21, ఫిబ్రవరి 2016, ఆదివారం

తొలిరేయి గీతాలు - నన్ను దోచుకుందువటే (గులేబకావళి కథ)


తొలిరేయిన భార్యలో ఆరాధనా భావం కలిగితే మగవానిలో అనుబంధం శాశ్వతమైనది అనే పవిత్రమైన భావం కలుగుతుంది. భర్తలో భార్య పట్ల ప్రేమానురాగాలతో పాటు బాధ్యత అనే మొక్క చిగురిస్తుంది. భార్యకు అన్నీ భర్తే అన్న ఉదాత్తమైన భావన మొలకెత్తుతుంది. ఒకరి మనసు ఒకరి దోచుకోవటంతో నేను అన్న భావన తొలగి మేము అన్న భావన వికసిస్తుంది. ఇద్దరు మనుషులైనా ఒకే నావలో ప్రయాణించే సమయం ఆసన్నమవుతుంది. 1962లో విడుదలైన గులేబకావళి కథ చిత్రంలో "నన్ను దోచుకుందువటే" అనే గీతం తొలిరేయికి సంబంధించినదే. జానపద ఇతివృత్తంతో ఎన్‌టీరామారావు గారు, కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు ఈ గీతాన్ని రచించారు, జోసెఫ్-కృష్ణమూర్తిగార్లు సంగీతాన్ని అందించారు. తొలిరేయి గీతాల శీర్షికన రెండో సంచికల "నన్ను దోచుకుందువటే" పాట వివరాలు అందిస్తున్నాను.

నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ నిన్నే నా స్వామీ

తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూలదండవోలే కర్పూరకళికవోలే కర్పూరకళికవోలే
ఎంతటి నెరజాణవో నా అంతరంగమందు నీవు
కలకాలం వీడని సంకెలలు వేసినావు సంకెలలు వేసినావు

నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో
ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గంధం ఇగిరిపోని గంధం

తెలుగు చలన చిత్ర సీమలో డాక్టర్ సి.నారాయణరెడ్డిగారి సాహిత్యం సహజత్వానికి ప్రయోగాలకు పుట్టినిల్లు. అంతకు మునుపు ఎక్కువగా వాడని పదాలను సాహితీ స్రవంతిలోకి తీసుకు వచ్చి, వాటితో సాహిత్యానికి ఎంతో వన్నె తెచ్చినవారు సినారె గారు. దొరసాని, నెరజాణ వంటి పదాలు అప్పట్లో తెలుగు సినీ సాహిత్యంలో చాలా అరుదుగా ఉపయోగించే వారు. నారాయణ రెడ్డి గారు అటువంటి పదాలను తన సాహిత్యంలో పొందు పరచి తెలుగు భాష అందాన్ని పెంచారు.

గీతాన్ని పరిశీలిస్తే, మనసు దోచుకున్న వనిత తనను ఒక పోటీ తరువాత భర్తగా స్వీకరించిన సన్నివేశం తరువాత ఈ పాట చిత్రంలో వస్తుంది. వన్నెలున్న రాణి తన మనసు దోచుకుందని ఆమెకు తెలుపుతాడు భర్త. దాని సమాధానంగా ఆయనను కన్నులలో దాచుకుని ఆరాధిస్తానని పలుకుతుంది ఆ భార్య. భర్త చరణాల నీడలో తరిస్తానని ఆ భార్య సంకల్పం. ఎలా? పూల దండలా, కర్పూరంలా అట. అతని వ్యక్తిత్వానికి సుగంధము, వెలుగు ఆమే కదా? అంతటి పవిత్రమైన భావన ఆ భార్యది. ఆ భార్య తెలివిని మెచ్చుకుంటూ తన అంతరంగంతో వీడిన సంకెళ్లు వేశావు అని ఆ భర్త భావించాడు. తన మసును ఒక మందిరంగా చేసుకుంది ఆ భార్య. అంటే, ఎంతో పవిత్రంగా చేసుకొని, దానిలో తన భర్తను దేవతగా భావించింది. హృదయంలో నిలిచిన భర్తతో తాను ఏకమై పోతాను అంది. జీవాత్మ-పర్మాత్మల అనుసంధానానికి భార్యా-భర్తల సంబంధానికి ఎలా సారూప్యత ఉందో చూడండి. మరి దానికి భర్త చేయాల్సింది ఏమిటి? ఆమెను అతిచరించకుండా, ఆ అనుబంధాన్ని మరపురానిగా చేయటం. నాయకుడు అలానే భావించి ఏనాటిదో ఈ బంధం, దాన్ని తెలుసుకోలేము, అది ఎన్ని యుగాలైనా ఇగిరిపోని గంధం లాంటిది అన్నాడు. చూశారా? నారాయణ రెడ్డి గారు నాయకుడి మనోగతం ద్వారా భార్యా భర్తల మధ్య సంబంధానికి శాశ్వతత్వం ఎలా ఆపాదించారో? అందుకీ ఈ గీతం యాభై ఏళ్ల తరువాత కూడా సుగంధాలు విరజిమ్ముతూనే ఉంది.

అన్న ఎన్‌టీఆర్, జమున గారు ఈ పాటలోని భావ వ్యక్తీకరణలో జీవించారు. అందానికి మారుపేరైన ఇద్దరూ ఒక పవిత్రబంధాన్ని మరింత అందంగా ఆవిష్కరించారు. చందమామ అంత అందంగా, చల్లగా, ప్రశాంతంగా ఎన్‌టీఆర్ నటించగా, ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆరాధనా భావం మనోజ్ఞంగా ఒలికించారు జమున గారు. ఘంటసాల మాష్టారు-సుశీలమ్మ ఈ గీతానికి అమృతత్వం ఆపాదించారు. ఈ చిత్రం ఎన్‌టీఆర్ గారు స్వీయ బ్యానర్ అయిన ఎన్ఏటీ ద్వారా నిర్మించారు. 

5 కామెంట్‌లు:

  1. చక్కటి పాటను పరిచయం చేసారు. భార్యాభర్తల అనురాగం, పరస్పర గౌరవం, ఆదరణ, ప్రేమానురాగాలు ప్రతిబింబించేలా చక్కని పాట. ఇద్దరూ ఒకరి ఔన్నత్యం ఒకరు గుర్తించుకుని తమ వైవాహిక బంధాన్ని మన్నించే గీతం. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. నిజంగానే మా మనసు దోచుకున్న పాట. ఎన్.టి.ఆర్ గారి అభినయం, జమున గారి హావభావాలు మమ్మల్ని కట్టిపడేసాయి అంటే నమ్మండి.

    రిప్లయితొలగించండి
  3. అద్భుతమైన సాహిత్యం, అద్భుతమైన సంగీతం, గానం. అభినయం ఈ పాటను అజరామరం చేసాయి. క్రిహ్స్నమూర్తి .. గారు విజయా లో వాద్య సహకారునిగా పని చేసారు. అందుకే ఆయన్ని విజయా కృష్ణ మూర్తి అనేవారు. తరువాత స్వతంత్రంగా కొన్ని చిత్రాలకు సంగీతం అందించారు కూడా.

    రిప్లయితొలగించండి
  4. అంతా బాగుంది కానీ, సినారె గారు"నీవే ఒక దేవతవై" అని ఎందుకన్నారు?
    సాధారణంగా, "దేవుడు" పుల్లింగమనీ, "దేవత" స్త్రీ లింగమని వ్యవహరిచారు.
    అందుకే కాబోలు, "మాతృదేవత", "దేవత", అన్న చలన చిత్ర పేరులు కూడా, స్తీ అర్ధాన్నే ఇచ్చాయి.
    మరెందుకు కవి గారు ఈ ప్రయోగం చేసారు? రెండూ "భ" గణములే కనుక, చందస్సు సమస్యలు లేవు కదా?
    ఎందుకీ ప్రయోగం??

    రిప్లయితొలగించండి