14, నవంబర్ 2020, శనివారం

రారా మా ఇంటి దాక - త్యాగరాజస్వామి వారి కృతి



ప్రహ్లాద విజయం త్యాగరాజస్వామి వారు రచించిన అద్భుతమైన యక్షగానం. అనేక కృతులతో, పద్యాలతో, గద్యంతో ఈ యక్షగానం ప్రహ్లాదుని భక్తిని, శ్రీహరి రూపమైన రాముని అనుగ్రహాన్ని ఆవిష్కరిస్తుంది. సాగర తీరంలో శ్రీహరి దర్శన భాగ్యం కలిగిన తరువాత స్వామి ప్రహ్లాదుని తన తొడపై కూర్చుండబెట్టుకుని చేతులతో నిమిరి ప్రహ్లాదుని కౌగిలించుకుంటాడు. ఆ భాగ్యాన్ని ఆస్వాదించిన ప్రహ్లాదుడు స్వామిని తన నివాసానికి రమ్మని వేడుకునే కృతి ఇది. పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు నిరంతర శ్రీహరి దర్శనాభిలాషియై స్వామిని తనతోనే ఉండమనే భావనను ఈ కృతి ద్వారా త్యాగరాజస్వామి తెలియజేశారు. ప్రహ్లాదుని హరిభక్తిలో ఉండే శరణాగతి, అనన్యమైన విశ్వాసాలు ఈ కృతిలో స్పష్టంగా మనకు గోచరిస్తాయి. వాగ్గేయకారులు భాగవతోత్తములపై ఇటువంటి రచనలు చేయటంలో ఉద్దేశం వారి మార్గంలోని ఔన్నత్యాన్ని, వారి భావనలను మనకు తెలియజేయటానికే. అందుకు సంగీత సాహిత్యాలకు మించిన సాధనమేముంటుంది? అందుకే త్యాగరాజస్వామి ప్రహ్లాద విజయం మేటి యక్షగానంగా నిలిచిపోయింది. 

సాహిత్యం
========

రారా మా ఇంటి దాక! రఘువీర! సుకుమార! మ్రొక్కేరా!

రారా దశరథ కుమార! నన్నేలుకోరా! తాళలేరా!

కోరిన కొర్కెలు కొనసాగకనే నీరజనయన నీ దారిని గని వే 
సారితి గాని సాధు జనావన సారి వెడలి స్వామి నేడైనా

ప్రొద్దున లేచి పుణ్యము తోటి బుద్ధులు చెప్పి బ్రోతువు గాని 
ముద్దుగారు నీ మోమును జూచుచు వద్ద నిలచి వారము పూజించేను

దిక్కు నీవనుచు తెలిసి నన్ను బ్రోవ గ్రక్కున రావు కరుణను నీ చే 
జిక్కియున్న నన్ను మరతురా ఇక శ్రీ త్యాగరాజుని భాగ్యమా

భావం
=====

ఓ రఘువీర! సుకుమార! నీకు మ్రొక్కెదను మా యింటి దాకా రారా! ఓ దశరథ కుమారా, నేనిక తాళలేకున్నాను నన్నేలుకొనుటకు రారా! నేను కోరుకున్న కోరికలు తీరకనే నీవు వెళ్లిపోయినంత నేను వేసారితిని. కావున ఓ సాధుజన రక్షకా! మరల ఈరోజైనా రావయ్యా స్వామీ! పొద్దునే లేచి పుణ్యమైన బుద్ధులు నాకు చెప్పి నన్ను బ్రోవుము. నీ ముద్దుగారే మోమును చూచుచు నీ వద్దనే నిలిచి మరల మరల పూజింతును, నీకు మ్రొక్కెదను, మా ఇంటి దాకా వచ్చి నన్ను బ్రోవుము. నీవే దిక్కని తెలిసినా నన్ను బ్రోచుటకు వేగము రావు, నాపై కరుణించుము, నీచేతిలో చిక్కియుంటే నన్ను నేను మరతునురా! నా భాగ్యమా! నీకు మ్రొక్కెదను, ఇక నన్ను బ్రోచుటకు మా ఇంటి దాకా రారా! 

శ్రవణం
======

అసావేరి రాగంలోని ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి