అదిగదిగో గగనసీమ అందమైన చందమామ ఆడెనోయి
ఇదిగిదిగో తేలి తేలి చల్లనైన పిల్లగాలి పాడెనోయి
సా రి గ మ ప ద ని సా సా దా ప మ రి గ మ రి సా
హాయి హాయి ఈ లోకం తీయనైనదీ లోకం
నీ ఇల్లే పూలవనం నీ సర్వం ప్రేమ ధనం మరువకోయి ఈ సత్యం
నీ కోసమే జగమంతా నిండెనోయి వెన్నెలలు
చేలలోని గాలిపైన తీయనైన తూలికలు
చెరుచుకోకు ఈ సౌఖ్యం చేతులార ఆనందం
ఏనాడును పొరపడకో ఏమైనా త్వరపడకో
మరల రాదు రమ్మన్నా మాయమైన ప్రేమ ధనం
చిగురింపదు తిరిగి వాడి చెడిన పూలవనం మరువకోయి ఈ సత్యం
దేవులపల్లి కృష్ణశాస్త్రి - ఆ పేరంటేనే తెలుగుదనం. మాటల మువ్వలు భావానికి మురిసి నర్తిస్తే అది కృష్ణశాస్త్రి గీతమవుతుంది. ఆ పదాలేమీ కఠినంగా ఉండవు, పామరులకు కూడా తేటతల్లమే. అందరి హృదయవీణలు మీటి మోహన రాగాలు పలికిస్తాయి. భావానికి మారు పేరు కృష్ణశాస్త్రి. అందులోనూ లలిత సంగీతానికి ఆయన సాహిత్యం ప్రాణవాయువు. తెలుగునాట కృష్ణా గోదావరులున్నంత వరకూ కృష్ణశాస్త్రి సాహిత్యం మకుటాయమానంగానే ప్రకాశిస్తుంది. అటువంటి ఓ గీతమే 1953లో విడుదలైన నా ఇల్లు అనే చిత్రంలోని అదిగదిగో గగనసీమ అనే భావవీచిక.
చిత్ర నేపథ్యం:
ఆనాటి సినీ మహామహులు చిత్తూరు వుప్పలదడియం నాగయ్య గారు నిర్మించి దర్శకత్వం వహించిన ఈ కళాఖండంలో నాగయ్య గారు నాయకుడు, ప్రఖ్యాత నర్తకి టీ ఆర్ రాజకుమారి గారు నాయిక. ఈ రాజకుమారి గారి కుటుంబానికి చెందినవారే జ్యోతిలక్ష్మి, జయమాలిని. ఈ చిత్రంలో ప్రతినాయిక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితగారి తల్లి సంధ్య సోదరి విద్యావతి. రాజకుమారి, విద్యావతి గార్ల అద్భుతమైన నటనతో ఈ చిత్రం మంచి విజయమే సాధించినా పార్టనర్ల మోసం చేసి నాగయ్యగారికి చిల్లి గవ్వ కూడా దక్కలేదు. చిత్రానికి సంగీతం నాగయ్య గారు, అద్దేపల్లి రామారావు గారు అందించారు.రావు బాలసరస్వతీ దేవి గారు, ఎమ్మెల్ వసంతకుమారి గారు, జిక్కి గారు, ఎమ్మెస్ రామారావు గారు, నాగయ్య గారు ఈ చిత్రానికి నేపథ్య గాయకులు. ఈ చిత్రానికి సంభాషణలు కూడా కృష్ణశాస్త్రి గారే.
పాట వివరాలు:
తెలుగు నేపథ్య సంగీతంలో తొలి గాయనీమణుల్లో ఒకరైన బాలసరస్వతి గారు, ఎమ్మెల్ వసంతకుమారి గారు కలిసి పాడిన ఓ అరుదైన గీతం అదిగదిగో గగన సీమ. పాటలో ప్రధాన గాత్రం బాలసరస్వతి గారిదే. ఎంత మధురంగా పాడారంటే వినే వారు ఆనందంలో తేలిపోవలసిందే. ఈ గీతంలో అద్భుతమైన భావం. మంచి ఆశావహమైన స్ఫూర్తిని కలుగజేస్తూ కర్తవ్యాన్ని కూడా బోధిస్తుంది ఈ గీతం. సాహిత్యంలో కృష్ణశాస్త్రి ముద్ర అణువణువునా గోచరిస్తుంది. నాగయ్య గారు ఈ పాటను సారంగ రాగంలో కూర్చారు. ఈ గీతం నాగయ్య గారి సంగీత ప్రతిభను సూచిస్తుంది. తరువాత ఇదే బాణీలో ఎన్నో దేశభక్తి, లలిత గీతాలు తెలుగు సంగీత ప్రపంచంలో వచ్చాయి. ఇల్లు, ప్రేమ ఎంత ముఖ్యమైనవో తెలిపే సందేశాత్మకమైన భావగీతి ఇది. బాలసరస్వతి గారి గాత్రంలో ఆ చెప్పలేని పట్టులాంటి మృదుత్వం ఉంటుంది, ఆ స్వరలక్షణం లలిత భావ గీతాలకు ఎంతో శోభనిచ్చేది. ఎమ్మెల్ వసంతకుమారి గారు అప్పటికే మేటి గాయని అయినా నాగయ్య గారిపై గౌరవంతో, బాలసరస్వతి గారి గొంతులో గొంతు కలిపి అద్భుతమైన ఏకగాత్రం అనిపించేలా పాడారు. ఆనాటి సామాజిక పరిస్థితుల వలన బాలసరస్వతి గారు సుశీలమ్మ, లీల, జిక్కి లాగా బహుళంగా పాడలేకపోయినా, పాడినవి అమృత గుళికలు. మలయమారుతంలా వీచే ఈ గీతం విని ఆనందించండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి