సంఘం - 1954లో విడుదలైన ఓ అద్భుత కళాఖండం. ఏవీఎం వారి బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించటానికి ప్రధాన కారణం కథ, వైజయంతిమాల, అంజలీదేవిల మేటి నటనాకౌశలం. ముఖ్యంగా వైజయంతిమాల గారిది మైమరపించే నటన. దాదాపుగా వీరిద్దరి భుజాల మీదే సినిమా నడుస్తుంది. అన్న ఎన్‌టీఆర్ గారు కూడా చాలా అందంగా ఉంటారు. ఈ చిత్రానికి ఆర్ సుదర్శనం గారు సంగీత దర్శకత్వం వహించగా తోలేటి వేంకటరెడ్డి గారు పాటలను రచించారు. నాయికలకు టీ.ఎస్. భగవతి మరియు సుశీలమ్మ నేపథ్య గానం చేశారు. 63 ఏళ్ల క్రితం ఇటువంటి చిత్రం వచ్చిందంటే ఓ సంచలనమే అనుకోవాలి. ఎంతో అభ్యుదయ భావాలను ప్రోత్సహించిన చిత్రం ఇది. చక్కని ఇతివృత్తం, మధ్య మధ్యలో హాస్యం, నటీనటుల సహజ హావభావాలు, సంగీత నృత్యాలు, చిత్రీకరణ ఈ చిత్రానికి ఆయువుపట్లు. రాణి, కామిని పాత్రలలో వైజయంతిమాల, అంజలి పోటీ పడి నటించారు. చిలక పలుకుల తెలుగులో వైజయంతిమాల తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. స్నేహితురాళ్లుగా వీరిద్దరూ చిత్రాన్ని డామినేట్ చేశారు. ఈ చిత్రం తొలుత తమిళంలో నిర్మించబడి (పెణ్), తరువాత తెలుగులో, తరువాత హిందీలో (లడ్కీ) విడుదలై మూడు భాషల్లోనూ విజయం సాధించాయి.
ఈ చిత్రంలో సుశీలమ్మ, టీఎస్ భగవతి గారు పాడిన సుందరాంగ మరువగలేనోయ్ రావేల అనే కృష్ణ ప్రేమ గీతాన్ని మనోజ్ఞంగా తోలేటి వారు రచించంగా పాటలో తన్మయులై నటించారు నాయికలు. ఎంత సుందరమైన గీతమో! పాట సాహిత్యమొక వైపు, ఈ ఇరువురు అందమైన నాయికల నటన మరొక వైపు. ప్రేక్షకుల మనసులు దోచుకొని ఈ గీతాన్ని అజరామరం చేశాయి. ఆర్ సుదర్శనం గారు ఏవీఎం వారికి ఆస్థాన సంగీత విద్వాంసులు. చక్కని వీణా వాదనం, పక్క వాయిద్యముల ధ్వానములతో ఈ పాట అనుక్షణం అలరిస్తుంది. మేను పులకరింపజేస్తుంది. ఆపాత మధురం అని ఊరకే అనలేదు సుమా! సంగీతానికి, నటనకు, భావానికి, చిత్రీకరణకు సమమైన ప్రాధాన్యతనిచ్చి పాటలను కూర్చిన రోజులవి. నటీమణుల ప్రతిభను ప్రకాశింపజేసే సాంకేతిక నైపుణ్యం ఆనాటీ దర్శకులలో ఉండేది. తోలేటి వారి పద ప్రయోగం గమనించండి. చక్కని చిక్కని తెలుగులో లయబద్ధమైన పదమంజరిని రచించారు. ఈ సాహిత్యానికి సంగీత దర్శకులు ఉపయోగించిన వీణావాదనం మనోహరం. నాయికల కళ్లలో వలపులు, ఎదురుచూపులు అద్భుతః. టీఎస్ భగవతి గారు తమిళ చలనచిత్రసీమలో ప్రఖ్యాత గాయని. ఇక సుశీలమ్మ సంగతి చెప్పేదేముంది? వీరిద్దరి యుగళగీతం ఆద్యంతం రసజ్ఞులకు కర్ణామృతమే. ఈ మేటి వన్నె గల గీతాన్ని వీక్షించండి. సాహిత్యం ఇదిగో!
సుందరాంగ మరువగలేనోయ్ రావేల
నా అందచందములు దాచితి నీకై రావేల
ముద్దు నవ్వుల మోహన కృష్ణా రావేల
నవ్వులలో రాలు సరాగాలు రాగమయ రతనాలు
మేని కనులలో వాలు చూపుల ఆ వేళ
నను జూసి కనుసైగ జేసితివోయి రావేల
కాలి మువ్వల కమ్మని పాట ఆ వేళ
ఆ మువ్వలలో పిలుపు అదే వలపు మురిపెముల కలగలుపు
హృదయ వీణ తీగలు మీటి ఆ వేళ
అనురాగ రసములే చిందితివోయి రావేల
మనసు నిలువదోయ్ మధు వసంతమోయ్ రావేల
పూవులు వికసించే ప్రకాశించే ప్రేమతో పలవించే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి