RightClickBlocker

6, ఫిబ్రవరి 2017, సోమవారం

మేఘ సందేశం - దేవులపల్లి కృష్ణశాస్త్రి సుందర కవితావేశం

మేఘ సందేశం (దేవులపల్లి కృష్ణశాస్త్రి)
=============================ఉదయగిరిపైన అదిగొ గగనాన
కదలె దినరాజు తేరు
ఒదిగి చిరుగాలి నిదుర తెర జారి
కదలె గోదారి నీరు

ఏ సీమల ఏమైతివో ఏకాకిని నా ప్రియా
ఏలాగీ వియోగాన వేగేనో నా ప్రియా
ఏలాగీ మేఘమాసమేగేనో ప్రియా ప్రియా ప్రియా
గడియ గడియ ఒకశిలయై కదలదు సుమ్మీ
ఎదలోపల నీ రూపము చెదరదు సుమ్మీ
పడిరావాలంటే వీలుపడదు సుమ్మీ వీలుపడదు సుమ్మీ!

ఊపి ఊపి మనసునొక్కొక్క వేదన 
కావ్యమౌను మరియు గానమౌను
నేటి బాధ నన్ను మాటాడగానీని
ప్రళయమట్లు వచ్చి పడియె పైని

దారులన్నియు మూసె దశదిశలు ముంచెత్తె
నీరంధ్ర భయదాంధకార జీమూతాళి
ప్రేయసీ ప్రేయసీ వెడలిపోయితివేల
ఆ అగమ్య తమస్వినీ గర్భ కుహరాల

లోకమంతా పాకినవి పగటి వెలుగులు
నాకు మాత్రం రాకాసి చీకట్ల మూలుగులు రాకాసి చీకట్ల మూలుగులు

ఎపుడు నీ పిలుపు వినబడదో
అపుడు నా అడుగు పడదు
ఎచ్చటికో పయనమెరుగక
ఎందుకో వైనమందక నా అడుగు పడదు

అది ఒకానొక మలిసందె ఎదుట గౌతమీ నది
ఇరు దరులొరసి మింటి చాయలను నెమరు వేసుకొనుచు సాగినది
అపుడు అపుడే కలిగె నాకొక్క దివ్యానుభూతి కలిగె నాకొక్క దివ్యానుభూతి

శూన్యాకాశము వలె చైతన్య లవము లేని బ్రతుకు దారుల
శోభానన్యంబు ఒక శంపాలత కన్యక తొలివలపు వోలె కాంతులు నించెన్ 

అంతరాంతరమున వింత కాంతి నిండి
ఊహలకు రెక్కలొచ్చి ప్రత్యూష పవన లాలనమునకు విచ్చు సుమాల వోలె
అలది కవితలు వెలువడె 

అంతలోన 

కనుమొరగి చనె మెరపు చీకటులు మిగిలె
అపుడు ఎలుగెత్తి పిలిచినాను
అపుడు దారి తెలియక వెలుగు కొరకు రోదించినాను రోదించినాను
వెదకి వెదకి వేసారితి వెర్రినైతి

ఆశలు రాలి ధూళి పడినప్పుడు
గుండెలు చీల్చు వేదనావేశము వ్రేల్చినప్పుడు
వివేకము గోల్పడి సల్పినట్టి 
ఆక్రోశము రక్తబిందువులలో రచియించితి నేను 
మేఘసందేశము రూపుదాల్చెనది నేడు
ఇది ఏమి మహా కవిత్వమో 

శోకమొకటియె కాదు సుశ్లోకమైన కావ్యమునకు జీవము పోయె
కరుణ ఒకటె కాదు రసము జీవితము నా కవికి వలయు ఎన్నో వివిధానుభూతులు ఎడద నిండ 

నా అన్వేషణ ఎన్నడేన్ సఫలమై నా మన్కియే పూవులున్ 
కాయల్ పండ్లును నిండు నందనముగా నైనన్ వ్యథావేదనల్ 
మాయంబై సుఖ శాంత జీవనము సంప్రాప్తించి పూర్ణుండనై 
వ్రాయంజాలుదు స్వానుభవ దివ్య కావ్య సందోహమున్

అద్భుత కావ్యకన్యకను ఆవిష్కరించగలిగిన శక్తి, సరస్వతీ అనుగ్రహం కేవలం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి దక్కింది. మేఘ సందేశం చిత్రంలో ప్రకటితమైన ఈ భావ గంగా ప్రవాహం ఆ చిత్రానికి వన్నె తెచ్చింది. రమేష్ నాయుడు గారి సంగీతం, ఏఎన్నార్ గారి అద్భుతనటనా కౌశలం భావకవి మనోవేదనను పరిపూర్ణం చేశాయి. ఏమి పద ప్రయోగం? ఏమి భావావేశం? ఏమి మనోగతం? ఏమి లయబద్ధమైన భావ రసగంగాప్రవాహం? రాగమాలికగా రమేష్ నాయుడు గారు కృష్ణశాస్త్రి గారి కావ్యకన్యకకు ప్రాణం పోస్తే పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ బిరుదులతో అలంకరించబడిన సరస్వతీ పుత్రుడు కేజే యేసుదాసు గారు ఎంతో అద్భుతంగా గానం చేసి కావ్యకన్యకను శాశ్వతం చేశారు. నిన్న రాత్రి 10:00 నుండి 11:00 వరకు ఎఫ్.ఎం రేడియోలో దేవులపల్లి వారి జీవిత విశేషాలు ప్రసారమైనాయి, అందులో భాగంగా ఈ కావ్యకన్యకను విన్నప్పుడు తెలుగుదనం రోమాంచమై నాలో అణువణువు జాగృతమైంది. భావావేశంతో కన్నీళ్లు రాలాయి. నిజంగా దేవులపల్లి, యేసుదాసు,రమేష్ నాయుడు, అక్కినేని వంటి కళామతల్లి ముద్దుబిడ్డలకు జన్మనిచ్చి భరత భూమి ధన్యత పొందింది. మీరు కూడా  వీరి అపూర్వ కలయికలో ఆవిష్కరించబడిన మేఘసందేశ కావ్య కన్యకను విని ఆనందించండి. కృష్ణశాస్త్రి గారి భావౌన్నత్యాన్ని ఆస్వాదించండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి