ఆమె పేరు వింటేనే ఉత్సాహం ఉరకలేస్తుంది. చిన్న-పెద్ద అని లేకుండా అందరూ ఆమె గళంలోని కైపుకు దాసోహమైన వాళ్లే. దశాబ్దాల పాటు మత్తెక్కించే పాటలతో పాటు ఎన్నో భక్తి గీతాలను కూడా పాడి దక్షిణాది సినీ అభిమానులను అలరించిన గాయని ఎల్. ఆర్. ఈశ్వరి. వీరి పూర్తి పేరు లూర్డ్-మేరీ రాజేశ్వరి ఈశ్వరి. 1939 డిసెంబరు 7న చెన్నైలో రోమన్ కేథలిక్ దంపతులైన ఆంథోనీ దేవరాజ్, రెజీనా మేరీ నిర్మల దంపతులకు జన్మించారు. అమ్మమ్మ వైపు వారు క్రైస్తవులు, నాయనమ్మ వైపు వారు హిందువులు కావటంతో రెండు కుటుంబాలకూ ఆమోదయోగ్యంగా అలా పేరు పెట్టుకున్నారు.
ఆరేళ్ల వయసులోనే భర్త దేవరాజ్ మరణించటంతో నిర్మల ముగ్గురు పిల్లల కుటుంబాన్ని నడిపే భారం తన మీద వేసుకుని, సినీ గీతాలలో కోరస్ పాడే ఉద్యోగంలో చేరారు . చిన్ననాటి పేదరికం వలన ఎల్. ఆర్. ఈశ్వరికి సంగీతం నేర్చుకునే అవకాశం రాలేదు. సిలోన్ రేడియోలో పాటలు విని నేర్చుకునే వారు. తల్లితో కలిసి కోరస్‌లో పాడటంతో ఆమె సినీ జీవితం ఆరంభమైంది. తొలి అవకాశం మనోహర అనే తమిళ చిత్రంలో జిక్కి గారితో కోరస్ పాటలో వచ్చింది. ఈ చిత్రం 1954లో ఎల్వీ ప్రసాద్ గారి దర్శకత్వంలో తమిళంలో, అదే సంవత్సరంలో డబ్ చేయబడి తెలుగు, హిందీ భాషలలో విడుదలైంది. అలాగే, 1957లో విడుదలైన సువర్ణసుందరి చిత్రంలో సుశీలమ్మ పాడిన పిలువకురా అనే పాట కోరస్‌లో కూడా పాడారు. 1958లో విడుదలైన తమిళ చిత్రం నల్ల ఇడత్తు సంబంధం అనే చిత్రంలో సంగీత దర్శకులు కేవీ మహాదేవన్ గారు మూడు పాటలు పాడే తొలి అవకాశాన్నిచ్చారు. షావుకారు జానకి, ఎం.ఆర్ రాధ నటించిన ఈ చిత్రం విజయం సాధించగా ఎల్.ఆర్ ఈశ్వరి సినీ నేపథ్య గాయని ప్రస్థానం మొదలైంది. తెలుగులో తొలి అవకాశం 1958లోనే కేవీ మహాదేవన్ గారి సంగీత దర్శకత్వంలో విడుదలైన దొంగలున్నారు జాగ్రత్త అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. తమిళ చిత్రాలలో 1961లో విడుదలైన పాశమలర్ అనే చిత్రంలో పాటలతో ఎల్.ఆర్ ఈశ్వరి గారి ఉత్థానం ప్రారంభమైంది. తమిళ దర్శకులు ఏ పీ నాగరాజన్ గరు అప్పటికే ఎం ఎస్ రాజేశ్వరి అనే గాయని ఉండటంతో రాజేశ్వరి ఈశ్వరి పేరుని ఎల్.ఆర్ ఈశ్వరి గా మార్చారు.
ఇక 1960-70 దశకాలు ఎల్.ఆర్ ఈశ్వరి గళంలో వెలువడిన పాటలు మత్తు, గమ్మత్తుతో వీక్షకులను ఉర్రూతలూగించాయి. సుశీలమ్మ, జానకమ్మ మాధుర్యానికి, సొగసుకు మారుపేరైతే ఎల్.ఆర్ ఈశ్వరి ఈ కైపున్న పాటలకు ట్రేడ్ మార్క్ అయ్యారు. తెలుగులో పాండవ వనవాసం, ప్రతిజ్ఞాపాలన, ఉమ్మడి కుటుంబం, భార్యా బిడ్డలు, రైతుబిడ్డ, రౌడీలకు రౌడీలు, మంచి మిత్రులు, అందమైన అనుభవం, అంతులేని కథ, నిండు మనసులు, నాగమల్లి, మరోచరిత్ర, పుట్టినిల్లు మెట్టినిల్లు, అమ్మాయిల శపథం, అగ్గి బరాట, శ్రీవారు మావారు, ముత్తైదువ, రామాలయం, గౌరి, మంచి చెడు, ధనమా దైవమా, శ్రీమంతుడు, జరిగిన కథ, జమీందారు గారి అమ్మాయి, అల్లూరి సీతారామరాజు, రైతు కుటూంబం, మానవుడు దానవుడు, మాతృదేవత, ప్రేం నగర్, దేవుడు చేసిన మనుషులు, రాజకోట రహస్యం, అమ్మ మాట, జీవన తరంగాలు, ప్రాణం ఖరీదు, అన్నదమ్ముల సవాల్, భక్త ప్రహ్లాద, శ్రీకృష్ణ పాండవీయం, మొరటోడు, ప్రేమ జీవులు, దీక్ష ఆలీబాబా నలభై దొంగలు, బాలమిత్రుల కథ, అగ్గిదొర, ఇదాలోకం మొదలైన ఎన్నో తెలుగు చిత్రాలకు పాటలు పాడారు.
ఎల్.ఆర్ ఈశ్వరి గారి పాడిన పాటల్లో - గాలిలోన పైట చెంగు, పాములోళ్లమయ్య, మాయదారి సిన్నోడు, ఆకులు పోకలు ఇవ్వద్దు, లేలేలేలేలే నా రాజా, భలే భలే మగాడివోయ్, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, నందామయా గురుడ నందామయా, గుడిలోన నా సామి, తీస్కో కోకోకోలా, బోల్త పడ్డావు చిన్ని నాయనా వంటి మత్తెక్కించేవి ఎంతో పేరు పొందాయి. . విజయలలిత, హలం, జ్యోతిలక్ష్మి వంటి శృంగార నర్తకీమణులకు ఎల్.ఆర్ ఈశ్వరి గారు పాడారు. ఇంతే కాకుండా, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారికి ఎన్నో తమిళ తెలుగు చిత్రాలలో నేపథ్య గాయనిగా పాటలు పాడారు. తమిళంలో ఎన్నో అమ్మవారి భక్తి గీతాల ఆల్బంస్ పాడారు. అలాగే క్రైస్తవ భక్తి గీతాలు కూడా పాడారు. తమిళం, తెలుగులో ఎక్కువ పాటలు పాడిన ఆవిడ కన్నడంలో, మళయాళంలో కూడా ఎన్నో బహుళ ప్రాచుర్యం పొందిన పాటలు పాడారు. ఘంటసాల, టీఎం సౌందర్‌రాజన్, పీబీ శ్రీనివాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, యేసుదాసు, సుశీలమ్మ, జానకమ్మ, వాణీ జయరాం మొదలైన వారితో కలిసి పాడారు. సత్యం, చక్రవర్తి, కేవీ మహాదేవన్, ఎమ్మెస్ విశ్వనాథన్ వంటి మేటి సంగీత దర్శకుల వద్ద పని చేశారు.
1970వ దశకం చివరలో లో నేపథ్య సంగీతం నుండి కనుమరుగైన ఎల్. ఆర్ ఈశ్వరి గారు 2011లో శింబు నటించిన ఓస్తే అనే తమిళ చిత్రం ద్వారా పునః ప్రవేశం చేశారు. ఆ తరువాత తమిళ కన్నడ చిత్రాలలో పాడారు. మొత్తం 14 భాషలలో ఆవిడ పాటలు పాడారు. పాట ఎంత చలాకీనో, మనిషి కూడా అంతే చలాకీ. వందల ప్రైవేట్ కచేరీలలో పాల్గొన్న ఎల్. ఆర్ ఈశ్వరి గారు అవివాహిత. ఈ మధ్య కాలంలో టెలివిజన్ పాటల పోటీల కార్యక్రమాలలో జడ్జిగా పాల్గొన్నారు. కలైమామణి, స్వరాలయ పురస్కారాలు అందుకొని, 77 ఏళ్ల వయసులో కూడ ఉత్సాహంగా పాడగలుగుతున్న విలక్షణ గాయని ఎల్.ఆర్ ఈశ్వరి గారు. బాలసుబ్రహ్మణ్యం గారు వీరిని ఎల్. ఆర్ భాస్వరం అని ఆటపట్టిస్తుంటారు. భాస్వరంలా ఉరకలెత్తే గాయనీమణి అని ఆయన భావన.
ఎల్. ఆర్. ఈశ్వరి గారి పాటల్లో నాకు చాలా ఇష్టమైన పాట 1972లో విడుదలైన అమ్మ మాట చిత్రంలో జ్యోతి లక్ష్మి పై చిత్రీకరించబడీన మాయదారి సిన్నోడు. తెలుగునాట సంచలనం సృష్టించిన ఈ పాట ఇటీవలే రీమిక్స్ కూడా చేయబడింది. నారాయణ రెడ్డి గారు రచించిన ఈ పాటకు సంగీతం రమేష్ నాయుడు గారు. అటు తరువాత 1978లో విడుదలైన మరో చరిత్ర చిత్రంలోని భలే భలే మగాడివోయ్ అన్న పాట. ఆచార్య ఆత్రేయ గారు రచించగా, ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతం అందించిన ఈ పాటను బాలు, ఎల్.ఆర్ ఈశ్వరి గారు కలిసి పాడారు. ఈ పాటను కమల్ హాసన్, సరితలపై చిత్రీకరించారు. భాషేతర ప్రేమ నేపథ్యమైన ఈ చిత్రంలో ఈ పాటలో ఎల్. ఆర్ ఈశ్వరి గారి మత్తెక్కించే గాత్రం సమ్మోహనం. ఎల్. ఆర్. ఈశ్వరి గారికి పరమాత్మ ఆయురారోగ్యాలు, మరెంతో గాత్ర సేవా భాగ్యం ప్రసాదించాలని ప్రార్థన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి