వాలుకొప్పు పెట్టుకొని కట్టమీద పోత ఉంటే
వాడు సూచే సూపులకు వాలుకొప్పు జారిపోయే
శిద్దలయ్య కొండ మీద సిన్ని కూర కోసే దాన్ని
ఊరు చూడు దుమ్ము చూడు దున్నపోతుల బారు చూడు
బెంగులూరి కోనేట్కాడ రాయి కోసే చిన్నవాడ!
సూదులో దబ్బనాలో ఏస్కోలేదా హాయో తీస్కోలేదా హాయో
పాలపూసలు పగడాల పూసలు ఏస్కోలేదో హాయో తీస్కోలేదా హాయో
ఆరికోళ్లు నెమలికోళ్లు ఏస్కో లెదా హాయో తీస్కో లేదా హాయో
వింజమూరి అనసూయాదేవి గారు జానపద సంగీత ప్రపంచానికి చేసిన సేవ అంతా ఇంతా కాదు. ఒక ప్రాంతం కాదు, తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాల మాండలికాలను పరిశీలించి అక్కడి గ్రామీణ జీవితాలను ప్రతిబింబించే గీతాలను సంపాదించి వాటికి సంగీతం కూర్చి తాను పాడి ఇతర గాయకుల చేత పాడించారు. అటువంటి వాటిలో ఒకటి ఈ నక్కలోళ్ల సిన్నదాన్ని అనే గీతం. అనసూయాదేవి గారు, వసంత గారు పాడిన గీతానికి సంగీతం అనసూయ గారు, బీ గోపాలం గారు అందించారు. అమెరికాలో టెక్సాస్‌లో తన కూతురు ప్రఖ్యాత నాట్య కళాకారిణి రత్నపాప గారి దగ్గర స్థిరపడిన అనసూయ గారు ఇటీవాలే 97వ పుట్టినరోజు జరుపుకున్నారు. వారిలో ఉన్న ప్రతిభకు, వారు కళారంగానికి చేసిన సేవకు కనీసం పద్మభూషణ్ ఇవ్వాల్సిన మాట. ఆవిడ బ్రతికుండగా ఆ అవార్డు వస్తుందని ఆశిద్దాం. అవార్డులదేముందండీ అనే అల్లాటప్పా ప్రతిభ కాదు వీరిది. దాదాపు 85 ఏళ్ల సుదీర్ఘ సంగీత యానం అనసూయ గారిది. భారత ప్రభుత్వం వీరి ప్రతిభను గుర్తించాలి. అది చారిత్రాత్మక అవసరం. లేకపోతే ప్రతిభ అన్న పదానికి అర్థం లేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి