"యమునా తీరమున సంధ్యా సమయమున వేయి కనులతో రాధా వేచియున్నది కాదా!"...అరవై ఐదేళ్ల రామారావు శ్రావ్యంగా పాడుతూ భార్య కనకం దగ్గరకు వచ్చి "వేయి కనులతో కనకం వేచియున్నది కాదా" అని ఆమె చెంగు లాగుతూ పాడాడు. "ఇదిగో! మా అమ్మా నాన్న ఎంచక్కా కనకమహాలక్ష్మి అని పేరు పెట్టి మహాలక్ష్మి అని పిలుచుకునే వాళ్లు. నేను పుట్టాక మా నాన్నకు వ్యాపారంలో బోలెడు కలిసి వచ్చిందిట. పెళ్లయ్యాక మీ పుణ్యమా అని నా పేరు మోటుగా కనకం చేసేశారు...మహాలక్ష్మీ అని పిలవకూడదూ"...అంది. "కనకం! పెళ్లై 38 ఏళ్లు అయ్యింది. ఇప్పుడు కొత్తగా నీ పేరు మహాలక్ష్మి అని ఎలా పిలవను? నా పాలిట బంగారం నువ్వు. అందుకే కనకమే నాకిష్టం" అని నవ్వుతూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. "అబ్బో! ఈ మాటలకేమి? పోనీలేండి. నా పేరు మీకు మంచి చెస్తే మనకు మంచి చేసినట్లే కదా!" అని నవ్వుతూ భర్త కళ్లలోకి చూసింది. "ఏవండీ! పిల్లలు దూరంగా ఉన్నారు, మీరు రిటైర్ అయ్యారు. ఇదివరకంటే వాళ్ల అవసరాలు, మీ అవసరాలలో నా జీవితం తీరిక లేకుండా ఉండేది. ఇప్పుడు పెద్దగా పని ఉండటం లేదు. పిల్లల దగ్గరకు వెళ్లి ఉండే వయసు కాదు. వాళ్ల సంసారాల్లో వాళ్లు నిలదొక్కుకొని స్వతంత్రంగా ఉండవలసిన సమయం. మనం ఎక్కువ జోక్యం చేసుకోకూడదు. అందుకనే నా ఆలోచనలలో, నా జీవితంలో ఓ పెద్ద అగాథంలా ఉంది ఈ ఖాళీ సమయం. రోజు చాలా భారంగా గడుస్తోంది..." అని నిట్టూర్పుగా అంది కనకం.
"నిజమే కనకం! ఇన్నేళ్ల నుండి పిల్లల పెంపకం, నా అభివృద్ధి అనే సుదీర్ఘ సేవలో నీ సమయమంతా గడిచిపోయింది. నువ్వన్నట్లు పిల్లలు వాళ్ల జీవితాలు వాళ్లు వెళ్లబుచ్చుతున్నారు. మన ప్రమేయం ఇప్పుడు అనవసరం. ఏదో పిల్ల పాప అవసరానికి వెళ్లటం తప్ప ఇప్పుడప్పుడే మనం వాళ్లతో కలిసి జీవించకపోవటమే అందరికీ మంచిది. మనం ఎంత నవీన దృక్పథంతో ఉన్నామనుకున్నా, తరాల మధ్య అంతరం ఉంటుంది. మన ఆలోచనలు, చేసే పనులు వాళ్లకు నచ్చక పోయే అవకాశమే ఎక్కువ...." అని అన్నాడు. "కనకం! నిన్న వాకింగ్ చేస్తున్నపుడు వేంకటేశ్వర్లు గారితో సంభాషణల్లో నేను నా జీవితంలో కొన్ని తప్పులు చేశాను అని అర్థమైంది. నేను, నా ఉద్యోగాభివృద్ధి, పరపతి మీద ధ్యాసతో నీ ఆశలు, ఆశయాలను విస్మరించాను. నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది, నీకు కూడా జీవితంలో తృప్తిగా ఏదో ఒకటి సాధించాలని ఉంటుంది అని ఆలోచించలేకపోయాను. నన్ను క్షమించు" అని కళ్లలో నీళ్లు నిండగా అపరాధ భావనతో కనకం చేతులు పట్టుకున్నాడు. తన మనసులో ఉన్న వేదనకు మూల కారణం భర్త గ్రహించి అంత తొందరగా, అంత పరిపూర్ణంగా స్పందిస్తాడని ఊహించని కనకం కరిగి పోయింది. "ఏమండీ! నిజమే! నాకు కూడా జీవితంలో ఏదో సాధించాలి అన్న భావన ఎన్నో ఏళ్లు ఉండేది. కొన్నేళ్లు మరుగున పడిపోయినా మళ్లీ ఇప్పుడు అది చిగురెత్తి నన్ను ప్రశ్నిస్తోంది. ఆ మాట మీతో చెప్పలేక అగాథంలా ఉంది అన్నాను. మీరు నా మనసులోని మాట కనుక్కున్నారు. గతం గురించి అనవసరం. మీరు కావాలని చేయాలేదు కదా!! మీరు పిల్లలు నా జీవితంలో మూడింట నాలుగ వంతు. మిగిలిన ఆ పావు భాగాన్ని ఇప్పటికైనా నా స్వావలంబనకు ప్రతిబింబంగా చేసుకొవాలని, నా ఆశయాలకు మార్గదర్శకంగా ఉండాలని మనసు పరి పరి విధాలుగా కోరుకుంటోంది..." అంది కనకం.
"కనకం! ఓ వారం సమయం తీసుకో. నీకు ఏమి చేయాలనుందో, ఏమి చేస్తే నీ మనసులోని వెలితి కొంతైనా పూడుతుందో బాగా ఆలోచించి నాకు చెప్పు. మనకున్న ఆర్థిక పరిమితులలో నేను తప్పకుండా నీ ఆశయాలను నెరవేర్చటానికి వందశాతం నా వంతు ప్రయత్నం చేస్తాను" అన్నాడు రామారావు. కనకం ఆలోచనలో పడింది. "ఏదో సాధిద్దాము అనే కానీ, ఏమి సాధించాలో తెలియదే. బాధ్యతల సాగరం దాటే సరికి అస్తిత్వమే కోల్పోయానా ఏమిటి?" అని గాభరా పడింది. అంతలో సర్దుకొని తన మాతృత్వపు మధురిమలు, రామారావు భార్యగా పొందిన గుర్తింపు నెమరు వేసుకొని కర్తవ్యం గురించి మనసు దృఢపరచుకుంది.
మర్నాడు కనకం అమీర్‌పేట్ షాపింగుకు వెళ్లింది. అక్కడ రోడ్డు మీద నడుస్తుంటే తన వయసు మనిషే ఎదురై "మీ పేరు కనకమహాలక్ష్మి కదూ!" అని అడిగింది. ఎవరో వెంటనే గుర్తుపట్టని కనకం "అవునండీ! మీరు?...". "నేను పీయుసీలో క్లాస్స్మేట్ వనజను" అంది. "వనజా! నువ్వా! ఎంతలా మారిపోయావ్? అసలు గుర్తుపట్టలేకపోయాను. ఎన్నేళ్లయ్యింది...." అని సంభ్రమంగా అంది కనకం. "నువ్వు మాత్రం అలాగే సన్నగా రివటలా ఉన్నావే అందుకే గుర్తుపట్ట గలిగాను" అంది. ఆ తరువాత ఇద్దరు పిచ్చాపాటీ, అలనాటి కబుర్లు ఓ గంటసేపు. మాటల మధ్యలో వనజ "అవునూ! నీకు గుర్తుందా? ఎన్సీసీలో నీకు మంచి పేరొచ్చింది. నీకు సర్టిఫికేట్ ఇస్తూ నువ్వు దేశసేవ చేయాలమ్మా అని ఆనాడు ముఖ్య అతిథి అన్నారు. ఏమైనా సేవ చేయగలిగావా లేక పతి-బిడ్డల సేవేనా" అంది. కనకానికి అసలు తాను ఎన్సీసీ శిక్షణ పొందినట్లు, అందులో తనకు విశిష్ట పతకం లభించినట్లు అసలు గుర్తే లేదు. తన జీవితంలో అంత ముఖ్యమైన ఘట్టం ఎలా మరచాను అనుకుంది. ఓ రెండు గంటల ఆత్మీయ సంభాషణ తరువాత "వనజా! మేము కూకట్‌పల్లిలో ఉంటాము. తప్పకుండా మా ఇంటికి రా. టచ్‌లో ఉందాము" అని చిన్ననాటి స్నేహితురాలిని ఆలింగనం చేసుకొని ఇంటికి తిరిగి వెళ్లింది.
రాత్రికి కనకంలో అంతర్మథనం తీవ్రమైంది. ఆలోచనా తరంగాలు ఓ నలభై ఏళ్లు వెనక్కి వెళ్లాయి. తాను పీయుసీ చదివే రోజులు అవి. ఎంతో ఉత్సాహంగా, దేశమంటే అత్యున్నత భావాలు కలిగి, దేశభక్తి గీతాలు పాడుతూ, కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ ఉన్నప్పుడు మహిళా క్యాడెట్‌గా ఎన్సీసీలో చేరాలని ప్రగాఢమైన కోరిక. కాలేజీలో డ్రిల్ మాష్టారు సత్యం గారు కూడా కనకాన్ని ఎన్సీసీలో చేరటానికి ప్రోత్సహించారు. ఇంట్లో అమ్మనాన్న ఒప్పుకోలేదు. వారికి చెప్పకుండా ఎన్సీసీలో చేరింది. తరువాత ఇంట్లో తెలిసి తిట్టినా మౌనంగా భరించింది. "ఆడపిల్లవు, చదువు పూర్తి కాగానే పెళ్లి చేసుకొని సుఖంగా ఉండక ఈ దేశసేవ నీకెందుకు చెప్పు? " అని వాళ్లు నీరుగార్చటానికి ప్రయత్నించినా గట్టిగా పట్టు పట్టి ఎన్సీసీ శిక్షణ మంచి గుర్తింపుతో పూర్తి చేసింది. నాన్న గారి ఆర్థిక పరిస్థితులు, ఇంట్లో ఇంకా పెళ్లి కావలసిన నలుగురు ఆడపిల్లలున్న సంసారం వలన చదువు పీయూసీ పూర్తవుతూనే వివాహం చేసుకుంది కనకం. ఇన్నాళ్లకు మళ్లీ తనకు అ విషయం గుర్తుకు చేసినందుకు వనజకు మనసులో కృతజ్ఞతలు తెలుపుకుంది. తనకు భర్త ఇచ్చిన వారం రోజుల సమయంలోపే తన ఆలోచనలను దృఢ పరచుకుంది.
"ఏవండీ! మానవ సేవే మాధావ సేవ అని ఎందరో పెద్దలు చెప్పారు. ఇన్నాళ్లూ నాలో మరుగున పడ్డ ఓ కోణాన్ని నిన్న నా కాలేజీ స్నేహితురాలు వనజ సమయానికి గుర్తు చేసింది. నాకు నిజంగా ఈ సమయంలో స్ఫూర్తినిచ్చేది ఈ సమాజానికి సేవ చేయటం. నేను ఆ మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నాను. మీ అభిప్రాయం ఏమిటి? " అని పక్క మీద నిద్రపోతున్న రామారావుతో కనకం అంది. రామారావు సమాధానం చెప్పలేదు.
కనకం భర్తతో మాట్లాడుతున్నా అతని దగ్గరినుండి సమాధానం లేదు. రామారావు నిద్రలోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. ఊహించలేని ఆ ఆకస్మిక మరణానికి కనకమహాలక్ష్మి ప్రపంచం తల్లక్రిందులైంది. పిల్లలు వచ్చారు, అంత్యక్రియలు, కర్మకాండ జరిగిపోయాయి. "అమ్మా! మేము ఇక్కడ నెలల తరబడి ఉండలేము కదా! మాతో పాటు అమెరికా రా, కొన్నాళ్లు నీకు కూడా కాస్త మార్పుగా ఉంటుంది" అని కొడుకు కూతురు కనకంతో అన్నారు. కానీ కనకం భర్త మరణం షాక్‌నుంచి తేరుకోలేదు. పైగా తనకు భర్తతో ఉన్న అనుబంధాన్ని పిల్లలతో పంచుకోవాలని కూడా ఎన్నడూ అనిపించలేదు. ఇప్పుడు తాను అమెరికా వెళ్లి నిరంతరం తన మానసిక పరిస్థితితో వారికి అసౌకర్యం కలిగించకూడదు అన్న భావనతో "నేను ఇప్పుడు రాలేనులేరా. కొన్నాళ్లు నా అంతట నేను ఉండాలి. నా పయనమెటో నిర్ణయించుకోవాలి" అని మృదువుగా చెప్పి పిల్లలను పంపించేసింది.
మనసులో ఎన్నో ప్రశ్నలు. తన ఆశయానికి ఓ రూపం వస్తోంది అనే సమయంలో భర్త మరణించటం ఏమిటి? పిల్లలకు తన మధ్య ఉన్న ఈ దూరాన్ని ఒంటరిగా ఎలా దాటటం? అని దుఃఖం, "మీకేం? హాయిగా దాటిపోయారు, మీ సుఖాలన్నీ చక్కగా అమరిపోయాయి..నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్లిపోయారు" అని రామారావు మీద కోపం. వచ్చిపోయేవాళ్ల సానుభూతిని కూడా భరించలేని పరిస్థితి..ఇలా, ఎన్నో వికారాలు. ఏమీ తెలియని స్థితి ఒకరోజైతే ఎక్కడలేని ధైర్యం మరో రోజు.ఒక్కోసారి మనుషులు కావాలి అన్న భావన, మరెన్నో సార్లు అబ్బ, ఎవరూ వద్దు, నా మానాన నేను జీవించాలి అన్న భావన.
కొన్నాళ్లు శూన్యం ఆవరించిన జీవితం కనకమహాలక్ష్మి. మొదట్లో పలకరింపులకు బంధువులు, ఇరుగు పొరుగు. తరువాత అది కూడా తగ్గిపోయింది. ఓ మూడు నెలలు కనకం ఒంటరి జీవితం అనుభవించింది. ఏ పని చేసినా తన ఒక్క దానికోసమే చేసుకోవాలి. ఇన్నాళ్లూ రామారావు కోసం వచ్చిపోయే స్నేహితులు, బంధువులు వాళ్ల కోసం ఏర్పాట్లు. ఇప్పుడు కేవలం తన కోసమే వంట. ఇలా మొదలైంది ఆమె సత్యాన్వేషణ. పిల్లలు, భర్త ప్రపంచంగా జీవితంలో సింహభాగం గడిచిపోయింది. అంతకుముందెన్నడూ బయట పనులలో తనను రామారావు భాగస్వామిని చేయలేదు. ఇప్పుడో? పూర్తిగా భిన్నమైన జీవితం. కరెంటు, ఫోను వగైరా బిల్లులు, పెన్షన్ పనులు, బ్యాంక్ పనులు ఇంటి పనులు...ప్రతిదీ తనదే బాధ్యత. ఇంటర్నెట్ ఎలా వాడాలి అన్నది కూడా ఇప్పుడే శ్రీకారం. అలా తప్పటడుగులతో కనకం తన జీవితంలోని తరువాయి భాగాన్ని మొదలు పెట్టింది. పీయూసీ చదువుకుంది కాబట్టి వ్యవహారాల్లో అంత కష్టపడకుండానే విషయాలను అవగాహన చేసుకుంది.
కొన్నాళ్లకు వనజ ఫోన్ చేసింది. విషయం తెలిసి తనతో పాటు మరో ముగ్గురు చిన్ననాటి స్నేహితులను తీసుకుని కనకం ఇంటికి వచ్చింది. పలకరింపులు, నిట్టూర్పులు పూర్తయ్యాయి. ఎక్కువ శాతం మంది స్నేహితులు, బంధువులు కనకానికి పిల్లల దగ్గరకు వెళ్లమని సూచించినా ఆమెకు ఆ సలహా నచ్చలేదు. తాను తిరిగి నిలదొక్కుకొని తనకు వెళ్ళాలి అన్న భావన కలిగినప్పుడే తన ఓన్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో వెళ్లాలని తీర్మానించుకుంది. స్నేహితులతో తన ఆశయాన్ని చర్చించింది.
"నువ్వున్న పరిస్థితులలో ఇవన్నీ అవసరమా! నీకు పెన్షన్ వస్తుంది, దానితో నీ జీవితానికి ఢోకా లేదు, అమెరికా వెళ్లి ఎంచక్కా పిల్లలతో సమయం గడిపేయవచ్చు. ఈ సమాజ సేవలో ఎన్ని లొసుగులో ఎన్ని కష్టాలో నీకు తెలియట్లేదు.." అని ఒక స్నేహితురాలు. "సమాజసేవలో నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ పోయి నువ్వు రోడ్డు మీదికోస్తే పిల్లలు దానిని హర్షించరు కనకమహాలక్ష్మి" అని మరో స్నేహితుడు..."ఆడదానివి, అందులోనూ ఒంటరిగా ఉంటావు, ఈ సమాజసేవ వల్ల నీకు ఒరిగేదేమిటి?" అని ఇంకో స్నేహితురాలు...తలా ఓ నిరుత్సాహపరచే సలహా లేదా కామెంటు. ఒక్క వనజ మాత్రం "కనకమహాలక్ష్మీ! జీవితం తల్లక్రిందులైంది అన్న పరిస్థితిలో నీ స్థానంలో ఉండే చాలా మంది స్త్రీలు పిల్లల దగ్గరకు వెళ్లిపోతారు లేదా ఎటూ కదలని స్తబ్దైన జీవితంలోకి వెళతారు. కానీ, నీ నిర్ణయం అలా లేదు. జీవిత భాగస్వామిని కోల్పోవటం అనేది చాలా పెద్ద దెబ్బ, అయినా నీ అస్తిత్వం కోసం పాటుపడే దిశగా నువ్వు ఆలోచిస్తున్నావు. అది మన దేశానికి చాలా శుభ పరిణామం. నీకు నా పూర్తి సపొర్ట్" అని కనకం ఆలోచనలను దృఢపరచింది.
స్నేహితులు వెళ్లిపోయిన తరువాత కనకం రీడింగ్ టేబుల్ దగ్గర లైటు పెట్టుకొని తన ఆలోచనలకు అక్షర రూపం ఇవ్వటం మొదలు పెట్టింది.
"వ్యక్తిత్వ వికాసం - నేటి భారతీయులలో కొరవడిన అది ముఖ్యమైన లక్షణం. ఈ వ్యక్తిత్వ వికాసాన్ని చిన్నప్పటినుండే పిల్లలకు అలవాటు చేస్తే? ఆలోచనే ఆహా అనిపిస్తోంది. అమలు చేయగలిగితే? కొంతమంది బాలబాలికలైనా స్వావలంబన, మానసిక దృఢత్వంతో నేటి సమాజపు సమస్యలను ఎదుర్కునే వ్యక్తిత్వం పొందగలరు. ఎందరో బాలబాలికలు మానసిక బలం లేక చదువుల్లో పోటీ ప్రపంచంలో నిలువలేకున్నారు, యువతీయువకులు వైవాహిక మరియు ఉద్యోగ జీవితాలలో సమస్యలను ఎదుర్కోలేక సతమతమవుతున్నారు. కొద్ది మంది బాలబాలికలు మరియు యువతీ యువకులకైనా జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కునే వ్యక్తిత్వాన్ని శిక్షణ ద్వారా, అవగాహన ద్వారా అందించ గలిగితే నాకు ఎంతో ఆత్మ సంతృప్తి. ఇదే నా మిగిలిన జీవిత లక్ష్యం. దానికి ముందు నేను దృఢ సంకల్పంతో ఉండాలి. దానికి సాధన నేడే ప్రారంభం".
రాసుకున్న అక్షరాలను పదే పదే చదువుకుని, రేపటి కోసం ఎదురు చూస్తూ నిద్రలోకి జారుకుంది కనకం. మరునాడు ఉదయమే లేచి తన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చింది. మూడు నెలల సమయంలో ఆర్కే (రామారావు - కనకం) పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఇన్స్టిట్యూట్ అని పాఠశాల, కళాశాల విద్యార్థులకు వారి వయసును బట్టి ప్రణాలిక సిద్ధం చేసి దానికి ఇద్దరు మనస్తత్వ నిపుణులు, ఇద్దరు విద్యావేత్తల సేవలను వినియోగించుకొని విద్యాసంస్థలతో అనుసంధానం ఏర్పరచుకోవటంలో కనకం సఫలమైంది. రెండేళ్ల కఠోర శ్రమ తరువాత ఆర్కే ఇన్స్టిట్యూట్ హైదరాబాదే కాదు ఇతర ప్రాంతాలలో కూడా పేరొందింది. ప్రముఖుల జీవిత పాఠాలు, చరిత్రలోని ఘటనలు, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన పుస్తకాలు, శిక్షణా కార్యక్రమాలను తన ప్రణాలికలో విద్యార్థుల తరగతి, వయసు మరియు అవగాహనకు తగినట్లుగా రూపొందించి ఆ ప్రణాలికల అమలులో తాను ముందుండి నడిపించింది కనకం. ఓ ఐదేళ్లలో ర్యాగింగ్, యాసిడ్ అటాక్, బాలికలపై అత్యాచారం, గృహ హింస వంటి ఎన్నో క్లిష్టమైన సమస్యలను ఎదుర్కునే ప్రణాలికలు విస్తృతంగా ప్రచారం చేసింది ఆర్కే ఇన్స్టిట్యూట్.
"విద్యార్థినీ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం అనే ముఖ్యమైన అంశంపై ప్రభావవంతమైన, విజయవంతమైన శిక్షణను, ప్రణాలికలను అందిస్తున్న ఆర్కే పర్సనాలిటీ డెవలప్మెంట్ సంస్థ అధినేత్రికి తెలంగాణా ప్రభుత్వం వారి విశిష్ట సేవా పురస్కారాన్ని అందజేయవలసిందిగా గవర్నర్ గారిని కోరుతున్నాము..."...క్రిక్కిరిసిన రవీంద్రభారతి ఆడిటోరియం హాలులో గవర్నర్ చేతుల మీదుగా సేవా పురస్కారాన్ని అందుకునే వేళ కనకం మనసులో భావోద్వేగం, ఏదో సాదించానన్న ఆత్మ సంతృప్తి, మరో పదేళ్లు సేవ చేయాలన్న ఉత్సాహం కలిగాయి. ఎదురుగా కూర్చొని చప్పట్లు కొడుతూ ఆనందబాష్పాలు తుడుచుకుంటున్న స్నేహితురాలు వనజ, అమెరికా నుండి మర్నాడు ఇంటర్నెట్‌లో తల్లి గురించి వచ్చిన వార్తలను చూసి పొంగిపోయిన బిడ్డలు ఆమె ఆనందంలో, ఆ స్థాయికి చేరటంలో పడ్డ కష్టాలలో భాగస్వామ్యులు. నేడు వంటింటికి పరిమితం కాని వనిత కనకమహాలక్ష్మి. ఆ ఇంకేముంది పెన్షన్ వస్తుంది జీవితం గడిచిపోతుంది అని అనుకునే అగమ్యగోచరమైన వితంతువు కాదు. పిల్లలే జీవితం అనుకుంటూ పిల్లలపై ఆధార పడని సాధికరత పొందిన తల్లి ఆమె. ఆర్కే అనే ఒక బ్రాండ్‌కు మారుపేరు కనకం. సమాజ సేవ చేస్తూ ఆర్థిక స్వావలంబన కలిగిన ధీర వనిత. ఆమె ఒక మార్గదర్శి. స్ఫూర్తిప్రదాత.
"నా కోసం" అని పరితపిస్తూ ముందడుగు వేయలేకపోతున్న ప్రతి మహిళకు ఈ కథానిక అంకితం!
- ప్రసాద్ అక్కిరాజు
బాగుంది ప్రసాద్. మంచి సందేశం ఇచ్చావు. ఒంటరిగా ఉన్న పెద్దవారికి మంచి స్ఫూర్తినిస్తుందీ కథ. అభినందనలు.
రిప్లయితొలగించండి