15, మే 2015, శుక్రవారం

రససిద్ధి - భక్తి



రససిద్ధి - ఆ రసాన్ని పూర్తిగా అనుభూతి చెంది దానిలో రమించటం. ఇదీ కళాకారుడి సాధనకు పతాక స్థాయి. రససిద్ధి పొందిన కళాకారుడికి తరువాత వేరే ఏదీ రుచించదు. అమృతత్వమంటే ఇదే. ఒక గాయకుడికి ఇది భావములో జీవించటం, దానిలో లయించి స్వరాలు పలికించటం. ఒక చిత్రకారుడికి గీయవలసిన బొమ్మలోని భావములో జీవించటం, దానికి జీవమివ్వటం రససిద్ధి. ఆస్వాదించగానే కళ్లు చెమర్చటం ఆ రససిద్ధికి సాఫల్యత. ఒక కవికి భావాన్ని పదప్రయోగంతో, శబ్ద శక్తితో, వ్యాకరణ శుద్ధితో రంగరించి ఒలికించటం రససిద్ధి. ఒక నాట్యకళాకరుడికి భావం ఆంగికంలో, ముఖ కవళికలలో, ముద్రలలో ప్రదర్శించి రసాస్వాదనలో ఎల్లలు లేకుండా నర్తించటం రససిద్ధి.

ఇలా ప్రతి కళకూ రససిద్ధి అత్యున్నతమైన లక్ష్యం. భక్తి ప్రాధాన్యమైన కళలలో రససిద్ధి ఎందుకు సులభం?

1. పరిపూర్ణమైన, నిర్వచించలేని, సర్వోన్నతమైన దివ్యత్వాన్ని ఒక కళ ద్వారా వ్యక్త పరచటం కాబట్టి. అన్ని భావనలలోని 'నేను' అన్న అహంకారాన్ని పక్కకు పెట్టి ఇంకొక పాత్రలో పరకాయ ప్రవేశం చేసి సమస్త రసాలను పండించగలిగే అవకాశం కాబట్టి
2. యుగ యుగాలుగా రససిద్ధి పొందిన వారి అనంతమైన దివ్య శక్తి ఆయా ఉపకరణాలలో ఒదిగి ఉంటుంది కాబట్టి
3. అనంతమైన దివ్యత్వాన్ని సూక్ష్మ రూపంలో ఒక కళ ద్వారా సేవించటం కాబట్టి. దైవానికి మానవ రూపమిచ్చి, మనలో ఒకనిగా భావించి, మన భావనలను సమర్పించి, తనలో ఏకమయ్యే సదవకాశం కాబట్టి.

భగవంతుని కోసం కాని కళ అసంపూర్ణమే. కొంత యాంత్రికంగానే గోచరిస్తుంది. పోతనగారు దీనిని చాలా అద్భుతంగా వివరించారు.

కంజాక్షునకుగాని కాయంబు కాయమే? పవనగుంభిత చర్మ భస్త్రి గాక;
వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే? ఢమఢమధ్వనితోడి ఢక్కగాక;
హరిపూజనము లేని హస్తంబు హస్తమే? తరుశాఖ నిర్మిత దర్విగాక;
కమలేశు జూడని కన్నులు కన్నులే? తనుకుడ్యజాల రంధ్రములు గాక;
చక్రి చింత లేనిజన్మంబు జన్మమే? తరళసలిల బుద్బుదంబు గాక;
విష్ణుభక్తి లేని విబుధుండు, విబుధుడే? పాదయుగముతోడి పశువు గాక...

"భగవంతుని కోసం కాని శరీరము గాలితో నింపబడిన చర్మపు సంచీ మాత్రమే. శ్రీహరిని పొగడని కంఠం ఢమ ఢమ శబ్దములు చేసే డప్పు మాత్రమే. నారాయణుని పూజించని చేతులు ఆకులతో కూడిన కొమ్మలు మాత్రమే. లక్ష్మీపతిని చూడని కన్నులు గోడలోని రంధ్రాలు మాత్రమే. చక్రధారిని స్మరించని జన్మ కేవలం నీటి బుడగ మాత్రమే. విష్ణుభక్తి లెని పండితుడు రెండు కాళ్లున్న పశువు మాత్రమే."

కళను పరమాత్మకు సమర్పించి రససిద్ధి పొందిన నాదయోగులు ఎందరో. వాగ్గేయకారుల దగ్గరినుండి మహాకళాకారిణి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి వరకు ఈ కళ ద్వారా పరమాత్ముని సేవ కొనసాగుతునే ఉంది.

అధరం మధురం అని సుబ్బులక్ష్మి గారు ఆ శ్రీకృష్ణుని నుతిస్తూ మధురాష్టకం పాడితే ఎదురుగా ఆ పరమాత్మ దివ్యమంగళ స్వరూపం ముందు నిలిచిందా అనిపిస్తుంది. భావయామి గోపాల బాలం అని పాడితే ఆ చిన్ని కృష్ణుడు ముద్దుగా ఎదుట నిలిచినట్లే. ఇలా ఎన్నో. కారణం ఆమెకు ఆ సంకీర్తనలోని భావం మనసులో నిలిచి ఆ దేవతా స్వరూపం కళ్లముందున్నంత విశ్వాసం. తాదాత్య్మత కలిగిన కళాకారిణి ఆమె. ఇలా రససిద్ధి పొందిన వారే కాలగమనంలో శాశ్వతమైన స్థానం పొంద గలిగారు. రససిద్ధికి భాష, దానిలోని మాధుర్యం, శబ్దాలలోని శక్తి, విశాలమైన హృదయము, భావ ప్రాధాన్యత, స్పష్టమైన వ్యక్తీకరణ, త్యాగశీలత, నిరాడంబరత ఎంతో ముఖ్యం.

ఇటీవలి కాలంలో శాస్త్రీయ సంగీత కళాకారులలో ఈ రససిద్ధి లోపించింది. అందుకే నేటి కళాకారుల గళాలలో ఆ సంగీతం మాధుర్యం లేక ఢమ ఢమల్లాగానే ఉంటోంది. శాస్త్రీయత పేరిట భావాన్ని ఖూనీ చేసి శబ్ద కాలుష్యంగా చేస్తున్నారు మన ప్రాచీన సంగీతాన్ని. భావయుక్తంగా, సాహిత్యోచితంగా పాడితే సంకీర్తనకు సంగీతం ప్రాణ వాయువులా నిలిచి పరమాత్మ మెడలో హారమవుతుంది. కళాకారులు ఈ రససిద్ధికి ప్రయత్నించకపోతే శాస్త్రీయ సంగీతాన్ని ప్రజలు ఆస్వాదించలేరు. దానికి గల పవిత్రత, ప్రాభవం తగ్గుతుంది. నేటి కళాకారులు దీనిని గమనించి సరిదిద్దుకుంటారని ఆశిద్దాం

సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయు వారెందరో మహానుభావులు అన్నారు త్యాగరాజుల వారు. స్వాంతము ఒక సరోజమని గ్రహించటానికి, దర్శించటానికి ఎంతో సాధన కావాలి. గాత్ర సేవ ద్వారా రససిద్ధి పొందిన మహా కళాకారిణి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు..

ఎందరో మహానుభావులు! అందరికీ వందనములు!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి