30 నవంబర్ 1945వ సంవత్సరంలో మద్రాసు రాష్ట్రంలోని వెల్లూరులో జన్మించిన కలైవాణికి ఐదుగురు సోదరీమణులు, ముగ్గురు సోదరులు. తల్లి పద్మావతి కర్నూలులో జన్మించినవారు కావటంతో తెలుగులో పాడటం అలవాటైంది. ఆవిడే వాణి గారి తొలి గురువు. తల్లి రంగరామానుజ అయ్యంగార్ వారి వద్ద సంగీత శిక్షణ పొందారు. ఆయన వద్దే వాణిని తల్లి కర్ణాటక సంగీత శిక్షణ కోసం చేర్పించారు. అయిదేళ్ల వయసులోనే ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తనలు అపూర్వమైన రాగాలలో వాణి నేర్చుకుని పాడగలిగారు. తరువాత కడలూరు శ్రీనివాస అయ్యంగారు గారి వద్ద కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నారు. వెల్లూరులో నాలుగవ తరగతి వరకు చదువుకున్న తరువాత వాణి గారికి మరింత మంచి సంగీత శిక్షణ ఇప్పించేందుకు వారి కుటుంబం చెన్నైకి తరలి వెళ్లారు. అక్కడ వాణి ప్రఖ్యాత సంగీత విద్వాంసులు జీఎన్ బాలసుబ్రహ్మణ్యం గారికి శిష్యులైన టీఆర్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఎన్నో జీఎన్‌బీ కృతులపై పట్టు సాధించారు. తరువాత శెమ్మంగూడి శ్రీనివాస అయ్యరు గారి శిష్యులైన ఆరెస్ మణి గారి వద్ద స్వాతి తిరునాళ్ కీర్తనలు నేర్చుకున్నారు. ఎనిమదవ ఏటనే ఆకాశవాణి మద్రాసులో పాడారు. పదేళ్ల వయసునుండే పూర్తి స్థాయి కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీలు చేశారు. చిన్ననాటి నుండే హిందీ సినీ గీతాలంటే ఎంతో మక్కువ కలిగిన వాణి గారు స్కూలులో 22 వేర్వేరు కళలతో బహుముఖ ప్రజ్ఞ కలిగిన విద్యార్థిగా అవార్డును పొందారు. బీఏ ఎకనామిక్స్ చదువ్తున్నప్పుడు కళాశాలల స్థాయిలో డిబేట్ కార్యక్రమాలలో బహుమతులు పొందారు. చదువు పూర్తైన తరువాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మద్రాసు బ్రాంచిలో ఉద్యోగంలో చేరారు. తరువాత 1967లో ఉద్యోగరీత్యా హైదరాబాదుకు బదిలీ చేయబడ్డారు. కొన్నాళ్లకే జయరాం గారిని వివాహం చేసుకున్నారు. వివాహానంతరం ముంబై వెళ్లారు.
ముంబైలో వాణి గారు భర్త జయరాం గారి ప్రోద్బలంతో పాటియాలా ఘరానాకు చెందిన ఉస్తాద్ అబ్దుల్ రెహ్మాన్ ఖాన్ గారి వద్ద హిందూస్తానీ శాస్త్రీయ సంగీత శిక్షణను పొందారు. ఆ సమయంలోనే గురువు గారి సలహాతో బ్యాంకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి పూర్తి స్థాయి సంగీత సాధనకు తన సమయాన్ని అంకితం చేశారు. అప్పుడు ప్రఖ్యాత సంగీత దర్శకులు వసంత్ దేశాయి గారు ప్రఖ్యాత గాయకులు కుమార గంధర్వ గారితో ఒక మరాఠీ ఆల్బం చేస్తున్నారు. ఆ ఆల్బంలో గంధర్వ గారితో కలిసి రుణానుబంధచ అనే గీతం వాణీ జయరాం పాడారు. 1971వ సంవత్సరం వాణీ జయరాం గారి జీవితంలో ఓ ముఖ్యమైన మైలురాయి. హృషీకేశ్ ముఖర్జీ గారి దర్శకత్వంలో వచ్చిన గుడ్డీ అనే చిత్రంలో వసంత దేశాయి గారు వాణీ జయరాం గారికి అవకాశం ఇచ్చారు. ఆ చిత్రంలోని బోల్ రే పపీహరా, హరి బినా కైసే జీయూ, హంకో మన్ కీ శక్తి అనే పాటలు అద్బుత విజయం సాధించాయి. వాణీ జయరాం గారికి తాన్సేన్ సమ్మాన్ అవార్డు, బెస్ట్ ప్రామిసింగ్ సింగర్ అవార్డు, ఆలిండియా సినీగోయర్స్ అవార్డు పొందారు. ఈ పాటలు ఇప్పటికీ సంగీతాభిమానుల హృదయాలలో నిలిచే ఉన్నాయి. 1972లో హిందీలో ఎంతో పేరొందిన మీనాకుమారి గారి పాకీజా చిత్రంలో నౌషాద్ గారి సంగీతంలో మోరా సాజన్ అనే పాట పాడారు. తెలుగు సినీ చిత్రాలలో తొలి అవకాశం 1973లో అభిమానవంతులు చిత్రానికి ఎస్పీ కోడండపాణి గారి సంగీతంలో వెంపటి చిన సత్యం గారు నృత్య దర్శకత్వంలో ప్రముఖ కూచిపూడి నర్తకి శోభానాయుడు గారు నర్తించగా ఎప్పటివలె కాదురా అన్న జావళిని వాణీజయరాం గారు పాడారు. హిందీలో చిత్రగుప్త, మదన్‌మోహన్, ఓపీ నయ్యర్, ఆర్డీ బర్మన్, జైదేవ్, కళ్యాణ్‌జీ-ఆనంద్‌జీ, లక్ష్మీకాంత్-ప్యారేలాల్ మొదలైన మహామహులైన సంగీత దర్శకుల వద్ద పాడారు. మహమ్మద్ రఫీ, ముకేశ్, మన్నా డే, కిశోర్ కుమార్, ఆశా భోస్లే గార్లతో యుగళ గీతాలు పాడారు. 1974 ప్రాంతంలో ముంబై నుండి చెన్నై వచ్చి తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ సినిమాలలో గాయనిగా స్థిరపడ్డారు.
1974లో విడుదలైన అమ్మాయిల శపథం అనే చిత్రంలో నీలి మేఘమా జాలి చూపుమా అనే గీతం వాణీ జయరాం గారి తెలుగు సినీ ప్రస్థానంలో మెరిసిన గీత రాజం. 1975లో విడుదలైన కే బాలచందర్ గారి తమిళ చిత్రం అపూర్వ రాగంగళ్‌లో ఎమ్మెస్ విశ్వనాథన్ గారి సంగీతంలో పాడిన పాటలకు వారికి తమిళంలో ఉత్తమ గాయనిగా జాతీయస్థాయి అవార్డును పొందారు. 1978వ సంవత్సరంలో విడుదలైన మల్లెపూవు చిత్రంలో చక్రవర్తిగారి సంగీత దర్శకత్వంలో నువ్వు వస్తావని బృందావని అన్న అద్భుతమైన ఆరుద్ర గారి పాటను పాడారు. అదే సంవత్సరంలో వచ్చిన మరోచరిత్ర అనే బాలచందర్ గారి మరో చరిత్ర చిత్రంలో ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతంలో విధి చేయు వింతలెన్నో అనే అద్భుతమైన పాటను పాడారు. అదే సంవత్సరంలో తెలుగులో వయసు పిలిచింది అనే చిత్రంలోని నువ్వడిగింది ఏనాడైనా వద్దన్నానా అనే గీతం వాణీ జయరాం గారి విలక్షణమైన గీతాలలో ఒకటి. 1979లో విడుదలైన మీరా అనే హిందీ చలనచిత్రం వాణీ జయరాం గారి సినీ జీవితంలో మరచిపోలేని మైలురాయి. పండిట్ రవిశంకర్‌గారు ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించగా 12 మీరా భజనలను వాణీ జయరాం గారు పాడారు. మోరేతో గిరిధర్ గోపాల అనే గీతానికి 1980వ సంవత్సరానికి ఉత్తమ గాయనిగా ఫిలింఫేర్ అవార్డు పొందారు. అలాగే 1979లో విడుదలైన కే విశ్వనాథ్ గారి ఆణిముత్యం శంకరాభరణంలో పాటలకు తెలుగులో ఉత్తమ గయని అవార్డును పొందారు. బ్రోచేవారెవరురా, మానస సంచరరే, దొరకునా ఇటువంటి సేవ వంటి అద్భుతమైన గీతాలను కేవీ మహాదేవన్ గారి దర్శకత్వంలో పాడారు. 1979లోనే కే బాలచందర్ గారి దర్శకత్వంలో విడుదలైన గుప్పెడు మనసు చిత్రంలో ఎమ్మెస్ విశ్వనాథన్ గారి సంగీతంలో బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి నేనా పాడనా పాట అన్న విలక్షణమైన గీతాన్ని గానం చేశారు. 1981లో విడుదలైన సీతాకోక చిలుక చిత్రం వాణీ జయరాం గారికి ఎంతో పేరు తెచ్చింది. ఇళయరాజా గారి సంగీతంలో మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా, అలలు కలలు, సాగర సంగమమే అన్న సంగీత ప్రధానమైన ప్రేమ గీతాలు ఎంతో ప్రజాదరణ పొందాయి.
1980వ దశకంలో ఇళయరాజా వంటి ప్రముఖ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఎన్నో తమిళ తెలుగు చిత్రాలలో వాణీ జయరాం గారు పాడారు. తరువాతి కాలంలో వాణీ జయరాం గారికి తెలుగు సినీ జగత్తులో పేరు రావటానికి ప్రధాన కారణం కళాతపస్వి విశ్వనాథ్ గారి చిత్రాలే. 1987లో విడుదలైన శృతిలయలు చిత్రంలో కేవీ మహాదేవన్ గారి సంగీతంలో ఇన్నిరాశుల యునికి (బాలు గారితో), ఆలోకయే శ్రీబాలకృష్ణం, శ్రీ గణనాథం భజామ్యహం (పూర్ణచందర్ గారితో) అనే పాటలు తెలుగు సినీ అభిమానుల నోట మారు మ్రోగాయి. 1988లో విడుదలైన స్వర్ణ కమలం చిత్రంలో ఇళయరాజా గారి సంగీతంలో బాలుగారితో కలసి వాణీ జయరాం గారు పాడిన అందెల రవమిది పదములదా అనే గీతం ఎంతో ప్రజాదరణ పొందింది. భానుప్రియ గారి నాట్యకౌశలానికి వాణీ జయరాం గారి గానం వన్నె తెచ్చింది. 1991లో బాపు గారి చిత్రం పెళ్లి పుస్తకంలో త్యాగరాజస్వామి వారి జగదానంద కారక అనే కృతిని పాడారు. 1992లో విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన స్వాతి కిరణం చిత్రం వాణీ జయరాం గారి తెలుగు సినీ నేపథ్య గాన ప్రస్థానంలో పతాక స్థాయి అనుకోవచ్చు. ఆ చిత్రంలో ఆనతినీయరా హరా అనే పాటకు వారికి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయానిగా అవార్డు వచ్చింది. ఈ చిత్రంలొ వారు పాడిన తెలిమంచు కరిగింది, ప్రణతి ప్రణతి, శివాని భవాని, జాలిగా జాబిలమ్మ, వైష్ణవి భార్గవి, కొండ కోనల్లో పాటలు అనే పాటలు అజరామరమై నిలిచాయి. మొత్తం మీద విశ్వనాథ్ గారి చిత్ర గీతాలతో వాణీ జయరాం గారికి ఎంతో పేరు ప్రతిష్ఠలు వచ్చాయి. 1980,90 దశకాలలో తెలుగు తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన సినీ గీతాలను వాణీ జయరాం గారు పాడారు.
జాతీయ స్థాయిలోనే కాకుండా, గుజరాతీ, ఒడియా, తమిళ, తెలుగు భాషలలో ప్రాంతీయ స్థాయి ఉత్తమగాయని అవార్డులను పొందారు. కలైమామణి, సంగీత పీఠ్ సమ్మాన్, తమిళనాడు ప్రభుత్వం వారి ఎం కే త్యాగరాజ భాగవతార్ జీవన సాఫల్య పురస్కారం, ఇలింఫేర్ జీవన సాఫల్య పురస్కారం, కాముకర అవార్డు, సుబ్రహ్మణ్య భారతి అవార్డు, రేడియో మిర్చి మరియు రెడ్ ఎఫెం జీవన సాఫల్య పురస్కారం, ఘంటసాల జాతీయ పురస్కారం, దక్షిణ భారత మీరా అవార్డు మొదలైన ఎన్నో పురస్కారాలను, గుర్తింపులను పొందారు. సినీ గీతాలే కాకుండా ఎన్నో భక్తి గీతాలను, లలిత గీతాలను ఆలపించారు. దూరదర్శన్‌లో కూడా పాడారు. వీరు పాడిన లక్షీ, దుర్గా స్తోత్రాలు, స్కంద షష్టి కవచం, శృంగేరి శారదాదేవి గీతాలు, పరాశక్తి గీతాలు మొదలైనవి ఎంతో పేరు పొందాయి. భారత దేశంలో ఉన్న దాదాపు ముఖ్యమైన భాషలన్నిటిలోనూ వాణీ జయరాం గారు 8000కు పైగా పాటలు పాడారు. వీరి భర్త జయరాం గారు సితార్ విద్వాంసులు. నిరాడంబరమైన జీవితం క్రమశిక్షణతో జీవిస్తున్న వాణీ జయరాం గారు తనకు ఇష్టమైన పాటలలో ఒకటిగా మొరటోడు చిత్రంలోని హే కృష్ణా మళ్లీ నీవే జన్మిస్తే అన్న గీతాన్ని పేర్కొన్నారు. గానానికి భాషాజ్ఞానం చాలా ముఖ్యమని భావిస్తారు వాణీ జయరాం గారు. ప్రేమలేఖలు చిత్రంలోని ఈరోజు మంచిరోజు అని సుశీలమ్మ గారితో కలసి అద్భుతంగా పాడిన గీతం వాణీజయరాం గారి ఇష్టమైన మరో పాట. క్యాన్సర్ ఆసుపత్రులలో, అనాథాశ్రమాలలో పాటలు పాడి ప్రేమను పంచుకునే మనస్తత్వం వారిది. కర్ణాటక సంగీతంలో పరిశోధన చేసి కొత్త కొత్త విషయాలను వెలుగులోకి తీసుకు వస్తున్న విదుషీమణి వీరు. దొరకునా ఇటువంటి సేవ అన్న త్యాగయ్య భావనను వేటూరి గారు శంకరాభరణంలో గుర్తు చేయగా వాణీ జయరాం గారు పవిత్రమైన నాద సాధనతో కొనసాగిస్తున్నారు. వారి సంగీత ప్రస్థానం ఇలాగే వైభవంగా ఓ యజ్ఞంలా సాగాలని ప్రార్థన. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.
వాణీ జయరాం గారికి జాతీయ స్థాయి అవార్డును తెచ్చిపెట్టిన ఆనతినీయరా హరా (స్వాతి కిరణం - 1992) గీతం వీక్షించండి.
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండి