4, ఫిబ్రవరి 2017, శనివారం

నీ చరణ కమలాల నీడయే చాలు - సినారె మధుర గీతం


సింగిరెడ్డి నారాయణరెడ్డి గారి పాటల్లో తెలుగుదనం యొక్క ప్రస్థానం అలా అలా మృదుమధుర పద సోపానంలా ఉంటుంది. లలితమైన పదాలు, మాధుర్యభరితమైన పదజాలాలు, మనసును హత్తుకునే భావాలు ఆయన పాటల ప్రత్యేకత. 1967లో విడుదలైన శ్రీకృష్ణావతారం అనే పౌరాణిక తెలుగు చలన చిత్రంలో అన్న ఎన్‌టీఆర్ గారు మరో మారు కృష్ణునిగా నటించి ప్రజలను మురిపించారు. చాలా పెద్ద విజయం సాధించిన ఆ చిత్రంలో నారాయణ రెడ్డి గారు "నీ చరణ కమలాల" అనే గీతం కూడా బాగా ప్రాచుర్యం పొందింది.

స్వామి ఇష్ట సఖుల మనోభావనలను, ఆయనకు వారిపై గల మనోహరమైన ప్రేమను ఈ గీతం ప్రతిబింబిస్తుంది. లీలమ్మ, ఘంటసాల మాష్టారు గళాల్లో ఈ పాట వింటునే ఆహా అబ్బా అని మనసు తేలిపోతుంది. స్వామిని ఆరాధించే సఖుల హృదయావిష్కరణ, స్వామికి వారిపై గల అనన్యమైన ప్రేమను ఈ గీతం మరో మారు మనకు తెలియజేస్తుంది. పరమాత్మ పూర్ణావతార స్వరూపమైన స్వామి పాదాల నీడ ఉంటే చాలు అనే చెలి భావన, చెలి కన్నుల్లో ఆరాధనగా తానుంటే చాలు అనే స్వామి భావన నిజంగా ప్రేమకు నిర్వచనం. ఇక్కడ స్వామి చరణాలు కమలాలే, ఆమె కన్నులు కూడా కమలాలే...అదీ నారాయణ రెడ్డి గారి ప్రత్యేకత. ఒకే పదాన్ని సారూప్యతకు ఉపయోగించి భిన్నమైన భావనలను వ్యక్తపరచే సాహితీ ఔన్నత్యం కల్గిన కవి ఆయన.

గీతంలో ఎంత లలితమైన శృంగారం ఉంది కదా? లేతమోవి చిగురుతో తనను మురళిగా మలచి అనురాగపు రాగాలు పలికించి ప్రేమ మధువును ఒలికించమని చెలి వేడుకుంటే, ముఖములో కనబడని, మురళిలో వినిపించలేని రాగాలను పలికిస్తాను, మధురమైన అనురాగాని చిలికిస్తాను అని స్వామి పలకటం ప్రేమ ఎంత మధురం అన్న భావనను కలిగిస్తుంది. ఆయన ప్రేమ అనే వనంలో తనకు స్థానం ఉంటే చాలు ఇంక నందనవనాలు ఎందుకని చెలి పలికితే, ఆకాశమంత విశాలమైన ఆమె హృదయంలో తానుంటే చాలు ఇంక బృందావనాలెందుకు అని స్వామి పలుకుతాడు.

స్వామి పత్నులలో రుక్మిణి పట్టమహిషి. ఆమె ప్రేమలో భక్తి ఉంది, శరణాగతి ఉంది. పరిపూర్ణమైన ప్రేమమూర్తి రుక్మిణి. ఆమె భావనలను వ్యక్తపరచటానికి తులసీదళాలను మించినవేముంటాయి. పవిత్రమిన ఆ దళాలతో పూజించి, ప్రేమను అందించి, పులకించే ఆమె భక్తిపూరితమైన ప్రేమను నారాయణ రెడ్డి గారు రెండవ చరణంలో ఆవిష్కరించారు. మరి ఆమె భక్తికి, ప్రేమకు సంతుష్టుడైన స్వామి ఎలా స్పందించాడు? పూజలను స్వీకరించి, పులకింతలు అందించి, తాను లోలోపల గానం చేస్తానని, ఆమె హృదయంలో నివసిస్తానని చెప్పాడు. కృష్ణ ప్రేమ సామ్రాజ్యం యొక్క గొప్పతనాన్ని ఈ గీతం మనోజ్ఞంగా చాటింది. టీవీ రాజు గారి సంగీతంలో నేపథ్య గాయనీ గాయకులు ఈ యుగళ గీతాన్ని అజరామరం చేశారు.

నీ చరణ కమలాల నీడయే చాలు
ఎందుకోయీ స్వామి బృందావనాలు
నీ నయన కమలాల నేనున్న చాలు
ఎందుకే ఓ దేవి నందనవనాలు

నును మోవి చివురుపై నను మురళిగా మలచి పలికించరా! పలికించరా మధువులొలికించరా!
మోవిపై కనరాని మురళిలో వినలేని రాగాలు పలికుంతునే! మధురానురాగాలు చిలికింతునే!
నీ ప్రణయవనిలోన నేనున్న చాలు
ఎందుకోయీ స్వామీ నందనవనాలు
నీ హృదయ గగనాన నేనున్న చాలు
ఎందుకే ఓ దేవి బృందావనాలు

తులసీదళాలలో తొలివలపులందించి పూజింతునా! స్వామి పులకింతునా!
పూజలను గ్రహియించి పులకింతలందించి లోలోన రవళింతునే! ఓ దేవి నీలోన నివసింతునే!
నీ చరణ కమలాల నీడయే చాలు
ఎందుకోయీ స్వామీ బృందావనాలు
నీ నయన కమలాల నేనున్న చాలు
ఎందుకే ఓ దేవి నందనవనాలు
నీ ప్రణయవనిలోన నేనున్న చాలు
ఎందుకోయీ స్వామీ నందనవనాలు

స్త్రీవాదులూ - సతులు పాదసేవ అన్న భావన పురుషాహంకారాన్ని నిరూపించదు. ఎన్నో సార్లు ప్రేమలో భార్యభర్తలకు ఒకరిపట్ల మరొకరికి దివ్యమైన భావనలు కలిగి వారి పట్ల ఆరాధనా భావంతో నమస్కరిస్తారు, పాదసేవ చేస్తారు. కాబట్టి నేను దీన్ని పురుషాహంకారంగా అంగీకరించను. కాకపోతే, భార్య పట్ల గౌరవం, నమ్మకం, విశ్వాసం, ప్రేమ లేని చోట ఇది కోరుకోవటం తప్పకుండా పురుషాహంకారమే. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి