"నా తండ్రే నేను గాయనిగా స్థిరపడటానికి కారణం" అని చెప్పారు పొరయాతు లీలమ్మ గారు. రెండు దశాబ్దాల పాటు దక్షిణ భారత దేశపు భాషలలో మధురమైన గాత్రంలో శ్రోతలను మైమరపించిన కంఠం పీ లీల గారిది. 1934 మే 19న కేరళలోని పాలక్కాడ్ జిల్లా చిత్తూరులో జన్మించిన పీ లీల కుంజమీనన్-మీనాక్షి అమ్మ దంపతులకు మూడవ బిడ్డ. తండ్రి ప్రోత్సాహంతో త్రిభువనమణి భాగవతార్, చెంబై వైద్యనాథ భాగవతార్ వంటి మేటి గాయకుల వద్ద కర్ణాటక సంగీతంలో శిక్షణను పొందారు. కూతురిని గాయనిగా చూడాలనుకున్న మీనన్ గారు ఆమెను చెన్నై తీసుకువెళ్లి గురుకుల పద్ధతిలో వడక్కన్‌చెర్రి రామభాగవతార్ గారి వద్ద శాస్త్రీయ సంగీతాన్ని నేర్పించారు. చెన్నైలో మహామహులైన అరైకుడి, చెంబై, జీఎన్‌బీ వంటి వారి సంగీతం వినే అవకాశం లీలకు దక్కింది. విన్న వెంటనే నేర్చుకోగలిగిన ప్రతిభ కలిగిన లీలకు చిన్ననాటినుండే పోటీలలో బహుమతులు వచ్చాయి. దుర్గాబాయి దేశ్‌ముఖ్ గారు ఆమెకు ఆంధ్ర మహిళా సభ ద్వారా తొలి కచేరీ అవకాశం కలిగించారు. కొలంబియా రికార్డింగ్ సంస్థ ద్వారా నేపథ్య గాయనిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన లీల ఇక వెను తిరిగి చూడలేదు.
తమిళ, తెలుగు భాషలు రాకపోయినా, మళయాళంలో ఆ పాటలు రాసుకొని అద్భుతమైన ఉచ్చారణతో ఆ రెండు భాషలలో పేరొందారు. అలా 1948లో ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. తెలుగులో మొట్టమొదటి సారిగా 1949లో మనదేశం, కీలుగుర్రం, గుణసుందరి కథ చిత్రాలలో పాడారు. ఘంటసాల గారు ఆమెకు మనదేశం చిత్రంలో పాడే అవకాశం కలిగించారు. గుణసుందరి కథ చిత్రంలో శ్రీరంజని గారిపై "శ్రీతులసి జయతులసి" అనే భక్తి గీతం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక వరుసగా పాతాళభైరవి మొదలు పాండవవనవాసం వరకు ఓ 15-16 ఏళ్ల పాటు లీల గారు తెలుగు నేపథ్య గాయనీమణుల్లో అగ్రశ్రేణిలో నిలిచారు. 1960 దశకం చివరి భాగానికి ఆవిడ గొంతులో మాధుర్యం తగ్గింది. అప్పటికి సుశీలమ్మ, జిక్కి, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి మొదలైన వారు బాగా నిలదొక్కుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే నేపథ్య గాయని అంటే సుశీలమ్మే అనే పరిస్థితి అప్పటికి వచ్చేసింది. ఆపైన లీల గారు తెలుగులో పెద్దగా పాడలేదు. కాకపోతే ఆమె భక్తి పాటల ప్రపంచంలో ప్రైవేట్ ఆల్బంస్ ఎన్నో చేసి చాలా పేరుపొందారు, తన సంగీత ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆమె పాడిన నారాయణీయం, మూకాంబిక శతకం, అష్టపదులు దక్షిణాదిన ఎంతో పేరుపొందాయి.
లీలగారి తెలుగు సినీ జీవితంలో మరువలేని మైలురాయి లవకుశ చిత్రం. 1963లో విడుదలైన ఈ చిత్రంలో ఆమె సుశీలమ్మ కలిసి లవకుశులకు అందించిన గాత్రం అజరామరమై నిలిచింది. ప్రతి ఒక్క పాట చాలా పేరొందింది. ఒకరకంగా తెలుగు నేపథ్య సంగీత జీవితంలో లీల గారికి ఈ చిత్రం పతాక స్థాయి అని చెప్పుకోవచ్చు. 1968లో మహానటి సావిత్రి అందరూ మహిళలతో నిర్మించిన చిన్నారిలోకం చిత్రానికి లీలగారు సంగీత దర్శకత్వం వహించారు.
పాతాళభైరవి, బ్రతుకుతెరువు, జయసింహ, మిస్సమ్మ, చిరంజీవులు, తెనాలి రామకృష్ణ, మాయాబజార్, సువర్ణసుందరి, బబ్రువాహన, అప్పుచేసి పప్పుకూడు, పెళ్లినాటి ప్రమాణాలు, శాంతినివాసం, రాజమకుటం, జగదేకవీరుని కథ, పాండురంగ మహాత్య్మం, వేంకటేశ్వర మహాత్య్మం, లవకుశ, గుండమ్మ కథ, పరమానందయ్య శిష్యుల కథ, తిరుపతమ్మ కథ, దక్ష యజ్ఞం, సీతారామకళ్యాణం, పెళ్లి సందడి, మాంగల్య బలం వంటి ఎన్నో చిత్రాలలో పాడారు. మొత్తం మీద దక్షిణాది భాషలలో 5000కు పైగా పాటలు పాడారు. 1984లో విడుదలైన ఎన్‌టీరామారావు గారి శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర చిత్రంలో నీవెవరో నీ జన్మం ఏదో అనే పాట ఆవిడ తెలుగు చిత్రాలలో పాడిన ఆఖరిది. లీలగారికి 1992లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డును, భారత ప్రభుత్వం 2006లో మరణానంతరం పద్మభూషణ్ అవార్డులను ప్రదానం చేశారు. వారికి హృదయపూర్వకమైన నివాళి.
ఆవిడ పాటిన పాటలలో నాకు అత్యంత ప్రియమైనది రాజమకుటం చిత్రంలోని సడి చేయకో గాలి సడి చేయబోకే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి