15, నవంబర్ 2020, ఆదివారం

ఈ వసుధ నీ వంటి దైవము - త్యాగరాజస్వామి వారి కృతి

 

సంగీత త్రయంలో ఉన్న ఒక ప్రత్యేకత అనేక క్షేత్రాలు దర్శించినప్పుడు అక్కడి దేవతామూర్తులపై కృతులను రచించటం. ముత్తుస్వామి దీక్షితులవారు భారతదేశమంతా తీర్థయాత్రలు చేశారు, అందుకే చాలా ఎక్కువ కృతులు అటువంటివి రచించారు. త్యాగరాజస్వామి ఎక్కువమటుకు తిరువయ్యారులోనే ఉండేవారు. అప్పుడప్పుడు తీర్థయాత్ర చేసిన క్షేత్రాలలో దేవతామూర్తులపై ఆయన కూడా కృతులను రచించారు. అటువంటి కృతి ఒకటి శహన రాగంలో కూర్చబడిన ఈ వసుధ నీ వంటి దైవము. చెన్నై సమీపంలోని కోవూరు సుందరేశ్వరునిపై ఆయన ఐదు కృతులను రచించారు. అవి కోవూర్ పంచరత్న కృతులుగా పేరొందాయి. దీని వెనుక ఒక గాథ ఉంది. 

త్యాగరాజస్వామి వారు తిరుమల తీర్థయాత్రకు వెళుతూ మధ్యలో కోవూరులో సుందరేశ మొదలియార్ అనే జమీందారును కలుస్తారు. త్యాగరాజస్వామి వారిని మొదలియార్ గారు కొన్ని కృతులను తనపై కృతులను రచించమని కోరతాడు. తాను మానవులను నుతిస్తూ కృతులను రచించనని చెప్పి త్యాగరాజస్వామి తిరుపతి బయలుదేరతారు. తిరుగు ప్రయాణంలో మార్గ మధ్యంలో బందిపోటు దొంగలు త్యాగరాజస్వామి వారి సమూహంపై దాడిచేయబోగా స్వామి వారికి తన వద్ద ఏమీ లేదని చెబుతారు. ఆ బందిపోట్లు తమపై రాళ్లు విసిరిన ఇద్దరు తేజోమూర్తులెవరు అని ప్రశ్నిస్తారు. త్యాగరాజస్వామి వారిని రామలక్ష్మణులుగా గుర్తించి ఆ బందిపోట్ల భాగ్యానికి ఆనందిస్తారు. కోవూరు క్షేత్రానికి గల మహిమను గ్రహించి అక్కడి సుందేశ్వరుడు, సౌందరాంబికను దర్శించుకుని ఐదు కృతులను రచిస్తారు. ఆ కృతులను విన్న మొదలియారు అవి తనపై రచన చేశారు అనుకుని సంతోషించగా త్యాగరాజస్వామి ఆ కృతులను తాను కోవూర్ సుందరేశ్వరునిపై రచించాను అని చెప్పి తిరిగి తిరువయ్యరు వెళ్లిపోతారు. ఈ కోవూరు పంచరత్న కృతులు - ఈ వసుధ (శహన), కోరి సేవింప (ఖరహరప్రియ), శంభో మహాదేవ (పంతువరాళి), నమ్మి వచ్చిన (కల్యాణి), సుందరేశ్వరుని (శంకరాభరణం). వాటిలో ఈ వసుధ నీ వంటి అనే కృతి వివరాలు:


సాహిత్యం
========

ఈ వసుధ నీ వంటి దైవమునెందు గానరా

భావుకము గల్గి వర్ధిల్లు కోవూరి సుందరేశ గిరీశ

ఆసచే అరనిముషము నీ పురవాస మొనర ఏయు వారి మది
వేసటలెల్లను తొలగించి ధనరాశులనాయువును
భూసుర భక్తియు తేజమునొసగి భువనమందు కీర్తి గల్గ జేసే
దాస వరద త్యాగరాజ హృదయ నివాస చిద్విలాస సుందరేశ

భావం
=====

శుభములు కలిగించుచు వర్ధిల్లే ఓ కోవూరి సుందరేశా! గిరీశ్వరా! ఈ భూమిపై నీవంటి దైవమును ఎక్కడా కానలేను. ఆశతో అరనిమిషమైన నీ సన్నిధిలో యుండే వారి మనసులోని పరితాపములను తొలగించి ధనరాశులను, ఆయుష్షును, బ్రాహ్మణుల పట్ల భక్తిని, తేజస్సును ప్రసాదించి ఈ జగత్తులో కీర్తిని కలిగించేవాడవు, దాసులకు వరములొసగే వాడవు, త్యాగరాజుని హృదయములో నివసించేవాడవు, చిద్విలాసుడవైన ఓ సుందరేశా! ఈ భూమిపై నీవంటి దైవమును ఎక్కడ కానలేను. 

శ్రవణం
======

శహన రాగంలో కూర్చబడిన ఈ కృతిని జీఎన్ బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించారు

1 కామెంట్‌: