RightClickBlocker

23, ఫిబ్రవరి 2016, మంగళవారం

తొలిరేయి గీతాలు - పూవై విరిసిన పున్నమి వేళ (శ్రీ తిరుపతమ్మ కథ)


తొలిరేయి వలపులో సున్నితత్వానికి కూడా చాల ముఖ్యమైన చోటుంది. భార్య సిగ్గుల దొంతరలో మురిసితే, భర్త వాటిని ఆస్వాదించి సంస్కారవంతమైన భావనతో ఆనందిస్తాడు. ఆ పూవంటి మనసు గల స్త్రీ తనదైనందుకు సంతోషపడతాడు, తొలివలపులు సఫలం చేసుకోవటానికి ఆమెను ప్రొత్సహిస్తాడు, దగ్గరుండి ముందుకు నడిపిస్తాడు. అటువంటి భర్త మనసు పాడితే వచ్చేది అద్భుతమైన ప్రేమ గీతం. 1963లో విడుదలైన శ్రీ తిరుపతమ్మ కథ చిత్రంలోని "పూవై విరిసిన పున్నమి వేళ" అనే పాట అటువంటి భావనల మనోజ్ఞ మాధుర్య గీతం. తొలిరేయి గీతాలు శీర్షికన నాలుగవ సంచికగా ఈ పాట వివరాలు మీకు అందిస్తున్నాను.

పూవై విరిసిన పున్నమి వేళ 
బిడియము నీకేల? బేల!

చల్లని గాలులు సందడి చేసే
తొలి తొలి వలపులు తొందర చేసే
జలతారంచుల మేలి ముసుగులో
తలను వాల్తువేల? ఏల!

మొదటి మూగినవి మొలక నవ్వులు
పిదప సాగినవి బెదరు చూపులు
తెలిసెనులే నీ తలపులేమిటో
తొలగిపోదువేల? బేల!

తీయని వలపుల పాయసమాని
మాయని మమతల ఊయలలూగి
ఇరువురమొకటై పరవశించగా
ఇంకా జాగేల? బేల!

పున్నమికి తొలిరేయి మధుర జ్ఞాపకాలకు గల అవినాభావ సంబంధం ఎన్నో సినీగీతాలలో చూస్తాము. గత సంచికలలో కూడా ఈ పున్నమి నేపథ్యంలోని తొలిరేయి గీతాల వివరాలు తెలుసుకున్నాము. అదే బాటలో వచ్చిన ఇంకో అద్భుతమైన గీతం శ్రీ తిరుపతమ్మ కథ చిత్రంలోని ఈ పాట. భార్య సిగ్గులలో మునిగి తేలుతుంటే భర్త నోట జాలువారిన ఈ గీతం తెలుగు సినీ పాటలలో విశేషమైన స్థానాన్ని సంపాదించింది. దానికి కారణం లలితమైన భావన, మాధుర్య ప్రధానమైన సంగీతం, నటీనటుల ప్రజ్ఞ.

అన్న ఎన్‌టీఆర్, అలనాటి అందాల నటి కృష్ణకుమారిలు అప్పట్లో విజయాలు సాధించే జంటగా పేరొందారు. ఆ సమయంలోనే వచ్చింది ఈ తిరుపతమ్మ కథ చిత్రం. పామర్తి-బీ శంకరరావుల సంగీత దర్శకత్వంలో డాక్టర్ సీ నారాయణ రెడ్డి గారి కలాన వెలువడిన ఈ గీతం తొలిరేయి భావనలకు మధురమైన ఆనవాలుగా నిలిచింది. నారాయణ రెడ్డి గారి రచనలలో ఈ గీతానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దానికి కారణం ఇందులోని భావ సౌందర్యము మరియు తెలుగుదనం.

పున్నమి పూవులా విరిసింది, ఓ చెలీ! సిగ్గెందుకు అని భర్త ఆమెను ప్రశ్నిస్తున్నాడు. చల్లని గాలులు సందడి చేస్తున్నాయి, మొదటి వలపులు తొందర పెడుతున్నాయి, పట్టు చీర కట్టుకొని ఆ చీర కొంగును చాటుగా చెసుకొని తలను వంచుతున్నావు ఎందుకు అని మొదటి చరణంలో తన మనోభీష్టాన్ని తెలుపుతాడు. వలపులు వికసించిన భర్త భార్యను ముందడుగు వేయమని ఎంతో అందంగా అడుగుతాడు. ఆమె ముఖంలో మొలకలెత్తిన నవ్వులు, అంతలో బెదిరిన చూపులు ఆమె మనసులో ఏమి ఆలోచనలు తెలుపుతున్నాయి, ఎందుకు పక్కకు వెళతావు అని ఆమెను దరిచేరటానికి రెండవ చరణంలో ప్రోత్సహిస్తాడు. మూడవ చరణంలో నారాయణ రెడ్డి గారి సాహితీ ప్రతిభ మరింత కనబడుతుంది. తీయమైన వలపులను పాయసంగా భావించి రుచిని చవిచూసి, శాశ్వతమైన ప్రేమానురాగాలనే ఊయాలలో ఊగి, ఇద్దరమూ ఒకటై పరవశించాల్సిన సమయం, ఆలస్యం ఎందుకు అని అతను ఆమెను సంగమానికై ముందడుగు వేయమని కోరతాడు. ఇక్కడ భార్య భర్తను బేల అని అనటం ఆమెను బలహీనం అని చెప్పటానికి కాదు. వివాహమైనా, మనసు అర్థం చేసుకునే భర్త ఎదురుగా ఉన్నా, సహజమైన సిగ్గుతో ఉన్న స్త్రీ మానసిక పరిస్థితిని ప్రతిబింబించటానికి.

ఏ గీతానికైనా అభినయం, గాత్ర ధర్మం, సంగీతం అతి ముఖ్యమైనవి. సాహిత్యం ఎంత లాలిత్యం కూడి ఉందో,  అంతే సంగీత మాధుర్యం కలిగి ఉంది ఈ పాట. దానికి నటీనటుల అభినయం, ఘంటసాల గారి గాత్రం సరిగ్గా తోడై పాటకు శాశ్వత కీర్తిని  తెచ్చాయి. 

1 వ్యాఖ్య: