కారముతో నా అలసటలన్నీ తొలగాయి, నా జన్మ సఫలమైనది, పరమేశ్వరా! జగదీశ్వరా! నన్ను రక్షించుము. సామాది వేదములలో సంచరించేవాడవు, సూర్యచంద్రాగ్నులు నేత్రములుగా కలవాడవు, కామాది అరిషడ్వర్గములను నాశనము చేసేవాడవు, ఇంద్రునిచే అర్చించబడిన పాదములు కలవాడవు, మేరు పర్వతమును చాపముగా ధరించినవాడవు, నీవు గాక నాకు దిక్కెవరు. మునుల మనసులలో నివసించేవాడవు, ప్రేమావతారుడవైన ఓ పరమేశ్వరా! జగదీశ్వరా! నన్ను రక్షించుము.
శ్రవణం
=======
కల్యాణి రాగంలో కూర్చబడిన ఈ కృతిని ఈ కృతిని ఓ ఎస్ త్యాగరాజన్ గారు ఆలపించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి